మంచిమానుట మంచిదోయ్‌

  • 21 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

ఏమిటండీ! మీకేమన్నా పిచ్చా? దానధర్మాలు చేయాలని తహతహలాడతారు ఎందుకు? మంచి చేయాలని మహా ఇదయిపోతున్నారు ఎందుకు? విషయం తెలిసే అలా అంటున్నారా? తిరిగే కాలు... తిట్టే నోరూ ఊరుకోవని, అలాగే పెట్టేనోరు కూడా ఊరుకోదని మీరు సమర్థించుకుంటారు. మీకు స్వానుభవాలు లేవేమోగానీ తాతముత్తాతల నుంచి వస్తున్న ‘రాత కూతల్ని నమ్మరా ఏంటీ?’ 
      మేలు చేస్తే వచ్చే కీడు అంతాఇంతా కాదు. పెట్టని మహాతల్లి ఎట్టాగూ పెట్టదు. పెట్టే ఆమెకి ఏమయిందని సామెత. మీరంటే గిట్టనివాడో నేనంటే గిట్టనివాడో చెప్పింది కాదిది. గుర్తు తెలియని వ్యక్తి నొక్కి వక్కాణించిన పరమ సత్యమది. 
      ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఆవిడేమో మహాతల్లి అట! రోజూ పెడుతూ ఏదో ఒకరోజు పెట్టనావిణ్నేమో నిందించడం! ఇది లోకనైజం. ‘మంచి చేసినవాడు మట్టిగొట్టుకుపోతాడు, చెడ్డచేసినవాడు పసిడి పట్టుకుపోతాడు’ అనడంలో సందేహంలేదు. ‘మంచి మీద బతికినట్టి ఏ జీవికి సుఖం ఉంది!
      చరిత్ర పుటలు తిరగేస్తే
      తెలిసే సత్యమ్మే ఇది!’ అని ఒక ఆధునిక కవి ఎంత మంచిగా/ చెడ్డగా చెప్పాడు.
      ‘‘మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ...’’ అని గురజాడ గొప్పగా చెప్పాడు. మనమూ గొప్పగా విన్నాం. బాగానే ఉంది గానీ, వీళ్లు మంచివాళ్లు, వాళ్లు చెడ్డవాళ్లు అని కనీసం జనాభాలెక్కలు కూడా చెప్పవు.. అంతోటి దానికి ప్రయాస ఎందుకు? ఆయాసం ఎందుకు? 
      ఉదాహరణకు... అంత దానం చేశాడు, ఇంత దానం చేశాడు అని దానకర్ణుణ్ని తెగ కీర్తిస్తాం. మరి పంచపాండవులు కురుక్షేత్రంలో అతణ్ని మంచివాడని ఏమన్నా వదిలేశారా? చావగొట్టి చెవులు మూశారా లేదా? వీరస్వర్గం వచ్చింది కదా అని మీరు అనవచ్చు, వీరుడైనా యుద్ధం 
చేయలేక చచ్చినందుకు వచ్చిందిగానీ - దానవీరం వల్ల కాదే. బలిచక్రవర్తి దానం చేయడం వల్ల కాదూ విష్ణుమూర్తి అతగాణ్ని చచ్చేట్టు తొక్కేశాడు. అంతెందుకు చెడ్డవాళ్లు జీవితాంతం సుఖంగా ఉంటారు. పొరపాటున చివర్లో ఏదయినా ఇబ్బంది అయితే రావచ్చు.. అదీ ఏమాత్రం అప్పీలు చేయడానికి అవకాశం లేకపోతే! 
      చేతిలో డబ్బున్నంత కాలం జాతిలో మార్పురాదు! ఇది ఏ కాలంలోనయ్యా అని అంటారు. అదీ తేల్చి చెప్పలేం! ‘‘గత కాలము మేలు.. వచ్చు కాలము కంటెన్‌’’ అని ఒక కవి అంటే, ‘‘మంచి గతమున కొంచెమేనోయ్‌’’ అని ఇంకో కవి పోటీగా చెప్పేశాడు. అంతటి వాళ్లే చెప్పలేకపోతే తేల్చుకోవడానికి మనం ఎంతటివాళ్లం.
      మంచివాళ్లు జీవితాంతం నరకయాతన అనుభవిస్తూనే ఉంటారు. తప్పుచేసి కేసుల్లో చిక్కినవాడు దర్జాగా తిరుగుతుంటే, మంచివాడు జీవితంలో ఎక్కువ భాగం నానా నిందలుపడి నిరాదరణకు గురై చరమాంకంలో నిర్దోషిగా మిగిలితే మాత్రం ఒరిగేదేమిటి?
      మంచి చేయడం చెడు చేయడం అంత తేలిక కాదు. పుణ్యానికి పోతే అదేదో ఎదురయిందన్న మాట విననివాడు తెలుగుబాటలో కనిపించడు. యావత్‌ భూ ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఇంతే. వ్యక్తికి మంచి చేసినా, జాతికి మంచి చేసినా ఇలాగే ఉంటుంది. మహాత్మా గాంధీని చంపేశారా లేదా!!? ఏసు క్రీస్తు సంగతి ఏమయింది? భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్నారా లేదా? ఇదంతా మంచి చేసినందువల్లనేగా. 
      చచ్చి అయినా సాధించవచ్చు గానీ మంచిచేసి సాధించేదేమీలేదు. ఎవరి వల్లనయినా మంచి జరిగితే, ప్రతిఫలం పొందిన వాడికి వెంటనే వచ్చేది మతిమరపు. నేను ఫలానా సాయం చేశానయ్యా నీకు అని ఎవడన్నా అంటే గుర్తులేదే అని ఎదుటివాడు ఠక్కున చెబుతాడు. అదే చెడు గనక ఎవడికయినా చేస్తే ఎవ్వరూ బొట్టుపెట్టి చెప్పనవసరం లేదు. పట్టుబట్టి గుర్తు చేయనవసరం లేదు. వాడే ముందుగా చెబుతాడు. తిక్కరేగితే తొక్క తీస్తానని చిందులు వేస్తాడు. అంటే చెడు చేస్తే బాధితుడికి మనం ఎక్కడ లేని జ్ఞాపకం కలిగిస్తున్నట్టేగా! ఎంతటి వ్యాపకం ఉన్నా జ్ఞాపకం లేకపోతే వృథానేగా; మనం ఏంచేసినా ఎదుటివాడు మనల్ని తలుచుకో వాలనే కదా తెగ ఆరాటపడుతుంటాం. 
      అయితే మంచి చేస్తే వచ్చే ఇబ్బందులూ అన్నీ ఇన్నీ కావు. వెనకటికి ఒకాయిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దగ్గరికి వచ్చి ‘‘సార్‌ ఫలానా నాయకుడు పనిగట్టుకుని మిమ్మల్ని తెగ తిట్టిపోస్తున్నాడు’’ అని పేరు చెప్పి నషాళానికి అంటేట్టు విషయం వివరించాడు. కేసరి ఆగ్రహాన్ని కళ్లారా చూడాలని పక్కన పెట్టిన కళ్లద్దాలను మళ్లీ పెట్టుకుని చూశాడు. చెవులారా వినాలని చెవులు రిక్కించి మరీ విన్నాడు. అయితే ఆంధ్రకేసరి చిత్రంగా చిరునవ్వు నవ్వాడు. అంతటితో ఊరుకో కుండా వాడికి నేనేమయినా మంచి చేస్తే కదా నన్ను తిట్టిపోయడానికి! అన్నాడు. మా కళ్ల ముందే మిమ్మల్ని తిడుతుంటే విన్నామని సాక్షులు నెత్తీనోరూ బాదుకున్నా చివరికి ఆకాశం మీద, భూమ్మీద ఒట్టేసినా ప్రకాశం పంతులు నమ్మలేదు. తన విశ్వాసాన్ని అమ్మలేదు.
      మంచి చేసేవాడిదే కాదు, చెప్పేవాడి గొంతు కూడా కటువుగా ఉంటుంది. ‘వస్తేరానీ పోతేపోనీ కష్టాల్‌ నష్టాల్‌ వస్తేరానీ, పోతేపోనీ’ అన్నట్టు అంటీ ముట్టనట్టు ఉంటాడు. కానీ చెడు చేసేవాడేకాదు, చెప్పేవాడు కూడా తియ్యగా మాట్లాడతాడు. ఎక్కడాలేని వరసలు కలిపేసి నీవాడను నేనే అంటాడు. నీకోసమే పుట్టాను అంటాడు... ఇవి అవసరం గానీ, నిష్ఠూరాలు, మెటికలు విరవడాలు ఎందుకు? ముంచిన వాడు ముమ్మూర్తులా భగవంతునిలా కనిపిస్తాడు. అంతకన్నా ఏం కావాలి.
      నిజం చెప్పడం మంచిదని అంటుంటారు. పుస్తకాల్లో రాస్తుంటారు. కానీ దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఎన్ని ఉంటాయో తెలుసుకోవడానికి కాలిక్యులేటర్‌ అవసరం.. యథార్థం చెప్పడమే మంచి అయితే బావుకునేది ఏముంటుందీ శత్రుత్వం కొని తెచ్చుకోవడం తప్ప! భూమి గుండ్రంగా ఉందని చెప్పినవాణ్ని ఏం చేశారు? చంపేశారా లేదా? నిజం చెప్పడం లోకానికి మంచే కదా! అని ఎవరన్నా వాదించినా, చెప్పినవాణ్ని వేధిస్తుంటే ఎవరన్నా అడ్డం పడ్డారా? ప్రాణాలు తీయకుండా ఆపారా? 
      మాట మీద నిలబడటం మంచిదయితే, నిజం చెప్పడమే మంచిదయితే సత్యహరిశ్చంద్రుడు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు. మంచివాళ్లు సంఘం పెట్టుకుని అతణ్నేమన్నా రక్షించారా? లేదే!! అదే చెడ్డపని చేస్తుంటే దిల్లీ నుంచి పల్లెలోని గల్లీ వరకు బోలెడంత మంది తమ జెండాలను పక్కన పారేసి వచ్చి అండదండగా నిలుస్తారు. మహా అయితే వాటాలు అడుగుతారు. అంతే. వీటిలో సహకరించిన వాడికి వాటా ఇవ్వడంలో తప్పేముంది? ఏదయినా మంచికి ఫలితం ఎంతో దూరం. చెడు అయితే అదిగో అల్లదిగో అన్నట్టు దగ్గరగా ఉంటుంది.
      మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనిషి కోరుకునేది ఎక్కువకాలం బతికి ఉండాలనేగా! ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయవచ్చు’’నని ఒకానొక కవి పుంగవుడు అన్నాడు. సుఖాలు పొందాలంటే చెడ్డగా ఉండటం కన్నా ‘మంచి’ మార్గం లేదు.  సుఖపడకుండా ఎంతకాలం బతికితే మాత్రం ఏం లాభం? ‘‘కాకి చిరకాలము న్ననే కార్యమగును’’ అన్న పద్యపాదం ఉంది. ఆ ‘పాదం’ పట్టుకుని ‘వేలాడినా’ చెడ్డ చేయకుండా గత్యంతరం లేదు. అందరినీ దగ్గరికి చేర్చే చెడును వదులుకుని నలుగురినీ దూరం చేసి నలుగుపెట్టే మంచి ఎందుకట! కటకట! 
      ఇంతకీ కురుక్షేత్రంలో మనం ధర్మపక్షం అని టముకు వేసే పాండవులు గెలిచింది ‘అబద్ధం’తో (పైకి వేరే ముసుగు వేసినా) కాదా? ఆ అబద్ధమేదీ లేకపోతే అర్జునుడి లాంటి వాడికి విలువయిన విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు అంత తేలిగ్గా ప్రాణాలు వదిలేసేవాడా? ఇదే కాదు మన పురాణాల్లో ఇలాంటివి ఎన్ని కనపడటంలేదు! అందువల్ల
      ‘‘మంచి అన్నది/ కంచి కొదిలెయ్‌
      చెడ్డదారిని/ ఎంచుకోవోయ్‌’’ అన్నమాటను వింటే చాలు... అదే పదివేలు... పదిలక్షలు... పదికోట్లు... లక్షకోట్లు.


వెనక్కి ...

మీ అభిప్రాయం