అభివృద్ధికి ఆరోప్రాణం

  • 87 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘మాతృభాషలో సాంకేతిక విద్య’ దేశాభివృద్ధికి ఆలంబన అని దశాబ్దాలుగా మేధావులు, భాషావేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే, ఆ దిశగా మనం సాగించిన పయనం అరకొరే. తెలుగు అకాడమీ ఏర్పాటయ్యాక అన్ని విద్యల్నీ అమ్మభాషలో అందించడానికి చాలా కసరత్తు జరిగింది. కానీ, ఆశించిన మేర ఫలితాలు అందుకోలేకపోయాం. ప్రాథమిక విద్య వరకు తప్పనిసరిగా, ఆ పైస్థాయిలో మాతృభాషలో విద్యాబోధన మేలని నూతన జాతీయ విద్యావిధానం ఇటీవల చెప్పింది. గతంలో విద్యకు సంబంధించి నియమించిన అన్ని కమిటీలు అమ్మభాషా మాధ్యమంలో చదువు ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా మాతృభాషలో చదువు అందించాలని అన్నాయి. దేశంలో ఇంజినీరింగ్‌ సహా సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మాతృభాషలో సాంకేతిక విద్యను ఎలా పటిష్టం చేసుకోవాలి? ఆ దిశగా మన ముందున్న సవాళ్లేంటి? అసలు దాని ఆవశ్యకత ఏంటి?... వీటి గురించి వివిధ రంగాల నిపుణులు ఏమంటున్నారు....


అద్భుతాలు జరుగుతాయి
గనులు, సహజ వనరులే ఒకప్పుడు దేశాల ఆర్థిక సంపదలు. అయితే, ప్రస్తుతం విజ్ఞానమే దేశాల ఆర్థికానికి వెన్నెముకగా నిలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషల్ని ఎన్నో ఏళ్ల నుంచే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాయి. ప్రపంచంలోని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తమ భాషల్లోకి అనువదించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోగలిగాయి. ఆంగ్లం అవసరం లేకుండానే ఆయా దేశాల పిల్లలు విద్యార్జన చేస్తున్నారు. పరిశోధనల్లో రాణిస్తున్నారు. మన దేశం విషయానికొస్తే ముందు నుంచే స్థానిక భాషలని అభివృద్ధి చేసుకోవడంలో వెనకబడ్డాం. అది మన విజ్ఞాన సముపార్జనకు అడ్డంకిగా మారింది. సాంకేతిక విద్యను మాతృభాషలోకి తేవాలంటే ముందుగా సాంకేతిక పదాలు అమ్మభాషలో ప్రజల్లోకి వెళ్లేలా చెయ్యాలి. వారి ఆలోచనా విధానంలో పురోగతి తెచ్చే సాహిత్యం విరివిగా రావాలి. ప్రజలను చైతన్య పరచకుండా విజ్ఞాన శాస్త్రాన్ని మాతృభాషలో ప్రజల్లోకి తీసుకెళ్లలేం. ఒక వేళ బలవంతంగా అమలు చేసినా మొక్కను తొందరగా ఎదగమని ఆజ్ఞాపించినట్టవుతుంది. మార్పునకు తప్పకుండా కొంత సమయం తీసుకుం టుంది. అయితే సాంకేతిక విద్యను మాతృభాషలో అందిస్తే కచ్చితంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

    - ఆచార్య వి.శ్రీనివాస చక్రవర్తి, ఐఐటీ మద్రాసు


కొత్త ఆవిష్కరణలకు మార్గం
మాతృభాషలో సాంకేతిక విద్యను బోధిస్తే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లం నేర్చుకోవడమే ప్రధాన సమస్యగా మారి సమయమంతా దానికోసమే వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు మాతృభాష మీద మమకారం లేకపోవడం కూడా ఒక సమస్యే. సాంకేతిక విద్య అమ్మభాషలో ఉంటే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ప్రభుత్వాలు ముందుగా తెలుగు, ఆంగ్లభాషల్లో ప్రవీణులు, అలాగే శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చెయ్యాలి. సాంకేతిక పదాల పదకోశాలు, అనువాద వ్యవస్థలు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.   

- నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు


వారితోనే అనువాదాలు చేయించాలి
విజ్ఞానశాస్త్రంలోని సాంకేతిక పదాలు తొంభై శాతం లాటిన్, ఇతర యూరోపియన్‌ భాషలకు సంబంధించినవి. అయితే మనం వాటికి బదులు ఆంగ్ల వ్యవహారికంలోని పదాలను సాంకేతిక పదాలుగా వాడుతున్నాం. ఆంగ్లం మీద ఉన్న వ్యామోహం వల్లే సాంకేతిక విద్య మాతృభాషలో అందడం లేదు. ‘ఫీవర్‌’ అనేది ఆంగ్లంలో జ్వరానికి అర్థం. కానీ దాని సాంకేతికపదం ‘పైరెక్సియా’ అనే లాటిన్‌ పదం. ఆంగ్లం మీద వ్యామోహం వల్ల అందులోని వ్యవహారిక పదాలకు సాంకేతిక పదాల హోదా ఇచ్చాం. అమ్మభాషలో సాంకేతిక విద్య అందిస్తే అయిదేళ్లలో నేర్చుకునేదాన్ని మూడేళ్లలోనే గ్రహించడానికి సాధ్యమవుతుంది. సొంతగా, ఆవిష్కరణ యోగ్యంగా ఆలోచించే శక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. ప్రస్తుతం ఈ అనుసంధాన భాషను నేర్చుకోవడానికే ఎక్కువ సమయం అవసరమవుతోంది. మనం ‘ఇంగ్లీషు మందులు’ అంటాంగానీ ఆధునిక వైద్యాన్ని ప్రపంచంలోని ఎంతో మంది కష్టపడి అభివృద్ధి చేశారు. ఇంగ్లీషు వాళ్లకు మాత్రమే ఆ మందులతో సంబంధం లేదు. 1970లలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు తెలుగు అకాడమీ సాంకేతిక పరమైన పాఠ్యపుస్తకాలను ఆ రంగాల్లో నిపుణులతో కాకుండా సంస్కృత పండితులతో అనువదింపజేసింది. ఉదాహరణకు ఫెర్న్‌ మొక్క ఆకు మెలికలు తిరిగి ఉండటాన్ని ‘సర్సినేట్‌ వెర్నేషన్‌’ అంటారు. దాన్ని ‘వలితకితలయ విన్యాసం’ అని అనువదించారు. ఈ పదాలకు సైన్స్‌ మాస్టర్లకు అర్థాలు తెలియదు. ఎందుకంటే వాళ్లు సంస్కృత పండితులు కాదు. ఇలా సాంకేతిక పదాలను సంస్కృతంలోకి అనువదించడం వల్ల తెలుగు మాధ్యమం అంటేనే భయం పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సర్సినేట్‌ వెర్నేషన్‌ అనేది సాంకేతిక పదం.. దాని అర్థాన్ని చెప్పేది అనుసంధాన భాష. అనుసంధాన భాషను మాతృభాషలోనూ, సాంకేతిక పదాలను యథాతథంగా బోధిస్తే మేలని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను అంతర్జాలమనీ, కంప్యూటర్‌ని గణన యంత్రమనీ కొందరు అంటున్నారు. అవి సరైన పదాలు కాదు. ఇప్పటికైనా సైన్స్‌ పుస్తకాలను కవిపండితులతో కాకుండా విజ్ఞానశాస్త్ర నిపుణులతో అనువాదం చేయిస్తే మంచిది.    

- డా।। జి.వి.పూర్ణచందు, ఆయుర్వేద వైద్యులు, సాహితీవేత్త


మాతృభాషలో సాంకేతిక విద్యతో సత్ఫలితాలు
అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ మాతృభాషల్లోనే సాంకేతిక విద్యను బోధిస్తున్నాయి. అనుకుంటే మనం కూడా అమ్మభాషలో దాన్ని తేవచ్చు. అయితే ‘ఫొటోసింథసిస్‌’ పదాన్ని ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటున్నారు. ఈ అనువాదం చాలా మందికి అర్థం కాదు. ఇలాంటి వాటిని మరింత సరళ భాషలోకి తేవాలి. అలాగే సాంకేతిక పదాన్ని యథాతథంగా ఉంచి అందించాలి. మన దేశంలో అనేక భాషలున్నాయి. అన్నింటిలోకి సాంకేతిక విద్యను అనువదించి బోధించడం అంత సులభం కాదు. అయితే అనుకుంటే సాధ్యంకాని పని ఏదీ లేదు. ఇన్నాళ్లుగా ఆంగ్లంలో చదివినవారికి మాతృభాషలో బోధించడంలో కాస్త ఇబ్బంది ఎదురవ్వవచ్చు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలు భాషాశాస్త్రవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సాంకేతిక పదాలను యథాతథంగా వాడేందుకు వారి సమ్మతి తీసుకోవాలి. విద్యార్థులు, ప్రజల ఆమోదం కూడా ముఖ్యం. వారి సందేహాలను పూర్తిగా నివృత్తి చేసి మాతృభాషలో సాంకేతిక విద్య మంచిదేనని నమ్మకం కలిగించాలి. ఇందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుని శాస్త్ర, భాషా పరిజ్ఞానం ఉన్నవారితో కమిటీలు ఏర్పాటుచేసి ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలి. మాతృభాషలో సాంకేతిక విద్యను బోధిస్తే తప్పక సత్ఫలితాలు ఉంటాయి. 

- డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు, మూత్రపిండ వైద్య నిపుణులు, నిమ్స్, హైదరాబాదు


అలక్ష్యం వీడాలి
మాతృభాషలో సాంకేతిక విద్యే కాదు ఏ విద్యను బోధించినా ప్రయోజనమే. ఇది చరిత్ర చెప్పే సత్యం. అభివృద్ధి చెందిన దేశాలే అందుకు నిదర్శనం. సాంకేతిక విద్యను మనం మాతృభాషలో బోధించలేకపోవడానికి కారణం భాషాపరంగా వెనకపడి ఉండటమే. ఆంగ్లంలో సాంకేతిక విద్యను అభ్యసించడానికి మనం అలవాటుపడ్డాం. ఇప్పుడు పూర్తిగా తెలుగులో బోధించడమంటే ఎంతో శ్రమ అవసరమవుతుంది. ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకోవలసి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు ముందునుంచే తమ మాతృభాషను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాయి. అందుకే వాటికి అది సాధ్యమయ్యింది. ఇన్నేళ్లు మనం ఆంగ్లం మీద ఆధారపడుతూ మాతృభాషలను నిర్లక్ష్యం చేశాం. ప్రభుత్వాల అలక్ష్యం వల్ల కూడా మాతృభాషలో సాంకేతిక విద్యను సాగించలేకపోతున్నాం. ఈ విషయంలో మార్పుకు శ్రీకారం చుట్టడం శుభసూచకం.

- తుమ్మల కిశోర్, ఆర్థిక రంగ నిపుణులు


అలా సుసాధ్యం అవుతుంది
మాతృభాషలో సాంకేతిక విద్య అందించడం వల్ల పిల్లలకు భావం అర్థమవుతుంది. ధైర్యంగా తమ భావాల్ని వ్యక్తీకరించగలుగుతారు. భావం అర్థమవడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుత విద్యావ్యవస్థలో లేనిది ఇదే. మనకు ముఖ్యంగా రెండు సమస్యలున్నాయి. ఒకటి పాఠ్యపుస్తకాలు. మాతృభాషలో విద్యార్థులకు నాలుగైదు రకాల పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఏ పుస్తకంలో పాఠ్యాంశం అర్థమైతే పిల్లలు దాన్ని చదువుకుంటారు. రెండో సమస్య విశ్వవిద్యాలయాల పరిశోధనలేవీ మాతృభాషలో అందుబాటులో ఉండటం లేదు. సైన్స్‌ పుస్తకాలను సంస్కృతీకరించడం మన దగ్గర జరిగిన మరో పొరపాటు. ‘వేవ్‌ లెంగ్త్‌’ పదాన్ని సరళంగా ‘తరంగం పొడవు’ అని కాకుండా ‘తరంగ దైర్ఘ్యం’ అని కష్టతరంగా అనువదించుకున్నాం. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు, పరిశోధనల్ని అమ్మభాషల్లోకి అనువదించడం సాధ్యమేనా! మనకు అంత భాష వచ్చిన వారు ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కృత్రిమ మేధ. సుప్రీంకోర్టు న్యాయపత్రాలను తొమ్మిది భాషల్లోకి దీని ద్వారానే అనువదిస్తున్నారు. 
      మాతృభాషలో సాంకేతిక విద్యను చదివితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా అన్నది మరో అంశం. దీనికి అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు సమాధానం చెబుతాయి. చైనాలో అందరూ సాంకేతిక విద్యను మాతృభాషలోనే చదువుతున్నారు. అయినా వారు అన్ని రంగాల్లో మనకన్నా ముందున్నారు. కారణం ఆ దేశంలో డిగ్రీ పూర్తయ్యేలోపు నేషనల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ తప్పక పాసవ్వాలి. అది ఆంగ్లభాషలోని నాలుగు నైపుణ్యాలను సంపూర్ణంగా పరీక్షించేలా ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పరీక్షను అందుబాటులోకి తెస్తే మాతృభాషలో సాంకేతిక విద్య చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధికి ఎలాంటి సమస్యా ఉండదు. ప్రభుత్వాలు దీని గురించి నిబద్ధతతో ఆలోచించాలి. 

- డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్, సహాయ ఆచార్యులు, ఆశ్రమ్‌ కళాశాల


చిత్తశుద్ధితో అమలు చేయాలి
జాతీయ నూతన విద్యావిధానం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. విద్యావిధానం రాష్ట్రాలకీ కేంద్రానికీ సంబంధించిన విషయం కాబట్టి చట్టాలకి మార్పులు చేయాలి. న్యాయవిద్య ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొనేలా ఉండాలని రాజ్యాంగంలో చెప్పారు. రాష్ట్రాల్లో ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా సాంకేతిక, న్యాయ, వైద్యవిద్యలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇవి అమలు జరగాలంటే ముందుగా ఆయాభాషల్లో ఆయా రంగాల నిపుణులతో పదకోశాలు తయారు చేయించాలి. లేకుంటే ఒక్క అడుగూ ముందుకు పడదు. న్యాయవిద్య విషయాని కొస్తే మన న్యాయవాదులు విదేశాల్లో వాదించే కేసులేమీ ఉండవు. విదేశీ న్యాయవాదులను కూడా మన దేశంలోకి అనుమతించడంలేదు. అందువల్ల మాతృభాషలో న్యాయవిద్యను అభ్యసించడంలో ఇబ్బందులేవీ ఉండవు. అయితే ప్రతి రాష్ట్రంలో అనేక భాషలున్నాయి. కనీసం రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన భాషల్లో అయినా పదకోశాలు రూపొందించి వాటిలోనైనా న్యాయ విద్యను బోధించాలి. న్యాయవిద్యలో అనేక అనువాద సమస్యలున్నాయి. సుప్రీంకోర్టులో ‘లీవ్‌ గ్రాంటెడ్‌’ పదానికి ‘అనుమతి ఇస్తున్నాం’ అని అర్థం. కానీ దాన్ని ‘సెలవు ఇస్తున్నాం’ అని అనువదిస్తున్నారు. ఇలాంటి వాటి అనువాద బాధ్యతల్ని నిపుణులకు అప్పగించాలి. దిల్లీలో టిబెటన్‌ వైద్యులను చూశాను. వాళ్ల విద్య మొత్తం టిబెటన్‌ భాషలోనే ఉంది. రోగిది - వైద్యుడిది, న్యాయవాదిది - లిటిగెంట్‌ది ఒకే భాష అయితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దాని వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. మాతృభాషల్లో సాంకేతిక, వృత్తి విద్యా బోధన విదేశాల్లో సాధ్యమయినప్పుడు మన దేశంలో కూడా సాధ్యమే. అందుకోసం చట్టాలను మార్చి, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలి.   

- జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి


అద్భుతమైన మార్పులు చూడొచ్చు
సాంకేతిక విద్యను మాతృభాషలోకి తేవడం చాలా మంచిది. అయితే, సాంకేతిక పదాలను అలాగే అందించి, వాటి అర్థాల్ని సూటిగా సరళ భాషలో ఇస్తే విద్యార్థులకు బాగా అర్థమవుతాయి. దీనివల్ల భావవ్యక్తీకరణలో విద్యార్థులు వెనకబడరు. గ్రామీణ విద్యార్థుల్లో మనం ఈ సమస్యను ఎక్కువగా చూడొచ్చు. అంతర్జాతీయ పరీక్షల్లో కూడా రాణించేలా సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం కూడా ఎంతో ముఖ్యం. సాంకేతిక పదాలను గ్రాంథికంలోకి అనువదించడం కూడా మరో ప్రధాన సమస్య. పిల్లలు ఆ పదాలను కేవలం బట్టీపట్టి గుర్తుంచుకుంటున్నారు. ఈ విధానం నుంచీ బయటపడాలి. అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వాలి. అప్పుడు తప్పకుండా అద్భుత మార్పులు చూడొచ్చు.    

- నల్లమోతు శ్రీధర్, సాంకేతిక రంగ నిపుణులు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం