వహ్హారే! సంక్రాంతి భోజనంబు!!

  • 234 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

  • విజయవాడ
  • 9440172642
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు 
    పుళియోరెము వెన్న బూరియలును 
సరడాల పాశముల్‌ చక్కెర పులగముల్‌ 
    నువ్వుమండిగలు మనోహరములు
అప్పము లిడ్డెన లతిరసాల్‌ హోళిగల్‌ 
    వడలు దోసెలు గలవంటకములు
శాకముల్‌ సూపముల్‌ చాఱు లంబళ్లు     
    శుద్ధోదనములును సద్యోఘృతమ్ము 
పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును
మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండఁ
బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె 
శత్రు సంహార వెంకటాచల విహార 

    (వెంకటాచల విహార శతకం)
      ఏ యుగంలో అయినా ప్రజలు తమకి ఇష్టమైన వంటకాలనే వండి, అవి దేవుడికి ఇష్టమైనవని నైవేద్యం పెడుతుంటారు. వాటిని కవులు వర్ణిస్తారు. అవి ఆకాలపు ఆహార చరిత్రకు అద్దం పడతాయి. 
      అచ్చతెలుగు ఆహార సంస్కృతికి ప్రబల సాక్ష్యాలనదగిన వంటకాలు పై పద్యంలో కనిపిస్తాయి. అన్నీ సంక్రాంతినాడు మనం వండుకునేవే! ‘ఇవన్నీ నువ్వు మెక్కుతు న్నావు. మేమేమో గుగ్గిళ్లు తింటున్నాం. అయినా నువ్వు ఫర్వా చెయ్యటంలేదు. నీలాంటివాళ్లు కాదా మా మనుషులు...?’ అని దేవుణ్ణి నిలదీస్తున్నాడీ కవి వెంకటాచల విహార శతకంలో! దేవుడు తినే వంటకాల పట్టిక ఇది! సంక్రాంతికి మనమూ వీటినే తిందామా!!  
      1. పాలు 2. వెన్న 3. బకాళబాతు 4. దధ్యోదనం 5. పుళియోరెము 6. వెన్న బూరెలు 6. సరడాల పాశం 7. చక్కెర పులగం 8. నువ్వుమండిగలు        9. మనోహరాలు 10. అప్పము 11. ఇడ్డెన 12. అతిరసాలు 13. హోళిగలు      14. వడలు 15. దోసెలు          16. కలవంటకాలు 17. శాకాలు      18. సూపాలు 19. చాఱులు 20. అంబళ్లు 21. శుద్ధోదనాలు 22. సద్యోఘృతం    23. పండ్లు 24. తేనెలు  25. హొబ్బట్లు 26. పచ్చళ్లు... ఇలా దేవుడు తినే అన్నం పేరుతో పాతికకు పైగా వంటకాలను పేర్కొన్నాడిందులో! ఈ వంటకాల్లో కొన్నే మనకు తెలుసు. కొన్నింటి పేర్లు మరిచిపోయారంతా! వీటితో ఈ సంక్రాంతిని ఎంత బాగా ఆస్వాదించి ఆనందించవచ్చో!
బకాళబాతు
భక్తం అనేది అన్నానికి పర్యాయపదం. కన్నడం, తెలుగుల్లో బత్త, భత్త అంటారు. ప్రాకృతంలో భత్త, మరాఠీలో భాత్, తెలుగు కన్నడాల్లో బాత్‌ దీన్ని బట్టే ఏర్పడింది. బిసిబేలీ బాత్, వాంగీ బాత్‌ ఇలా ‘బాత్‌’ అనే పేరు దక్షిణాదిలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్యంలో చెప్పిన బకాళబాత్‌ ప్రత్యేకమైంది. ఈ పేరుతో తమిళ కర్ణాటక ప్రాంతాల్లో పెరుగు లేదా చల్లన్నం తయారు చేసుకుంటారు. అమ్మవారికి ‘చలిది నివేదన’ పెడతారే... అలాంటి పెరుగన్నం ఇది! తమిళులు ‘బాగలబాత్‌’ అనికూడా పిలుస్తారు. మనకి అంబకళం అనే ఇంకో వంటకం ఉంది. పులియబెట్టిన గంజి (అంబలి)లో చల్ల కలిపి తయారు చేసిన పానీయం అంబకళం. ‘చెన్నయ్య యింట బులియంబ ళకము చెయిదియ్యకనుజుర్రి’ అనే కవి ప్రయోగం ఉంది. ‘పులియంబకళం’ అనే అంబళకాన్ని వ్యాసుడి శిష్యులకు విశాలాక్షి వడ్డించిందని శ్రీనాథుడు వర్ణించాడు. రాయలసీమవారు ఎక్కువగా రాగి లేదా జొన్నగంజి (పారిజ్‌)తో దీన్ని చేస్తారు. కోస్తావారు వరి అన్నాన్ని వాడతారు. ఈ అంబలిలో పులిసిన మజ్జిగని కలిపితే అది పులిఅంబలి. అన్నంలో దాన్ని కలుపుకుని తింటే అది అంబకళం. పలనాడులో శ్రీనాథుడు ‘చల్లాయంబలి ద్రావితి’ అని దీనంగా చెప్పుకున్నది ఈ అంబకళమే! చక్కగా తాలింపు పెట్టి కాచినది అంబకళం. కబళం అంటే నోటి నిండుగా తీసుకున్నది అని! దీన్ని అన్నంలో కలుపుకుని తింటే అదే బకాళాబాతు కావచ్చు. కోస్తా ప్రాంతాల్లో లక్ష్మీచారు అనీ, తరవాణి అనీ పిలుస్తారు.
దధ్యోదనం
ఈ పద్యంలో కవి చెప్పిన మరో వంటకం దధ్యోదనం. ఓదనం అంటే అన్నం. దధి అంటే పెరుగు. వేడివేడి అన్నంలో పెరుగు కలిపి, తాలింపు పెట్టిన అన్నాన్ని దధ్యోదనం అన్నారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైందిది. ఉపయోగపడే బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి దీన్ని పెరుగు అన్నారు. తింటే ఆరోగ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మానికి వన్నె పెరుగుతుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
పుళియోరెం
పులిహోరనే పుళియోరెం అని కూడా పిలుస్తారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఈ ఆరు రుచులు కలిసే విధంగా దీన్ని వండుకోవాలి. పులుపు, ఉప్పు, కారం ఎటు తిరిగీ కలుపుతారు. ఆవపిండి, మెంతిపిండి, బెల్లం కూడా కొద్దికొద్దిగా కలిపి పులిహోర తయారు చేసుకుంటే అది ఆరు రుచులతో ఆరోగ్యదాయకంగా ఉంటుంది. మరాడించిన పసుపునే వాడాలి. పసుపు వల్ల పులిహోరకు మంచి సువాసన, అదనపు రుచితో పాటు విషదోషాలను హరించే గుణం కలుగుతుంది. పరిమితంగా తినాలి. అతిగా పులుపు కలపకూడదు!
వెన్నబూరెలు
వెల్ల (తెల్లనిది) + నెయ్యి= ‘వెన్న’ అయ్యింది. తెల్లనిదని భావార్థం. బియ్యప్పిండిలో వెన్నపూస కలిపి గట్టి ఉండలు చేసి నూనెలో గానీ నేతిలోగానీ వేయించి పాకం పట్టిన ఉండల్ని వెన్న ఉండలు, వెన్నబూరెలు, వెన్నడాయిలు, వెన్నప్పాలు, వెన్నమడుగులు, వెన్నముద్దలు, వెన్నమెరుగులు అంటారు. వీటిని ఉండలుగా లేదా బూరెల్లా చేస్తారు. 
సరడాల పాశం
పాశం అంటే పాయసమే! అక్కాల పాశం అంటే అక్కుళ్లు అనే ధాన్యంతో వండిన పాయసాన్ని అన్నమయ్య ప్రస్తావించాడు. సరడాలనేవి కూడా బాసుమతి బియ్యంలా ఆనాటి ఒక ప్రసిద్ధ ధాన్యవిశేషం కావచ్చు. ‘శరణ్డః’ (బంగారు నగ) నుంచి ఈ సరడాలు పదం ఏర్పడింది. బంగారు తీగెలు, మొలకొలుకులు అన్నట్లే సరడాలనే బియ్యం కూడా ఉండేవి కాబోలు. ఆ సరడాల బియ్యపు పాయసం ఇది!  పొంగే పాలలో బియ్యం, బెల్లం కలిపి ఉడికించి సంక్రాంతినాడు తినటం మన సంప్రదాయం. నూతన గృహప్రవేశ సమయంలో తెలుగువారు తప్పనిసరిగా పాలుపొంగించి పరమాన్నం వండుతారు. పొంగళ్లు పెట్టడం తెలుగింటి ఆచారం.  
చక్కెర పులగం
పొంగలికీ, పులగానికీ మౌలికమైన తేడా ఉంది. పాలలో బియ్యం వేసి ఉడికిస్తే అది పొంగలి. బియ్యమూ, పెసరపప్పు కలిపి ఉడికిస్తే అది పులగం. ఇందులో బెల్లం కూడా కలిపి ఉడికిస్తే అది చక్కెరపులగం. చక్రపొంగలి అని కూడా పిలుస్తారు. బియ్యంలో పెసరపప్పు కలిపి ఉడికించి తీపి చేర్చింది చక్కెరపులగం. ఏలకులపొడి, పచ్చకర్పూరం, జీడిపప్పులు వగైరా వేసి, నేతితో వండుకుని సంక్రాంతి నాడు ఆస్వాదించవచ్చు. బియ్యం, నెయ్యి, పెసరపప్పు, చక్కెర కలిపి వండిన ‘పరుప్పవియల్‌’ వంటకాన్నే తిరుమలలో నైవేద్యం పెడతారు.
నువ్వు మండిగలు
మండెగలు కారపు వంటకమే. గిన్నెని బోర్లించి బియ్యప్పిండి, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, నువ్వులు కలిపి వేడి నూనెతో ముద్దగా చేసిన పిండిని ఆ గిన్నె పైన ఉంచి గుండ్రంగా వేళ్లతో రొట్టెలా నొక్కి, అడుగు నుంచి మంట పెట్టి కాలుస్తారు. ఇవి చెక్కల్లా గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. వీటిని మండెగలు అనీ, ఇందులో నువ్వులు కలిపితే నువ్వు మండిగలనీ పిలుస్తారు. 
      రెండు మండిగల మధ్య తీపి లౌజుగానీ, కారపు కూరగానీ పెట్టుకుని తింటే వాటిని ‘జమిలి మండెగలు’ అంటారు. వీటి మీద పంచదార కలిపిన పాల గుజ్జుతో చక్కని లతలు చిత్రించే వారు. ఆ లతలు పెళ్లి కూతురు కట్టుకున్న చీరజరీ అంచులా ఉన్నాయని శ్రీనాథుడు వర్ణించాడు. 
      తప్పాల లేదా తపేలా (గిన్నె) మీద కాలుస్తారు కాబట్టి వీటిని తప్పాల చెక్క లన్నారు. తపేలాని బోర్లించి, పైన రొట్టె వేసి, కింద నుంచి మంట అందించటం ఒక ప్రత్యేకమైన బేకింగ్‌ ప్రక్రియ. ఇది తేలికగా, త్వరగా అయ్యే వంటకమే! 
మనోహరాలు
అంటే తీపి మురుకులు. బియ్యప్పిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి, లావు కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి, ఉండ కట్టి నైవేద్యం పెడతారు. తిరుమలలో ‘మనోహరప్పడి’ పేరుతో నివేదిస్తారు. కర్ణాటక మెల్కోటే, మధుర మీనాక్షి ఆలయాల్లో దీన్ని ప్రసాదంగా పెడతారు. ఈ సంక్రాంతికి మీరూ ప్రయత్నించండి!
అప్పం
ఋగ్వేద కాలంలో ఆర్యులు భక్తితో దేవతలకు అర్పించిన అపూపం అనే వంటకమే ఈ అప్పం. ఎఫ్‌.బి.జె.క్వీపర్‌ అనే పండితుడు దాదాపు 350 పదాలను ఋగ్వేదంలోంచి ఏరి ఇవి ఇండో యూరోపియన్‌ భాషాకూటమికి చెందిన పదాలు కావని, ద్రావిడ లేదా ముండా భాషల్లోంచి అరువు తెచ్చుకున్నవనీ ప్రకటించారు. వాటిలో అపూపం ఒకటి. ఇది ద్రావిడుల అప్పమే! తెలుగు, తమిళ, కన్నడాది అన్ని ద్రావిడ భాషల్లోను కనిపించే అప్పమే ఋగ్వేద అపూపానికి మూలం కావచ్చు. తెలుగువాళ్లు అప్పచ్చి అని కూడా పిలుస్తుంటారు. సజ్జప్పాలు ఈ అపూపం లాంటివే! సజ్జ పిండి, బెల్లం కలిపి వండినవి సజ్జప్పాలు. బొంబాయి రవ్వతో, మైదా పిండితో చేయటం అనారోగ్యకరం. అచ్చమైన సజ్జప్పాలు ప్రయత్నించండి ఈసారి.
ఇడ్డెన 
ఇడి అంటే రుబ్బిన లేదా కొట్టిన పిండి. ఇడితో తయారైందే ఇడిలీ లేదా ఇడ్డెన. తెలుగువాళ్లకు ఇడ్డెనలే. తిరుమలలో ‘ఇడ్డలి ప్రసాదం’ అంటారు. శ్రీనాథుడు కూడా ఇడ్డెనలనే రాశాడు. వీటిని అన్నంతో పాటే తిన్నారు ఆ రోజుల్లో! 
అతిరసాలు
అతిరసం అంటే అరిసె! తెలుగింటి వైభోగానికి తీపి గుర్తు. తీపి భక్ష్యాలకు రారాజు. తెలుగు వారికి సంక్రాంతి అంటే అరిసెల పండుగ! ‘అలివేణి నీ చేతి యతిరసరుచి రసఙ్ఞానందమాయె నేమనగ వచ్చు’ అని ఓ కవిగారు వర్ణించారు. తెలుగులో ‘అరిసి’ అంటే వరి బియ్యం. అరిసితో చేసినది అరిసె.  తమిళంలో ‘అరిచి’ అంటారు. అరి అంటే వరిపంట మీద విధించే పన్ను. పన్నుకట్టే రైతును ‘అరికాపు’ అంటారు. వరి పండే పొలానికి యజమానిని అరుసు లేదా అరసు అంటారు. తిమ్మరుసు అనేది తెలుగు పేరే! పన్ను కట్టేందుకు గడువునో, పంటమీద రుణాన్నో కోరటాన్ని ‘అరువు’ అంటారు. ఇది ‘చేబదులు’ అనే అర్థంలోకి మారింది. 
      అరి లేదా అరిసితో వండిన వంటకం కాబట్టి అరిసె అన్నారు. తమిళులు ‘విష్‌ యూ ఎ హ్యాపీ పొంగల్‌’ అంటూ పాయసం శుభాకాంక్షలు చెబుతారు! సంక్రాంతికి తెలుగువారు అరిసె శుభాకాంక్షలు చెప్పుకోవాలి!   ఇంగ్లీషులోనే చెప్పుకోవాలనుకుంటే ‘విష్‌ యూ ఎ హేపీ అరిసె’ అనండి! సంక్రాంతికి తప్పనిసరిగా అరిసెలు తినండి. పంచదారతో చేసిన అరిసెల్ని ఘేవరి అంటారు. ఇది బెల్లం అరిసె కన్నా నయం అని భావప్రకాశ ఆయుర్వేద గ్రంథం చెబుతోంది.
హోళిగలు/ హొబ్బట్లు 
కన్నడం వారు, రాయసీమలోని కొందరు తెలుగువారు హోళిగలని పిలిచే వంటకాన్ని ఇతర తెలుగు ప్రాంతాలవారు హొబ్బట్టు, ఒబ్బట్టు లేదా బొబ్బట్టు అంటారు. ఈ పద్యంలో కవి హొబ్బట్లను కూడా ప్రస్తావించాడు. కాబట్టి, హోళిగలు, హొబ్బట్లు వేర్వేరన్నమాట! రాయలసీమ వారు చపాతీ పిండిలో తీపి కలిపి చపాతీ వత్తి తక్కువ నూనె వేసి కాల్చుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ ఉంటాయి. పాలల్లో నంజుకుని తింటారు. మహారాష్ట్రులకు కూడా ఇలా తినటం అలవాటు. ఆరోగ్యదాయకమైన విధానం ఇది. బహుశా ఇవి హోళిగలు కావచ్చు 
      శనగపప్పు, చక్కెర/ బెల్లం కలిపి బాగా మెత్తగా చేసిన పూర్ణాన్ని పోలి అంటారు. వత్తిన చపాతీ మీద దీన్నుంచి మూసి, మళ్లీ గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చే బొబ్బట్లకు కోస్తా, తెలంగాణల్లో ప్రచారం ఎక్కువ. బొబ్బ అంటే ఉబ్బటం. పూరణం వలన లావుగా మందంగా ఉంటాయి కాబట్టి వీటిని హొబ్బట్టు, ఒబ్బట్టు లేదా బొబ్బట్లంటారు.
వడలు
తెలుగువాళ్లు పెద్దల్ని, ప్రముఖుల్ని గౌరవసూచకంగా ‘గారు’ అని పిలుస్తారు. గారెలు కూడా అలాంటి గౌరవనీయమైనవి కాబట్టి గారెలని పిలిచారు. కొందరు ఘృత సంబంధమైనవి గారెలంటారు. 
      గారెల్నే కొందరు వడలని కూడా అంటారు. మినప్పప్పుతో కాకుండా ఇతర పప్పుధాన్యాలతో వండితే వడలని కొందరు, చిల్లు పెట్టకుండా వండితే వడలని కొందరూ చెబుతారు. రుబ్బిన మినప్పిండిలో మొక్కగట్టిన రాగుల పిండి, అల్లం, మిరియాలు, ఉల్లి, కొత్తిమీర, పుదీనా లాంటివి కలిపి చిల్లు పెట్టకుండా వండిన వడలు నూనె పీల్చకుండా ఉంటాయి. తేలికగా అరుగుతాయి. అరటి, బీర, వంకాయ, క్యాబేజీ, ఆలు, క్యారెట్, బీట్‌రూట్‌ ఇలా రకరకాల కూరగాయ లతో కూడా వీటిని వేసుకోవచ్చు. వాము ఆకు వడలు రుచిగా ఉంటాయి.
      ఆవ పెట్టిన పెరుగులో నానబెట్టిన వడల్ని ఆవవడలు లేదా ఆవడలు అంటారు. దహీవడ, తైరువడలుగా ఇవి దక్షిణాదిలో ప్రసిద్ధి. ఉత్తరాదిలో ‘వడాపావ్‌’ అంటారు. ఆమవడలు ఆవడలయ్యాయని ఒక వాదన ఉంది. ఆమం అనేది అజీర్తి సూచకమైన పదం. ఆవ వడలే ఆవడలై ఉంటాయను కుంటాను. ఆవపిండి కలిపిన పెరుగులో నానిన గారెలు వాతం చెయ్యకుండా, కడుపుబ్బరం కలిగించకుండా ఉంటాయి. సంక్రాంతికి గారెలతోపాటు ఆవపెట్టిన ఆవడలు వండుకుంటే, ఆరోగ్యానికి మేలు. 
దోసెలు
దోసియలు, దోసెలని పిలిచే ఈ వంటకాన్నే మనవాళ్లు అట్టు అంటుంటారు. తడిలేకుండా అట్టకట్టినట్టు కాలింది అట్టు. ‘అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌’ అనే జానపదగీతాన్ని బట్టి, అట్టుని ముద్దపప్పుతో నంజుకుని తినే అలవాటు తెలుగువాళ్ల కుండేదని అర్థం అవుతోంది. శనగచట్నీ ఒకరకం ముద్దపప్పే కదా! శృంగారనైషధంలో శ్రీనాథ మహాకవి చాపట్లతో (పెద్దదిగా వేసిన అట్టు) పెసరపప్పుని నంజుకుని తినటం గురించి ప్రస్తావించాడు. శనగ చట్నీ, సాంబారు, నెయ్యి, కారప్పొడులతో మాత్రమే హోటల్‌ దోశెలు తినగలుగుతాం. ముద్దపప్పు లేదా కొంచెం బెల్లం ముక్క ఉంటే చాలు తెలుగు దోసెలు తినేయొచ్చు. చెరకు రసాన్ని మరగకాచిన ద్రావణంలో ముంచి తినే వాళ్లు వీటిని. బియ్యం, మినప్పప్పు, పెరుగు, నెయ్యి, చక్కెర కలిపి తయారు చేసిన దోసెలు తిరుమలలో స్వామికి నైవేద్యం పెడతారు. 
ఇంకా ఎన్నో...
పాడిపంటల పండగ సంక్రాంతినాడు పాలు, వెన్నలు తప్పనిసరిగా ఉండాలి. 
కలవంటకములు కలపు+వంటకము = చిత్రాన్నం. అనేక  కూరగాయలు కలిపి వండిన ఖిచిడి, వెజిటబుల్‌ ఫ్రైడ్‌ రైస్‌ లాంటి ఒక వంటకం. శాకాలు సలాదు లాంటివి. సూపం అంటే ముద్దపప్పు, వండినపప్పు. చాఱు అనేది సారం అనే సంస్కృత పదానికి తెలుగు రూపం. దేని సారం...? ధనియాలు, మిరియాలు వగైరా జీర్ణశక్తికి ఉపయోగించే ద్రవ్యాల సారం. మనమిప్పుడు చింతపండు సారంతో అశాస్త్రీయంగా చారు/రసం కాచుకుంటున్నాం. తెనాలి రామకృష్ణుడు యొర్రచారులు గురించి ప్రస్తావించాడు. అంటే ఒర్రగా కాచిన ఘాటైన మిరియాల చారు. దీన్ని తింటే కంఠ పర్యంతం భుజించినా భుక్తాయాసం కలగకుండా ఉంటుంది. ఇదీ చారు ప్రయోజనం.
      అంబలి అంటే పిండి నూకలువేసి జావగా కాచిందని! ‘పలుచని యంబళుల్‌ చెరుకుపాలెడనీళ్లు ... వడపిందెలు నీరుచల్లయున్‌ వెలయగబెట్టు వెసవిఁజందనచర్చమున్నగన్‌’ అని ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు రాసిన పలుచని అంబలి ఎండ శ్రమను తీర్చేదిగా ఉంటుందట. ఉదయాన్నే అంబటి వేళకు రైతన్నలు అంబటి కుండలోంచి అంబలి తీసుకుని సేవిస్తారు. ఖరీదైన హోటళ్ల కెళ్లినప్పుడు ముందుగా ఎపిటైజర్‌ అంటూ ఇచ్చే సూపు లేదా పారిజ్‌ ఇదే! భోజనంలో ముందుగా తినదగిన వంటకం.
      శుద్ధోదనాలు అంటే అన్నమూ పెరుగూ శొంఠిపొడి కలిపి తయారుచేస్తారు. తిరుమలలో నిత్యనైవేద్యాలలో ఇది కూడా ఒకటి. 
      సద్యోఘృతం అంటే తాజా నెయ్యి. దీన్నే శ్రీనాథుడు ‘హైయంగవీనము’ అన్నాడు. అప్పుడే తరచి తీసి కాచిన నెయ్యి అన్నమాట! 
      పండ్లు తేనెలు పచ్చడులు ఇవన్నీ భోజనంలో తప్పనిసరిగా ఉండేవే! గారెలు, బొబ్బట్లు లాంటి వాటిని తేనెతో నంజుకుంటే ఎక్కువ రుచికరంగా ఉంటాయి. అందుకని విస్తట్లో తేనెని కూడా కొద్దిగా వడ్డించేవాళ్లు.
      తెలుగువారి సంప్రదాయ భోజనం ఇలా ఉంటుంది. అన్నంలో సాంబారు పోసుకుని రుచికరమైన కూరల్ని ఆ సాంబారన్నంలో నంజుకుని తినే విధానం మనకు లేదు. షడ్రసోపేతంగా సుష్టుగా, తృప్తిగా భోజనం చెయ్యాలంటే తెలుగువారి భోజనమే శరణ్యం!


వెనక్కి ...

మీ అభిప్రాయం