ఆ ధ్యాస ఏది?

  • 602 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కొడవటిగంటి కుటుంబరావు

‘‘చదువనివాడజ్ఞుండగు - అన్నాడు బమ్మెర పోతన గారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో. హిరణ్యకశిపుడి కాలానికి పుస్తకాలున్నాయో లేవో తెలీదు. పుస్తకాలు లేనికాలంలో శ్రౌతజ్ఞానమైనా సంపాదించవలసి వచ్చేది. మనిషి ప్రపంచమంతా తిరిగి వచ్చినా కూడా కాలానుగతంగా మానవమేధస్సు పెంపొందుతూ వచ్చిన జ్ఞానాన్ని సంపాదించలేడు. సరే, పుస్తకాలు వచ్చాక బమ్మెర పోతనగారు చెప్పినట్టు అజ్ఞానం తొలగించుకోవటానికి చదువు సాధనమైంది.
మనదేశంలో శాస్త్రజ్ఞాన వ్యాప్తి బహుతక్కువ. అక్షరాస్యులు నూటికి పదిమందివుంటూ, వారిలో కూడా శాస్త్రపరిజ్ఞానం సంపాదించి దాని ఆధారంతో జీవితాన్ని అర్థం చేసుకోగలవారు నూటికి ఒకరైనా లేరు. దీని దుష్ఫలితాలు మనం జీవించే విధానంలోనూ, సాముదాయిక ప్రవర్తనలోనూ, మన రాజకీయాలలోనూ బయటపడుతున్నాయి!
ముందుకు వచ్చిన దేశాలన్నిటిలోనూ శాస్త్రజ్ఞానం బాగా అభివృద్ధి అయింది. అమెరికాలో ప్రతివిద్యార్థీ మోటారుకారు రిపేరు చేస్తాట్ట. ఎంతోమంది విద్యార్థులు టెలిఫోనులూ, రేడియో ట్రాన్స్‌మిటర్లూ మొదలైనవి సొంతాన తయారు చేసుకుంటారు. అమెరికాలో ‘సైన్సు’ పత్రికలు విపరీతంగా అమ్ముడవుతాయి, సైన్సుపుస్తకాలూ అంతే. నిన్నగాక మొన్న మధ్యయుగపు వాతావరణం నుంచి బయటపడిన రష్యాలో కూడా శాస్త్ర గ్రంథాలు జాస్తిగా అమ్ముడవుతాయని ప్రొఫెసర్‌ హాల్డేన్‌ చెప్పాడు. ఆయన ఎనభై పుస్తకాల షాపులు తిరిగితే సైన్సు పుస్తకాలు లేని దుకాణం కనబడలేదట. ఇది దాదాపు ఇరవై ఏళ్లనాటి మాట. మనదేశంలో ‘సైన్సు’ పుస్తకాలు రాయించాలంటే బహుమానాలు ప్రకటించాలి. వాటినెవరూ చదవరు. మనదేశంలో ఆధునిక శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషు భాషలోనే జరిగింది. అణుశక్తిని గురించి ఇవాళ మనం తెలుగులో గ్రంథం ప్రకటిస్తే షేక్‌స్పియర్‌ నాటకాన్ని తెలుగు లిపిలో అచ్చువేసినట్టుగా ఉంటుంది. చదివేవాడికి ఒక్కముక్క అర్థం కాదు. ప్రాథమిక విషయాలను ముందు తెలుగులోకి దించి ప్రజల కందించాలి. తరువాత అంతకన్న క్లిష్టమైన విషయాలూ, అటుపిమ్మట ఆధునిక పరిజ్ఞానమూ అందించాలి. సినిమా చిత్రాల ద్వారా ఈ పని సాధించటం చాలా తేలిక. ప్రతి చిన్న పట్టణంలోనూ ఏటా ఎగ్జిబిషనులు వగైరాలు జరుగుతాయి. వీటిలో ఉచితంగా వైజ్ఞానిక చిత్రప్రదర్శన జరిపితే లక్షలాది ప్రజలు శాస్త్రవిజ్ఞానం పొందుతారు. జీవితరంగంలో కూడా వారి భావాలు సంస్కారం పొందుతాయి. ప్రజలలో మూఢవిశ్వాసాలున్నంత కాలం ప్రజాస్వామ్యం సాధ్యంకాదు సరిగదా; ప్రజాక్షేమం కూడా అభివృద్ధి కాదు’’

*     *     *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం