తూళిప్పాట్టు - ఉంజల్‌ పాట్టు

  • 140 Views
  • 0Likes
  • Like
  • Article Share

జోవచ్యుత
జోవచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామగోవిందా..
జో + అచ్యుత- జోవచ్యుత. దీన్ని ప్రాసస్థానంలో వేసి ‘రావె పరమానంద’ అని రెండో చరణంలో ప్రయోగించాడు అన్నమయ్య. ‘జోవచ్యుతానంద’ అని గుజరీ ప్రతులలో ఉంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగే పాడారు. ఏ పండితమన్యుడో ఇది తప్పనుకుని ‘జో అచ్యుతానంద రార పరమానంద’ అని దిద్దివేశాడు, అన్నమాచార్యులు పల్లవుల్లో యతిస్థానం పాటిస్తారనే పరిజ్ఞానం కూడా లేకుండా. 

- తిరుమల రామచంద్ర 


తూళిప్పాట్టు - ఉంజల్‌ పాట్టు
లాలిస్తూ పాడేది లాలిపాట, జోకొడుతూ పాడేది జోలపాట, ఊయలూపుతూ పాడేది ఊయలపాట, దాదులుపాడేది దాదిపాట, బుజ్జగిస్తూ పాడేది బుజ్జగింపు పాట, ముద్దాడుతూ పాడేది ముద్దుపాట. ఊయల ఊపుతూ జోల పాడేటప్పుడు నోట్లో నాలుక మడిచి ‘‘ఉళు.. హుళు.. హుళు ఆయీ’’ అనడం వల్ల తాళ్‌ + అట్టు - తాళట్టు ఏర్పడింది. తమిళంలో తాళ్‌ అంటే ఊయల అని అర్థం. కొన్ని సందర్భాల్లో ‘‘రారారో.. రారిరారో...’’ అనడం వల్ల ‘రారాట్టు’, ‘‘ఆరారో.. ఆరీరారో’’ అని ఉచ్చరించడం వల్ల ‘ఆరాట్టు’ ఏర్పడ్డాయి. తూళి అంటే చీరతో దూలానికి వేసే జోలె అని అర్థం. అలా ‘తూళిప్పాట్టు’, ఈ తూళికే మరోపేరు యానై అయినందువల్ల ‘యానైపాట్టు’ అయ్యాయి. ఉంజల్‌ అంటే ఊయల అనే అర్థంలో ‘ఉంజల్‌పాట్టు’, తొట్టెను ఊపుతూ పాడటం వల్ల ‘తొట్టిల్‌పాట్టు’, ఓలలాడిస్తూ పాడటం వల్ల ‘ఓరట్టు’ ఇలా... లాలిపాటకి తెలుగు తమిళ భాషల్లో అనేక వ్యవహార నామాలున్నాయి.

- డి.విజయలక్ష్మి ‘తెలుగు తమిళ లాలిపాటలు భాషా సామాజిక పరిశీలన’ నుంచి


ఒలువు
కొత్తగా బావి తవ్వేముందు అక్కడి నీటిమట్టం, జాలు, నీటి రుచి లాంటివి తెలుసుకోవడానికి కొద్దిపాటి వైశాల్యంలో తవ్వే గుంటని ఒలువు అంటారు. ‘ఒలువులో మంచినీళ్లు పడ్డవి’ అని నెల్లూరు ప్రాంతంలో వాడుక.


కర్మాంతరాల దీపం చూసినట్టు
ఒక పని విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరించడం, ఆసక్తి లేకపోవడం అనే అర్థంలో దీన్ని వాడతారు. ‘‘ఆయన ఆ పనికి కర్మాంతరాల దీపం చూసిపోయినట్లు వచ్చిపోతుంటాడు’’ అని లోకవ్యవహారం. అపర క్రియల్లో చివరి రోజు రేవు దగ్గరికి పోయొచ్చిన చుట్టాలు మృతుని ఇంటికి తిరిగొచ్చి, గదిలో దీపాన్ని చూసి, ఎవరినీ పలకరించకుండా ఎవరికి వారు వెళ్లిపోవడం అనే ఆచారాన్ని ఉద్దేశించి ఈ సామెత వాడుకలోకొచ్చింది


కుదురు
వడ్లు దంచేటప్పుడు అవి చెదిరి బయటపడకుండా రోలు మీద ఉంచే వెదురుబుట్టను కుదురు అంటారు. నెమ్మది అనేది మరో అర్థం. గోదావరి ప్రాంతంతో కుదురుగా ఉండు అంటే అల్లరి చెయ్యకుండా ఉండాలని అర్థం. ‘కుదురుగా ఉండనీయరు’ అంటే స్థిమితంగా, ప్రశాంతంగా ఉండనివ్వరని. వంటగదిలో పాత్రలు నిలపడానికి వాటి కింద పెట్టేందుకు ఉపయోగించేదాన్ని ‘చుట్టకుదురు’ అని వ్యవహరిస్తారు. ఆధారం అనే అర్థంలో ‘ఈ వంశానికి నువ్వే కుదురు’ అనడం పరిపాటి.


కూరాడు
బియ్యాన్ని కడగ్గా వచ్చిన కడుగు, కలిని పోసే కుండను కూరాడు అంటారు. కలికుండ, తరవాణి అని భిన్న వ్యవహార నామాలున్నాయి. శుభకార్యాలప్పుడు మాంసాహారం కాని వాటిని ఈ కుండకు నైవేద్యంగా పెడతారు. నూతన గృహప్రవేశ సమయంలో ఇంటి ఆడపడుచు కలికుండ ఎత్తుకుని వచ్చి కట్నం తీసుకునే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది.


బాడుదల
అవమానించడం అని నిఘంటువు అర్థం. ‘‘బాడుదలనొండెబట్టుము పాండవతనయముఖ్యు, సంజయబాడుదలవట్టి కొనిదెచ్చి..’’ అని భారతం కర్ణ, శల్యపర్వాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. సంస్కృత భారతంలో జీవగ్రాహమానయ అని ఉంది. చంపకుండా ప్రాణాలతో పట్టుకుని తెమ్ము అని అర్థం. తెలుగులో ఈ నుడికారం వాడుకలో లేదు. బాయిదలై, మనుదలై వంటి తమిళ పదాల లాంటిదే ఇది కూడా.


ఇంటికి ఇల్లు
ఇంటికినిల్లుగట్టుకొని
యేగగవచ్చు మురారివెంట? నా 
ఇంటికి వచ్చి పూజగొని
యేగుట నన్ను కృతార్థుచేత... 

అని కాకుత్స విజయంలో ఇంటికినిల్లు అనే పలుకుబడి కనిపిస్తుంది. ఇంటికిఇల్లు అంటే ఇంటిలోనివారందరూ అని అర్థం. కట్టుకుని ఏగడం అంటే అందరూ కలిసి జట్టుగా వెళ్లడం. ఇంటిల్లిపాదీ అన్నమాట. ఇలపాది, వేలుపాది కూడా ఇలాంటివే.


ఉలిపికట్టె
‘ఊరిదంతా ఒకదారి, ఉలిపికట్టెది ఇంకొక దారి’ అని సామెత. అందరికంటే భిన్నంగా ప్రవర్తించేవాడు, వేరే మార్గంలో నడిచేవాడు, పెడతోవ పట్టినవాడు, ఎవరితోనూ పొసగనివాడు అని చెప్పేందుకు దీన్ని వాడతారు.


గజనిమ్మ
కడపలో చీని అనే మేలు జాతి తియ్యనిమ్మ. తమిళంలో దీనికి సాత్కుడి అని పేరు. సర్కారు జిల్లాల్లో బత్తాయి అని పిలుస్తారు. వెలగపళ్లంత పెద్దగా ఉండేవాటిని పెద్దపులుసు నిమ్మ, దూదినిమ్మ అని వ్యవహరిస్తారు.


కపాది
ఎద్దు మీదనో, గొడ్డు ఆవు మీదనో మోతగా రెండు పక్కలా వేసే బరువును కపాది అంటారు. వీటితో సంచరిస్తూ వర్తకం చేసేవారిని కబడీ, కపాడివారు అంటారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో సైనికులుగా ఉండి, తర్వాత నెల్లూరు వలసొచ్చిన వీరికి వండునాళ్లు అని వ్యవహారం.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం