ఇక్కడ ప్రేమలేఖలు రాయబడును

  • 584 Views
  • 2Likes
  • Like
  • Article Share

    సాంబ కృష్ణన్‌

అర్ధరాత్రి శబ్దరత్నాకరంలోంచి ఏవో మూలుగులు వినిపిస్తుంటే అలమరలోంచి కిందికి దించాను కాస్త భయంగానే. అప్రయత్నంగా ఓ పేజీ తెరుచుకుంది. అందులోంచి ప్రేతాత్మలో మొదటి అక్షరం పుటుక్కున జారి కింద పడింది- ప్రే.
      కాస్త గాలికి పేజీలు ఫెళఫెళమంటూ తిరిగాయి. ఆగినచోట మర్కటంలోని మొదటి అక్షరం గాల్లోకి లేచింది- మ.
      ప్రే...మ!
      వూఁ.. ఫిబ్రవరి కదూ.. ఎవడి ఆత్మో ఘోషిస్తోంది ప్రేమలేఖ రాయమని. వెయ్యిన్నొక్క ప్రేమలేఖలు రాశా! రానీ చూద్దాం.. ఎవడి ప్రేత్‌+ఆత్‌+మ వస్తుందో! చిటికెలో రాసి పారేస్తా!!
      కంగారు పడకండి.. ప్రేమలో పడ్డవాడి ఆత్మని ప్రేతాత్మ అంటుంటాను. కావాలంటే ప్రేతాత్మని చితక్కొట్టి చూడండి.. ప్రే తో మొదలై మ తో ముగుస్తుంది. ప్రేత్‌+ఆత్‌+మ..!
      ఈ ఫిబ్రవరిలో ప్రేతాత్మల ఆత్మీయ సంభాషణలన్నీ ఏకతాటిపైకి తీసుకురావడమే నా చిరకాల వాంఛ! వస్తాయి. సందేహంలేదు.
      ప్రేమోద్ధరణ కోసం లేఖాస్త్రం సంధించుటకై సరసకలము టికిటికి లాడించు నా బొటనవేలు ప్రేమికుల పాలిట ఫేసుబుక్కులో లైకు సింబలై అవతరించినదని చెప్పినా మీరు నమ్మరు! అయినా చెప్తాను వినండి.
      ప్రేమలేఖ రాయటంలో తొలిమెట్టు అందాన్ని వర్ణించడం. దానికిగానూ ప్రబంధాల లెక్కల ప్రకారం నవ్వూ పువ్వూ బుగ్గా మొగ్గా కళ్లూ కురులూ అంటూ నేనూ ఒకప్పుడు రాశాను. ఏ హైహీలో చెంపన దిగేది మా ప్రేతాత్మలకు. ఎనభైల్లోనూ తొంభైల్లోనూ చెప్పు నంబరు అచ్చు పడేది గానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉందంటున్నారు. అందుకని పంథా మార్చాను. యాజ్‌ పర్‌ సైకాలజీ అండ్‌ బాడీలాంగ్వేజ్‌.. లేఖాలజీలో ప్రేమాలజీ నింపుతున్నాను.
      అదెలా అంటారా... ఇదిగో ఇలా!!
ఉక్రోష్‌ అనీ మహగొప్ప ప్రేతాత్మ. వాణ్ని ప్రేమలో తోసింది ఓ బ్యాంకు బాలిక. వాడికోసం రాసిన లేఖలో ‘వందనోటు మీద వెండితీగలాంటి నీ నవ్వు నా జీవితపు అకౌంటులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్టు చేయవా ప్రియా..’ అని రాశా. అంతే! వాడి పెళ్లికి అకౌంటు ఓపెన్‌ అయిపోయింది. మా టిప్పుగాడి పరీక్ష తప్పింది ఓ తెలుగు టీచరమ్మ వల్ల. వాడు ఏడుస్తుంటే ‘నా నాలుగోతరగతి తెలుగు పుస్తకంలో నెమలికన్నంత అందమైన నవ్వు నా జీవిత పుస్తకంలో దాచుకోనివ్వవా’ అని రాశా. అంతే! వాడి పెళ్లి పుస్తకం తెరుచుకుంది.
      మా అంజిబాబుని ఓ ఇంజినీరమ్మ ముంచేసింది. వాడు దీనంగా ములిగి పోతుంటే ‘నా జీవిత సౌధానికి నీ నవ్వే పునాది కావాలి’ అన్నా. చెప్పేదేముంది? వాడి పెళ్లికి పందిరికి పిల్లర్‌ పడింది.
      ఇక సాదాసోంబాబుగారు సాఫ్ట్‌వేర్‌ బూమ్‌లో పడ్డారు. వాడికి జావా తాగిస్తూ ‘నువ్వు నవ్వితే నా జీవితమనే సర్వర్‌ ఎప్పుడూ డౌన్‌ అవ్వదు.. నాకోసం నవ్వుతూ ఉంటావా’ అనే సరికి వాడి పెళ్లికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసింది ఆ సుకుమారి. అంతేనా.. పక్క వూళ్లొ జగన్నాథానికి ఓ డాక్టరమ్మ ఉత్తినే ఆపరేషన్‌ చేసేసింది. బ్యాండేజ్‌ లేకుండా వాడు ఎదురయ్యేసరికి ‘నువ్వు నవ్వాలేగానీ, మత్తుమందు లేకుండా లక్ష ఆపరేషన్లయినా చేసుకోగలను.. ఈ గుండెకాయ లబ్‌డబ్‌లు రోజూ లెక్కపెడతావా’ అని రాశా. హ్హహ్హ... స్టెత్‌ కాస్తా మంగళసూత్రమైపోయింది.
      దోస్తు ధర్మారావును పనిపిల్ల సింకులో పడేసింది. వాణ్ని కొంచెం లేపి,‘ ‘మాడిపోయిన గిన్నెను మెరిపిస్తావు.. పనిలో పనిగా నన్ను చూసి నవ్వి మురిపిస్తావు.. మరి నా ఆశను గెలిపిస్తావా’ అనిపించా. వారం తిరిగేసరికి ఫెళఫెళలాడే షామియానా తెప్పించుకున్నాడు పెళ్లికి.
      కనకాంబర్రావుకి అనుకోకుండా ఓ లాఠీమణి కొట్టింది. ఆ అమాయక ప్రేతాత్మను స్టేషన్‌నుంచి తీసుకొస్తూ ‘నా జీవితానికి ఇది చివరి ఎఫ్ఫయ్యార్‌. నీ నవ్వే దానికి సాక్షి సంతకం’ అని రెడ్డింకులో రాసి పంపించా. ఏడు వూచల బంధం ఏడడుగులదాకా పోయింది.
      ఒకటా రెండా.. వెయ్యిన్నొక్క వీరప్రేతగాథలు..!

* * *

      హలో గురూ..
      ఎవరు బాబూ నువ్వూ..?
      నేనే.. నువ్వే..
      గొంతు.. నా గొంతే.. నేనా.. నువ్వు నేనా?
      అవును. ప్రేతలేఖ రాస్తావని బయటికి వచ్చా. అదే.. ప్రేమలేఖ.. నోరు తడబడుతోంది గురూ...
      ఏంటి? నాకోసం నేనా?
      మరి.. పిల్ల కవయిత్రి అంటే మాటలా!?
      వామ్మో... నన్నొదిలేయ్‌రా బాబో...
      హ్హహ్హ.. వదిలేశా కాబట్టే బయటికి వచ్చాన్రా పిచ్చి సన్యాసి.. బతుకు ఫో!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం