గిడుగు బావుటే విజయబావుటా

  • 601 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వేదగిరి రాంబాబు

  • హైదరాబాదు
  • 9391343916

ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచివెళ్లినా మనకు భావదారిద్య్రం, భాషా బానిసత్వం వదల్లేదు. లేకపోతే, అన్ని రంగాల్లోనూ ఆంగ్లాన్నే పట్టుకుని వేలాడటమేంటి!! పిల్లలకు విద్యానైపుణ్యాలు పక్కాగా ఒంటబట్టాలంటే, ప్రాథమిక స్థాయిలో వాళ్ల విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్నది నిపుణుల మాట. దీన్ని మనం పట్టించుకోవట్లేదు. కానీ, గిడుగు రామ్మూర్తి మాత్రం కొన్ని దశాబ్దాల కిందటే.. ఎవరూ చెప్పకముందే ఈ వాస్తవాన్ని అర్థంచేసుకున్నారు. ఆ అవగాహనకు అనుగుణంగా ఆయన చేసిన కృషి.. నేటి భాషోద్యమానికి స్ఫూర్తిమంత్రం.
ఆనాడు దుర్భర పరిస్థితుల్లో ఉన్న సవరలు- చదువు నేర్చి, వ్యవహార జ్ఞానం అలవరచుకుని ఆర్థికంగాను, సామాజికంగానూ అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు గిడుగు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషే! అందుకే వాళ్ల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి అనువుగా సవర భాషని నేర్పడం కోసమని తాను కష్టపడి వాళ్ల భాషను నేర్చుకున్నారు. వాళ్లకి ఆ భాషని నేర్పడానికి సొంత ఖర్చుతో బడులు నడిపారు. సవరల పాటల్ని సేకరించారు. కొన్నింటిని సవర భాషలో తానే సొంతంగా రాశారు. కొన్ని సవర కథలను సేకరించి వాచకాలుగా రూపొందించారు. సవర భాషా వ్యాకరణ నిరూపణగా ఓ వివరణ గ్రంథాన్ని రాశారు. సవర- ఇంగ్లీషు, ఇంగ్లీషు- సవర, సవర- తెలుగు, తెలుగు- సవర నిఘంటువుల్ని రూపొందించారు.
      లిపి, గ్రంథాలు లేని భాషకు వీటిని సమకూర్చడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చిందన్నారు గిడుగు. అంతేకాదు- గ్రంథ రచనకు ఒక భాషని, మాట్లాడడానికి వేరొక భాషను ఉపయోగించే తెలుగువాళ్ల తీరుని నిరసించి, మాట్లాడే భాషలోనే గ్రంథ రచన, విద్యాబోధన జరిగేట్టు చేశారు. పాఠశాల, కళాశాల స్థాయి పాఠ్యపుస్తకాలలో ఇప్పుడు తెలుగు వచనం ఆధునిక భాషలోనే కనిపిస్తోంది. ఈ భాషలో మాట్లాడటం, రాయడం, రాసింది చదువుకుని బాగా అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని వ్యవహరించడం అందరివల్లా అవుతుంది. ఇలా పలికే నోటికి, రాసే చేతికి, చదివే కంటికి, మనసులో మెదిలే ఆలోచనకు చక్కటి సమన్వయాన్ని మాట్లాడే భాషలో ఏర్పరిచారు గిడుగు.
పునాది ముఖ్యం
రామ్మూర్తిచిన్నప్పుడు చదువుకున్న తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలకు తోడుగా ఒడియా, సవర భాషల్ని నేర్చుకున్నారు. ఇన్ని వచ్చినా ఆయనకు మాతృభాషా ప్రాధాన్యం తెలుసు. అందుకే లిపిలేని సవరలు మాతృభాషని సక్రమంగా మాట్లాడేటట్లు, తమ జీవన విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా సవర భాషని తెలుగు, ఇంగ్లీషు లిపులలో భద్రపరచి వాళ్లర్థం చేసుకునేట్టు చేశారు. అలాగే లిపి ఉన్న తెలుగులోనూ అందరికీ అర్థంకాని గ్రంథ భాషని విస్మరించి, మాట్లాడే భాషలోనే వ్యవహారాలు, గ్రంథరచన జరిగేట్టు చూశారు. మానవ జీవితంలో భాషకి ఎంత ప్రాధాన్యముందో, మాతృభాషలో ఎందుకు ప్రాథమిక విద్యను అభ్యసించాలో, జీవితాన్ని మలచుకోవడానికి అదెలా తోడ్పడుతుందో చెప్పారు గిడుగు.
      పుట్టినప్పటి నుంచి వినేది, మాట్లాడటా నికి ప్రయత్నించి నేర్చుకునేది అమ్మభాష. అప్పటికే ఆ భాషలో ఆలోచించడం మొదలవుతుంది. అందుకని మాతృభాషలో రాయడం, చదవడం కూడా నేర్పితే ఒక భాష వాళ్లకి పూర్తిగా వస్తుంది. ఆ పట్టుతో మరికొన్ని భాషలూ నేర్చుకోగలరు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆ తర్వాత ఏ భాషలో చెప్పినా పిల్లలు సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రాథమికంగా మాతృభాష నేర్చుకోవడంవల్ల ఆలోచనలు ఆ భాషలోనే చకచకా సాగుతాయి. అందుకే ఆ తర్వాత ఎన్ని భాషలు నేర్చుకున్నా- వాటిని అనువాద పద్ధతిలోనే ముందు మనసులో మాతృభాషలో అనుకుని అనువదించుకుని చెప్పగలరు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఎవరికైనా మాతృభాషలో విద్యాబోధన జరగాలన్నది గిడుగు ఆలోచన.
      ఇంతకుముందే అనుకున్నట్లు పాఠశాలలో ప్రవేశించే నాటికే పిల్లలు మాతృభాషలో చక్కగా సంభాషించగలిగిన స్థాయిలో ఉంటారు. ఆ సమయంలో బడిలో మాతృభాషాబోధన లేకపోతే నేర్చుకున్న భాష నిరుపయోగమవుతుంది.
ప్రత్యక్ష పద్ధతిలో ఆంగ్ల బోధన
డిసెంబరు 1912లో మద్రాస్‌ విశ్వవిద్యాలయం వారు ఆచార్య డేనియల్‌ జోన్స్‌తో ఫొనెటిక్స్‌ మీద 16 ఉపన్యాసాలు ఇప్పించారు. రామ్మూర్తి, ఆయన కుమారుడు సీతాపతి వాటిని విని ధ్వనిశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. ప్రత్యక్షపద్ధతిలో (డైరెక్ట్‌ మెథడాలజి) భాషా బోధన శ్రేష్ఠమని అర్థం చేసుకున్నారు.
      ప్రస్తుతం కొత్త భాషా బోధన ఏదైనా అనువాద పద్ధతిలోనే జరుగుతోంది. బీవోవై- బాయ్‌- బాలుడు అంటూ కొత్త భాషని నేర్పడం అనువాద పద్ధతి. ఆంగ్ల పదాలకు తెలుగులో అర్థాలు చెప్పడం, వాక్యార్థాన్ని తెలుగులో చెప్పడం, ఆంగ్ల వ్యాకరణాన్ని తెలుగులోకి అనువదించి బోధించడం- ఈనాడు పాఠశాలల్లో చూస్తున్నాం. ఇది సులువైన పద్ధతే కానీ, ప్రయోజనకారి కాదు. ఎన్నాళ్లు చదివినా ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయడం, వ్యాసాల్ని కంఠస్థం చేయడం తప్ప విద్యార్థులు సొంతంగా ఒక్క వాక్యం కూడా రాయలేకపోతున్నారు. అనువాద పద్ధతిని వదిలిపెట్టి, ప్రత్యక్ష పద్ధతి గురించి ఆలోచించి గిడుగు ఏం చెప్పారంటే.. ‘‘నూతన పద్ధతైన ప్రత్యక్ష పద్ధతిలో- తెలుగు మాటలు దొర్లించకుండా, తెలుగు లోకి అనువాదం చేయకుండా ప్రారంభం నుంచి చిన్న చిన్న ఇంగ్లిష్‌ వాక్యాలు మాట్లాడటం అలవరచడం, అభినయంతో అర్థమయ్యేట్టు పదాలు- వాక్యాలు చెప్పడం, ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌తో కాక, ఫొనెటిక్‌ లిపిలో చదివించడం రాయించడం నేర్పాలి. నేడు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో ఇంగ్లిష్‌ బోధించడానికి ప్రత్యక్ష పద్ధతిని అనుసరిస్తు న్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ధ్వని లిపి తెలిస్తే ఏ భాషలోనైనా మాట్లాడేటట్లు రాసుకోవచ్చు. ఐ.పి.ఎ. నేర్పించి, ప్రత్యక్ష విధానంలో పిల్లలకు నేర్పాలి. ప్రత్యక్ష పద్ధతిలో ఇంగ్లిష్‌ తరగతిలో ఇంగ్లిష్‌ తప్పితే మరో భాష వాడకూడదు. ఇంగ్లిష్‌ పదాలకు అర్థాలు కూడా వస్తువులు చూపించిగాని, అభినయం ద్వారా గాని చెప్పాలి. అంటే పాఠశాలలో చేరకముందు మాతృభాషని ఎలా నేర్చుకుంటారో అలా ఇంగ్లీష్‌ని గాని మరో భాషని గాని నేర్పాలి. ఇది కష్టమైనా మంచి పద్ధతి. విద్యార్థికి సందేహాలుంటే ఇంగ్లిష్‌లోనే అడగాలి. మాతృభాషలో అడగకూడదు’’.
      ఇప్పుడు విద్యాలయాల్లో ఆధునిక భాషా బోధకులు అవలంబిస్తున్న పద్ధతి ఇది.. ముందుగా మాట్లాడటం నేర్పుతారు. భాషలో సంభాషించడం వచ్చిన తర్వాత రాయడం నేర్పుతారు. వాస్తవానికి భాష వచ్చిన తర్వాతే రాయడం చదవడం నేర్పాలి. ఇంగ్లండ్‌లో ఓ పిల్లాడు బడిలో అడుగుపెట్టేసరికే మాట్లాడటం వస్తుంది. రాయడం, చదవడం నేర్చుకుంటాడు. అందుకే అక్కడ ప్రాథమికస్థాయిలోనూ ఆంగ్లం నేర్పుతారు. మన దగ్గర ఆ పునాది ఉన్నత పాఠశాలలో వేయాలి. అలా కళాశాలలోకి వచ్చేసరికి విద్యార్థులు ఇతర భాషల్లోనూ చదవడం రాయడం నేర్చుకుని ఉంటారు. అందుకని అప్పుడు ఆంగ్ల మాధ్యమంలో బోధించినా ఇబ్బంది పడరు.
      ఏదిఏమైనా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో కాకుండా ఇతర భాషా మాధ్యమాల్లో చెప్పడం సరైన పద్ధతికాదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష చదవడం రాయడం తెలిస్తే- ఒక భాష వస్తుంది. తర్వాత ఉన్నతపాఠశాలలో ప్రత్యక్ష పద్ధతిలోనే ఆంగ్లంలో మాట్లాడడం, చదవడం, రాయడం నేర్పాలి.
      మాతృభాష బాగా వచ్చినవాళ్లు ఎన్ని భాషలనైనా నేర్చుకోగలరు. మాతృభాషతో బాటు ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిదేగా! మాతృభాష నేర్వకుండా ఇతర భాషలు నేర్చుకోవడమంటే నేలవిడిచి సాము చేయడమే!


వెనక్కి ...

మీ అభిప్రాయం