అరచేతిలో తెలుగు ఆప్స్‌

  • 98 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.ప్రవీణ్

  • హైదరాబాదు
  • 8179407778
జి.ప్రవీణ్

సాంకేతికంగా తెలుగు అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తరుణంలో మరో కొత్త మొబైల్‌ ఆప్‌ అంగట్లోకి అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్, ఐఫోన్, ట్యాబ్లెట్లలో తెలుగు కీబోర్డుతో సంక్షిప్త సందేశాలను పంపించుకోవడానికి వీలుగా రూపొందించిన ‘తెలుగుమాట’ ఆప్‌ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ కిందటేడాది డిసెంబరు 30న హైదరాబాదులో విడుదల చేశారు.
అంగడిలో రకరకాల మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నా వాటిల్లో చాలావరకూ ఆంగ్లంలోనే పని చేస్తాయి. దీంతో తెలుగు తప్ప వేరే భాషలేవీ తెలియని వినియోగదారులకు మొబైల్‌ వాడకం కొంచెం కష్టమవుతుంది. ‘తెలుగుమాట’ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. దీంతో పాటు ఇలాంటి మేలే చేసే ‘పాణిని’, ‘ఎనీసాఫ్ట్‌ కీబోర్డ్‌’,  ‘లిపికార్‌’ వంటి ఆప్‌లూ ఉన్నాయి. వీటన్నింటిని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. 
తెలుగు మాట

‘తెలుగు మాట’ అనేది ఆండ్రాయిడ్‌ ఫోన్లో, ట్యాబ్లెట్లలో సులువుగా తెలుగు టైప్‌ చేసుకోవడానికి వీలుగా ఉండే ఓ కీబోర్డ్‌. దీన్ని భాషా సాంకేతిక ప్రయోగశాల, అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రం (హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం) అభివృద్ధి చేసింది. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసువచ్చు. దాని సాయంతో సందేశాలు పంపుకోవచ్చు. ఎస్సెమ్మెస్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో తెలుగులో రాసుకునే సౌకర్యం ఉంది. మన మొబైల్‌ నుంచి మరో మొబైల్‌కి తెలుగులో సమాచార బదిలీ జరుగుతుంది.
ఇలా ఉపయోగించాలి
‘తెలుగు మాట’ని ఇన్‌స్టాల్‌ చేసి ఏ ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనైనా తెలుగు అక్షరాలు సింగిల్‌ కీ-స్ట్రోక్స్‌గా సులభంగా, వేగంగా టైప్‌ చేసుకోవచ్చు. అక్షరాలన్నింటిని కీబోర్డులో రెండు విధాలుగా విభజించారు. షిఫ్ట్‌  లేకుండా టైప్‌ చేస్తే అల్పాక్షరాలు, షిఫ్ట్‌తో టైప్‌ చేస్తే మహాప్రాణాలు వస్తాయి. అక్షరాల్ని మూడు వరుసల్లో అమర్చారు. రాసిన పాఠం ఎప్పుడూ యూనికోడ్‌లో ఉంటుంది. చిహ్నాలు అమర్చారు. గుణింతాలూ ఒత్తులూ వాటంతటవే తయారవుతాయి. 
డౌన్‌లోడ్‌ చేసుకుంటారా! 
గూగుల్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌అని టైప్‌ చేసి గూగుల్‌ ప్లే స్టోర్‌ని ఎంపిక చేసుకోవాలి. అందులో తెలుగుమాట అని టైప్‌ చేసి శోధన బటన్‌ నొక్కాలి. లేదా http://teluguvijayam.org లో కూడా మీకు ‘తెలుగుమాట’ కనిపిస్తుంది. ‘తెలుగుమాట’ మీద నొక్కగానే ఇన్‌స్టాల్‌ అండ్‌ యాడ్‌ టూ విష్‌లిస్ట్‌ అని రెండు ఆప్షన్లు వస్తాయి. అందులో ఇన్‌స్టాల్‌ను ఎంచుకోవాలి. ఇక తెలుగు మాట కీబోర్డ్‌ మీ మొబైల్లో సిద్ధం. తరువాత ‘లాంగ్వేజ్‌ ఇన్‌పుట్‌’ను ఎంపిక చేసుకుని, అందులో తెలుగుమాటని ఎంచుకోవాలి.
వెంటనే చిన్న విండో తెరుచుకొని ‘చూజ్‌ ఇన్‌పుట్‌ మెథడ్‌’లో హార్డ్‌వేర్, ఇంగ్లీష్, తెలుగు మాట అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ ‘తెలుగు మాట’ను ఎంపిక చేసుకోవాలి.
తెలుగు కీబోర్డు సాయంతో తెలుగు అక్షరాలు రాసేటప్పుడు మధ్యలో ఆంగ్లం అవసరమైతే చివరి వరుసలో ‘ఈఎన్‌జీ’ అనే బటన్‌ నొక్కితే ఇంగ్లీష్‌ కీబోర్డ్‌గా మారుతుంది. సంఖ్యలు, చిహ్నాలు కావాలంటే 123 బటన్‌ నొక్కితే చాలు. దీర్ఘాక్షరాలు కావాలంటే షిఫ్ట్‌ నొక్కితే వరుసలో కనిపిస్తాయి.
ఉదాహరణకు: సంస్కృతి పదానికి 
స+ం+స+ ్+క+ృ+త+ ¨ 
అని కంపోజ్‌ చేయాలి.
పాణిని కీ బోర్డ్‌ 
గూగుల్‌ ప్లేలో ‘పాణిని కీపాడ్‌ తెలుగు’ అని టైప్‌ చేయగానే పాణిని కీపాడ్‌ తెలుగు ఐ ఎంఈ అని వస్తుంది. అక్కడ కనిపించే చిత్రంపై ‘ఇన్‌స్టాల్‌’ బటన్‌ మీద నొక్కాలి. తరువాత యాక్సెప్ట్‌ అండ్‌ డౌన్‌లోడ్‌ బటన్‌ మీద నొక్కితే పాణిని కీబోర్డ్‌ ఆప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.
లాంగ్వేజ్‌ అండ్‌ ఇన్‌పుట్‌కి వెళ్తే మనకు వివిధ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ‘పాణిని కీపాడ్‌ తెలుగు’ని ఎంచుకోగానే ‘సెలెక్ట్‌ ఇన్‌పుట్‌ మెథడ్‌’ పేరుతో ఒక విండో తెరుచుకుంటుంది. అందులో ‘పాణిని కీపాడ్‌ తెలుగు’ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అప్పుడే పూర్తిస్థాయిలో పాణిని కీబోర్డ్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. దాంతో మనకు కావాల్సిన విషయాన్ని సులభంగా టైపు చేసుకోవచ్చు.
ఎనీసాఫ్ట్‌ కీబోర్డ్‌
గూగుల్‌ ప్లేలో ‘ఎనీసాఫ్ట్‌కీబోర్డ్‌ తెలుగు’ అని టైప్‌ చేయాలి.తరువాత ‘తెలుగు ఫర్‌ ఎనీసాఫ్ట్‌కీబోర్డ్‌’ లింక్‌ని ఎంచుకొని ఓకే బటన్‌ మీద క్లిక్‌ చేస్తే సరి. ఎనీసాఫ్ట్‌ కీబోర్డు ఇన్‌స్టాల్‌ అవుతుంది. ‘తెలుగు లాంగ్వేజ్‌ పాక్‌ ఈ ఇన్‌స్టాల్‌’  చేస్తుంది. 
అప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లాంగ్వేజ్‌ అండ్‌ కీబోర్డ్స్‌’ని ఎంచుకోవాలి. తరువాత ఎనీసాఫ్ట్‌కీబోర్డ్‌ని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఎనీసాఫ్ట్‌కీబోర్డ్‌లోకి వెళ్లి ‘కీబోర్డ్స్‌ - తెలుగు లేఅవుట్స్‌’ ఎనేబుల్‌  చేసుకోవాలి. 
ఈ ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ‘తెలుగు కీబోర్డ్‌ లేఅవుట్‌’ ఫైల్‌ని నోకియా ఎన్‌ 9 మొబైల్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసిన తరువాత ఎలాంటి చిహ్నాన్ని (ఐకాన్‌) కనపడదు. ఒక సారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎన్‌9 సెట్టింగ్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 
ఈ కీబోర్డులో అక్షరాలకు అనుగుణంగా టైపు చేయవచ్చు. అంకెలు, ఆంగ్లం కావాలనుకుంటే ఎడమవైపు కుడివైపు గుర్తులను ఉపయోగించాలి.
లిపికార్‌ తెలుగు కీబోర్డ్‌
గూగుల్‌ప్లేలో ‘లిపికార్‌ తెలుగు కీబోర్డ్‌’ అని టైపు చేయగానే ‘సెలెక్ట్‌ ఇన్‌పుట్‌ మెథడ్‌’ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులోనే ‘లిపికార్‌ తెలుగు’ పై క్లిక్‌ చేయాలి. ఆంగ్లం కీబోర్డ్‌తో కాస్త పరిచయం ఉంటే చాలు. ఈ లిపికార్‌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించడం చాలా సులభం.  
ఉదా: అమ్మ పదానికి లిపికార్‌ కీబోర్డ్‌ని ఉపయోగించి amma అని ఆంగ్లంలో టైప్‌ చేస్తే తెలుగు పదాన్ని చూపిస్తుంది. అంతేకాదు అమ్మ పదంతో ఉన్న అనుబంధ పదాలూ కనిపిస్తాయి.
ఇలా ఎన్నో రకాల తెలుగు ఆప్స్‌ అంతర్జాలంలో ఉచితంగానే లభిస్తున్నాయి. తెలుగు వారందరూ వీటిని వినియోగించు కోవడమే తరువాయి... సెల్‌ఫోన్లలో మన అమ్మభాష వన్నెలీనుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం