రాయలసీమ కథారత్నాలు

  • 195 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి

  • అనంతపురం
  • 9963917187
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి

రాయలసీమ... తొలిసారి తెలుగు అక్షరం ‘శాసనం’ అయింది ఇక్కడే. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఇక్కడివాడే. రాయలవారి ప్రాపకంలో ప్రబంధ సాహిత్యం పరిమళించింది ఇక్కడే. ఆపాతమధుర ఫలాల రుచులు సరే మరి ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథ మాటేమిటి? సీమలో కథావృక్షం మొలకెత్తిందెప్పుడు? కోస్తా, తెలంగాణలతో పోలిస్తే రాయలసీమలో కథ కాస్త ఆలస్యంగా ఆవిర్భవించిందన్నది సాహిత్య పరిశోధకుల భావన. అయితే రాయలసీమ నుంచి వెలువడ్డ కొన్ని పత్రికలను గమనిస్తే ఈ భావన అపోహ మాత్రమేనని అర్థమవుతుంది. 
      ‘సర్కారు ప్రాంతంలో ఆధునికత తొందరగా ప్రవేశించటం వల్ల అక్కడ ఆధునిక సాహిత్యం ముందుగా ప్రవేశించింది. నూతన చారిత్రక శక్తులు కోస్తా జిల్లాల్లో ముందు తలెత్తడం వల్లనే ఈ వ్యత్యాసం ఏర్పడింది. ప్రజా జీవితంలో విప్లవాత్మకమైన పరిణామాలు ముందు ఆ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా కారణమైంద’న్నారు రాచమల్లు రామచంద్రారెడ్డి. 
      ‘సమకాలీన జీవితాన్ని గురించి విభిన్న దృక్పథాలతో కోస్తాలో రాస్తున్న కాలంలో రాయలసీమలో సమకాలీన జీవితాన్ని గురించి సాహిత్య స్పృహే కనిపించదు. కోస్తా జిల్లాల కంటే రాయలసీమ ఆర్థికంగా వెనుకబడి ఉండటమని చాలా మంది విశ్లేషకులు భావిస్తారు. ఇది ఒక కారణం కావచ్చు. కానీ ప్రధాన కారణం కాదు. వెనుకబడిన కళింగాంధ్రలోనే మొదట ఆధునిక నాటకం, కథ, కవిత్వం ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో వెనుకబడిన దేశాలలోనే గొప్ప సాహిత్యం వస్తోంది. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమనుంచి గొప్ప ఆధునిక సాహిత్యం వచ్చి ఉండవచ్చు, కానీ రాలేదు.  స్వాతంత్య్రానంతరం రాయలసీమ నుంచి గొప్ప ఆధునిక సాహిత్యం రాకపోవడానికి కారణం సీమలో రచయితలు వెనుకబాటుతనాన్ని గుర్తించకపోవటమేనని మనం గమనించవలసి ఉంది. రాయలసీమ సంప్రదాయ సాహిత్యానికి కేంద్రం కావటం, వ్యావహారిక భాషోద్యమంతో సంబంధం లేకపోవడం ఇందుకు కారణం. సమకాలీన జీవితం గురించి, సమకాలీన భాషలో ఆధునిక ప్రక్రియల్లో వివరించలేకపోయార’ంటారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. 
      ‘రాయలసీమ వెలుపలి సాంస్కృతిక చైతన్యం, ఆ చైతన్యానికి కారణమైన సామాజిక భాషా సాహిత్య ఉద్యమాలు కడప జిల్లాలోని కవిపండిత సాంస్కృతిక వారసత్వ చైతన్యాన్నీ, దాని వెనుకబాటుతనాన్ని ఏమాత్రం 1955- 1960ల ప్రాంతాలదాకా కుదుపునివ్వలేకపోయాయి’ అన్నారు కేతు విశ్వనాథరెడ్డి. సింగమనేని నారాయణ కూడా స్వాతంత్య్రానంతరమే రాయలసీమలో కథానిక ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు. ‘రాయలసీమలో అనేక కారణాల వల్ల 1940కి గాని కథానిక మొదలుకాలేదు. ఆధారాలు లభిస్తున్నంతలో 1941లో గుత్తి రామకృష్ణ రాసిన ‘చిరంజీవి’ తొలి రాయలసీమ కథ’ అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి నిర్ధరించారు. 
      ఈ వ్యాఖ్యల్లో కొంత శాస్త్రీయత, వాస్తవికత ఉంది. విమర్శకులు ఆశించిన స్థాయిలో సీమ కథా సాహిత్యం వెలువడకపోయినా, మరీ అంత దీనస్థితిలో మాత్రం లేదనే విషయాన్ని ఇప్పుడిప్పుడే లభిస్తున్న ఆధారాలు తెలుపుతున్నాయి.
ఇవిగో ఆధారాలు
చారిత్రక పరిణామ క్రమంలోని అన్ని దశల్లో సీమవాసులు క్రియాశీలక పాత్ర పోషించారు. సమకాలీన సమాజ స్థితిగతులపై స్పందించారు. సాహిత్యరంగంలోనూ ఆ ప్రయత్నం జరిగింది. శతక, సంకీర్తన, ప్రబంధ సాహిత్యాలలో సీమవాసులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం. 1825 నాటికే బ్రౌన్‌ సీమను కేంద్రంగా చేసుకుని సాహిత్య పరిశోధనకు పూనుకున్నాడు. తెలుగునాట తొలి రైలు మార్గం 1862లో రాయలసీమలోనే ప్రారంభమైంది. 1870 నాటికి కడప- కర్నూలు కాలువ ద్వారా సీమకు సాగునీటి వసతి ఏర్పడింది. అప్పటి రాజధాని మద్రాసు సీమకు దగ్గరగా ఉండటంతో పుస్తక, పత్రికల ప్రచురణ రంగం వేగంగా వ్యాప్తి చెందింది. 
      బళ్లారి నుంచి వెలువడిన ‘సత్యదూత’ (1835) నుంచి 1950దాకా రాయలసీమలో దాదాపు అరవై పత్రికలు వెలువడ్డాయి. వీటిలో ప్రస్తుతం కొన్నే లభిస్తున్నందువల్ల సీమలో ఆధునిక సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం అంతగా వెలుగులోకి రాలేదు. అయితే నాకు లభ్యమైన శ్రీసాధన పత్రిక (1926)లో 30 దాకా సీమ కథలు లభించాయి. శ్రీసాధనతో పాటు బయటపడ్డ ‘సౌందర్యవల్లి’ (1918), ‘భారత కథానిధి’ (1926) పత్రికలను పరిశీలిస్తే 1940కి ముందే రాయలసీమలో 150 దాకా కథలు వెలువడినట్లు తెలుస్తుంది.
సీమ ‘సౌందర్యవల్లి’ 
గాడిచర్ల హరిసర్వోత్తమరావు సతీమణి రామాబాయి సంపాదకత్వంలో 1918 సెప్టెంబరులో ‘సౌందర్యవల్లి’ మాసపత్రిక ప్రారంభమైంది. సాహిత్యం, చరిత్ర, విజ్ఞానశాస్త్రం మొదలైన అంశాలను తగిన బొమ్మలతో ప్రచురించారు. రెండో సంచికలో ‘కడపటి పైసా’ కథను ప్రచురించారు. అందులో కథానాయకుడు పురుషోత్తం నాయుడు. చేద్దామంటే పని, తినడానికి తిండి దొరక్క ఆత్మహత్య చేసుకొందామని తుంగభద్ర తీరానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఓ యువకుడు సిగరెట్‌ తాగుతుంటాడు. అది చూసి ఎలాగైనా తన దగ్గరున్న కడపటి పైసాతో సిగరెట్‌ను ఆస్వాదించి దేహత్యాగం చేద్దామనుకుంటాడు. పురుషోత్తం అంగడిలో పొగ తాగుతుండగా, తన గురించి మరొకరితో చర్చిస్తున్న ధనవంతుడైన తన తాతను చూస్తాడు. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని తాతను కలుసుకుంటాడు. ‘కడపటి పైసా ఘనరక్షయై ధర్మమే జయమనుటను చాటింద’ని కథ ముగుస్తుంది. నిర్దిష్టమైన స్థల, కాల స్పృహతో వెలువడిన ఈ కథ రాయలసీమ ప్రాదేశికతను సూచిస్తుంది. వర్ణన, పాత్రచిత్రణ, భాషలో ఆధునిక కథా లక్షణాలు కనిపిస్తాయి. లభ్యమవుతున్నంతలో సీమ తొలికథ ఇదే. రచయిత పేరు లేకుండా వెలువడిన ఈ కథలో ప్రదేశాల వర్ణణలను బట్టి కర్నూలు పట్టణంతో అనుబంధమున్నవారే రాసి ఉంటారనిపిస్తుంది. ఈ పత్రిక ఒక్క సంచిక మాత్రమే లభిస్తోంది. మిగిలినవి కూడా లభిస్తే... సీమ కథాలక్ష్మి తొలి అడుగుల అందెల రవళి మరింత స్పష్టంగా వినిపిస్తుంది. 
కథల నిధి... భారత కథానిధి
కడప జిల్లా పొద్దుటూరు కేంద్రంగా 1926 జులై నుంచి ‘భారత కథానిధి’ పత్రిక వెలువడింది. ఇది కథా సాహిత్యానికి విశేష ప్రాధాన్యం ఇచ్చింది. కథల ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందించాలనే సదాశయం నిర్వాహకుల్లో కనిపిస్తుంది. నీతి, ఆధ్యాత్మిక, సంప్రదాయ కథలతోపాటు, సమకాలీన సమాజంలోని కుల, మత, కన్యాశుల్క, వరకట్న, వితంతు, అవినీతి వంటి అంశాలపై నూటికిపైగా కథలు ప్రచురితమయ్యాయి ఈ పత్రికలో. 1926 జూన్‌లో అయ్యగారి నరసింహమూర్తి రాసిన ‘మతభేదం’... ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకోవడంకోసం సంప్రదాయాలను పక్కనపెట్టి, ఊరి సాహెబ్‌ను ఇంట్లోకి ఆహ్వానించి వైద్యం చేయించే ఇల్లాలి ఇతివృత్తంగా సాగుతుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రి పరిసర ప్రాంతం నేపథ్యంగా కథ నడుస్తుంది. 
      బొగ్గవరపు నాగవరదయ్య శ్రేష్ఠి ‘మీనాక్షి’ కథ రాశారు. మీనాక్షి ఓ బాలవితంతువు. ఆమె మేనమామ సంఘసంస్కర్తగా పేరుగాంచిన వ్యక్తి. మీనాక్షిని తన కొడుకుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇష్టంలేని ఆ పెళ్లిని మీనాక్షి తిరస్కరిస్తుంది. తన మాట నెగ్గలేదనే అవమానంతో ఆమె మేనమామ ఊరు వదిలిపోతాడు. ఎవరి జీవితంపై వారికే నిర్ణయాధికారం ఉండాలనే సందేశాన్నిస్తుంది ఈ కథ. 
      భూతపురి నారాయణస్వామి, ఎం.వి.పాపన్నగుప్త, రూపావతారం శేషశాస్త్రి, ఆలూరి శేషాచార్యులు, అవధానం సుందరం, యాలేటి వెంకటరావు, వెల్లాల మైసూరయ్య, సీతాబాయి, ఎస్‌.దస్తగిరి, హెచ్‌ మహమ్మద్‌ వియ్యాక్, పూతలపట్టు శ్రీరాములరెడ్డి, డి.పాపమ్మ, వి.వసంతరావు, కిదాంబి రామచంద్రాచార్యులు, కైప శేషశాస్త్రి, సి.విశ్వేశ్వరశర్మ, వి.భాస్కరరావు, కందాళ శేషాచార్యులు వంటి ఎందరో సీమ రచయితల కథలు ‘భారత కథానిధి’లో ప్రచురితమయ్యాయి.
సీమ కథా కరదీపిక... శ్రీసాధన
పప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో 1926 ఆగస్టులో ప్రారంభమైంది ‘శ్రీసాధన’ వారపత్రిక. రాయలసీమ జనజీవిత చిత్రణకు, ఆధునిక సాహిత్య ప్రక్రియలకు పెద్దపీట వేసిన ఘనత దీని సొంతం. పురాణ, అనువాద, ఆధునిక కథలను అచ్చొత్తింది. దీనిలో ప్రచురితమైన కథల్లో ఆధునిక లక్షణాలతో కూడినవి 30 దాకా ఉన్నాయి. 1926 అక్టోబరు సంచికలో ‘ఒక చిన్నకథ’ శీర్షికతో మొదటి కథ వెలువడింది. ఇందులో సంప్రదాయ కుటుంబంలోని అతివ తన కుమారుణ్ని ఆంగ్ల పాఠశాలలో చదివించాలనుకుంటుంది. దీనికి భర్త అయిష్టంగానే సమ్మతిస్తాడు. కథ చివరి భాగం లభించనందున కథ ఎలా ముగిసింది, రచయిత వివరాలు తెలియడం లేదు. తమ పిల్లల భవితను నిర్మించటంలో ముఖ్యభూమిక పోషించే అమ్మ పాత్రగా ఆ ఇల్లాలిని కథకుడు చిత్రించాడు. సమాజం సాంప్రదాయికత నుంచి ఆధునికత వైపు రూపాంతరం చెందుతున్న సంధి దశను, విద్యారంగంలో వస్తున్న మార్పులకు అక్షరరూపం ఈ కథ. 
      హెచ్‌.నంజుండరావు ‘చిన్నకథలు’ శీర్షికన ‘కథాలక్షణాల’ను వివరిస్తూ వ్యాసం రాశారు. ఇది 1927 జనవరిలో వచ్చింది. ప్రాచీన కథకు, ఆధునిక కథకు, నవలకు గల తేడాలు తెలియజేస్తూ, ఆధునిక కథ నిర్మాణ సూత్రాలను వివరించారు. తెలుగు సాహిత్యంలో ఆధునిక కథ లక్షణాలను వివరించిన తొలి వ్యాసం ఇదే కావచ్చు. 
      ఇద్దరు మిత్రుల తిరుపతి ప్రయాణ నేపథ్యంలో వచ్చిన ‘ఇరువురు యాత్రికులు’ (1927 జూన్‌) కథ... మానవసేవే మాధవసేవ అన్న సందేశాన్ని ఇస్తుంది. ఈ కథపై ‘విమర్శనము’ పేరుతో తరువాత రెండు, మూడు సంచికల్లో విగ్రహారాధన, పూజలు, సంఘసేవ తదితర అంశాలపై చర్చ జరిగింది. 
      జాతీయోద్యమ నేపథ్యంలో ప్రతీకాత్మకంగా సాగుతుంది ‘మనబెబ్బులి’(1930 ఏప్రిల్‌). దీని కథకుడి పేరు లేదు. సెప్టెంబరులో అనామకంగా వెలువడిన ‘భగీరథ ప్రయత్నం’లో పురాణ పాత్ర అయిన భగీరథుడు కథానాయకుడు. అతను రాయలసీమలో సంచరించి, తుంగభద్ర జలాలను సీమకు తేవడానికి అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమవుతాడు. సీమకు తుంగభద్ర నదీ జలాలు కావాలని ప్రజలు పోరాడుతున్న కాలం అది. ఈ వాస్తవాల్ని భగీరథుడికి సమన్వయం చేసి కథకుడు నైపుణ్యంగా చిత్రించాడు. 1935 జూన్‌లో పి.ఎస్‌.ఆచార్య రాసిన ‘దాహపు దొంగ’ సరదాగా ఉంటుంది. అత్తగారింట్లో అర్ధరాత్రి దాహమేసి నీళ్లను అడిగేందుకు మొహమాటపడిన అల్లుడికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని తెలియజేస్తాడు రచయిత. ఇదే నెలలో ‘గెలుపెవరిది’ పేరిట మరో కథ కూడా ప్రచురితమైంది. కథంతా సంభాషణల రూపంలో సాగుతుంది. 
      1936 జనవరిలో వచ్చిన ‘సుశీల మోహనులు’... జీవిత భాగస్వామి ఎంపికలో యువతులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఆవశ్యకతను తెలియజేస్తుంది. అక్టోబరులో కథకుని పేరులేకుండా వచ్చిన ‘ప్రేమబలి’లో అనాథ అమ్మాయిని పెంచి పోషించి, విద్యాబుద్ధులు నేర్పిన గురువు దారితప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు కళాశాలలో ఆమెను ప్రేమించి గర్భవతిని చేసిన ప్రియుడు మోసం చేస్తాడు. ఈ స్థితిలో ఆమె తనను పోషించిన గురువుకి లేఖ రాస్తుంది. తనను బిడ్డలా ఆదరించమని అభ్యర్థిస్తుంది. అయినా అతనిలో మార్పు రాదు. దాంతో మానవత్వంపై నమ్మకం కోల్పోయిన ఆ అభాగ్యురాలు తనువు చాలిస్తుంది. పురుషాహంకారానికి బలయ్యే యువతుల మనోవేదనను కళ్లకు కట్టినట్లు చిత్రించి, కన్నీటిని తెప్పిస్తాడు కథకుడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏకబిగిన చదివిస్తుందీ కథ.
      కందాళ శేషాచార్యులు ‘బ్లాకీ కుక్క చరిత్ర’ (1936 డిసెంబరు) కథను రాశారు. ఇందులో ఊరి కరణం ఇంట్లో ఉండే కుక్క ఆంగ్లేయ అధికారి వద్దకు చేరి మిడిసిపడుతుంది. ఆ అధికారి పదవీ విరమణ తరువాత స్వదేశానికి వెళ్తూ దానిని మద్రాసులోనే వదిలేస్తాడు. ఓ స్వాతంత్య్రోద్యమ సభలో అనుకోకుండా కుక్క చచ్చిపోతుంది. ఆంగ్లేయ అధికారుల మోచేతి నీళ్లు తాగుతూ స్వదేశీయులను అవమానించే వారికీ ఏదో ఒక రోజున ఆ కుక్కకు పట్టిన గతే పడుతుందని రచయిత చిత్రించారు. ఈయన ఇదే పత్రికకు ‘కూలివాడు’, ‘లక్ష్మీకటాక్షం’, ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ‘బడి పంతులు’; డబ్బు, హోదాల వల్ల మనుషుల్లో విలువలు లుప్తమయ్యే తీరుపై ‘రైల్వేగైడ్‌’, ‘బీఏ అర్జీ’;  తిండికోసం జైలు జీవితాన్ని కోరుకునే నిస్సహాయుల వెతలను తెలిపే ‘ఆకలి’ కథలను రాశారు. ఆర్థికాంశాలు మనుషుల్లో ప్రవేశించే వివిధ సందర్భాలను, వాటి ప్రభావాలను కందాళం కథలు తెలియజేస్తాయి. ఇదే పత్రికలో యర్రగుంట నారాయణరెడ్డి ‘సముద్ర మథనం - స్వరాజ్య సంపాదనము’లో జస్టిస్, కాంగ్రెస్‌ పక్షాలు వైషమ్యాలు మాని కలిసి స్వరాజ్య సంపాదనకు కృషి చేయాలని సూచిస్తారు.
      పాణ్యం సంజీవ శాస్త్రి రాసిన ‘వెలి’ కథ (1938 ఏప్రిల్‌) వితంతువులు ఎదుర్కొనే ఇబ్బందుల్ని తెలియజేస్తుంది. 1939 ఆగస్టు సంచికలో విద్వాన్‌ విశ్వం ‘నా పెండ్లి సంబరం’ పేరిట ఓ కథ రాశారు. పెళ్లిని గొప్పగా ఊహించుకుంటూ ఆనందపడే అమ్మాయి చివరికి వివాహాన్ని తప్పని అవసరంగా భావించి రాజీపడే పరిస్థితిని ఇందులో చిత్రిస్తారు. తప్పులో ఇద్దరి పాత్ర ఉన్నా సమాజం స్త్రీపట్ల వివక్ష చూపడాన్ని ‘మొగమహారాజు’ కథలో ఎత్తిచూపుతారు విశ్వం. 1940లో ఆయనే రాసిన ‘ఎందుకు’ కథలో... సమాజం బాగుండాలంటే విప్లవాత్మక మార్పు రావాలంటారు. ప్రేమికులు నూలుదండలు మార్చుకుని దంపతులైన వృత్తాంతాన్ని జాతీయోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా చిత్రిస్తూ 1940 ఫిబ్రవరి సంచికలో ‘ప్రభాతభేరి’ కథ రాశారు ఎం.వి.శాస్త్రి.
అధ్యయనం అవసరం
కిందటి శతాబ్దం నాలుగో దశాబ్దం వరకు వెలువడిన ఈ కథలన్నింటినీ సీమవాసులే రాశారు. ఆనాటి సమాజంలోని వాస్తవాల్ని చెప్పే క్రమంలో పేర్లు లేకుండానూ, మారుపేర్లతోనూ కథా సాహిత్యాన్ని వెలువరించారు. అన్ని కథల్లోనూ స్థల, కాల నేపథ్యాల స్పృహతో సమకాలీన జీవితాన్ని చిత్రించారు. విద్యా, సామాజిక రంగాల్లో ఆధునికత వైపు పయనించాలనే తీరు, వలస పాలన నుంచి బయటపడాలనే ఆకాంక్ష, జాతీయోద్యమ స్ఫూర్తి, మూఢ విశ్వాసాల ఖండన, నమ్మకాలు మానవ పురోభివృద్ధికి ఉపయోగపడాలనే శాస్త్రీయ దృక్పథం, స్త్రీ విద్య, అన్ని రంగాల్లోనూ స్వేచ్ఛ, సమానత్వాల ఆవశ్యకత, వితంతు పునర్వివాహాలు, కరవు, సాగునీటి సమస్య, డబ్బు వల్ల అంతరించిపోతున్న మానవ సంబంధాలు, సమసమాజ నిర్మాణ కాంక్ష ఇలా వైవిధ్య భరితమైన వస్తు విస్తృతి ఈ కథల్లో కనిపిస్తుంది. 
      శిల్ప పరంగానూ వీటిలో ఆధునిక కథ లక్షణాలు ఉన్నాయి. చాలా కథలు సర్వసాక్షి దృష్టికోణంలో, వాస్తవికత శిల్పం ఆధారంగా నిర్మాణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఉత్తమ పురుషలోనూ, సంభాషణాత్మకంగానూ సాగాయి. పాత్రోచిత భాష, వ్యావహారిక భాష అన్ని కథల్లోను కనిపిస్తుంది. కథా శీర్షికల్లో కూడా సృజనాత్మకత గోచరిస్తుంది. చాలా కథలకు చిన్న కథ, కథ, కథానిక అని సూచనలు కనిపిస్తున్నాయి. సమకాలీన సంఘటనలను ప్రత్యక్షంగా వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ప్రతీకాత్మకంగా, రూపకాత్మకంగా కలాన్ని కదిలించిన కథకులూ ఉన్నారు. కొన్ని కథలపై జరిగిన చర్చలు, విమర్శలు, కథా లక్షణాలపై వ్యాసాలు సీమ కథా పురోగతిని సూచిస్తాయి.
      ప్రస్తుతానికి ఉన్న ఆధారాలను బట్టి 1918 నాటికే సీమలో స్పష్టమైన రూపంలో కథ ఆవిర్భవించింది. 1926 నుంచి విస్తృతి పొందింది. 1940ల నుంచి కందాళ శేషాచార్యులు, విద్వాన్‌ విశ్వం, గుత్తి రామకృష్ణ తదితర రచయితల చేతుల్లో కొత్త పుంతలు తొక్కింది. 1950 నాటికి కె.సభా రచనల్లో ఉత్కృష్ట స్థానం అలంకరించింది. మున్ముందు మరింత పరిశోధన జరిగితే తెలుగు కథా సాహిత్యంలో సీమ కథలు, కథకులు పోషించిన పాత్ర విశదమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం