మళ్లీ పరుండేవు లేరా!

  • 251 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

నల్లనయ్య నిద్దరోతున్నాడు. జగమేలు స్వామి జగాన్ని మరచి మరీ కునుకు తీస్తున్నాడు. ఘడియలు గడుస్తున్నాయి. ఎండదొర ఏడుగుర్రాలెక్కే వేళ కావస్తోంది. అయినా... కన్నయ్య కళ్లు తెరవట్లేదు. లే నాయనా అంటూ యశోదమ్మ తట్టిలేపుతున్నా ఆ యదువంశ విభుడు వినట్లేదు. ‘మేలు కొలుపు’ పాడితే తప్ప మంచం దిగేలా లేడు.
సరే సరే... మరి పాటేది? ఇదిగో అన్నారు మల్లాది. స్వరాలద్దిస్తానంటూ దాన్ని తీసుకున్నారు ఘంటసాల. ఆయన పని పూర్తయ్యేసరికి నేను సిద్ధం మాస్టారూ అంటూ గొంతు సవరించుకున్నారు లీల. ‘తెల్లవారవచ్చే తెలియక నా సామి’ అంటూ గంధర్వగానాన్ని ఆరంభించారు. ఆ గళంలోని లాలనకు గోపబాలుడి శాయిక లాహిరి వదిలిపోయింది. 

ఉదయభానుడి లేలేత కిరణాల స్పర్శ మనల్ని తాకకముందే... ఉదయరాగం పాడుతున్న ఆకాశాన్ని చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది! ఆ నులివెచ్చని చలిలో నిన్నటి స్మృతుల్ని వదిలేస్తూ... రేపటి కలల్ని తలుచుకుంటుంటే ప్రతికూల భావనలన్నీ పటాపంచలై సరికొత్త శక్తి ఉదయిస్తుంది. అది హృదయాన్ని ఉత్తేజభరితం చేస్తుంది. పొద్దుపొడిచినప్పటి నుంచి పొద్దుగూకే వేళ దాకా అలుపు లేకుండా పని చేయడానికి అవసరమైన ఉత్సాహాన్ని మేనికందిస్తుందా కొలవి. అందుకే, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని చెబుతుంటారు మన బామ్మలు, తాతయ్యలు. 
      నిద్రమత్తులో పడి వారి మాటలను వినిపించుకోని పిల్లలు, ముందురోజు పడ్డ శ్రమ కారణంగా ఇవాళ పొద్దున్నే లేవడానికి బద్ధకించే పెద్దల కోసమే ప్రత్యేకంగా ‘మేలుకొలుపు’ పాటలు పుట్టాయి. అజ్ఞాత జానపదుల నుంచి అన్నమయ్య వరకూ ఎందరో సరస్వతీపుత్రులు ఈ మేలుకొలుపులకు మెరుపులద్దారు. వాటిలో పేరుకు భగవంతుడి ప్రస్తావన ఉన్నా రేపటి మనీషికి మేలుకొలుపు పాడే గీతాలవి. ప్రతి మనసునూ తట్టిలేపే గేయాలవి. అలాంటి వాటిల్లో ఒకటి, మేలుకొలుపుల్లో మేలిమలుపుగా, తెలుగు చలనచిత్ర సాహిత్యంలో మణిహారంగా నిలిచిపోయిన గీతమిది. 
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళిపరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
కలకలమని పక్షిగణములు చెదిరేను
కల్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా

తెలుగు నుడికారానికి గుడికట్టి తెలుగు చలనచిత్ర పాటకు సాహితీ గౌరవాన్ని తీసుకొచ్చిన తొలితరం గేయరచయితల్లో అగ్రగణ్యుడు, ఎందరో రచయితలకు గురుతుల్యులు మల్లాది రామకృష్ణశాస్త్రి. ‘చిరంజీవులు’ (1956) చిత్రంలోని పై పాట మల్లాది సృజనే. 
      తెలవారవచ్చె తెలియక నా సామి... అంటూ పాట ప్రారంభమౌతుంది. రాత్రి అలా పడుకున్నామో లేదో ఇంతలోనే  (మనకు తెలియకుండానే) తెల్లారిపోయిందనే అర్థముంది ఈ వాక్యంలో. అదే భక్తి కోణంలో చూస్తే.. పురుషోత్తమా! పొద్దుకు తెలియదు నువ్వు నిద్దరోతున్నావని! అందుకే వచ్చేసింది... దాని పరువు కాపాడటానికైనా నిద్రలేవయ్యా అనే అర్థం స్ఫురిస్తుంది. ఆ వెంటనే వచ్చే ‘మళ్ళీ పరుండేవు లేరా’ అనే పదాల్లోనూ రెండర్థాలు ధ్వనిస్తాయి. కావాలంటే మళ్లీ పడుకోవచ్చు ఇప్పుడైతే నిద్రలే నాయనా అనేది సాధారణార్థం. నేనిటు లేపుతుంటే నువ్వటు పడుకుంటావేంటనేది అంతరార్థం.  (మళ్ళి - మళ్ళీ... చిన్నపొల్లు మార్పుతో ఈ అర్థాలను సాధించారు మల్లాది) పొద్దునే పిల్లలను నిద్రలేపడానికి ప్రయత్నించే వారికి దీని గురించి బాగా తెలుసు. ఇంకో విషయం... తెల్లారిపోతోంది లేవండర్రా అంటే... చిన్నారులు అటూ ఇటూ మసులుతారు తప్ప కళ్లు తెరవరు. ‘మసులుతూ ఉండేవు’ అంటూ అదే విషయం గురించి చెప్పారు కవి. మంకుతనానికి పోకుండా (మారాము చాలింక) మత్తు వదిలించుకోమంటున్నారు తరువాత. ఈ పాట మొత్తాన్ని గమనిస్తే చిన్ని కన్నయ్యను నిద్రలేపుతున్న యశోదమ్మ వాత్సల్యం కనిపిస్తుంది.
      ఓ పక్క పక్షులన్నీ కిలకిలారావాలతో చెదిరిపోతున్నాయి... ఇప్పటికైనా నిదరలేవయ్యా అంటూ కళ్యాణ గుణధామ అనే పదాన్ని వాడారు. నిజమే! ఓ పక్క పిట్టలే అంత పొద్దుటే నిద్రలేస్తే... జగత్కల్యాణ కారకుడైన భగవంతుడు బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే ఎలా మరి? సృష్టిలో చిన్న ప్రాణులైన పక్షులే పనిలో నిమగ్నమైతే... జీవజాతులన్నింటిలో ఉన్నతుడైన మనిషి ఊరికే నిద్రపోవడం తప్పు కదా. ఈ నీతిని చెప్పడానికే పాటలోకి పక్షులను పట్టుకొచ్చారు కవి. అంతేనా.. స్త్రీలంతా దధి(పెరుగు) చిలికే వేళ అయింది లే నాయనా అంటున్నారు. నల్లనయ్యకు వెన్నంటే ఎంతిష్టమో తెలుసు కదా. పెరుగు చిలుకుతున్నారంటే వెన్న సిద్ధమవుతోందనే కదా. దాన్ని తిందువు గానీ లే బాబూ అంటూ ఆశపెడుతున్నారు. ‘ఇదిగో నీకిష్టమైన గారెలు చేశా. నువ్వు నిద్రలేవకపోతే వాటన్నింటినీ చెల్లి తినేస్తుంద’ని చెప్పే అమ్మలెందరు లేరు చెప్పండి! 
      చివరి చరణంలో పూర్తిగా యశోదమ్మ లాలిత్యమే దర్శనమిస్తుంది. నల్లనయ్య, నను కన్నవాడా, బుల్లితండ్రి, బుజ్జాయి అంటూ ఆ అమ్మ ప్రేమతో బిడ్డను పిలుస్తోంది. మన ఇళ్లలో కూడా మారాం చేసే చిన్నారులను మా అయ్య కదూ, మా నాన్న కదూ, మా బంగారు తండ్రివి కదూ అంటూ ఊరడిస్తుంటాం కదా.  అంతే కాదు.. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ మమకారాన్ని కలిపి గోరుముద్దలు తినిపిస్తాం. ఇక్కడ మల్లాది వారు అదే మాటల్ని పోగేశారు. ‘నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలుస్తోంది రా’ అంటూ ఆ మాధవుడికి మేలుకొలుపు పాడారు. 
      అయితే... ఈ పాటలోని అక్షరాలన్నీ మల్లాది కలం నుంచి వచ్చినవి కావు. శృంగార రసాన్ని ఒలికించే ఓ జానపద మేలుకొలుపు గీతాన్ని భక్తిరస ప్రధానంగా మార్చి (అందంగా, అర్థవంతంగా) మనకందించారాయన
తెల్లవారెనమ్మ, చెల్లనేమందు
నల్లని నా సామి లేరా
మరల పడుకునేవు మసలుచున్నావు
మరియాద గాదిక పోరా
కలకలమని పక్షి గణములు కూసెను
కాంతుడ యిక నిద్రలేరా
జలజారి కాంతులు వెలవెల బారెను
తలుపుదీసి చూడు లేరా
తరుణులందరు లేచి దధిచిల్కు వేళాయె
తడవుండ రాదింక లేరా
అరగంటి చూపుతో నట్టిట్టు చూచేవు
నెరజాణవౌదువులేరా

      ఇలా సాగే ఆ జానపద గీతంలో మరో అయిదు చరణాలు ఉంటాయి. దీన్నుంచే స్ఫూర్తి పొంది, చలనచిత్ర భాషకు, భావనకు అనుగుణంగా భక్తిని రంగరించి పాటను తీర్చిదిద్దారు మల్లాది. ఆయన కుమారుడు ఈ గీతాన్ని విని, దానిలోని సాహిత్యాన్ని మెచ్చుకుంటూ ఉత్తరం రాశారట. దానికి మల్లాది సమాధానమిస్తూ... ‘‘నాయనా, అది ఒక పాత మేలుకొలుపు పాట. పల్లవి, పాదాలు యథాతథంగా తీసుకుని వాడుకున్నాను. పాత పాటలో ‘‘మరియాద కాదింక పోరా’’ ని మాత్రం నేను ‘‘మళ్లీ పరుండేవు లేరా’’ అని మార్చి రాశాను. కనుక ఇందులో సారస్వతం అంటూ ఏమన్నా ఉంటే అదంతా ఆ అజ్ఞాత కవి ప్రతిభే. పాత పాట శృంగార రసప్రధానమైనది కనుక ‘‘నల్లనయ్యా రారా.. వెన్న తిందూగాని రారా’’ అన్న పదాలు మాత్రం నేను వేసి పాటను భక్తిపరంగ మలిచాను’ అని చెప్పారట. ఆ మాటల్లో ఎంత నిజాయతీ ! 
      రక్తిని భక్తిగా మలచి, జాను తెనుగు వంతెన వేసి, ఆ గొప్పతనమంతా అజ్ఞాత రచయితకు ఆపాదించారు మల్లాది. ఆరుద్ర అన్నట్లు ‘రామకృష్ణశాస్త్రి సముద్రుడికన్నా గొప్పవారు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోషపెట్టరు’.


వెనక్కి ...

మీ అభిప్రాయం