భాషకు భూషణం రాజ పోషణం

  • 127 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మావుడూరు సూర్యనారాయణమూర్తి

  • సికింద్రాబాదు
  • 9849855983
మావుడూరు సూర్యనారాయణమూర్తి

భువన విజయ సభ జరుగుతోంది. అష్టదిగ్గజ కవులు రాయల వారిని స్తుతులతో ముంచెత్తారు. ఇది గమనించిన మంత్రి ‘‘ప్రభువుల వారు మీమీ కావ్యాల గురించి వినాలనుకుంటున్నారు’’ అని ప్రకటించగానే అల్లసాని పెద్దన లేచి ‘‘మొదట ప్రభువులే తమ కావ్య పఠనంతో ప్రారంభిస్తే బాగుంటుంది’’ అని అన్నారు. ‘‘ఔను ఔను...’’ అన్నారు మిగతా కవులు. రాయలవారి ముఖంలో గర్వరేఖ. అప్రయత్నంగా చేతివేళ్లు మీసం మీదకు వెళ్లాయి. గొంతు సవరించి పద్యం అందుకునే ముందు తన ఆముక్తమాల్యద గురించి చెప్పి విష్ణు చిత్తుని ఆతిథ్యం గురించిన పద్యం చదివాడు రాయలు.
      ‘‘ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్‌ మ్రోయు...’’ ఇలా సాగింది. రాయలు పద్యం ముగించి ‘‘కవులు ఎవరైనా ఈ పద్యంలో గుణదోషాలు చర్చించవచ్చు’’నన్నాడు. ఇంకేముంది? తెనాలి రామకృష్ణుడు లేచి ‘‘మహారాజా! మీ పద్యం అద్భుతంగా ఉంది. గానీ చక్కని తెలుగు పద్యం రాస్తూ పద్యం మధ్యలో ‘నాస్తిశాక బహుతా, నాస్త్యుష్ణతా నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయాభోక్తవ్యమ్‌’ అంటూ, సంస్కృత పదబంధాలు అవసరమా ప్రభూ!’’ అని విమర్శించాడు. రాయల వారు చిరునవ్వు నవ్వి ‘‘రామకృష్ణా! నీ చమత్కార దృష్టి నాపై కూడా ప్రసరించావు. నేను ఈ తెలుగు పద్యం మధ్యలో సంస్కృత పదాలు సందర్భశుద్ధిగా వాడాను. విష్ణుచిత్తుని మాతృభాష తమిళం. అతని ఇంటికి వచ్చిన అతిథుల్లో యావద్భారతదేశీయులు ఉన్నారు. వాళ్ల భాషలన్నీ విష్ణుచిత్తునికి రావు. ఈయన భాష వాళ్లకి తెలియదు. ఆనాటి కాలంలో భారతదేశ భాష సంస్కృతం. అందుకే వారికి అర్థం కావడానికి ఆ మాటలు సంస్కృతంలో రాశాను. నాది తెలుగు కావ్యం కాబట్టి పద్యం తెలుగులో ఆరంభించి సందర్భాన్ని బట్టి సంస్కృతాన్ని ఉపయోగించానన్నాడు రాయలు. ‘‘ఓహో’’ అనుకున్నారు కవులు. ఇదీ రాయల భాషా విషయదృష్టి.
      రాయల మాతృభాష ‘తుళు’. కన్నడ ప్రాంతంలో రాజ్యం స్థాపించటం వల్ల కన్నడం, ద్రవిడవేదం ప్రధాన గ్రంథంగా ఉన్న వైష్ణవమతానుయాయి కావడం వల్ల తమిళం ఆయనకు వచ్చింది. విద్యాభ్యాసం నుంచే సంస్కృతభాష అబ్బింది. ఇక ఇష్టపడి మోజుపడి ఆహ్వానించి, ఆస్వాదించి ఆదరించిన భాష ‘తెలుగు భాష’. ఆయనకు తెలిసిన భాషలన్నింటి మధ్య తెలుగుకు ఇచ్చిన స్థానం ప్రత్యేకమైంది. తనకు స్వప్నంలో శ్రీమహావిష్ణువు చెప్పినట్లు చెప్పిన పద్యం రాయలకే వర్తిస్తుంది.
      ‘‘ఎల్ల నృపులు గొలువ ఎరుగవేబాసాడి’’ అనే పాదానికి ‘‘ఎందరు రాజులు కొల్చినాసరే ‘‘వేబాస+ఆడి’’= వేరు భాష మాట్లాడి ఎరుగను. ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని దేశీయ భాషల్లో తెలుగు ప్రత్యేకతను చాటిచెప్పి తనకుతాను ‘తెలుగొకండ’= తెలుగు+ఒకండ ‘‘నేనొక తెలుగువాడిని’ అని ప్రకటించినవాడు.
రాయల భాషా వేదిక
కొండవీడుపై సాధించిన విజయానికి కొండగుర్తుగా నిర్మించిన సభాభవనం ‘భువన విజయం’గా పేరొంది కావ్య గోష్ఠులకు నిలయమైందని ప్రచారం జరిగింది. కానీ ఆ సభలో భాషా రక్షణకు, సంస్కరణలకు ఎన్ని పునాదులు పడ్డాయో, ఎన్నెన్ని నిర్ణయాలు భాషను పటిష్ఠం చేశాయో మనం తెలుసుకోవాలి.
ఆనాటి భాషావసరాలు
ఇవాళ విద్యారంగంలో, ఉద్యోగ వ్యాపార రంగాల్లో భాష అవసరమవుతుందని మనకు తెలుసు. కానీ 16వ శతాబ్దానికి వచ్చేవరకు భాష కావ్యాలను రచించడానికి, శాసనాలకు మాత్రమే ఉపయోగపడేది. మరి ఆ పరిధిలోనే విభిన్న రూపాల్లో ఉన్న భాషను సంస్కరించే పనిని రాయలు చేపట్టాడు.
* రాయల ఆస్థానంలో మనం అనుకున్నట్లు కేవలం అష్టదిగ్గజ కవులే కాక కృష్ణావధాని (సంస్కృతం) తిమ్మణ్న (కన్నడ) తమిళ కవులు కూడా ఉండేవారు. ఈ కవుల కావ్యాల మధ్య రాయలు ఒక తులనాత్మక పరిశీలన చేసి తెలుగుకున్న ప్రత్యేకతలను గుర్తించి అబ్బురపడ్డాడు. భాషను కేవలం కావ్యాలకే గాక ప్రజావసరాలు తీర్చే సాధనంగా, పరిపాలనా సాధనంగా మలచడానికి రాయలు కృషి చేశాడు. 
* ప్రజాబాహుళ్యం మాట్లాడే పదాలను కావ్యాల్లోకి రానిచ్చి వాటికి కావ్య అర్హత కల్పించాడు. ఉదా: ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో... ‘రోసీరోయదు’, ‘చేసీ చేయదు’. ఇలా వ్యాకరణ విరుద్ధంగా ఉన్నా వాటికి సభార్హత కలిగించాడు. నిజానికి ‘రోసియు రోయదు, చేసియు చేయదు’ అని ఉండాలి. ఆ పదాల్లో ‘రోసియు, చేసియు’ అనేవి వ్యావహారిక రూపాలై రోసీ, చేసీ అని అవుతాయి. ఈ ప్రక్రియను భాషాశాస్త్రంలో లోపదీర్ఘత అంటారు.
      ఇదొక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ప్రజాజీవనంలోని పదాలు కావ్యాల్లోకి వచ్చాయి.
* రాయలు తన ఆస్థాన కవులు రాసిన కావ్యాలను ప్రజల్లోకి పంపించడానికి కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. అంతకుముందు రాజుల ఆస్థానాల్లో ఒకే కవి లేదా ఇద్దరు ఉండేవారు. వారి కావ్యాలకు కొన్ని ప్రతులు తాళపత్రాలపై రాయించి ఇతర రాజ్యాలకు కానుకగా పంపేవారు. దానివల్ల తమ కీర్తి ఇనుమడించేది. రాయలు ఆ కవుల బృందానికి తానే ఆలంబనగా నిలిచి వారి కావ్యాలకు అనేక ప్రతులు రాయించడంతో ‘వ్రాయసకాడు’ వ్యవస్థ నిర్మాణం అయింది.
లిపి సంస్కరణలు
భాషను శాశ్వతం చేయడానికి లిపి సాధనం, ఉలితో శిల మీద చెక్కిన అక్షరాలు శాసనాలుగా నిలిచాయి. భాషావసరం మారాక ఉలి ఘంటంగా మారితే శిలలు తాళపత్రాలుగా, తామ్రపత్రాలుగా మారి రాజ శాసనాలను ప్రజలకందించాయి. ఆ సందర్భంలో అక్షరాల ఆకృతులు ఒక్కొక్క ప్రాంతపు యాసలాగానే వేరుగా ఉండేవి. ఆ ఆకృతులు క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి మారుతూ అనేక రూపాలెత్తాయి. చివరికి రాయల కాలంలో 16వ శతాబ్దంలో స్థిరీకరణచెందాయి. ఈనాడు మనం వాడుతున్నవి అవే. రాయలు లిపిని సంస్కరించి విభిన్న ప్రాంతాల రూపాలను క్రోడీకరించి ఏకరూపత సాధించాడు. తాను సాధించిన ఈ ఏకరూపత అన్ని ప్రాంతాలకూ తెలపడానికి రాయలు అనేక శాసనాలు వేయించాడు. 
రాయల శాసనభాషా విషయాలు
పరిపాలకుల నిర్ణయాలను, దానధర్మ విశేషాలను తరువాతి కాలానికి అందించేవి శాసనాలు. ఈ శాసనాల వల్లనే ‘శిలాక్షరం’ అనే పదం ‘శాశ్వతం’ అనే అర్థంలో వచ్చింది. శాశ్వతమైన, నిర్మాణాత్మకమైన పనులు చేసిన రాయలు ఆ వార్తను తెలిపే భాష కూడా శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాడు. ప్రజలకు కావ్య పఠనంతో సంబంధం లేదు. కవులో, పండితులో, పౌరాణికులో కావ్యాలు చదివి ఏ దేవాలయాల్లోనో వినిపిస్తే ప్రజలు విని తరించేవారు. కంఠస్థం చేయడం ద్వారా భాష శబ్దరూపంలో ప్రజలకు చేరువైంది గానీ అక్షర రూపంలో పరిచయం కాలేదు.
      ప్రజలకు తెలుగు అక్షర స్వరూపాన్ని పరిచయం చేయడానికి, తన పాలనా విషయాలను, ధర్మాలను ప్రజలవద్దకు చేర్చడానికి రాయలు ఎక్కువ శాసనాలు వేయించాడు. శాసనాలు చెక్కడం ఒక శాఖగా వెలిగింది.
      లిపి ఒక కళగా ప్రసిద్ధి చెందింది ఈ రోజుల్లోనే. రాయడం ఒక విద్యగా ఉంది. ఆనాడు అది కళగా వెలిగింది. ‘కళ’ అనేసరికీ దానికీ ఒక సౌందర్యత్వం వస్తుంది. రాయల శాసనాలు చెక్కిన శిల్పులు అక్షరాకృతులను స్థిరీకృతం చేశారు. ఒక్క తెలుగుకే కాదు - ఈ లిపి సంస్కరణ కన్నడ, తమిళాలకు కూడా దక్కింది.
      కొన్ని శాసనాలకు అనువాదాలు కూడా వేయించారు. రాయల కాలంలో శాసనాలు సుమారుగా 225 పైచిలుకు దానశాసనాలు, రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తెలిపేవి ఎనిమిది శాసనాలు ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.
      రాజు భాషాభిమాని అయితేనే భాష బాగు పడుతుంది. రాజుకు భాష అక్కర లేకపోతే ప్రజలకు అక్కరలేదు. మన భాష మీద ఉర్దూ ప్రభావానికి కారణం ఆ రాజుల పాలన. మన మీద ఆంగ్ల ప్రభావానికి కారణం ఆ దొరల పాలన. ఆ తరువాత మన భాష దిగజారడానికి కారణం పాలకులకెవ్వరికీ భాష పట్ల, దాని అవసరాల పట్ల అవగాహన లేకపోవడమే. 
      జాతి నిర్మాణానికి, దేశ సమగ్రతకు భాషాభిమానం మూలసూత్రమని నమ్మినవాడు రాయలు. అందుకే విశ్వనాథ తెలుగు గురించి ‘ఒక సంగీతమేదో పాడునట్లు’ అని పద్యం మొదలిడి...
భాషలొక పది తెలిసిన ప్రభువు చేత
భాషయన నిద్దియని చెప్పబడిన భాష

      అని శ్రీకృష్ణరాయల స్తుతిని ధ్వనింపజేశారు. అలాంటి రాయలు నేటి మన పాలకులను ఆవహించి మన భాషను కాపాడాలని ఆకాంక్షిద్దాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం