బామ్మపాట బంగారు బాట

  • 221 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వాడపల్లి రాధ

  • విజయవాడ
  • 9032044635
వాడపల్లి రాధ

ఆ పాటల్లో రాగరంజితమైన స్వరాలు ధ్వనిస్తాయి. పదాల్లో పూల సౌకుమార్యం గోచరిస్తుంది. ప్రతి గీతంలోనూ సందేశమో, సంప్రదాయమో, భక్తో, బాంధవ్యమో పల్లవిస్తూనే ఉంటుంది. ఇంత అపూర్వమైన గీతాలు ఏ వాగ్గేయకారుడో రాసి, పాడినవి కాదు. మనకు రాతలు చేతకాని కాలం నుంచి మౌఖికంగా ప్రవహించి నేటికీ మన సందళ్లలో పాలు పంచుకుంటున్నాయి. 
తెలుగు వారి సంప్రదాయం అతి ప్రాచీనమైంది. ఇది ఒకతరం నుంచి మరొకతరానికి ఆచరణ ద్వారా సంక్రమించింది. కాలక్రమేణ మౌఖిక సాహిత్యంలోనూ ప్రతిబింబించింది. అందులో స్త్రీల ఆచార వ్యవహారాలు, భక్తి, నోములు, వ్రతాల గురించి ఎన్నో విషయాలు గీతాల రూపంలో ఉన్నాయి. అవి నాటికాలంలో ఇళ్లల్లో జరిగే ప్రతి వేడుకలోనూ వినిపించేవి. ఈ పాటలు వాటిలో పదజాలం మన సంస్కృతికి ప్రతిబింబాలు. తెలుగుజాతి సొత్తు. వాటిలో అక్షరరూపం పొందినవి అతి తక్కువ. భక్తి, మతవిశ్వాసాలకోసం కాకపోయినా వాటిలో ఉండే ఆరోగ్య, వ్యక్తిత్వవికాసం, నైతిక బోధల కోసమైనా మిగిలినవాటిని బతికించుకోవాలి. అప్పుడే మన భాష, సాహిత్యం, సంస్కృతి, ఆచారాలు పరిఢవిల్లుతాయి. మచ్చుకు కొన్ని... 
భారతదేశంలో ప్రాంతాలకతీతంగా ప్రతి ముంగిలిలో కొలువుదీరుతూ అర్చనలందుకుంటుంది తులసిమొక్క.  దీన్ని తులసికోట, తులసిబృందావనం, తులసిమండపం అని పిలుస్తారు. ఈ మొక్క గొప్పతనం తెలుపుతూ అనేక కథలు మనపురాణాల్లో ఉన్నాయి. ఔషధ గుణాలిందులో ఉన్నాయని ఆయుర్వేద గ్రంథాలూ తెలుపుతున్నాయి. తులసిమొక్కను ఆరాధిస్తే కలిగే ప్రయోజనం గురించి తెలిపే పాట...
శ్రీకరంబుగ వెలయు శ్రీలక్ష్మి తులసి,
ఏక చిత్తంబునా ఏమరక తలతు ।।
మహి మీద వెలసినా మహలక్ష్మి తులసి,
మదిని పూర్ణమ్ముగా శ్రీహరిని తలతు।।
నల్లనీ ఆకులా తులసమ్మ దెచ్చి,
బృందావనం వేసి కుదురొప్ప నిలిపీ,
ప్రాతః కాలమునందు గోమయము దెచ్చి,
అలికిన అత్యంత పాపములు బాయు।।
అష్టదళ పద్మములు పెట్టిరెవరైనా
మూడు లోకమ్ముల ముక్తులై వుంద్రూ।।
మృత్తిక సోకెనా మేనంతలోనూ
అపమృత్యు వెడబాయు నా క్షణమునందూ।।
నిండు వుదకంబులూ పోయు వారలకూ
సామ్రాజ్య వైభవము గలుగు తప్పకనూ।।
తులసమ్మ కళ్లార చూచి మ్రొక్కిననూ
జన్మ బంధములొదలి ముక్తి నొందెదరూ।।

      తెల్లవారుజామున లేచి తులసిపూజ చేసే స్త్రీలు పాడే పాట ఇది. దీన్ని ‘చిలుకముగ్గుల పాట’ అంటారు. 
      తులసిమొక్కని పెంచటం లక్ష్మీకరమని ఈ పాటలో అనేక విషయాలు చెప్పారు. ఏమరపాటు లేకుండా ఏకాగ్రచిత్తంతో స్మరించాలి. భూమి మీద వెలసిన లక్ష్మీ స్వరూపం తులసి. నల్లని ఆకులుగల తులసిమొక్కను తీసుకువచ్చి దానికి మండపం ఎత్తుగా కట్టి సూర్యోదయానికి పూర్వమే ఆవుపేడతో ఆ మండపాన్ని అలికితే పాపాలు పోతాయట. దాని చుట్టూ అష్టదళపద్మం (ఆరుకోణాలు) గల ముగ్గును వేస్తే సత్యలోకం, వైకుంఠం, కైలాసాల్లో ముక్తి కలుగుతుంది. తులసిమొక్క ముందు ఉండే మట్టి శరీరానికి తగిలితే పూజించేవారి అపమృత్యుదోషం పోతుందట. తులసిచెట్టుకి సరిపోయేంత నిండుగా నీరు పోసేవారికి సామ్రాజ్య వైభవం కలుగుతుందట. దాన్ని కళ్లారా చూసి నమస్కరిస్తే భవబంధాలు తొలగి ముక్తి వస్తుందని చెప్పారు.   
      భారతదేశంలో చాలా ప్రాంతాల్లో స్త్రీలకు ‘తులసి’ ఆరాధ్యదేవత. 
భక్తితో తులసికి గోవిందారామ,
మ్రొక్కులైన చేతు గోవిందా।। 
కృష్ణతులసమ్మకు గోవిందారామ,
పూజలయినా సేతు గోవిందా।।

      ఇది ‘తులసి గోవింద నామాల’ పాట.   కృష్ణ తులసి, రామ తులసి రెండురకాలు. అందులో పూజకు ఉపయోగించేది కృష్ణతులసి. ఈపాటలో  ప్రతి వాక్యానికీ చివరలో ‘గోవిందారామ’ అనే పదాన్ని చేర్చారు. ఇటువంటి ప్రయోగాలు బృందగీతాల్లో ఉంటాయి. తులసీమాతను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చెరకు గడలతో పందిరివేసి, మామిడి తోరణాలతో అలంకరించి పూజచేస్తారు. ఆ విషయాన్నీ ఈ పాటలో తెలిపారు. తులసిమొక్కను పూజించటంలో ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు ఆరోగ్యసూత్రాలూ ఉన్నాయి. 
      ‘మహాలక్ష్మికి జ్యేష్ఠాదేవికి సంవాదం’ తెలిపే పాట ఉంది. ఆ పాటలో లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉంటుందో తెలుస్తుంది.
      ఒకప్పుడు జ్యేష్ఠాదేవిని భీమసేనుడు అవమానించాడని అలిగి మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని జ్యేష్ఠాదేవి శపించిందట. జ్యేష్ఠాదేవికి చెల్లెలు లక్ష్మీదేవి. అందువల్ల జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిని పిలిచి ధర్మరాజుని వదిలేసి దుర్యోధనుని వద్దకు వెళ్లమని కోరిందట. అప్పుడు శ్రీలక్ష్మీదేవి ధర్మరాజుకున్న మంచి గుణాలు చెప్తూ...
అలికి విడిచిన గడప దాటడే రాజు,
ఆధర్మనందనుని ఎడబాయలేనే

అని జ్యేష్ఠాదేవి మాటను తిరస్కరించిందట లక్ష్మీదేవి. గుమ్మానికి పసుపు పూసి కుంకుమబొట్టు తప్పకుండా పెట్టాలనే సంప్రదాయం తెలుపుతున్నాయి ఈ వాక్యాలు. అంతేకాకుండా...
నడిముగ్గు లేనింట నడువడే రాజు ।।ఆ ధర్మ।।
ఆడి మిగిలిన జలక మాడడే రాజు ।।ఆ ధర్మ।।

      పాటలో ఇల్లు కళకళలాడుతూ ఉండాలనీ, కట్టి విడిచిన బట్టలు వేసుకోరాదనీ, పది మందిలో న్యాయం చెప్పాల్సి వచ్చినప్పుడు పక్షపాతం చూపరాదనీ, ఒళ్లోకి పూలు కోయరాదనీ, ఆస్తుల వంటివి భాగాలు పంచుతున్నప్పుడు భేదాలు చూపరాదనీ, ముత్తయిదువుని తిట్టరాదనీ ఈ పాట తెలుపుతోంది. 
      నాటి పాటలు ఇప్పుడు ఎక్కడో తప్ప వినిపించడం లేదు. నలుగు పాటలు, వరస పాటలు, బువ్వంబంతి పాటలు, అప్పగింతల పాటలు... ఇలా ఎన్నో, ఎన్నెన్నో...
మచ్చుకి నలుగు పాట..
1. నలుగిడవే కోమలీ... నలుగిడవే కృష్ణునకు ।।నలుగి।।
అత్తరు నూనెలు... పన్నీరుతోనూ...
పునుగు జవ్వాదితో నెమ్మదిగా నీవు ।।నలుగీ।।
2. నీలవర్ణ వేగిరారా... నలుగు పెట్టేవేళ
బాలకృష్ణ జాలమేలరా... గోపాలకృష్ణ జాలమేలరా
శ్రీగంధము నలదరా... జవ్వాదిని బూయరా...
సిగను పూలు జుట్టరా... సఖియను చేపట్టరా ।।నీల।।
3. నీలగళా!... నలుగిదిగో నిగమ గోచరా!
ఫాలలోచనా... సురేశ... పాపసంహారా! ।।నీల।।
పరమ పురుష! భవవిదూర! భక్తవందితా!
పరిపూర్ణా ఖండ నిత్య పావన చరితా ।।నీల।।
విశ్వేశ్వర విశ్వగర్భ విశ్వరూపకా!
ఈశ్వర సర్వాంతర్యామి సజ్జన పోషా ।।నీల।।

      మన ప్రాచీన సంప్రదాయంలో మనిషి చేసిన ప్రతీపనినీ దైవానికీ ముడిపెట్టడం పరిపాటి. అందుకే ఈ పాట కృష్ణునికి నలుగు పెట్టినట్లు తలచుకుంటూ సాగుతుంది. నాటి రోజుల్లో నలుగు పెట్టేటపుడు అత్తరుతో తయారుచేసే నూనెలు, పన్నీరు, పునుగు అంటే కస్తూరీమృగం. దీన్నే గంధమార్జాలం అంటారు. గ్రామీణులు బూతిపిల్లి అని అంటారు. దీనినుంచి సేకరించిన తైలం వంటివి వినియోగించేవారని తెలుస్తోంది. నలుగుపెట్టి స్నానం చేసిన తరువాత గంధాన్ని, సువాసనకు కస్తూరి తైలాన్నీ, వేణీ అలంకరణకు పువ్వులు పెట్టేవారు. శ్రీకృష్ణునికి సపర్యల తరువాత నీలకంఠుడైన శివుణ్నీ తలచుకుంటూ సేవలకు సిద్ధమవుతున్నారు. ఈ పాటలో శైవ వైష్ణవ అభేదమూ గోచరిస్తోంది. ఇలాంటి నలుగు పాటలు ఇంకా చాలా ఉండేవి. ఇక పెళ్లిలో వధూవరుల చేత బంతులాడించే పాట...
1. బంతులాడిరీ... రుక్మిణీ కృష్ణులు ।।బంతు।।
వింతగ చేమంతి పూల బంతిని చేపట్టి ।।బంతు।।
ముత్యంపు ముక్కెర అందముగా మెరయగ
మొగలీ రేకుల జడ ఘుమఘుమలు నిండగ ।।బంతు।।
ఓర చూపులు చూసి, వయ్యార మొలికించి
సన్న జాజుల బంతి, సంపంగి పూబంతి ।।బంతు।।
2. పూల వసంతము లాడెనే...  దమయంతి
రాజాధిరాజు శ్రీ నల మహారాజుతో ।।పూల।।
చుట్టు జల్తారుచీర, మల్లెమొగ్గల రవిక ।।పూల।।
సంపంగి దండలు గుమగుమా పరిమళింప ।।పూల।।
ఇద్దరూ చేరే... వనమూన రేగిరి...
ముత్యాల పానుపు పయి ముదముతో  కూర్చుండి ।।పూల।।

      ఈ పాటలో వధూవరులాడే బంతులు ఏపూలతో చేస్తారో చెబుతూనే వారు బంతులాడుతున్నప్పుడు అక్కడి శోభనూ వర్ణించారు. ఇలాంటి చక్కని పాటలకు ఈనాటి వివాహ వేడుకల్లో చోటేదీ.
      ఆ రోజుల్లో పెళ్లి భోజనాల్లో ఎటువంటి మర్యాదలో, ఎన్ని రుచులో చూడండి... 
1. ఏలాగు భోం చేతుమో! ఈ విందు మేము 
ఎలాగు భోం చేతుమో!
విస్తళ్లు వేశారు... దోసెడంత వెడల్పు లేవండీ!
వడ్డించే వదిన గారి వడ్డాణము జారిపోయె ।।ఏలాగు।।
నూనె వంకాయకూర... దానిలోకి మారు ఏ పచ్చడి లేదు
చల్లా చూడగబోతే చాలా పుల్లగ నుండె ।। ఏలాగు।।
2. సుందరమగు బువ్వమూ
చూడగ ఆనందమూ ఇందువదనలార రారె
హిమగిరి సుత కనుగొందము ।।సుందర।।
అపరంజరిటాకులే... అందముగా వేసిరీ...
శాకాన్నము, కూరలూ చాలగ వడ్డించిరీ ।।సుందర।।
అరటీ, మామిడి పండ్లూ, ఫలరసమ్ములూ 
పూర్ణము బూరెలు, గారెలు, పాయసమ్ములూ ।।సుందర।।
కమ్మని, తియ్యని పెరుగును తరుణులు వడ్డించిరీ...
మీనాక్షి వరుడైన సుందరేశు డారగింప ।।సుందర।।
3. చేసి గెలిచిరమ్మ కార్యమూ... వియ్యాల వారు
చూసి పాడిరమ్మ సోద్యమూ ।।చేసి।।
మారన్న మడిగితే మామగారు వచ్చిరీ
మారు అన్నము లేదనీ మాయమాటలు చెప్పిరీ ।।చేసి।।
వడియాలు అడిగితే... వగలమారి పెద్దవదినె
వడియాలు లేవనీ... కడియాలు తిప్పసాగె ।।చేసి।।

      ఇందులో మొదటి చరణంలో విస్తళ్లు చిన్నవనీ, నంజుకు పచ్చడి లేదనీ, చల్ల పుల్లగా ఉందనీ ఎత్తిపొడుపూ, విమర్శలూ  ఉన్నాయి. రెండో చరణంలో అరటాకుల్లో అరటి,  మామిడిపండ్లు వంటి ఫలరసాలు, పూర్ణం బూరెలు, గారెలు, పాయసాలూ వంటి పదార్థాలతో విందుని ఏర్పాటుచేసి బంధువుల మన్నలను పొందారని తెలుపు తోంది. వీటితోపాటు పాటలో వియ్యాలవారి కయ్యాలూ ఉన్నాయి. తెలుగు వారి వంటలూ, వైభవాలూ తెలుస్తాయి.
      పెళ్లి అయిపోయిన తర్వాత అప్పగింతల వేళ కళ్లు తుడవని వారు ఉండేవారే కాదు నాటి రోజుల్లో. మేళం వాళ్లు పోయి రాగదమ్మ... జానకీ... మా తల్లి సీతా! అంటూ వాయించడం మొదలుపెట్టే సరికే అందరికీ మనసులు భారమైపోయేవి. వధువు చేతులు పాలల్లో ముంచి వరుని తరఫున వారికి అప్పగింతలు పెడుతుంటే అందరూ నిశ్శబ్దమై పోయేవారు. అప్పుడే అప్పగింతల పాటలు పాడేవారు.
గౌరీ కల్యాణ వైభోగమే... లక్ష్మీ కల్యాణ సౌభాగ్యమే అంటూ అత్తమామలకూ, భర్తకూ, ఆడబడుచులకూ బిడ్డని అప్పగిస్తూ...
మీ పట్టి గాని ఇక మా పట్టి కాదు
చేపట్టి రక్షించు, చేత మ్రొక్కెదము
బిగ్గరగ పిల్వగా బెదరి చూచేను,
కోడలు కాదిది కూతురనుకొనుమా!
పనులేమి నేరదీ పసిబాల అబలా,
కన్న బిడ్డగ నేర్పి కావుమోయమ్మా
తనకు మిక్కిలి నొప్పి కలిగి యున్నానూ
మనసు మర్మము చెప్పుకొన జాలదమ్మా!

      ఈ రోజునుంచి మా అమ్మాయిని మీ బిడ్డగా చూడండని వేడుకొంటారు వధువు తల్లిదండ్రులు. తమబిడ్డ పూవులా లాలితమైందనీ, లోకం పోకడ తెలియని అమాయకురాలని, తనకు బాధ కలిగినా చెప్పుకోలేదంటూ అత్తవారికి అప్పజెబుతూనే కూతురికీ బుద్ధులు చెప్పేవారు.
కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అల్లుని పిలిచి తన బిడ్డను అప్పగించే పాటలో
చిన్ని నా కన్నియను ఇన్నాళ్లు పెంచి, 
నీ చేత బెట్టితిమి నీకప్పగించి,
గడయ నన్విడిచి తానెపుడుండలేదు,
ఇక మీద కాపురము ఎట్లు చేసిడిదో,
బంగారు నా తల్లి బావురు మనునో,
బెంగ పెట్టుకొనునో, అంగలార్చెడునో,
కన్నీరు పెట్టక కాచుకోవయ్య!
ఈ చిట్టి తల్లిని ఇక మీద విడిచి,
మేమెట్టు లుందుమో ఈశునకెరుక,
ఇక మీద మా యింట ఎవ్వరాడెదరు?
ఉయ్యాల లెవ్వారు ఊగుతారింక!
చిన్ని వీణియ నెవరు వాయించుతారు?
వరహాల మూట, నా వజ్రాల కోట,
నా చిట్టి బంగారు మీ ఇల్లు చేరూ!
పాడియై దయతోడ గాచి రక్షించు,
ప్రేమతోడుత చూచి పాలించవయ్యా!

      అని బతిమాలుకొంటారు. చిన్ననాటి నుంచి ఆమెకు చేసిన గారాబం, ఆమె చేసిన చిలిపి పనులు తలపోస్తూ తమ తనయ నడయాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోతుందని వ్యధ చెందుతారు. తమ కుమార్తెను ప్రేమతో, దయతో చూడమని అల్లునికి అప్పగిస్తారు. నేడివన్నీ ఎక్కడా లేవు. కన్నబిడ్డ పరాయి చోట (అత్త వారింట) అందరూ తనవారనుకుంటూ కలసిమెలసి ఉండటం నేర్పుతున్నామా? 
      ఇటువంటి మరెన్నో పాటలు మన బామ్మల నోటి నుంచి జాలువారాయి. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అవన్నీ క్రమంగా అంతరించి పోతున్నాయి. ఈ తరం వారు బామ్మల దగ్గర చేరి నాలుగు మంచి మాటలు వినటానికీ కూడా సమయం లేదంటారు. బామ్మల పాటలు బంగారు బాటలు అని అర్థం చేసుకోలేకపోతున్నారు.
      ఈ పాటల్లో ఎక్కడా అర్థంకాని పదాలు ఉండవు. పల్లెల్లో పరిఢవిల్లిన పదాలే పోతపోసుకుంటాయి. సామెతలు, జాతీయాలు, నానుడులు నిండుగా ఉంటాయి. ఇలాంటివే వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. వాటన్నింటినీ కాపాడుకోవాలి.  


వెనక్కి ...

మీ అభిప్రాయం