ప్రేమతో... ఓ గడ్డిపోచ!

  • 785 Views
  • 0Likes
  • Like
  • Article Share

మనిషి ప్రేమైక జీవి. ప్రేమకు ఎన్నో అర్థాలున్నా... సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే గాఢమైన ఇష్టమే ప్రేమ. మామూలుగా అయితే దాని గమ్యం పెళ్లి. కానీ, ప్రతీ ప్రేమా పెళ్లికి దారితీయదు. ఏవేవో కారణాల వల్ల విడిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. అక్కడే సమస్య వస్తుంది. భగ్నహృదయులు విపరీతంగా ప్రవర్తిస్తారు. ఆ వైపరీత్యం ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాబోదు. జరిగిన సంఘటనను మరిచిపోయి మంచి మనసుతో బతకడమే ఎవరైనా చేయాల్సింది. ఇలాంటి వృత్తాంతాన్ని తీసుకుని వందేళ్ల కిందటే ‘తృణకంకణము’ అనే అమలిన ప్రేమకావ్యాన్ని ఆవిష్కరించారు తెలుగు భావకవితా ఉద్యమ సారథి రాయప్రోలు సుబ్బారావు.
      ప్రేమ విఫలమైతే చాలు... చంపడానికో, చావడానికో సిద్ధమైపోతున్నారు కొందరు. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజమైన ప్రేమ అవతలి వ్యక్తి బాగును మాత్రమే కోరుతుంది. ‘తృణకంకణము’ కూడా అదే సందేశాన్ని అందిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఈ కావ్యనాయకుడి ప్రేయసికి వేరే వ్యక్తితో పెళ్లవుతుంది. గుండె పగిలిన ఆ యువకుడు పెళ్లి చేసుకోకుండా ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. వాళ్లొమారు ఒక ఉద్యానవనంలో కలుసుకుంటారు. ఒకరికొకరు కుశలప్రశ్నలు వేసుకుంటారు. ఒకరిచేతిలో మరొకరు చేయివేసుకుని ప్రేమగా మాట్లాడుకుంటారు. అప్పుడు ఆ యువకుడు ‘వియోగంలో అమృతం విషం రెండూ సమానమే’ అంటాడు యువతితో. అంటే బతికినా మరణించినట్లే అని! ఇంకా ‘ఏ అరమరికలూ లేకుండా ఒక్క కంచంలో తిన్నాం, మనసులో నాటుకున్న మమతల్లో మునిగి తేలాం. అలాంటి జంటను విడదీయాలని తలుచుకుని, ప్రేమను ఇబ్బందిపెట్టే సృష్టి దైవికం కాదు. తనకు ఇష్టమైనవాళ్లు సంతోషంగా ఉంటే ప్రాణికి హాయిగా ఉంటుంది. ప్రశాంతత చేకూరుతుంది. అదే దూరమైపోతే మాత్రం ఆ బతుక్కి అర్థం ఉండదు. చీకట్లు లేకపోతే వెలుగు అవసరం ఏముంటుంది. బాధ లేకపోతే వ్యసన రుచి బోధపడదు. అలాగే భరించలేని వియోగమే మధురం’ అంటాడు ఆమెతో.
      ఇద్దరు వ్యక్తులు కేవలం కలిసి ఉన్నంత మాత్రాన (ఏ రకంగానైనా) అది ప్రేమకాదు. మనుషుల అంతరంగాలను అతకగలిగిన అపూర్వమైన లంకెనే ప్రేమ. అందుకే, కలుషితం కాని ప్రణయకాంక్షే ప్రేమంటే అంటుంది ఆమె చివరికి. అయితే ఆమె చేతికి ప్రేమికుడు కట్టిన ఓ దండ ఉంటుంది. తమ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఆమె పెళ్లికి ముందే అతను దాన్ని కట్టాడు. ఇప్పుడు దాన్ని తీసేయమని అడుగుతుందామె. ఆ యువకుడు బాధతో ఆ సూత్రాన్ని విప్పేస్తాడు. కానీ అక్కడే పాదుల్లో ఉన్న గడ్డిపోచలతో కంకణం తయారుచేస్తాడు. ‘మన ప్రేమ మధురలాంఛనం బిదియె సుమ్మి!’ అంటూ ఆ తృణకంకణాన్ని ఆమె చేతికి కట్టుకోమంటాడు. అప్పుడే ఇలా చెబుతాడు...
ఈ తృణకంకణంబు 
           భరియింపుము నీ మణిబంధమునందు, సం
తిని అప్పుడప్డు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా
భాతికవేళ నీ ప్రణయ బాష్ప జలాంజలినింత జల్లి, యే
రీతిని వాడకుండ నలరింపు, మిదే తుదివాంఛ సోదరీ!

      అప్పుడప్పుడు ‘ఏ సుప్రభాత వేళలోనైనా మన ప్రేమ గుర్తుకు వస్తే... నీ ప్రణయ బాష్పజలాన్ని కొంచెం దీనిమీద చల్లి ఈ ‘తృణకంకణాన్ని’ వాడిపోకుండా ఉండేలా చూడు సోదరీ’ అంటాడా యువకుడు. ఇక్కడ సోదరీ అన్న ప్రయోగం కొంచెం విచిత్రమే. అయితే మరి భార్యా భర్తలుగా కలిసి ఉండలేని వాళ్లు ఎలా కలిసినా దాని వెనక కామం స్ఫురిస్తుంది. అందుకే అతనితో ఆమెను ‘సోదరీ’ అని పిలిపించారు రాయప్రోలు. తర్వాత ఆమె తన ఉంగరాన్ని అతని వేలికి అలంకరించి... ‘వలపు నశించి ప్రేమ నిలువగలిగితే, కలలో కూడా కలుషం అంటుకోని స్నేహపు తీయటి రసానుభూతిని పొంది మనం మన నీడల్లా ఏకమైపోవాలి’ అంటుంది. వారి అమలిన ప్రేమకు ఆ ఉద్యానవనంలోని చెట్లు పూలు జలజలా వర్షించాయంటారు కవి. చివరికి వాళ్లు ఒకరినొకరు చూసుకొంటూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. ఏదేమైతేనేం... వాళ్ల ‘మైత్రీ సూత్రబంధములు తెగవు’ అని తృణకంకణాన్ని ముగిస్తారు రాయప్రోలు.
      నిజమే ఒక్కోసారి ప్రేమలు పెళ్లికి దారితీయవు. అంతమాత్రాన ద్వేషం పెంచుకోవడమో, బతుకు మీద విరక్తి చెందడమో ఎందుకు? జీవితాంతం స్నేహభావంతో ఒకరి సుఖాన్ని ఒకరు కోరుకుంటూ బతికితే మేలు కదా!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం