బాలభాష భలే భాష

  • 129 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.సరోజినీదేవి

  • విశ్రాంత తెలుగు ఉపాధ్యాయని
  • హైదరాబాదు
  • 8142282158
జి.సరోజినీదేవి

‘‘తానో ‘లాములు’, తండ్రి పేరెవరయా? ‘దాచాతమాలాలు’...’’ ఇలా సాగుతుంది బాల రాముడు, కౌసల్యల సంభాషణ ‘రామాయణ కల్పవృక్షం’లో. అంటే నా పేరు రాముడు, మా నాయన దశరథ మహారాజు అని. రాముడిలాగే పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పటినుంచి పరిసరాలను అనుకరిస్తూ తొక్కు పలుకులు పలకడం నేర్చుకుంటారు. అమ్మ, అత్త, మామ, ఉవ్వు(నువ్వు) ఇలా సాగుతూ అభివృద్ధి చెందుతుంది వారి పదజాలం. వారు అలా పలుకుతుంటే చూసేవారికి ఒకరకమైన ఆనందం. వాళ్లు తమంత తాము నేర్చుకునే వరకు అనుకరణే ప్రధాన భాషా సేకరణ మాధ్యమం.
ఊహలను, కష్టసుఖాలను తోటివారితో పంచుకునే సాధనం భాష. గుంపులుగా సంచరించే జీవులకు భాష అవసరం మరీ ఎక్కువ. ఏకాకిగా మసిలే కాకికి పది పన్నెండు అరుపులు వస్తే గుంపులుగా తిరిగే కోతులు వందదాకా శబ్దాలు చేస్తాయి. మనిషి సంఘజీవి కనుక భాషా తదనుగుణంగానే క్రమపద్ధతిలో అభివృద్ధి చెందింది. ఆ క్రమమే శిశువుల్లోనూ ప్రతిఫలిస్తుంటుందని జీవపరిణామవాదం సారం. 
      ప్రాపంచిక వ్యవహారాల్లో భాష అవసరాన్ని కనిపెట్టి మనిషి ఎలా దాన్ని వశంలోకి తెచ్చుకున్నాడో... శిశువూ అదే క్రమంలో వస్తువులు, వాటి సౌకర్యాలు, వాటిని సమకూర్చుకునే పద్ధతులను గురించి నేర్చుకుంటాడు. ఒక మూల వస్తువుల కుప్ప ఉంటే, అందులోంచి తనకు కావాల్సిన వస్తువును సైగలతో స్పష్టంగా సూచించడం కుదరదు కదా! పెద్ద వాళ్లెవరైనా ఒక్కొక్క వస్తువును చూపిస్తుంటే... అది అవునో కాదో చెప్పాలి. అనుకున్నది దొరికే దాకా ఓపిక కావాలి. శిశువుకు అంత సహనం ఉండదు. కోరింది వెంటనే అందాలంటే స్పష్టమైన పదంతో సూచించడం అవసరం. మాటలు నేర్చుకోవడం ఏ శిశువుకైనా ఒక తప్పనిసరి అవసరం. మాటలు రాని ఇద్దరు శిశువులను ఒకేచోట కూర్చోబెట్టి చూడండి. వాళ్లిధ్దరూ ఏవో విచిత్రమైన శబ్దాలతో పరస్పరం సంభాషించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మాటలు నేరిస్తే కావాల్సిన వస్తువు పేరు వత్తి చెప్పో, ముఖ కవళికల ద్వారా సూచించో, అవయవాలను యథాశక్తి కదిలించో సాధించుకోవచ్చు. కానీ ఈ అభ్యాసమంతా ఎన్నో తప్పుల తడకల్తో తమాషాగా సాగుతుంది. 
ఏదైనా ‘బెల్లమే’
బిడ్డకు వస్తువు పేరు తెలిసినా దాని లక్షణం సంపూర్ణంగా తెలియదు చాలాసార్లు. ఆ వస్తువును గురించి తనకు తట్టిన భావంతో గుర్తించడం బిడ్డకు అలవాటు. బెల్లం రుచి నచ్చి బెల్లం పేరు పలకటం వచ్చిన పిల్లలు... రుచి నచ్చిన మరే తినుబండారం చేతికిచ్చినా ‘బెల్లం’ అనే అంటారు. బెల్లం రుచి పేరు ‘తీపి’ అని తెలిసిన తరువాత ఆ ‘తీపి’ ఇష్టం కనుక ఇష్టమైన ఏ రుచినైనా వాళ్లు తీపి అనే అంటారు. పండుగనాడు పిండివంటలు చేస్తారు. కాబట్టి పిండివంటలు చేసిన ఏ రోజైనా పిల్లల దృష్టిలో పండుగే.
      ఒక వస్తువు ప్రత్యేక లక్షణాలను గుర్తించి అలాంటి వస్తువును ఆ పేరుతోనే పిలిచే శక్తి కొన్ని నెలలు గడిస్తేనే కాని పిల్లలకు పట్టుబడదు. ఉదాహరణకు పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తూ వారు ఇతరులను ఎలా పిలిస్తే అలా పిలుస్తారు. అంటే తాతయ్యలను నాన్న అనీ, నానమ్మ- అమ్మమ్మలను అమ్మ అనీ, అత్తను అక్క అనీ పిలవడం లాంటివి. పెద్దవాళ్లు పక్కనుండి సరిదిద్దే వరకూ చిన్నాన్నను నాన్ననీ, పిన్నిని అమ్మనీ చేసేసి కంగారుపెట్టేస్తుంటారు. మీసాలు గడ్డాలు కలగలిసిపోయిన ఆసామినెవరినన్నా చూపించి పెద్దాళ్లు ‘బూచాడు’ అని భయపెడితే... మీసాలు గడ్డాలున్న ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ దృష్టిలో బూచాడే. వ్యక్తుల ప్రత్యేక లక్షణాలను గ్రహించి ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం శిశువుకి అలవాటయిందాకా ప్రతిరోజూ ఇంట్లో ఇలాంటి ఏదో తమాషా జరుగుతుండాల్సిందే. ఒక వస్తువు ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే సామర్థ్యం అలవడ్డ తరువాత ఆ లక్షణాలున్న అన్ని వస్తువులనూ ఒక సముదాయంగా భావిస్తారు పిల్లలు. గులాబీ రంగు నచ్చింది కనక మల్లె, మందారం, గన్నేరు, చివరికి గడ్డిపూవైనా సరే - గులాబీలే బాలలకు. పెద్దవాళ్లు ఒక్కొక్క పువ్వు లక్షణాన్ని వివరించి పేర్లు చెప్పించాల్సిన సమయమిదే. మొగ్గైనా, పువ్వైనా, రెక్కైనా ఒక దశలో పిల్లలకు అన్నీ పూలకిందే లెక్క. వివిధ దశలను ప్రత్యేకమైన పేర్లతో గుర్తించి పిలిచే పదసంపద సొంతమయ్యేదాక పిల్లలతో ఇదో రకమైన తారుమారు సరదా.
అనుకరిస్తారు జాగ్రత్త!
పిల్లల దగ్గర సభ్యపద ప్రయోగాలు మాత్రమే చేయడం చాలా అవసరం. అర్థం తెలియకపోయినా పెద్దవాళ్ల మాటలను గుడ్డిగా అనుకరించడం పసివాళ్ల లక్షణం. భాష చురుకుగా నేర్చుకోవడానికి బిడ్డకు ఉపకరించేది అనుకరణ గుణమే. ఇదంత సులభమైన విషయమేమీకాదు. ఎన్నో పాట్లుపడిన తరువాత కానీ అలవాటుకాదు. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు నవ్వుపుట్టించే సందర్భాలూ ఉంటాయి. పిల్లలకు తెలిసే వస్తువులు కొన్నే. ఆ వస్తువుల లక్షణాలు కనిపిస్తే తెలీని వాటినీ ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. ఇంట్లో ఉండే తువ్వాయికి నాలుగు కాళ్లుంటాయి. కనుక నాలుగు కాళ్లున్నది ఏదైనాసరే వాళ్లకి తువ్వాయే. పండక్కి తను కొత్తగౌను కట్టుకుంటుంది కనుక ఇంట్లో వాళ్లందరూ గౌన్లే కట్టుకుంటారని ఓ పాపాయి ఊహ. నిన్న, రేపు, కొనడం, అమ్మడం, రావడం, పోవడం... లాంటి పదాల మధ్య తేడాలు అంతుపట్టక ఒక దానికి బదులు ఒకటి వాడి నవ్వు తెప్పిస్తుంటారు. మూడు నాలుగేళ్ల పిల్లలు ఆడుకుంటూ కల్పించుకునే సొంత పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వస్తువులకు వాళ్లు పెట్టే పేర్లు ఒక్కోసారి చాలా సృజనాత్మకంగా ఉండి… ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘పడవ’ను ఒక పాపాయి ‘కాలవ ఇల్లు’ అంటుంది. వానపడితే కప్పలు బెకబెకలాడతాయి. కనుక వర్షాన్ని మరో చిన్నారి ‘బెకబెక’గా సంబోధిస్తుంది. 
కప్ప అప్ప... బల్లి బావ
మానవ సంబంధాలను అచేతన పదార్థాలకూ ఆపాదించే కావ్య లక్షణం పసివాళ్లకు ఎలా అబ్బుతుందో... అదో అబ్బురం. ఒక పాపకు వంకాయ పేరు మాత్రమే తెలుసు. సంత నుంచి తండ్రి తెచ్చిన సొరకాయను, పొట్లకాయను... వరసగా పెట్టి వంకాయ అమ్మమ్మ, వంకాయ తాతయ్య అంటూ వంకాయ భాషలోనే పిలుస్తుంది. ఇంకో పాపకు పక్కింటి పడుచుపిల్ల దగ్గర బాగా చనువు. అస్తమానం ‘అక్క’ అంటూ ఆ పిల్ల వెంటే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లందరూ ఆ పాపకు అక్క అమ్మ, అక్క అన్న, అక్క నాన్న... ఇలా. మరోబాబు దృష్టిలో పోషణ చేసేవాళ్లందరూ అమ్మల కిందే జమ. అందుచేత నీళ్లు చేదుకునే బావి - బావమ్మ, అప్పచ్చి ఇచ్చే పక్కింటావిడ  ‘అప్పచ్చమ్మ’. చుట్టరికాలతో సొంతంగా పాటలు కట్టుకుని పాడుకోవడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించే సరదా. ‘కప్ప నీ అప్ప, బల్లి నీ బావ, బొమ్మ నీ అమ్మ, చీమ నీ చెల్లెలు’ ఇలా సాగే పిల్లల పాటలు ఆంగ్లంలో ‘నాన్సెన్స్‌ రైమ్స్‌’ పేరిట చాలా ప్రసిద్ధి. పిల్లల్లోని ఈ అభిరుచి వల్లే బాలల కథల్లో కాకిబావ, నక్కమామ లాంటి చిత్రమైన పాత్రలు పుట్టుకొచ్చాయి. 
వారికి ‘పుస్సే’ పులుసు
తల, గొంతు, తత్సంబంధమైన తదితర కండరాల కదలికలను బట్టి ధ్వని ఉచ్చారణ ఉంటుందని మనందరికీ తెలుసు. కండరాల స్వాధీనత, వెసులుబాటు శిశువు ఉచ్చారణను నిర్దేశిస్తుంది. ఆ స్వాధీనానికి బిడ్డకు కొంత వ్యవధానం అవసరం. అయినా ఈ లోపే శిశువుకి వస్తువు మీద ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కండరాలను సులభంగా కదిలించగలిగిన అక్షరాలనే బిడ్డ ముందుగా పలుకుతుంది. ర, డ లాంటి అక్షరాలు అంత సులభంగా లొంగవు. త, ప లాంటి అక్షరాలూ ఆరంభంలో పలకడం కొంచెం కష్టమే. కష్టమని ప్రయత్నం మానడం శిశువుల లక్షణం కాదు. ఒక అక్షరాన్ని పలకడంలోని ఇబ్బంది... దాని పక్క అక్షరాన్ని బట్టి ఉంటుంది. త, ప లు లాంటివి ఒంటిగా పలికే ఇబ్బందిని ‘అత్త... అప్ప’ అని ‘అ’ ముందు చేర్చడం ద్వారా పరిష్కరించుకోవడం ఇలాంటి ఒక పద్ధతి. అక్షరాలను మార్చడం, కొన్ని అక్షరాలను వదిలేయడం, కష్టమైన అక్షరాలకు బదులుగా తేలిక అక్షరాలు పలకడం ఇంకొన్ని పద్ధతులు. కొత్తపదం దొరికినప్పుడు పరిచయమున్న పాతపదానికి దాన్ని అనుసంధానించుకోవడం ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాడు శిశువు. రోకలి-లోకలి, తమలపాకు-తాంపాకు, పటికబెల్లం-కటికబెల్లం, పులుసు-పుస్సు, పెన్సిలు-పెస్సలు, పుస్తకం-పుత్తకం... ఇలా ఎన్ని పదాలనైనా గుర్తించవచ్చు.
      రెండేళ్లు నిండేవరకు శిశువుకు 20, 30 పదాలకు మించి రావు. మూడు నాలుగు ఏళ్లకు అత్యద్భుతమైన, వేగంతో నాలుగైదు వందల పదాల దాకా సాధిస్తారు పిల్లలు. ఒంటరిగా ఉండే పిల్లలకు పదాలు ఎక్కువ రావు. ఈడుకు మించిన వాళ్లతో జోడుకట్టే బాలల భాషాజ్ఞానం అసాధారణంగా ఉంటుంది. పరిస్థితులు, ఆరోగ్యం, ఆసక్తి, పరిశీలనా శక్తి... ఇలా భాషాభ్యాసానికి దోహదం చేసే ఉపకరణాల చిట్టా పెద్దదే.
పేర్లతో ప్రారంభించి...
అన్ని భాషాభాగాల్లోనూ నామవాచకాలను పిల్లలు ముందు గ్రహిస్తారని ఒక సాధారణ అభిప్రాయం. అభ్యాసం నామవాచకాలతోనే ప్రారంభమైనా శిశువుకి క్రియావాచకాల మీద ధ్యాస జాస్తి. పని చేయడం మీదే శిశువుకు సహజంగా ఉండే ఆసక్తి దీనికి కారణం. ఇతర భాషా పదాలనూ క్రియాపదాలుగా మార్చి పలకడం... అదో విచిత్ర పద విన్యాసం. ప్రతి పదానికి ఒక క్రియని జోడించే అలవాటు వల్ల ఆ పదాన్ని ఆ క్రియకు పర్యాయపదంగా ఉపయోగిస్తాడు శిశువు. మేడమీదకు తీసుకువెళ్లడానికి ‘మీద.. మీద’ అని సూచించడం దీనికి ఒక ఉదాహరణ. విరుద్ధ పదాలను సైతం ఒకే వాక్యంలో సమర్థంగా కూరి వినోదం అందించడం పిల్లల మరో తమాషా విద్వత్‌ లక్షణం. ఆడవాళ్లతో చాలాకాలం మెలిగిన బిడ్డ మొగవాళ్లతోనూ ‘ఇది ఇయ్యవే... ఇలా రావే’ అని మాట్లాడుతుంటే నవ్వు రాదా!
అల్పాక్షరాలతో అనల్పార్థాలు
పెద్ద పెద్ద వాక్యాలతో గాని పెద్దలు స్పష్టపరచలేని భావాన్ని ఒక చిన్న పదంతో స్పష్టంగా వెలిబుచ్చగల చిచ్చర పిడుగులు చిన్నారులు. అసలు సిసలు మినీ కవులన్నా తప్పు లేదు. ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపమనడానికి ‘జో... జో’ అని రెండక్షరాలతో సూచిస్తుందో బాలమేధావి. రెండు మూడు సంబంధం లేని విడి పదాలను జోడించి విచిత్రమైన వాక్యం తయారు చేయగలరు బాలలు. అభినయం తగ్గి మాటలు పెరగడం శిశువు వికాసదశ పరిణామం. వస్తువు, దాని ప్రత్యేక లక్షణం గుర్తుపట్టే విచక్షణ పెరిగే కొద్దీ పదాలను పొందిక చేసి వాక్యాలుగా ఉచ్చరించడం బిడ్డకు అలవాటవుతుంది.
      పసిపిల్లలకు ‘నేను’ అన్న భావం ఒక పట్టాన బుర్రకెక్కదు. అందరూ తనను ఎలా పిలుస్తారో తననూ తానూ అలాగే సంబోధించుకుంటుంది ఓ చిట్టి. ‘చిట్టికి పప్పులు కావాలి’ అంటే ‘నాకు పప్పులు కావాలి’ అని అర్థం అన్నమాట. ‘చిట్టి ఏడుస్తుంది... చూడూ’ అని అరుస్తుందంటే ‘నన్ను ఏడ్పించద్ద’ని అర్థించడమన్న మాట.
వీరతాళ్లు వేయాల్సిందే
‘వాన వెలిసింది’ అనడానికి ‘వాన పోయింది’ అని, ‘నూనె ఒలికింది’ అనడానికి ‘నూనె పారిపోయింది’ అని... ఇలా ఒక పదార్థ లక్షణాన్ని వేరొక పదార్థ లక్షణానికి అన్వయించి చిత్రమైన పదబంధాలను తయారు చేసే శక్తి పసిపిల్లలది. ఎంతకూ తన మాట వినిపించుకోని తల్లి మీద ‘నీకు చెవులు కనిపించవా?’ అని గయ్యిమంటూ లేస్తుందో పిల్లరాక్షసి. ఎంత అదిమి పట్టుకున్నా ఆ తల్లిపెదాలు నవ్వుతో విచ్చుకోకుండా ఉంటాయా? ‘అయ్యో... బంగారం లాంటి బలపం పారేశావే’ అని తండ్రి గద్దించడం గుర్తుంచుకున్న బాబు... బళ్లో ఉపాధ్యాయుడు ‘బంగారం చూశావా?’ అని అడిగినప్పుడు ‘చూశాను... బలపం లాగుంటుంది’ అనేస్తాడు ఠకీమని. ఎంత కోపిష్ఠి గురువైనా ఫక్కుమనకుండా ఉంటాడా? అల్లరి చేసే బిడ్డ ఒళ్లో ఇన్ని పప్పులు పోసి ‘ఈ పప్పులు తీసుకెళ్లి వీటితో ఆడుకో’ అని తల్లి గద్దిస్తే... బిడ్డా అంతే చురుగ్గా ‘పప్పుల్తో ఆడుకోం! పప్పు పెట్టి చిన్నితోటీ చింటూ తోటీ ఆడుకుంటాం’ అని తల్లి భాషను పెద్దఆరిందలా సరిదిద్దబోతే పెద్దవాళ్లు ఎంతసేపని పెదాలు బిగపట్టుకొని ఉంటారు? ఇలాంటి¨ మెట్లెన్నో ఎక్కిన తరువాతే ఏ బాలైనా ఉద్దండపిండంగా తయారయ్యేది. భాషాభ్యాసంలో పదకవితా పితామహుడు అన్నమయ్యకైనా దాటక తప్పని పసిదనపు చిలిపి దశలివన్నీ.


మీరు చదివితే... వాడు మాట్లాడేస్తాడు 
ఇది కమలా పండు! ఇదేమో ఆవు! అది మేక!
      మాటలు నేర్చుకునే దశలో ఉన్న మీ బుజ్జాయిలతో మీరింత ‘సంక్షిప్తంగా’ మాట్లాడుతున్నారా? అయితే... వారికి వేగంగా మాటలు రాకపోవచ్చు. పిల్లలకు ఏ ‘పదాన్ని’ పరిచయం చేయాలను కుంటున్నారో... ఆ పదాన్ని వాడుతూ దీర్ఘ వాక్యాల రూపంలో చెబితేనే చిన్నారులు తొందరగా మాటలు నేర్చుకుంటారట! స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయం చెబుతున్నారు. కమలా పండు ఎంత గుండ్రంగా ఉందో చూడు... లోపల ఎన్ని తొనలుంటాయో తెలుసా... ఇలా చెప్పాలన్న మాట! చిన్నారులు సొంతగా భావవ్యక్తీకరణ చేసే స్థాయికి రాకముందే వారి మెదడు పదాలను అర్థం చేసుకోగలదు. మీరు వాడే మాటలన్నింటినీ అది నిక్షిప్తం చేసుకుంటుంది. ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ మాటలను అది గ్రహించిందన్న దాని బట్టే బుజ్జాయిల ‘మాట’ వేగం ఆధారపడి ఉంటుంది. పిల్లాణ్ని ముందుకు కూర్చోబెట్టుకుని అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు ఏదో ఒక పుస్తకాన్నో, పత్రికనో చదివి వినిపిస్తుంటే  ఇంకా తొందరగా మాటలు వచ్చేస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం