తమిళనాడు రాష్ట్రం, తంజావూరు ప్రాంతంలో తెలుగు ప్రజల భాష, సంస్కృతి, కళలు తెలుసుకోవడానికి ఒక బృందంగా చెన్నై నుంచి బయల్దేరాం. నాతోపాటు ఈ బృందంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, పరిశోధకుడు డా.జి.వి.పూర్ణచంద్, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం సంచాలకులు డా.శ్రీపాద సుబ్రహ్మణ్యం, రచయిత్రి సుధారాణి తదితరులు ఉన్నారు. తమిళనాడులో ఉండే అన్ని (32) జిల్లాల్లోనూ తెలుగు వారున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, తిరువళ్లూరు, తిరుత్తణి, వేలూరు, కోయంబత్తూరు, తిరునల్వేలి, విరూద్‌నగర్, సేలం, తిరుచిరాపల్లి, మధురై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. మొత్తం 25 వేల గ్రామాల్లో మూడోవంతు అంటే 8 వేల గ్రామాల్లో తెలుగు వారున్నారు. వీరంతా ఇంట్లో తెలుగు మాట్లాడతారు. బయట తమిళం వినియోగిస్తారు. వీళ్లకి తెలుగు ప్రాంతాలతో సంపర్కం తగ్గిపోవడం, తమిళం, కన్నడం, మలయాళ ప్రాంత సరిహద్దుల్లో ఉండటంతో పలుకుపై ఆయా భాషల ప్రభావంపడటం సహజం. తెలుగునాట కనబడకుండా తప్పిపోయిన చక్కని తెలుగు పదాలూ, కళలూ తమిళనాట పదిలంగా ఉన్నాయి.
చెన్నై నుంచి సుమారు మూడు వందల కిలోమీటర్లు పైచిలుకు ప్రయాణిస్తే తంజావూరు పొలిమేరల్లో తమిళ విశ్వవిద్యాలయం ఉంది. తమిళభాషను పలువిధాలుగా అభివృద్ధి చేయాలని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ దీనిని 1981లో స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం సువిశాల ప్రాంతంలో, మంచి భవనాలతో ఆకర్షణీయంగా, ఎనిమిది వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒక భాష కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు మన దేశంలో దీంతోనే మొదలయింది. ఈ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1985లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అయినా మన తెలుగు విశ్వవిద్యాలయం ఇంకా సొంత భవనాల్లోకి తరలి వెళ్లలేదు!
తమిళ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా।। ఎం.తిరుమలై, రిజిస్ట్రార్ డా।। ఎస్.గణేశన్. వీళ్లిద్దరూ తెలుగు కుటుంబాల వాళ్లే. తమిళ విశ్వవిద్యాలయ గ్రంథాలయం పార్లమెంటు భవనాన్ని పోలినట్లు గంభీరంగా వెలుగుతోంది. చదువుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లున్నాయి. ఎన్నో తెలుగు పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా పుస్తకాలు బహూకరిస్తే వారి పేరిట వారిచ్చిన పుస్తకాలు ఒకేచోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారు. 1931లో మన్నార్గుడి ప్రాంతంలో గ్రంథాలయ శాస్త్రవేత్త ఎస్.ఆర్.రంగనాథన్ సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దాని కోసం జట్కా లాంటి దానిని వినియోగించారు. ఆ వాహనాన్ని ఇక్కడ భద్రపరిచారు..
తమిళ విశ్వవిద్యాలయం 25 శాఖలతో అలరారుతోంది. శిల్పం, సంగీతం, నాటకం విభాగాలు కళల శాఖలో ఉన్నాయి. తాళపత్రాలు, రాతప్రతులు అనే విభాగాలే కాకుండా ప్రాచీన లేఖనాలు (ఎపిగ్రఫి), పురావస్తుశాస్త్రం (ఆర్కియాలజీ) ఒక శాఖగా, సముద్ర వర్తక వ్యాపారాల చరిత్ర (మారిటైమ్ హిస్టరీ), సముద్ర పురావస్తు శాస్త్రం (మెరైన్ ఆర్కియాలజి) మరో శాఖగా ఉంది. తమిళభాష అభివృద్ధి విభాగంలో విదేశాల్లో తమిళం, అనువాదం, నిఘంటువులు, సామాజిక శాస్త్రాలు, సైంటిఫిక్ తమిళ, తమిళ అభివృద్ధి అనే అయిదు శాఖలు అలరారుతున్నాయి. తమిళనాడులో మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ అనువాద విభాగం లేదని ఉపకులపతి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సర్వస్వం 19 సంపుటాలు తమిళంలో వెలువడ్డాయి. వీటితోపాటు సామాజిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం 15 సంపుటాలు ప్రచురించింది తమిళ విశ్వవిద్యాలయం. ఇటువంటి ప్రయత్నం తెలుగులో ఇంత సమగ్రంగా జరుగలేదు. తమిళ - తెలుగు అధ్యయనం కూడా జరుగుతోంది. అయిదు కోట్ల మూలధనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వగలిగితే తెలుగు - తమిళ అధ్యయన శాఖను, పరిశోధనను ప్రారంభించడానికి సిద్ధమని ఉపకులపతి పేర్కొన్నారు. ప్రస్తుతం డా।। సావిత్రి తెలుగు అధ్యాపకులుగా ఉంటూ తెలుగు - తమిళ తులనాత్మక పరిశోధనలు చేయిస్తున్నారు.
ఇక్కడ సైంటిఫిక్ తమిళ విభాగంలో చేస్తున్న కృషి విలక్షణం. 9, 10 శతాబ్దాలకు చెందిన సంగం సాహిత్యానికి సంబంధించి ఈ విభాగంలో పరిశోధన జరుగుతోందని ఆ శాఖ అధ్యక్షులు డా।। త్యాగరాజన్ వివరించారు. ఇప్పటి వరకూ పరిశోధన జరిగిన విషయాలపై పీహెచ్డీ గ్రంథాలు వెలువడ్డాయని ఆయన పేర్కొన్నారు. జనరంజక విజ్ఞాన రచనకు సంబంధించి కోర్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నం తెలుగులోనూ జరిగితే బాగుంటుంది.
తమిళభాష కోసం ఇక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. జిల్లా స్థాయిలో ఒక గెజిటెడ్ స్థాయి అధికారి తమిళభాష అమలు ఎలా ఉందో పరిశీలిస్తారు. కాగితాలు ఆయన దగ్గరకు రావడం కాదు, ఆయనే అన్ని కార్యాలయాలూ సందర్శిస్తారు. అవసరమైన తమిళ సమానార్థక పదాలు సూచిస్తారు. ఏటా మెరుగైన రీతిలో తమిళం వాడిన వారికి ప్రోత్సాహకాలిస్తారు. తమిళ భాషాభివృద్ధి, సంస్కృతి విభాగం ద్వారా ఈ కృషి జరుగుతోంది. ఇలాంటి విభాగం, మంత్రిత్వ శాఖ మనకు చాలా అవసరం.
తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయం తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి, చారిత్రక నేపథ్యంలో సాహిత్యం ద్వారా సమాజాన్ని, సామాజిక పరిణామాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి పూజనీయమైంది. దీన్ని క్రీ.శ. 1532-1675 మధ్యకాలంలో తంజావూరు ప్రాంతాన్ని పాలించిన నాయక రాజకుటుంబీకులు తయారు చేసుకున్నారు. ఇక్కడ గ్రంథాలయమే కాకుండా మ్యూజియం కూడా ఉంది. 1798-1832 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మరాఠా నాయకుడు శరభోజి-2 ఈ గ్రంథాలయాన్ని బాగా అభివృద్ధి చేశాడు. ఆయనకు భారతీయ భాషలే కాదు ఫ్రెంచి, లాటిన్, ఇటాలియన్, ఇంగ్లిషుల్లోనూ ప్రవేశం ఉంది. వివిధ వైద్య విధానాల మీద అవగాహనా ఉంది. స్వయంగా నేత్ర వైద్యుడు. వాటికి సంబంధించిన పరికరాలు తంజావూరు సరస్వతీ మహల్ మ్యూజియంలో చూడవచ్చు. ఇతను మంచి సంస్కారి. అందువల్లనే ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్న తన ప్రతిమను చేయించుకున్నారు. రాయల్ ఏషియాటిక్ సొసైటీలో ఏకైక భారతీయ సభ్యుడైన వ్యక్తి కూడా ఈయనే.
మరాఠి మాతృభాషగా కలిగిన రాజు దక్షిణాదిలో రాజ్యం చేస్తూ దక్షిణాది భాషలను గౌరవించిన సలక్షణుడు శరభోజి. ఈయన వారసులు కూడా గ్రంథాలయాభివృద్ధికి పాటుపడ్డారు. ఈయన సేవలకు గుర్తింపుగా సరస్వతీ మహల్‌కు శరభోజి పేరును కలిపారు.
ఇందులో తమిళం, సంస్కృతం, ఇంగ్లిషు, తెలుగు, మరాఠి, హిందీ భాషల పుస్తకాలు, విలువైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా గుడ్డలో కట్టి భద్రపరిచారు. తెలుగుకు సంబంధించి 822 మూటలు ఉన్నట్లు గ్రంథాలయం గైడ్‌బుక్ వల్ల తెలుస్తోంది. వీటిలో తాళపత్ర గ్రంథాలు, కాగితం గ్రంథాలు రెండువేలదాకా ఉండవచ్చు. ఆముక్తమాల్యద వంటి తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి. ప్రాచీన తాళపత్రాలను భద్రపర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న డా।। డి.రవి తప్ప గ్రంథాలయంలో తెలుగు తెలిసిన అధికారిగానీ, పండితుడు గానీ లేరు. ఈయన కొందరు పండితులతో కలసి కొన్ని గ్రంథాలు పరిష్కరించారు. సరస్వతీ మహల్ గ్రంథాలయానికి జిల్లా కలెక్టర్ డైరెక్టర్. అయితే, దీనికి తెలుగు తెలిసిన పండిత సిబ్బంది తక్షణ అవసరం. ఆర్థిక వనరుల కన్నా సిబ్బందిలేమే పెద్ద ప్రతిబంధకం. చల్లా రాధాకృష్ణశర్మ తంజావూరులో ఉన్నప్పుడు తెలుగు వారికి సరస్వతి మహల్ గురించీ, అందులోని అపురూప గ్రంథాల గురించీ అప్పుడప్పుడు తెలిసేది. నేడు అలాంటివారు లేకపోవడంతో ఇటీవలకాలంలో తమిళనాడు నుంచి తెలుగు సంగతులు తెలియడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కైవ్స్‌లో ఇక్కడి 600 తాళపత్ర గ్రంథాల మైక్రోఫిల్మ్‌లు భద్రపరచారని చెబుతున్నారు. ఏ గ్రంథాలు తీశారు, ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలు పూర్తిగా వెలుగులోకి రావాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా కొన్ని గ్రంథాలను ప్రచురించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలు ప్రస్తుతం అంత సులువుగా దొరకడం లేదు. ఈ సమాచారం ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకుని మున్ముందు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. దీనికి తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రాచ్య లిఖిత భాండాగారం వంటి సంస్థలు చొరవ చూపాలి. సరస్వతీ మహల్‌కు సంబంధించిన ప్రచురణలను పరిశీలిస్తే రచయితగా డా।। ఎం.రాజారాం అనే పేరు కనబడుతుంది. ఈయన తెలుగు కుటుంబాలకు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం తమిళ సాంస్కృతిక శాఖకు నేతృత్వం వహిస్తున్నారు. ఇలాంటి వారిని సంప్రదిస్తే, ఇక్కడి తెలుగుభాషా విశేషాలు తెలియవచ్చు.
తంజావూరు విశ్వవిద్యాలయానికి చేరువలో పిళ్లయార్‌పట్టి అనే గ్రామం ఉంది. ఇక్కడ అన్ని ఇళ్లలో తెలుగు మాట్లాడతారు. తెలుగు వినబడితే చాలా సంతోషిస్తారు. ఈ గ్రామ సర్పంచి వి.ఎస్.ఆనందన్. ఇది వరకు గ్రామ సర్పంచిగా చేసిన వెంకట పెరుమాళ్ చాలా విషయాలు ప్రస్తావిస్తూ- తెలుగు నేర్చుకోవడానికి సదుపాయాలు లేక ఎంత ఇబ్బందిపడ్డారో వివరించారు. నేర్పించే వెసులుబాటు కల్పిస్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఆ గ్రామస్థులు టీవీ ఛానళ్లలో తెలుగు కార్యక్రమాలు చూస్తామన్నారు. పిళ్లయార్‌పట్టి వంటి గ్రామాలను సంరక్షించుకోవడం తెలుగు వారి బాధ్యత.
పిళ్లయార్పట్టికి దగ్గరలో ఉన్న ఊరు మేలత్తూరు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహ జయంతికి ఒక వారం పాటు భాగవత మేళాలు ప్రదర్శిస్తారు. మేలత్తూరు వేెంకట్రామశాస్త్రి రచించిన యక్షగానాలు ప్రహ్లాద చరిత్రం, రుక్మిణి కల్యాణం, సీతా కల్యాణం, హరిహర లీలా విలాసం మొదలైన వాటిని ప్రదర్శిస్తారు. ఈ మేళాలో కేవలం మగవారు మాత్రమే పాల్గొంటారు. ఈ నాటకాలన్నీ తెలుగులోనే ఉన్నా వీరికి తెలుగు రాయడం, చదవడం రాదు. తమిళ లిపిలో రాసుకుని నేర్చుకుంటారు కనుక ఉచ్చారణలో తమిళ ప్రభావం కనిపిస్తుంది. తెలుగు ఉచ్చారణ చెప్పేవారు అందుబాటులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహాలింగం బృందం, ఎస్.కుమార్ బృందం విడివిడిగా ప్రదర్శనలు చేయడం ఆనవాయితి. ఊళ్లో ఉండే వరదరాజస్వామి గుడిలో నమస్కారంతో ప్రదర్శన ప్రారంభించి, చివరకి అక్కడే మంగళం పాడతారు. ఈ భాగవత మేళాల వీడియో, ఆడియో రూపాలను భద్రపర్చడం చాలా అవసరం. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలి.
కర్ణాటక సంగీత మేరుపర్వతం త్యాగరాజస్వామి సమాధి తిరువయ్యూరులో ఉంది. త్యాగరాజు సమాధితోపాటు ఆయన గురువు శొంఠి వెంకటరమణయ్య, ఇతర శిష్యుల సమాధులు ఇక్కడే ఉన్నాయి. త్యాగయ్య సమాధిని నిర్మించిన బెంగుళూరు నాగరత్నమ్మ సమాధి కొంత దూరంలో, త్యాగయ్య సమాధికి ఎదురుగా ఉంది. త్యాగయ్య అయిదో తరం వారు ఇక్కడ కాపురమున్నారు. ఇవన్నీ కూడా కావేరి నది ఒడ్డున ఉన్నాయి. శ్రీరంగం తిరుచ్చిరాపల్లి సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయం చాలా పెద్ద దేవాలయం. కీర్తనలు రాసిన వెంకటాద్రిస్వామి సమాధి ఇక్కడ ఉంది.
తంజావూరు, మధుర, తిరుచ్చిరాపల్లి ఒకప్పుడు గొప్పగా వెలిగిన తెలుగు ప్రాంతాలు. నేటికీ ఇవి కళలకూ, కర్ణాటక సంగీతానికి కాణాచి. తమిళనాట తెలుగు సంస్కృతి కాపాడుతున్న ప్రాంతాల్ని సందర్శించడం అక్కడి వారికి పెద్ద ఊరట, తెలుగువారికి మంచి స్ఫూర్తి. మన సోదర తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలనుంచి భాషా సంపదను ఒడిసి పట్టుకోవడం తక్షణ కర్తవ్యం.