రాజు వెడలె... రవి తేజములడరగ

  • 1773 Views
  • 3Likes
  • Like
  • Article Share

    మల్లెకేడి రామోజి

  • తెలుగు పండితులు
  • వెల్టూరు, మహబూబ్‌నగర్‌
  • 9491493596
మల్లెకేడి రామోజి

జామురాతిరివేళ... ఆరుబయట... బల్లలతో నిర్మించిన వేదికమీద ఆముదపు దీపాల వెలుగులో ఆట మొదలయ్యేది. భాగవతార్‌ మధురమైన గాత్రంతో పాడుతూంటే... అభినయించేవారు ఒకవైపు, సంగీత వాయిద్యాలు వాయించే వారి నేపథ్యం మరోవైపు, పరిసర ప్రాంతాలనుంచి తరలివచ్చిన ప్రేక్షకులతో ఉర్రూతలూగుతూ తెల్లవారు జామువరకు ఉత్సాహంగా సాగేదా ప్రక్రియ. తెలుగునాడా... కన్నడ రాజ్యమా ఎక్కడ పుట్టిందన్న సందేహం పక్కన పెడితే, గత అయిదారు వందల ఏళ్లుగా తెలుగు వారిని తన విన్యాసాలతో ఆహ్లాదపరిచింది. అదే యక్షగానం. సాహిత్య సంగీత నాట్య ప్రధానమైన సమాహారం.
ప్పుడెప్పుడో 12వ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో దొమ్మరాటలు, తోలు బొమ్మలాటలు, బయలాటలు, దాసర్ల చిందులు, గంతుల కేళికలు, వెడ్డంగమాటలు అంటూ కొన్ని దేశీరీతులను పేర్కొన్నాడు. వాటిని పుణ్యక్షేత్రాల్లోనో, గ్రామ మైదానాల్లోనో, నగర వీధుల్లోనో, రాజాంతఃపురాల్లోనో, ఉత్సవాల్లోనో ప్రదర్శించేవారు. యక్షగానానికి ఇవి మాతృకలు.
      యక్షగాన రచన తమిళ, కన్నడ భాషలకంటే తెలుగులో మొదట వెలువడ్డాయని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం.  క్రీ.శ. 14వ శతాబ్దిలోనే తెలుగులో ప్రారంభమయిందని విమర్శకులు శిష్ట్లా రామకృష్ణశాస్త్రి నిరూపించారు. ఈ యక్షగాన ప్రక్రియ 14వ శతాబ్ది నుంచి పరిణామం చెందుతూ 17వ శతాబ్ది నాటికి పూర్ణరూపాన్ని సంతరించుకుంది. యక్షగానం తెలుగునాడులోని మూడు ప్రాంతాలతోపాటు, తమిళనాడులోని తంజావూరు, కర్ణాటకలోని మైసూరు వరకు విస్తరించి అక్కడి రాజుల పోషణలో గౌరవాన్నందుకొంది.
జక్కుల గానమే యక్షగానం
తెలుగులో ‘యక్షగాన’ పదాన్ని మొదట ప్రయోగించింది శ్రీనాథుడు. కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి అని భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. వినుకొండ వల్లభుడి ‘క్రీడాభిరామం’లోనూ జక్కుల పురంధ్రి ప్రస్తావన ఉంది. ఆ జక్కుల పురంధ్రుల గాన కళాభిమానాలే యక్షగానాలని పండితుల వాదన. వీటిని ప్రధాన వృత్తిగా స్వీకరించి ప్రదర్శించేవారే యక్షులు. యక్షులే కాలక్రమంలో జక్కులు అయ్యారన్నది మరికొందరి వాదన.  
      తెలుగులో మొట్టమొదటి యక్షగానాల్లో కొంత వచన భాగం, అక్కడక్కడా కథ నడిచేందుకు తోడ్పడే విధంగా చిన్న చిన్న సంధి వచనాల వంటివి గద్యంలో ఉంటాయి. ప్రోలుగంటి చెన్నశౌరి రాసిన యక్షగానం ‘సౌభరి చరిత్రము’ ప్రస్తుతం అలభ్యం. లభిస్తున్న వాటిని బట్టి చూస్తే కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం (16వ శతాబ్ది) తొలి తెలుగు సంపూర్ణ యక్షగానం. రాముడు వాలిని చంపి కిష్కింధకు సుగ్రీవుని రాజును చేయడం ఇందులో ప్రధాన కథ. ఇందులో ఆఖ్యానశైలికంటే సంవాదశైలికే ప్రాధాన్యమెక్కువ. ఇదే శతాబ్దంలో వేంకటాద్రి- వాసంతికా పరిణయం, బాలపాపాంబ- అక్కమహాదేవి చరిత్ర, కంకంటి పాపరాజు- విష్ణుమాయా విలాసం, టేకుమళ్ల రంగశాయి- జానకీ పరిణయం, గోగులపాటి కూర్మనాథుడి మృత్యుంజయ విలాసం వెలువడ్డాయి. బాల పాపాంబ తొలి తెలుగు యక్షగాన కవయిత్రి.
తంజావూరులో తెలుగు పతాక
పదహారో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. తెలుగునేల నుంచి ఎందరో సాహితీవేత్తలు తమిళ, కన్నడ ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఫలితంగా తంజావూరు, మధురై, మైసూరులలో వెలసిన నాయక రాజ్యాల్లో తెలుగుతల్లి తలెత్తుకొని నిలిచింది. అయితే వీటిలో తంజావూరునుంచే ఎక్కువ సాహిత్యం వెలువడింది. యక్షగాన ప్రక్రియ మరింత పరిణామం చెందుతూ 17వ శతాబ్దంలో వీధి నాటకాల రూపంలోకి మార్పు చెందింది. తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుడు ‘రుక్మిణీకృష్ణ వివాహం’ యక్షగానాన్ని రచించాడు. ఇది అలభ్యం. రఘునాథుడి కుమారుడు విజయ రాఘవుడు యక్షగాన ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేశాడు. కాళీయమర్దనం, విప్రనారాయణ మొదలైన యక్షగానాలు రాశాడు. యక్షగానాల్లో భరతవాక్యాన్ని (నాటకం చివర ఉండే మంగళవాక్యం) ప్రవేశపెట్టాడు. ఇతని ఆస్థాన కవయిత్రి రంగాజమ్మ ‘మన్నారుదాస విలాసం’, మన్నారు దేవుడు ‘హేమాబ్జనాయికా పరిణయం’ అనే యక్షగానాలు రచించారు.
       తంజావూరును ఏలిన మరాఠా రాజు శహాజీ ‘కిరాత విలాసం, గంగా పార్వతీ సంవాదం, ద్రౌపదీ కల్యాణం’ మొదలైన యక్షగానాలు రచించాడు. గణపతి ప్రార్థన, గణపతి పాత్ర, అంక విభజన ప్రవేశపెట్టాడు. యక్షగానాలు ప్రదర్శన యోగ్యతను ఎక్కువగా సంతరించుకున్నది ఈ కాలంలోనే. యక్షగానాలు వీధి నాటక గుణాలను ఎక్కువగా స్వీకరించడంతో వీధినాటకాలను యక్షగానాలని పేర్కొన్నారు. అయితే ఇవి రెండూ వేర్వేరు ప్రక్రియలు. వీధి భాగవతాలు కూడా యక్షగానాల వంటివే. కిరాతార్జునీయం, పార్వతీ పరిణయం, గంగాగౌరీ విలాసం మొదలైన యక్షగానాలను 17వ శతాబ్దంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శించి, వ్యాప్తిలోకి తెచ్చారు.
      17వ శతాబ్దంలో మైసూరు పాలకుడు కంఠీరవ నరసరాజు తెలుగు, తమిళ, కన్నడ, ప్రాకృత భాషలలో యక్షగానాలు రాశాడు. 1712లో అన్నదానం వేంకటాంబ అనే కవయిత్రి స్త్రీలు పాడుకోవడానికి అనుకూలంగా రామాయణ బాలకాండాన్ని యక్షగానంగా మలచింది. పుదుక్కోట కోటిరాయ రఘునాథ తొండమాన్‌ ఆస్థానకవి నుదురుపాటి వెంకన ‘పార్వతీ కళ్యాణము’ రచించాడు. 18వ శతాబ్దంలో తంజావూరు సమీపంలోని మేలట్టూరుకు చెందిన వేంకటరామశాస్త్రి ‘ప్రహ్లాద చరిత్రము, రుక్మాంగద చరిత్రము, ఉషాపరిణయము, సీతాకల్యాణము’ మొదలైన యక్షగానాలు రచించాడు. మేలట్టూరు భాగవత మేళాలకు నాంది పలికిందీ ఈయనే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మే నెలలో ఇక్కడ భాగవత మేళా నిర్వహిస్తారు. ఇది అయిదు రోజుల ప్రదర్శన. త్యాగరాజ స్వామి ‘నౌకావిజయము’ అనే యక్షగానం రచించాడు.
తెలంగానం...
18వ శతాబ్ది ఉత్తరార్ధంలో తెలంగాణలో అనేక యక్షగానాలు వెలువడ్డాయి. శేషాచలకవి ధర్మపురి రామాయణం, రాపాక శ్రీరామకవి అధ్యాత్మ రామాయణాన్ని యక్షగాన రూపంలో రాశారు. తెలంగాణలోని యక్షగాన రచయితల్లో ప్రసిద్ధుడు చెర్విరాల భాగయ్య (1950). ఈయన 30కి పైగా యక్షగానాలు రచించాడు. 18వ శతాబ్దంలో వచ్చిన యక్షగానాల్లో వఝల నరసింహకవి ‘దుష్యంత చరిత్రము’, అకలంక శ్రీకృష్ణమాచార్యుని ‘కృష్ణవిలాసము’, నారాయణకవి ‘పారిజాత నాటకము’ ప్రసిద్ధం. కానూరి వీరభద్రకవి, తిరునగరు పాపకవి, శేషభట్టురు కృష్ణమాచార్యుడు తదితరులు ఈ ప్రాంతపు యక్షగాన కవులు.
వైవిధ్య భరితం
యక్షగానాల్లో తాళ ప్రధానమైన రేకు, రగడలు, గాన ప్రధానమైన ద్విపదలు, ఏలలు, అర్ధచంద్రికలు, ధవళ శోభనాలు, వచనం, పద్యం, శ్లోకాలు, చూర్ణికలు, అష్టకాలు, దండకాలు ప్రముఖంగా కనిపిస్తాయి. కావ్యానికి ఎన్ని హంగులు ఉండాలో అన్నీ యక్షగానంలో ఉంటాయి. అంతేకాదు కొరవంజి(ఎరుకలసాని వేషం), వీధినాటకం, తోలు బొమ్మలాట, హరికథ ఇలా వివిధ సాహిత్య ప్రక్రియలతో యక్షగానానికి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు... యక్షగానాల్లో పౌరాణికాలు, స్థలపురాణాలు, చారిత్రకాలు, సాంఘికాలు, జానపద గాథలు మొదలైన వాటితో వస్తు వైవిధ్యంతో అలరారాయి. 
      ఇవి శృంగార రస ప్రధానమైనవైనా, ఇతర రసాలు అంగి రసాలుగా ఉండి రసాస్వాదన కలిగిస్తాయి. యక్షగానం పుట్టుకతో జానపదుల దేశీ మార్గానికి చెందింది. పరిణామంలో మార్గ పద్ధతికి మళ్లింది. దీన్ని పామరుల ప్రక్రియ అనుకుంటారు కానీ, యక్షగానం రాయాలంటే విద్వత్తు ఒక్కటే సరిపోదు. సంగీతం, నృత్యాల్లో కూడా ప్రవేశం ఉండాలి. 
రాజువెడలె రవితేజములడరగ...
ఏ యక్షగానమైనా దైవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆ ప్రార్థనకూడా ప్రదర్శించే యక్షగానానికి సంబంధించిందే అయి ఉంటుంది. ఆ తరువాత హరిహరులను, జగన్మాతను ప్రార్థించాక సూత్రధారి వేదిక మీదికి ప్రవేశిస్తాడు. యక్షగానంలోని అంశాన్ని, పాత్రలను పరిచయం చేస్తాడు. చివర్లో ఫలశ్రుతిని కూడా వినిపిస్తాడు. కథను అనుసరించి వివిధ పాత్రల ప్రవేశాన్ని ఇతడే సూచిస్తాడు. ఉదాహరణకు రాజు పాత్ర వేదికమీదికి ప్రవేశిస్తుంటే... ‘రాజువెడలె రవి తేజములడరగ/ కుడి యెడమల డాల్‌ కత్తులు మెఱయగ’ అని ఆలపిస్తారు. వేదికను అలంకరించిన ఆయా పాత్రలు కథాంశాలను రాగయుక్తంగా ఆలపిస్తాయి. మధ్యమధ్యలో సూత్రధారి చూసేవారికి ప్రధాన కథనుంచి దృష్టి మళ్లకుండా సంధివచనాలు పలుకుతాడు. 
      సూత్రధారి కాకుండా యక్షగానంలో సాధారణంగా వచ్చే ఇతర పాత్రలు... మాధవి- సూత్రధారిలానే కథా సంధానం చేస్తాడు. సుంకరి కొండడు, సింగి సింగడు- అహోబల నారసింహుడి వారసులుగా చెబుతారు, కటికము- ఓ రాజోద్యోగి, మంత్రసాని- శ్రీకృష్ణుడు, ప్రహ్లాదుడు పాత్రల జనన సమయంలో పురుడుపోసేందుకు ప్రవేశపెట్టిన పాత్ర. 
      యక్షగానాల్లో ప్రజల విశ్వాసాలు, కలలు, శకునాలు, పూజలు, అప్పగింతలు, మతం, మంత్రాలు ఇలా సమకాలీన సామాజికాంశాలు ఎన్నో కనిపిస్తాయి. 
ఓ వనితా! ఈడకి వింతవారు రారాదమ్మ
పెనగకు పిలవని పేరంటమునకు
కినిసి రావద్దమ్మ కిసరి సోకుతుంది
కనుబాటు తాకెనమ్మ కడకు పోవమ్మ
నిన్న దృష్టి తాకెనేమో చన్నంటకుండగాను
చిన్ని కృష్ణునకొక సిద్ధుని చేత
కన్నెరో రచ్చరేకు కట్టించితిమమ్మ మేము

ఇది విజయ రాఘవుడు రచించిన ‘పూతనాహరణం’ యక్షగానంలోది. బాల కృష్ణుడికి విషపు పాలివ్వడానికి వచ్చిన పూతనను చూసి గోపస్త్రీలు అంటున్న సందర్భంలోనిది. ఇందులో మా పిల్లలకు కిసరు సోకుతుంది. పిలవని పేరంటానికి నీలాంటి వింత రూపులు రావద్దు. దిష్టి తాకుతుంది దూరంగా వెళ్లు అంటారు. ఇంతకుముందే కిట్టయ్యకు దిష్టి తాకినట్లుంది. పాలు తాగకపోతే నిన్ననే ఓ సిద్ధుడు రక్షరేకు కట్టాడంటారు. 
      ఇందులో కిసరు సోకడం అంటే అంటుగాలి సోకడమని అర్థం. దిష్టి, రక్షరేకు లాంటివి అప్పటి నమ్మకాలను తేటతెల్లం చేస్తాయి. పైగా ఇందులో పిలవని పేరంటం అనే జాతీయాన్ని ప్రయోగించడం విశేషం.
      యక్షగానాలు తెలుగులో కొత్త ప్రయోగాలకు తెరతీశాయి. ఆయిత్తారం/ జన్నెవారం (ఆదివారం), ఉరాటం (ఉరితాడు), తిరువళిక (దేవునికి పెట్టిన దీపం), గవిణేరు (గవర్నర్‌), డీడిక్కిసలాడు (ఢీకొట్టు)... పదాలు; దినరోజులు, ఇష్టవేలుపు, రావణరంకు, వీరమద్దెల లాంటి వైరిసమాసాలు; జూటుతనము (మోసం), ఖడేరావు (ఆగు), తమాము (పూర్తిగా) మొదలైన అన్యదేశ్యాలు; ఇల్లుబంగారాయెను, పోతుపేరంటాల్లాంటి జాతీయాలు; అచ్చుబొడిచి నిన్నాబోతనవలె, తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లులాంటి సామెతలు ప్రయోగించారు. 
      తెలుస్తున్నంత వరకు తెలుగులో 800 యక్షగానాలు వెలువడ్డా లభ్యమైనవి 500. యక్షగాన వాఙ్మయంపై పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, ఆచార్య ఎస్వీ జోగారావు, బిరుదురాజు రామరాజు, ఆర్వీఎస్‌ సుందరం మొదలైనవారు పరిశోధనలు చేశారు. తెలుగు భాషా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ద్రావిడ దేశమంతటా విస్తరింపజేసిన ఘనత యక్షగానానిదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం