‘ముగ్గు’లొలికే సంస్కృతి

  • 205 Views
  • 0Likes
  • Like
  • Article Share

దిక్చక్రంపై సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పరుగు తీసేందుకు సన్నద్ధమయ్యేవేళ... లేలేత కిరణాలు వాలుగా మేఘాలమధ్య దోబూచులాడుతూ తూర్పు ఆకాశాన్ని నారింజ వర్ణ రంజితం చేసేవేళ... కువకువల ప్రభాతభేరితో పక్షులు జగతికి మేల్కొలుపు గీతం పాడేవేళ... కళ్లాపి చల్లి పచ్చగా ఉన్న ఇంటి ముంగిళ్లలో కొలువుదీరిన అందమైన రంగవల్లులతో మన పల్లెలు ఎంతో ముచ్చటగొలుపుతాయి.
ఆసేతుహిమాచలం అదే అందం
ముగ్గులు వేయడం జానపదుల జీవన విధానం నుంచి రూపుదిద్దుకున్న కళ. ఆదిమ మానవులు సంచార దశ దాటి స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్న దశలో తమ నివాసాలను అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ముగ్గులు ఆవిర్భవించి ఉంటాయి. ముగ్గులను తమిళంలో కోలం, రాజస్థాన్‌లో మాండినా, ఉత్తరప్రదేశ్‌లో చౌక్‌పూరణ్, బీహార్‌లో అరిపణ, బెంగాల్‌లో అల్పన, మహారాష్ట్రలో రంగోలీ, కర్ణాటకలో రంగవల్లి అని పిలుస్తారు. ఎన్ని పేర్లతో పిలిచినా ఇవి దేశమంతటా ప్రభాత వేళలో ఇంటి ముంగిట కొలువు దీరి ముచ్చట గొలుపుతాయి. రాజస్థాన్‌లో మాండనా మాత్రం ఇంటి గోడలపై వేసే ముగ్గులు. 
పొయ్యి వెలగాలంటే...
ఇంటి ముంగిట పేడతో కళ్లాపి చల్లి ముగ్గు పెట్టడం శుభ సంకేతం. ముగ్గు వేయడం సృజనాత్మకతకు నిదర్శనం. ఇది స్త్రీలకే సొంతం. ముగ్గుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. చుక్కల ముగ్గు, మెలిక ముగ్గు, గీతల ముగ్గు...ఇలా! ముగ్గులు వేసేందుకు ప్రత్యేకంగా ధనుర్మాసం ఉంది. ఈ ్జమాసంలోనే సంక్రాంతి వస్తుంది. ఈ సమయంలో పోటీలు పడి ముగ్గులు వేస్తారు. వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యి వెలిగించడం నేటికీ పల్లెల్లో ఉన్న ఆచారం. ఎందరో కవులు తమ కావ్యాల్లో ముగ్గులను గురించి వర్ణించారు.
శ్రీమహాలక్ష్మికి ఆహ్వానం
సున్నపురాయిని మెత్తగా చూర్ణం చేసి ముగ్గుపొడిని తయారు చేస్తారు. తెల్లగా ఉండే ఆ పొడి శాంతికీ, స్వచ్ఛతకూ, శుభానికీ సంకేతం. కొంతమంది ఇందులో బియ్యపు పిండిని కలుపుతారు. బియ్యపు పిండి చీమలకు, కీటకాలకు ఆహారంగా  ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొద్దున, సాయంత్రమూ ముగ్గులు వేస్తారు. ఉదయం వేసే ముగ్గుల్లో అడ్డుగీతలు ఉండవు. పొడుగ్గా గీతలు గీసి చుక్కల ముగ్గును వాటి మధ్య చక్కగా తీర్చిదిద్దుతారు. ఉషోదయాన లక్ష్మీదేవిని తమ ఇంటిలోకి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నట్లుగా ఈ గీతలు ఉంటాయి. ఆ ముగ్గును చక్కగా తీర్చిదిద్ది, వాకిలి పరిశుభ్రంగా ఉంచిన ఇల్లాలి పనితనానికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుం దన్నది ఓ నమ్మకం. సంధ్యవేళ వేసే ముగ్గులో అడ్డుగీతలుంటాయి. తమ ఇంట ప్రవేశించిన లక్ష్మి అడ్డంగా ఉన్న గీతలు దాటి వెళ్లదన్న విశ్వాసం స్త్రీలది.
ఆరోగ్యకరం... ఆచారపూర్వకం
ఆరోగ్య రీత్యా కూడా ముగ్గు వేయడం ప్రాధాన్యత కలిగిందే. సూక్ష్మక్రిములు, కీటకాలు సున్నపు ఘాటుకు నశిస్తాయి. ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లడం వెనుక శాస్త్రీయత దాగుంది. ఆవుపేడ క్రిమి సంహారిణి. పెందలకడనే నిద్ర లేచి వాకిలి ఊడవడం, కళ్లాపి చల్లడం, ముగ్గు వేయడం స్త్రీలకు మంచి వ్యాయామంగా ఉంటాయి. రకరకాల ముగ్గులు వేయడం వల్ల సృజనాత్మకశక్తి పెరుగుతుంది. 
 ప్రతీ రోజు ఇంటిముందు చిన్నముగ్గు పెట్టినా, ధనుర్మాసంలో(డిసెంబరు 14 నుంచి జనవరి 14వరకు) పెద్ద పెద్దముగ్గులు వేస్తారు. వీటిని రంగులతో అలంకరిస్తారు కనుక రంగవల్లులయ్యాయి. రథసప్తమి నాడు రథం ముగ్గు వేస్తారు. ఇది సూర్య గమనానికి సూచిక. కృష్ణాష్టమి సందర్భంగా బాలకృష్ణుని పాదాలు ఇంటి గడప నుంచి పూజా ప్రదేశం వరకు వేయడం ఆచారం. కిట్టయ్య రాకకు గుర్తుగా భక్తి భావంతో పాదాలను గీస్తారు. కేవలం పండుగల రోజుల్లోనే కాకుండా వేడుకల్లోనూ ముగ్గు ప్రాధాన్యత మనకు తెలిసిందే. పెళ్లిలో వధూవరులు ఆసీనులయ్యే పీటల కింద ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు. పూజలు, వ్రతాలు చేసేప్పుడు ఆ ప్రదేశాన్ని శుద్ధిచేసి అష్టదళ పద్మం, శంకు, చక్రం లాంటి ముగ్గులతో అలంకరించి మండపాన్ని పెడతారు. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టేప్పుడు కూడా ముగ్గులు వేస్తారు. ఇలా ముగ్గులు మన జీవన విధానంలో అడుగడుగునా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎంతో ప్రశస్తి పొందాయి. 
ఎన్నో పేర్లు
విస్తరాకు, మల్లెపందిరి, పూలసజ్జ, సర్పరాజు, సూర్యచంద్రులు, నెలవంక, రథం, ఊయల, చిలుకలు... ఇలా ముగ్గులకెన్నో పేర్లు. పల్లెటూళ్లలో కన్నెపిల్లలు ముగ్గులు వేయడంలో పోటీలు పడతారు. ఒక్కో పండుగకు ఒక్కో రకమైన ముగ్గు వేస్తారు. దీపావళికి దీపాల ముగ్గులు, సంక్రాంతికి హరిదాసు, గంగిరెద్దులు, బొమ్మలకొలువు, ఇక రథసప్తమికైతే రథం ముగ్గు, నాగుల చవితికి పాము ముగ్గు, అట్లతద్దికి తాడాట ఆడే బాలికలు, ఊయలూగే బాలికలు మొదలైన ముగ్గులు ఆయా పండుగల విశేషాన్ని తెలుపుతాయి. 
      ముగ్గుల్లో గణితం ఇమిడి ఉండటం మరో ప్రత్యేకత. చుక్కలు పెట్టడంలో తేడా వస్తే ముగ్గు అస్తవ్యస్తమౌతుంది. ప్లస్, మైనస్, ఇంటూ, ఈజ్‌ ఈక్వల్‌ టు, సున్నా గుర్తులను ముగ్గులు వేయడంలో ఉపయోగిస్తారు. చతురస్రం, సరళరేఖ,  వృత్తాలు, త్రికోణాలు, స్వస్తిక్‌ లాంటివి గణితాన్ని స్ఫురింప చేస్తాయి. ముగ్గులతో ఇంటికి అందం, అలంకారం, ఆకర్షణలతో పాటు ఆరోగ్యప్రదం. సంక్రాంతికి అఖండంగా వేసే రథం ముగ్గులా మన సంస్కృతి అవిచ్ఛిన్నంగా కొనసాగాలి. 

- కె.అనూరాధ, హైదరాబాదు


వెనక్కి ...

మీ అభిప్రాయం