కొమ్మే జీవిత చుక్కాని

  • 183 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చిలుకూరి శ్రీనివాసరావు

  • కడియం, తూ.గో.జిల్లా
  • 8985945506

నాగుల చీర గట్టిన నీలమ్మక్కో
తెల్లచీరగట్టిన పల్లాలమ్మక్కో...

ఇలా అంతెత్తున్న చెట్టెక్కి చుట్టుపక్కలున్న వాళ్లను కేకేస్తూ తోచినంత దానం చెయ్యండని పాడుతూ పిలుస్తాడా జానపద కళాకారుడు. ఎవరై ఉంటారబ్బా? కొమ్మమీద కూర్చుని అడుగుతున్నాడు కనుక కొమ్మదాసై ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీ ఊహ సరైందే. 
కొమ్మదాసరిని కొమ్మాయిదాసుడు అని కూడా అంటారు. కొమ్మదాసరి తను ఎంచుకున్న చెట్టు ఎక్కేందుకు ముందే ఒక వస్త్రాన్ని చెట్టుకింద పరుస్తాడు. ఆ తరువాత చెట్టెక్కి తన దగ్గరున్న గంటను వాయిస్తూ చుట్టుపక్కల వాళ్లను వాళ్లవాళ్ల వస్త్రధారణను బట్టి వివిధ పేర్లతో పిలుస్తూ ఆకట్టుకుంటాడు. జనం ఎక్కువగా రాకుండా, దానం తగినంత చేయకుండా ఉంటే... అప్పుడు ‘‘అక్కయ్యో పప్పుకుండలో పడిపోతున్నా, కాలుబెణికింది... కిందకు దిగేస్తున్నాను’’ అంటూ జనాన్ని రెచ్చగొడతాడు. ఈ పోరు భరించలేక అక్కడ చేరినవారు కింద పరిచిన గుడ్డలో డబ్బులు, ధాన్యం వేస్తారు. కిందకు దిగుతానని బెదిరించడం ఎందుకంటే, కొమ్మ దాసర్లు కిందికి దిగితే ఎవ్వరేది ఇచ్చినా తీసుకోరు. వీరి తత్వం తెలిసిన జనం, దిగేస్తా అనగానే ఎంతోకొంత ఇస్తారు.
అంతేకాదు చెట్టు దిగాక కూడా ఆ ఊళ్లో ఇంక ఎవరి దగ్గరా యాచించరు. ఆ రోజుకి ఎంత వస్తే అంత తీసుకుంటారే కానీ, ఇంటింటికీ తిరిగి అడుక్కోరు. ఇది వాళ్ల కట్టుబాటు. పైగా ఒక ఊళ్లో యాచించిన తరువాత మళ్లీ ఆ ఊరికి రారు. చెట్టెక్కి అడుక్కోవడమే ఓ వింతైతే, కుళ్లాయికి గుచ్చిన తురాయి, పెద్దగా గుబురుగా ఉన్న మీసాలు, మెడలో పూసల దండలు, పులితోక పెట్టుకొని, గంటను వాయిస్తూ, పాటలు పాడుతూ, అరుపులతో జనాన్ని రెచ్చగొట్టడం చూపరులకు వినోదాన్ని కలిగిస్తాయి. కాలప్రభావంవల్ల ఈ కళ ప్రస్తుతం అంతరించింది.
తె.వె.బృందం


నెలపొడుపు పొద్దుల్లో... సంక్రాంతి వేళల్లో
వేకువజామునే
ప్రభాతభానుడితో పోటీపడి
మంచు తెరలను చీల్చుకుంటూ
ఓ వింతరాగం విన్పిస్తుంది.
నెత్తిన పాతగుడ్డలతో కుట్టిన 
బఫూన్‌ కుళ్లాయి
ముఖానికి పూసిన రంగుల మాసికలతో
హాస్యబ్రహ్మలా దర్శనమిస్తాడు.
చేతపట్టిన చిగురుకొమ్మతో
కరవాల నాట్యం చేస్తూ
కుప్పిగంతులు వేస్తూ
వీధుల్ని సందడి చేసేస్తాడు.
దారిపొడవునా నవ్వులు పూయిస్తాడు.
జరజరా చెట్లెక్కేసి
వాటిమీంచి కూనిరాగాలు తీస్తూ 
గారాలు ఒలకబోస్తూ
ఆబాలగోపాలాన్నీ అలరిస్తాడు.
ఊరి నడిబొడ్డులో
వలవలూరిన చెట్టుకి చిటారి కొమ్మెక్కి
‘‘అప్పయ్యమ్మగారో...
మీ ముద్దుల తమ్ముణ్ని వచ్చాను
పడిపోతున్నాను
చెట్టిమీంచి పడిపోతున్నాను
పప్పుకుండలోకి దూకేస్తున్నా’’నంటూ
ఉత్తిత్తి మాటల్తో మారాం చేసేస్తాడు.
ఆ కబుర్ల కచేరికి ముగ్ధులైన
అమ్మల హృదయాలు
చెట్టుకింద పరిచిన వస్త్రంలో 
సొమ్ములు, కూరలు, అన్నం, పప్పుదినుసులై 
ఆత్రంగా నిండిపోతాయి.
ఉరికేస్తానంటూ అతగాడు చేసే హడావుడికి
వద్దని బుజ్జగిస్తూ జనం ఇచ్చే సంభావన
వినోదాల వల్లరిగా కనిపించినా?
అది మనుషుల మధ్య మమతలకి తార్కాణం
ఆత్మీయ అతిథికి విశిష్ట సత్కారం.
‘‘బావగారికి నీళ్లతో నడిచే
మోటారుబండి తెచ్చానని,
చిన్నమేనల్లుడికి
ఒట్టిగడ్డి మొల్తాడు తీసుకొచ్చానని, 
బుల్లి మేనకోడలికి ప్రేమపావురాల
జడగంటలు పట్టుకొచ్చా’’నని
గాలికబుర్లు చెప్తూ,
గ్రామమంతా చుట్టమై చుట్టేస్తాడు.
అతడు...
మనిషికీ చెట్టుకీ ఉన్న 
తరతరాల మైత్రికి ప్రతీక
ఆకుపచ్చని బంధాన్ని గుర్తు చేసే 
అపురూప నేస్తం, 
లోక కల్యాణాన్ని కాంక్షించే
జానపద కళాకారుడు.
ఖాళీ జాగాల్లో బహుళ అంతస్తులు
మొలిచిపోతుంటే...
చెట్లు చిన్నబోయి ఆ భవనాల్లో
మరుగుజ్జు వృక్షాలుగా మారుతుంటే,
ఆస్వాదించే కళ్లు బుల్లితెరకు
టచ్‌స్క్రీన్‌కి మధ్య బందీలైపోతుంటే...
కొమ్మ కరవై, ఆదరణ మరుగై
ఆ రాగం మూగబోతోంది!
అనురాగం వలసపోతోంది!!
అందుకే ఈ పండక్కి
మా కడియం వెళ్తాను,
ఆ పూలవనంలో ఏ చెట్టుమీదైనా
ఓ పచ్చని రాగం ‘కొమ్మదాసై’
విన్పిస్తుందేమో వెతుకుతాను.


వెనక్కి ...

మీ అభిప్రాయం