ఇద్దరూ ఇద్దరే

  • 996 Views
  • 4Likes
  • Like
  • Article Share

సినీ జంట కలాలలో ఒకేరోజు సిరా ఇంకిపోయింది. ఓ కలం చెన్నైలో ఆగిపోతే మరో కలం భాగ్యనగరంలో మూగబోయింది. సినీ జగత్తులో వాళ్లిద్దరూ తారాజువ్వలు. ఎందుకంటే సమకాలీన తెలుగు సినిమాలకు వారు అందించిన కథాబలం అంత గొప్పది. వీరిలో తొలి కలం గొర్తి సత్యమూర్తిది... మలి కలం శ్రీనివాస చక్రవర్తిది. ఇద్దరూ జీవన పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వారే. కానీ, సినిమాల మీద ఉన్న మోజే వారిని నిలదొక్కుకొనేలా చేసింది.
      ఉపాధ్యాయుడిగా ఉంటూనే సత్యమూర్తి తన సాహిత్య పరిజ్ఞానానికి పదును పెట్టుకున్నారు. ఆయన కథలు అనేక వారపత్రికలలో ప్రచురితమవడమే కాదు బహుమతులూ తెచ్చిపెట్టాయి. సత్యమూర్తి రచించిన ‘పవిత్రులు’, ‘అధర గరళం’, ‘పునరంకితం’, ‘చైతన్యం’, ‘దిగంబర అంబరం’ వంటి కొన్ని నవలలు మద్రాసులో సినీ మేధావుల దృష్టిని ఆకర్షించాయి. దాంతో గోదావరీ తీరంలో ఉండే వెదురుపాక నుంచి వెల్లువలా వచ్చి మద్రాసులో వాలారు సత్యమూర్తి. తొలి ప్రయత్నంగా దగ్గుబాటి రామానాయుడు సినిమా ‘దేవత’ (1982)కు కథను సమకూర్చారు. దానికి సత్యానంద్‌ మాటలు రాశారు. ఆ చిత్రం అంబరాన్నంటేంతగా విజయవంతమైంది. సత్యమూర్తి వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన కథా కథనంలో కొత్తదనం ఉంటుంది. అదే శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, వెంకటేశ్‌ వంటి నటుల సినిమాలకు కాసులవర్షం కురిపించింది. ‘బావామరదళ్లు’, ‘మహారాజు’, ‘ఖైదీ నెం.786’, ‘కిరాయి కోటిగాడు’, ‘నారీనారీ నడుమ మురారి’, ‘భలేదొంగ’, ‘బంగారు బుల్లోడు’, ‘పెదరాయుడు’, ‘శత్రువు’, ‘శ్రీనివాసకల్యాణం’, ‘మాతృదేవోభవ’ సినిమాల పేర్లు చాలు, సత్యమూర్తి ఎంతటి వైవిధ్యంతో కూడిన కథలు అల్లారో తెలుసుకునేందుకు! ఇక భావోద్వేగంతో నడిచే ‘చంటి’ సినిమా సంభాషణలు సత్యమూర్తి ప్రతిభకు దర్పణాలు. అలా విభిన్న శైలితో దాదాపు తొంభైకి పైగా సినిమాలకు సత్యమూర్తి రచన చేశారు.
      రాశిలో కొన్నే అయినా సత్యమూర్తి రాసిన సినిమా పాటలూ అర్థవంతమైనవే. తమిళంలో ‘సింధుభైరవి’కోసం ఇళయరాజా ‘పాడిరియేన్బ పాడిపరియేన్‌ పళ్లికూడం తానరియేన్‌...’ పాటను స్వరపరిచారు. దాన్ని ‘పాడలేను పల్లవైన భాషరానిదానను... వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను’ అంటూ సత్యమూర్తి అద్భుతంగా, అర్థవంతంగా రాయడం ఆయన మేధాశక్తికి ఓ ఉదాహరణ మాత్రమే. అలాగే ప్రభాస్‌ నటించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో సత్యమూర్తి రాసిన భక్తిగీతం ‘మొరవినరా ఓ గోపీకృష్ణా ఈ కన్నెల వన్నెలు నీవేలేరా’ కూడా అభినందనీయమే. సత్యమూర్తి మూడోనేత్రాన్ని ఆయన సినీదర్శకత్వంలో చూడవచ్చు. మూడు విభిన్న కథలతో ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘బావగారు’, ‘చైతన్యం’ సినిమాలకు నిర్దేశకత్వం వహించిన ఆయన ప్రతిభ గొప్పది. రైలు ప్రయాణంలో మానభంగానికి గురైన అబల కథా నేపథ్యంలో ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’ తెరకెక్కించారు. మద్యపాన నిషేధం నేపథ్యంలో ‘చైతన్యం’ తీశారు. అనారోగ్యంతో సతమతమవుతూ 61 ఏళ్ల వయసులోనే ఆయన దివంగతులయ్యారు. ఆరోగ్యం సహకరించి ఉంటే ఆయన ఇంకొన్ని అద్భుతాలు సృష్టించేవారే! అలాగే తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగానే కాకుండా, మంచి నటుడిగా కూడా చూసి ఉండేవారే!!
వెంటాడిన దురదృష్టం
శ్రీనివాస చక్రవర్తి (68)కి సత్యమూర్తితో భావసారూప్యం ఉంది. ఆయనలాగే ఈయనా భావుకుడే. అశ్వినీదత్‌ నిర్మించిన కాల్పనిక భావనా చిత్రం ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’కి కథను సమకూర్చింది శ్రీనివాసే. చలనచిత్ర రంగంలో ‘శ్రీనివాస్‌’గానే ఎక్కువగా తెలిసిన ఈ చక్రవర్తి కథకుడిగానే కాదు, చిత్ర నిర్దేశకుడిగా కూడా రాణించిన మేధావి. అయితే సత్యమూర్తి మూడు తెలుగు సినిమాలకు దర్శకత్వం నిర్వహిస్తే... శ్రీనివాస్‌ ‘మదుర స్మరణయ్‌’, ‘ఒరు నిమిష తారు’, ‘పతివ్రత’ అనే మూడు మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్‌ చక్రవర్తి చలనచిత్ర జీవితం రాజ్‌కపూర్‌ నిర్మించిన ‘బాబీ’తో మొదలైంది. దర్శకత్వశాఖలో ఆ చిత్రానికి శ్రీనివాస్‌ పనిచేశారు. మద్రాసు వచ్చేశాక కమలాకర కామేశ్వరరావు, కె.ఎస్‌.ప్రకాశరావు, విజయనిర్మల నిర్దేశకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు దర్శకత్వ సహకారం అందించారు. అలాగే బాపు-రమణల రంగవల్లి ‘అందాల రాముడు’కు లక్ష్మీనారాయణ, ఉపేంద్రవర్మ, గనిసెట్టిలతోబాటు సహాయదర్శకుడిగా పనిచేశారు. అయితే సినీ కథకునిగా పరిచయమైంది తమిళంలో దొరై నిర్మించిన ‘ఎంగళ్‌ వత్తియార్‌’ (1980) చిత్రంతోనే. ఇది 1980 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర బహుమతి అందుకోవడం విశేషం. తర్వాత ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘పెళ్లి’, ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘గురుబ్రహ్మ’, ‘భలే దంపతులు’, ‘దాగుడుమూతల దాంపత్యం’, ‘అనురాగ బంధం’, ‘అనాదిగా ఆడది’, ‘చుట్టాలబ్బాయి’, ‘పుణ్యదంపతులు’ వంటి ఎన్నో మంచి చిత్రాలకు కథారచన చేశారు. కన్నడ నటి పద్మప్రియను ప్రేమ వివాహం చేసుకున్నారు. దురదృష్టం వెంటాడి భార్య అకాలమరణం చెందారు. ఒక్కగానొక్క కూతురు కూడా అనారోగ్యంపాలై దూరమైంది. చివరి రోజుల్లో ఆర్థికంగా చిక్కిపోయారు. చిత్రరంగానికి దూరంగా ఒక చిన్న వసతి గృహంలో తలదాచుకుంటూ గడపాల్సి వచ్చింది. పబ్లిసిటీ డిజైనరు ఈశ్వర్‌ ఎప్పుడైనా హైదరాబాదు వస్తే శ్రీనివాస చక్రవర్తితో కనిపిస్తూ ఉండేవారు. తను అందించే కథలకు మార్పులు చేయమని సూచించే నిర్మాత, దర్శకులకు దూరంగానే ఉంటూ తన ఉనికిని కాపాడుకున్నారు శ్రీనివాస్‌. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ సినిమా పొడిగింపు చిత్రానికి కథను సిద్ధం చేసిపెట్టారు. దానితోబాటు మరో పది సినిమా కథలకు రూపమిచ్చి పదిలపరచారు. కామెర్ల వ్యాధి తిరగబెట్టి ఆయన్ను పొట్టనబెట్టుకుంది. శ్రీనివాస చక్రవర్తికి ప్రముఖ నేపథ్య గాయకులు పి.బి.శ్రీనివాస్‌ దగ్గరి బంధువు.
      విధి ఎంత విచిత్రమైందంటే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి’ సినిమాకు కథను సమకూర్చింది శ్రీనివాస చక్రవర్తి అయితే, సంభాషణలు రాసింది సత్యమూర్తి!! ఈ జంట రచయితలు ఒకేరోజు మరణించడం విధి రాసిన విషాదగాథ!!!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం