అడకత్తెరలో అమ్మ భాషలు

  • 213 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

భూమిపుత్రుల భాషలు బలిపీఠమెక్కుతున్నాయి. మట్టిమనుషుల మాటలు మూగబోతున్నాయి.  జాతి అస్తిత్వాన్ని చాటే ఆచారాలు అదృశ్యమవుతున్నాయి. జాతిజనులకు సొంత గొంతుకనిచ్చే సాంస్కృతిక వారసత్వ సంపదలు సర్వనాశనమవుతున్నాయి. అభివృద్ధికి పర్యాయపదమనుకునే అమెరికా నుంచి అంతర్గత సమస్యలతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల వరకూ ఇదే విధ్వంసం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... ఈ శతాబ్దాంతానికి ప్రపంచ భాషల్లో దాదాపు సగం అంతరించిపోతాయి. అదే జరిగితే... భాషావైవిధ్యంతో ముడిపడి ఉన్న జీవవైవిధ్యం పెను ప్రమాదంలో పడుతుందన్నది యునెస్కో హెచ్చరిక. 
మాటకు మరణం ఉంటుందా? అక్షరం క్షరమవుతుందా?*
ఏ భాష అయినా సరే నిత్యజీవిత సంభాషణలు, వ్యాపార వాణిజ్యాలు, విద్యావ్యవస్థ, సాహిత్యం, కళలు, పత్రికలు, ప్రసారమాధ్యమాలకు క్రమంగా దూరమవుతోందంటే... అంతర్ధానానికి చేరువవుతున్నట్లే. ఆ భాషకు సామాజిక, ఆర్థిక, రాజకీయ మద్దతు కూడా లభించకపోతే అది ఇంకా వేగంగా అంతరించిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా గడచిన అరవై ఏళ్లలో అంతరించిపోయిన 230 భాషలే ఇందుకు తార్కాణాలు. ప్రస్తుతం మరో 2956 భాషలూ ఇదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికి సజీవంగా ఉన్న మాటలమూటల్లో (7105) వీటి వాటా 41%. 
      మరి ఈ జాబితాలో మన అమ్మభాష కూడా ఉందా?
‘మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు మాత్రమే అంతర్ధాన ప్రమాదాన్ని ఎదుర్కోవట్లేదు’
      ప్రమాదంలో ఉన్న ప్రపంచభాషలపై ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రచురించిన నివేదిక (యునెస్కో అట్లాస్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ లాంగ్వేజస్‌ ఇన్‌ డేంజర్‌)కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించిన ఆస్ట్రేలియా భాషావేత్త క్రిస్టఫర్‌ మోస్లే స్పష్టంగా చెప్పిన మాట ఇది. అంటే... ప్రస్తుతానికి మన పలుకు భద్రంగా ఉన్నట్లే. కానీ, ఏయే పెడధోరణుల వల్ల భాషలు అంతరించిపోతాయని భాషావేత్తలు చెబుతున్నారో అవి మన నేలపై కూడా ప్రబలుతున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే... ఇప్పటికే ముప్పులో ఉన్న ఇతర జాతుల మాతృభాషల గురించి తెలుసుకోవాలి. వాటిని ఆ కొలిమిలోకి నెట్టిన పరిస్థితులను అధ్యయనం చేయాలి. అలాంటి దుస్థితిలోకి మన భాష జారిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తించడానికి ఇది అత్యవసరం. 
      అందుకే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న భాషల గురించి యునెస్కో ఏం చెప్పింది? ఏయే ప్రమాణాలను అనుసరించి ‘భాషలకెదురవుతున్న ప్రమాదాల’ స్థాయిని లెక్కగట్టింది? భాషలు అంతర్ధానమైతే వసుధపై జీవవైవిధ్యం దెబ్బతింటుందని ఆ సంస్థ పేర్కొనడంలో అంతరార్థమేంటి తదితర వివరాలను అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా మీ ముందుకు తెస్తోంది ‘తెలుగు వెలుగు’. 
సామ్రాజ్యవాద పడగనీడ
యునెస్కో అట్లాస్‌ ప్రకారం... మాతృభాషలను మరణం అంచులకు నడిపిస్తున్న వారిలో ప్రథమస్థానం మనదే. భారతావనికి చెందిన 197 భాషలు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. అమెరికా(191), బ్రెజిల్‌(190), ఇండోనేషియా(146), చైనా(144), మెక్సికో(143)ల్లోనూ స్థానికభాషలపై కత్తులు వేలాడుతున్నాయి. అలాగే, ఆఫ్రికాలోని సహారా ఎడారి పరిసర ప్రాంతాలకు చెందిన 200 భాషలు కూడా ఈ శతాబ్దం చివరి నాటికి అదృశ్యమవుతాయని అంచనా. ఈ జాబితాను గమనిస్తే, ఈ దేశాల్లో అత్యధికం... చరిత్రలో ఏదో ఒక సందర్భంలో పరాయిమూకల బారినపడ్డవే. ‘తమ అధీనంలోని ప్రాంతాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలడానికి సామ్రాజ్యవాద పాలకులకు ఒక సాధారణ పరిపాలనా భాష కావాలి. అది సహజంగా వారి సొంతభాషే అవుతుంది. దాన్ని వ్యాప్తిలోకి తేవడానికి పాలిత ప్రజల సంప్రదాయాలు,  సంస్కృతులను నాశనం చేస్తారు. విద్యావ్యవస్థలో మార్పులు చేస్తార’ంటారు క్రిస్టఫర్‌ మోస్లే. అప్పట్లో వారు చేసిన గాయాలే ఇప్పుడు రాచపుండులై భాషలను బలితీసుకుంటున్నాయని చెబుతారు.  ఆయన మాటలు అక్షరసత్యాలనడానికి అమెరికా అనుభవాలే సాక్ష్యాలు. అమెరికన్‌ బోర్డింగ్‌ పాఠశాలల్లో చదువుకునే ఆదివాసీ పిల్లలు తమ మాతృభాషల్లో మాట్లాడితే తీవ్రంగా శిక్షించే వారు ఒకప్పుడు. దాంతో సొంతభాషను నేర్చుకోవడానికి కొత్తతరం ఆసక్తి చూపేది కాదు. ఫలితం... యూరోపియన్లు అక్కడ అడుగు పెట్టకముందు చలామణీలో ఉన్న 115 ఆదివాసీ భాషలు ఇప్పుడు అంతరించిపోయాయి. ఆస్ట్రేలియాను ఏలిన ఆంగ్లేయుల దెబ్బకు 250 స్థానికభాషల్లో నేడు 20 మాత్రమే ఓ మోస్తరు స్థాయిలో వాడుకలో మిగిలాయి. యునెస్కో లెక్కల ప్రకారం వచ్చే కొన్నేళ్లలో అక్కడి భాషల్లో 103... శాశ్వతంగా అదృశ్యమవబోతున్నాయి.
ఉపాధి దొరక్క...
ఆర్థికంగా అభివృద్ధి చెందే సమాజాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలెక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వలసదారుల భాష... పట్టణాల్లో వ్యాప్తిలో ఉండే అన్యభాషలతో తీవ్ర రాపిడికి గురవుతుంది. ఆర్థిక, సామాజిక ఫలాలను అందుకోవాలంటే తాము కూడా ఆ భాషల్లోకి మారిపోవాలన్న భావన వలసదారుల్లో మొలకెత్తుతుంది. ఇలా కొన్ని జాతుల భాషలు అంతరిస్తున్నాయి. మరికొన్ని సమాజాల్లో (ముఖ్యంగా మనలాంటి) ఆంగ్లం వంటి భాషల్లోనే విద్యా ఉపాధి అవకాశాలు కేంద్రీకృతం అవుతుండటం కూడా అమ్మభాషలకు చేటు చేస్తోంది. ఆర్థిక, సామాజిక కారణాల వల్ల సొంతభాషలపై జాతిజనులకు గౌరవం తగ్గిపోవడం, ఒకవేళ ఆ భాషలను మాట్లాడేవారు ఉన్నా... వారిని చిన్నచూపు చూడటం, పరాయిభాష రాదన్న అపోహతో పాఠశాలల్లో, ఇళ్లల్లో మాతృభాషలో మాట్లాడేందుకు చిన్నారులను అనుమతించకపోవడం తదితరాల వల్ల కూడా భాషలకు ప్రమాదం ముంచుకొస్తోందని నిర్ధరించింది యునెస్కో. 
      జపాన్‌లో 30 వేల మంది ‘అయిను’ జాతి ప్రజలు నివసిస్తున్నారు. కానీ వారిలో 15 - 40 మంది మాత్రమే తమ మాతృభాష(అయిను)లో మాట్లాడగలరు. కారణం... వృత్తి, వ్యాపారాల నుంచి సామాజిక క్రతువుల వరకూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న జపనీస్‌ భాషే. దీని వెనుక పరిగెత్తక తప్పని పరిస్థితుల్లో అమ్మభాషకు దూరమయ్యారు అయిను జాతీయులు! ఇలాగే, శ్రీలంకకు ‘సింహళ’ భాష రాకముందు నుంచే అక్కడ ఉంటున్న ఆదిమ ‘వెడ్డా’ జాతీయులు కూడా ఇప్పుడు తమ మాతృభాష(వెడ్డా), సొంత సాంస్కృతిక అస్తిత్వాన్ని పోగొట్టుకుని సింహళ సమాజంలో భాగమైపోయారు.
హేళనను తప్పించుకోబోయి...
నేపాల్‌ పశ్చిమ ప్రాంతంలోని గిరిజన జాతి ‘మ్యాహ్ఖ్‌’ మాతృభాష కుశుంద]. మ్యాహ్ఖ్‌ అంటే ‘అడవికి రాజు’ అని అర్థం. శ్రీరాముడి కుమారుడు కుశుడి వారసులమని చెప్పుకుంటారీ కుశుందులు. వారిలో అమ్మభాషను అనర్గళంగా మాట్లాడగలిగిన ఒకే ఒక్క వ్యక్తి 76 ఏళ్ల గ్యానీ మాయ్యాసేన్‌. మిగిలిన వారెవరికీ ఆ భాష అర్థం కూడా కాదు. కుశుందులు గతంలో వేటపై ఆధారపడి సంచార జీవితం గడిపేవారు. అప్పటి నేపాల్‌ సమాజం వీరిని హీనంగా చూసేది. ఆరేడు దశాబ్దాల కిందట కుశుందులు వేటను మానేసి గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకోవడం ప్రారంభించారు. సాటివారి హేళనను తప్పించుకోవడానికి తమ సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా మరచిపోవడం మొదలుపెట్టారు. స్థానిక ఠాకూర్ల ఇంటి పేర్లను పెట్టుకున్నారు. ‘మగర్‌’ వంటి ఇతర జాతుల వారితో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. కుశుంద భాషనే మాట్లాడితే ఇంకా తక్కువగానే చూస్తారన్న ఉద్దేశంతో నేపాలీ భాషను అలవాటు చేసుకున్నారు. జనాభా గణన సమయంలో కూడా తాము కుశుందులమని చెప్పుకోరు వారు. సామాజిక నిరాదరణను తప్పించుకోవడానికి సొంత సంస్కృతిని పణంగా పెట్టడంతోనే ‘కుశుంద’ నేడు అంతరించిపోయే స్థితికి చేరుకుంది. 
అభివృద్ధికీ ఉంది పాత్ర
ప్రాంతాభివృద్ధి కూడా ఆ ప్రాంత భాషపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉత్తర పాకిస్థాన్‌లోని యాసిన్, హంజా - నగెర్‌లోయలో ‘బురుషాస్కీ’ భాష మాట్లాడే వారున్నారు. 1960వ దశకంలో కారకోరం అంతర్జాతీయ రహదారిని నిర్మించడంతో ఈ ప్రాంతంలోకి బయటివారి రాకపోకలు పెరిగాయి. వారి సంపర్కం కారణంగా ‘బురుషాస్కీ’లో ఉర్దూ, ఆంగ్ల పదాలు బాగా చేరాయి. అవి ‘బురుషాస్కీ’ మౌలిక స్వరూపాన్నే మార్చేశాయి. రాబోయే కొన్నేళ్లలో ఆ భాష పూర్తిగా కనుమరుగు కాబోతోంది. దీనికి ఎవరిని తప్పుపట్టాలి?
ఇదీ నష్టం
ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగపడేదే భాష... ఒకవేళ అది అంతరిస్తే మరో భాషలో మాట్లాడుకుంటాం... దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిందేముంది అని అంటారు కొంతమంది. ఈ ఆలోచన తప్పని చెబుతారు కొయిచిరో మత్సుర. 1999 నుంచి 2009 వరకూ యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించిన మత్సుర... ‘ఒక భాష మరణం ఆ జాతి సాంస్కృతిక వారసత్వానికి చెందిన అనేక రూపాలను అదృశ్యం చేస్తుంది. ముఖ్యంగా వెలకట్టలేని ఆచార వ్యవహారాలను; పద్యాలు, సామెతలు, చమత్కారాల రూపంలో ఉండే ఆ జాతి మౌఖిక భావ వ్యక్తీకరణలను! ఆ జాతి నివాసిత ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణ సమాచారం ఆ భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఏ భాష అంతరించినా మానవ మేధలో కొంత భాగం అంతర్ధానమైనట్లే’నని అంటారు. 
      దక్షిణ అమెరికాలో ‘కల్లువాయ’ తెగకు చెందిన ప్రజలున్నారు. తండ్రి నుంచి కొడుకుకు అనే పద్ధతిలో 400 ఏళ్లుగా వారు విశిష్ట వైద్యపరిజ్ఞానాన్ని తమలోతాము అందించుకుంటూ వస్తున్నారు. స్థానిక ఔషధవృక్షాల వివరాలు, చాలా వ్యాధులను నయం చేయడానికి ఉపకరించే సహజ పద్ధతుల రహస్య సమాచారం వారి సొంతం. అయితే, అదంతా వారి మాతృభాషలోనే నిక్షిప్తమై ఉంది. కానీ, ప్రస్తుతం దాన్ని వంద మందే మాట్లాడగలరు. వారి తరువాత ‘కల్లువాయ’ వైద్య విజ్ఞానానికి వారసుల్లేరు. అందుకే, వారి భాషను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
      సంప్రదాయ విజ్ఞానం ప్రస్తుత పరిస్థితి, ఆవిష్కరణల స్థాయి అనేది జీవవైవిధ్య ప్రమాణాల్లో ఒకటి. జాతుల మాతృభాషలే సంప్రదాయ విజ్ఞానానికి పట్టుగొమ్మలు. అంతేకాదు, జాతిజనుల అలవాట్లను, జీవనవిధానాలను తెలియజేసే ప్రత్యేక పదాలు వారి మాతృభాషల్లోనే ఉంటాయి. వాటికి ఇతర భాషల్లో సమానార్థకాలు ఉండవు. ఉదాహరణకు గ్రేట్‌అండమానీస్‌ భాషలోని ‘థెకా’ అనే మాటకు అర్థం ‘తేనె తాగిన మత్తులో ఉన్న వ్యక్తి’! గ్రేట్‌ అండమానీస్‌ ప్రజలకు తేనె అంటే చాలా ఇష్టం. కేజీ తేనెను దించకుండా తాగగల నైపుణ్యం వారి సొంతం. దీన్ని ప్రతీకాత్మకంగా తెలియజేసే పదమే ‘థెకా’. మానవ శాస్త్ర పరిశోధకులకు ఇలాంటివి ఉపకరిస్తాయి. కాబట్టి భాషావైవిధ్యాన్ని కాపాడుకోవడం జీవవైవిధ్యానికి అత్యవసరం. 
      అందుకే, అంతరించిపోతున్న భాషలపై 1990వ దశకం నుంచి అంతర్జాతీయంగా ఆందోళన ప్రారంభమైంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలనూ సంరక్షించాలని ఐక్యరాజ్యసమితి అప్పుడే తీర్మానించింది. ఆ క్రమంలోనే ప్రమాదంలో ఉన్న భాషల గురించి చెబుతూ మొదటిసారిగా 1993లో యునెస్కో ‘రెడ్‌బుక్‌’ను ప్రచురించింది. అంతర్ధానమవుతున్న భాషలను నమోదు చేయడానికి 1995లో టోక్యో విశ్వవిద్యాలయం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న భాషలపై పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సాయం అందించేందుకు అమెరికా, బ్రిటన్లలో సంస్థలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాధినేతలు, ఆయా భాషలు మాట్లాడే సమూహాలు, సాధారణ ప్రజల్లో ‘భాషలు అంతరించిపోయే ప్రమాదం’పై అవగాహన పెంచడం, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడమే లక్ష్యంగా 1996లో తొలిసారిగా యునెస్కో ‘అంతరించిపోయే భాషల అట్లాస్‌’ను ప్రచురించింది. 600 భాషలు ప్రమాదంలో ఉన్నట్లు చెప్పింది. మరో 200 బాధిత భాషల సమాచారాన్ని దానికి జతచేసి 2001లో రెండో ముద్రణను వెలువరించింది. ఈ రెండు ముద్రణల్లోనూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చెందిన భాషల వివరాల్లేవు. ఈ లోపాన్ని సరిచేస్తూ అన్ని దేశాల్లో వాడుకలో ఉన్న భాషలను విస్తృతంగా పరిశోధించి మోస్లే నేతృత్వంలో 2010లో ‘అట్లాస్‌’కు మూడో ముద్రణ తెచ్చింది. 2473 భాషలు అపాయంలో ఉన్నాయని ప్రకటించింది. ఈ మూడేళ్లలో మరో 483 భాషలను ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి ‘అట్లాస్‌’లో చేర్చింది. ఈ నివేదిక రూపకల్పనలో వివిధ దేశాలకు చెందిన 30 మంది భాషావేత్తలు పాలుపంచుకున్నారు. మన దేశ భాషల సమాచారాన్ని ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌’ (మైసూర్‌) మాజీ సంచాలకులు ఉదయ నారాయణ సింగ్, దక్షిణాసియా భాషల పరిశోధకులు, లండన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా।।స్టువర్ట్‌ బ్లాక్‌బర్న్, బెర్న్‌ విశ్వవిద్యాలయ (స్విట్జర్లాండ్‌) ఆచార్యులు జీన్‌రాబర్ట్‌ ఒప్గెనార్ట్‌ క్రోడీకరించారు.
అయిదో దశ అంటే అంతర్ధానమే
ఒక తరం నుంచి మరో తరానికి మాతృభాష రూపంలో ఆ భాషాజ్ఞానం అబ్బకపోతున్నప్పుడే ఏ భాష అయినా ‘అంతరించే ప్రమాదంలో ఉన్న భాష’ అవుతుందని యునెస్కో నిర్వచించింది. మాతృభాషీయుల్లో చివరి వ్యక్తి 1950 తరువాత మరణించి ఉంటే... ఆ భాష అంతరించిపోయినట్లేనని స్పష్టీకరించింది. ఇలా ఇప్పటి వరకూ 230 భాషలకు ఈ భూమిపై నూకలు చెల్లిపోయాయని లెక్కలు తేల్చింది. మాంక్స్‌ (ఇంగ్లాండ్‌ 1974), అసాక్స్‌ (టాంజానియా 1976), ఉబెఖ్‌ (టర్కీ 1992), యేక్‌ (అమెరికా 2008), బొ (అండమాన్‌ దీవులు 2010) తదితర భాషలు గత కొన్ని దశాబ్దాల్లో తమ చివరి మాతృభాషీయుణ్ని కోల్పోయాయి. 
      మొత్తమ్మీద అంతరించిపోయే ప్రమాదమున్న భాషలను యునెస్కో అయిదు రకాలుగా వర్గీకరించింది. ఉదాహరణకు తెలుగే ప్రమాదంలో ఉందనుకోండి. ఆ ప్రమాద స్థాయిలు, ఆ స్థాయిల్లో భాష స్థితిగతులు ఎలా ఉంటాయంటే...
సురక్షితం కాదు: పిల్లలు తెలుగులో మాట్లాడతారు. కానీ ఆ ‘మాట’ ఇంటికే పరిమితం.
కచ్చితమైన ప్రమాదం: మాతృభాషగా తెలుగును పిల్లలు మరెంతో కాలం నేర్చుకోలేరు. తెలుగును తాతల తరం వారే మాట్లాడతారు.
తీవ్ర ప్రమాదం: తెలుగును తాతల తరం వారే మాట్లాడతారు. తండ్రి తరం వారు దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ, వారు ఆ భాషలో పిల్లలతో మాట్లాడరు. 
పెను ప్రమాదం: తెలుగులో మాట్లాడగలిగిన వారిలో అతి తక్కువ వయసున్న వారు ముదిమిలోని తాతలు మాత్రమే. వాళ్లు ఆ భాషను పాక్షికంగా, అప్పుడప్పుడే మాట్లాడతారు.
అంతర్ధానం: తెలుగుకు మాతృభాషీయులంటూ ఎవరూ లేరు.
      అతికీలకమైన తొమ్మిది ప్రమాణాల ఆధారంగా ఈ స్థాయిలను లెక్కగడతారు. అవి... 1) ఆ భాష మాట్లాడే ప్రజల సంఖ్య 2) మొత్తం ప్రాంత జనాభాలో ఆ భాషీయుల సంఖ్య 3) అక్షరాస్యత, మాతృభాషా మాధ్యమంలో చదువు, భాషను నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులు 4) పత్రికలు, ప్రసారమాధ్యమాలు, అంతర్జాలాల్లో ఆ భాష వినియోగం 5) మౌఖిక, లిఖిత సాహిత్యాలను పరిరక్షిస్తున్న విధానం, నిఘంటువుల నిర్మాణం, ఉచ్చరణ విధానాలను నమోదు చేసే పద్ధతులు - వీటిలో నాణ్యత 6) ప్రభుత్వ, వ్యవస్థాపరమైన భాషా విధానాలు, అధికార భాషగా గుర్తింపు, అది అమలవుతున్న తీరు 7) భాషా వినియోగంలో వచ్చే మార్పులు 8) సొంతభాషపై జాతిజనుల అభిప్రాయం, మాతృభాషపై ఆ జాతి చూపించే గౌరవం 9) ఒక తరం నుంచి మరో తరానికి భాష అందుతున్న తీరు 
      క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించి ఈ ప్రమాణాల్లో ఒక్కోదానికి 5 నుంచి 0 వరకూ మార్కులు వేస్తారు. ఎక్కువ వాటికి అయిదు వస్తే ఆ భాష సురక్షితంగా ఉన్నట్లు లెక్క. నాలుగు వస్తే సురక్షితం కాదని అర్థం. మూడు... కచ్చితమైన ప్రమాదం. రెండు... తీవ్ర ప్రమాదం, ఒకటి... పెనుప్రమాదం, సున్నా అంటే అప్పటికే ఆ భాష అంతర్ధానమైపోయిందన్న మాట! తెలుగుకు సంబంధించినంతవరకూ ఈ తొమ్మిది గీటురాళ్లకూ అయిదు మార్కుల చొప్పున పడుతున్నా ‘ఆరింటి’ (3, 5, 6, 7, 8, 9) విషయంలో మాత్రం ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.
మూగబోతున్న ‘భారతి’
మన దేశంలోని గిరిజన భాషలన్నీ ఏదో ఒకస్థాయిలో ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఈ విధ్వంసకాండ ఎక్కువగా జరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన తంగం, తైరొంగ్, తైనొర భాషలు మాట్లాడే వారు వందమంది చొప్పున మాత్రమే ఉన్నారు. ‘న’, ‘మ్ర’ భాషీయుల సంఖ్య 350కి మించిలేదు. హందురి (రాష్ట్రం: హిమాచల్‌ప్రదేశ్, మాట్లాడగిలిన వారు: 138), కుందల్‌షాహీ (పాక్‌ ఆక్రమిత కాశ్మీర్, 500), టారవా (మణిపూర్, 870), టొటొ, మెక్‌ (పశ్చిమబెంగాల్, 1000), కురుబ, కొరగ, బల్లారీ (కర్ణాటక, 1000), తొద (తమిళనాడు 1006), నహలి (మధ్యప్రదేశ్, 2 వేల కన్నా తక్కువ), ఇరుళ (తమిళనాడు, 5000), అసుర్‌ (జార్ఖండ్, 7000) భాషలూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. అండమాన్‌ దీవులకు చెందిన 12 స్థానిక భాషల్లో ఇప్పుడు మూడు (ఓంగె, సెంటినిలిస్, జారవా) మాత్రమే మిగిలాయి. దీనికి అప్పటి బ్రిటీష్‌ పాలన ఒక కారణమైతే ఇప్పటి హిందీ ఆధిపత్యం మరో హేతువు. డెబ్భై ఏళ్ల కిందట కాశ్మీరీ పండితులు ‘శారద’ అనే ప్రాచీన భాష మాట్లాడే వారు. అందులోనే జాతక చక్రాలు రాసేవారు. న్యాయస్థానాల నుంచి ఆర్థిక లావాదేవీల వరకూ దాన్నే వినియోగించే వారు. పెచ్చరిల్లిన హింస వల్ల పండితులు కాశ్మీరును వదలి దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. స్థానిక భాషలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏ కొద్దిమందికో తప్ప కాశ్మీరీ పండిత కుటుంబాల్లో ఎవరికీ ‘శారద’ రాదు. అంతర్ధానానికి అడుగు దూరంలో ఉందీ భాష.
      తూర్పుగోదావరి జిల్లాలో సీలేరు నది ప్రవహించే కొండప్రాంతాల్లో నివసించే గిరిజనం అమ్మభాష కూడా తీవ్ర ప్రమాదంలో ఉందని యునెస్కో నివేదిక చెబుతోంది. మనందరికీ తెలిసిన ఎరుకల, ఉత్తరాంధ్రలో వినిపించే సవర, గదబ, కొండ/కూబి, ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ నివసించే గిరిపుత్రుల భాష కొలామీ, ఒడిశా ఆదివాసీల పలుకులు జువాంగ్, గోరం, బొండ తదితరాలూ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నాయి. 
      గిరిజన భాషల్లో పుస్తకాలు ప్రచురితం కాకపోవడం, విద్యారంగంలో వాటికి కనీస ప్రాధాన్యత కూడా దక్కకపోవడమే ఈ దుస్థితికి కారణం. 
ఈ పని ఎందుకు చేయరు?
‘యునెస్కో అట్లాస్‌’ ఆధారంగా అక్స్‌ఫర్డ్‌ (బ్రిటన్‌), కొలంబియా, మిచిగాన్, జార్జియా (అమెరికా), హాంబర్గ్‌ (జర్మనీ), పారిస్‌ (ఫ్రాన్స్‌), కరాచీ (పాకిస్థాన్‌) విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు పరిశోధనలు సాగిస్తున్నారు. తమ ప్రాదేశిక పరిధుల్లోని భాషలను కాపాడటానికి అవసరమైన కృషి చేస్తున్నారు. 
      మన దేశంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ప్రభుత్వాలూ ప్రయత్నించట్లేదు. భారతావని ప్రారబ్ధమిది. 
      ‘మాతృభాషలో చదువుకోని చిన్నారుల విద్యా ప్రమాణాలు తక్కువస్థాయిలో ఉంటాయి. అలాంటి వారు దేశ ఆర్థిక, మేధో సంపదల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించలేరు’
      ఈ మాట చెప్పింది ప్రపంచ బ్యాంకు. మన పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు! మరోవైపు... ఆంగ్లంలో చదివితేనే, ఆంగ్లంలో మాట్లాడితేనే మంచి ఉపాధి దొరుకుతుందని తెలుగునాట ఓ దురభిప్రాయం వ్యాపించింది. సక్సెస్‌ పాఠశాలల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే, ఆ చదువుల్లో ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది మరో విస్తృత అధ్యయనాంశం. కానీ, ప్రాథమిక దశలో అమ్మభాషలో చదువుకోవడం విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అత్యవసరమన్నది యునెస్కో నిశ్చితాభిప్రాయం. అప్పుడే ఇతర భాషలను మెరుగ్గా నేర్చుకోగల ప్రజ్ఞ చిన్నారులకు అబ్బుతుందనే విషయాన్ని అందరూ గుర్తించాలంటోందీ సంస్థ.
      యునెస్కో నిర్ధారణ ప్రకారం... విద్య, పని ప్రదేశాలు, మాస్‌మీడియా, ప్రభుత్వ వ్యవహారాల్లో వాడుకలో ఉండే భాష మాత్రమే ఎల్లకాలం నిలుస్తుంది. చిన్నారులు బయట అమ్మభాషలో మాట్లాడుతున్నా పాఠశాలలో దాన్ని చదవకపోతే భాషకు భవిష్యత్తు ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా మాతృభాషపై జాతిజనులకుండే మమకారమే ఆ భాషను అజరామరం చేసే అమృతమవుతుంది. ఈ మూడు మంచి మాటలను మనం ఎంత త్వరగా అర్థం చేసుకోగలుగుతామన్నదే మన అమ్మభాష భవితకు ఆధారం.


వెనక్కి ...

మీ అభిప్రాయం