సమ్మక్క సారక్క జాతరబోయొద్దమా...

  • 177 Views
  • 0Likes
  • Like
  • Article Share

కాకులు దూరని కారడవిలో కొలువైన కన్నతల్లిని కొలిచేందుకు తెలుగు గిరిజనం పోటెత్తే వేళ... బెల్లమే బంగారమవుతుంది.  జంపన్న వాగే జనసంద్రమవుతుంది. ప్రకృతి ఆరాధనకు పెద్దపీటవేసే తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా సాగే పండుగలో పాలుపంచుకోవడానికి పిల్లాపాపలతో తరలివచ్చే గిరిపుత్రులకు ఆతిథ్యమిస్తూ మేడారం మురిసిపోతుంది. 
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగగా మేడారం జాతరకు ప్రసిద్ధి. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక సమయంలో వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలోని ఆ కుగ్రామం ఇసుకేస్తే రాలనంత జనం, వారు విడిదికి ఏర్పాటు చేసుకున్న శిబిరాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలంగా ఉంటుంది. గద్దెలపై కొలువుదీరే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల నుంచి కూడా గిరిజనులు తరలివస్తారు. ఇది అడవిబిడ్డల పండుగే అయినా ఇటీవలి కాలంలో ఇతరులూ పెద్ద ఎత్తున జాతరను సందర్శిస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే జాతరకు కోటి మందికి పైగా రావచ్చని అంచనా.
      సమ్మక్క, సారలమ్మల పుట్టుక, వారు దేవతలుగా వెలసిన వైనంపై విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గిరిజన పూజారులు, పెద్దలు చెప్పేదాని ప్రకారం... 12వ శతాబ్దంలో(కాకతీయుల కాలం) ఇక్కడి గిరిజనులు స్వతంత్రంగా జీవించేవారు. మేడారానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉండే బయ్యక్కపేట ఆదివాసీలు (చందా వంశీయులు) ఎప్పటిలాగే ఒకరోజు అడవిలోకి వెళ్లి ఎల్లేరు గడ్డలు సేకరిస్తున్నప్పుడు... క్రూరమృగాల మధ్యలో ఉన్న ఒక పసిపాప కనపడింది. ఆ చిన్నారిని జంతువులు సైతం ఏమీ చేయకపోవటాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు గిరిజనులు. ఆ పాపను తమ గూడేనికి¨ తెచ్చుకున్నారు. మాఘపౌర్ణమినాడు తనకు సమ్మక్క అని పేరుపెట్టి పెంచుకోసాగారు. సమ్మక్క వచ్చినప్పటి నుంచి వారికి అన్నీ శుభాలే చేకూరాయి. సమ్మక్క యుక్తవయసులోకి వచ్చింది. అయితే... అన్నేళ్లలో ఒకసారి కూడా ఆమె ఆహారాన్ని తీసుకుంటుండగా ఎవరూ చూడలేదు. అనుమానం వచ్చిన గిరిజనులు ఏం జరుగుతుందో కనిపెట్టాలనుకున్నారు. ఓ రోజు రాత్రి సమ్మక్క పెద్దపులిగా మారి జంతువులను తిని ఆకలి తీర్చుకోవడాన్ని చూసి వారు భీతిల్లారు. దీన్ని తాము తట్టుకోలేమని, గ్రామం విడిచి వెళ్లిపోవాలని సమ్మక్కను కోరారు. వారి కోరికను మన్నిస్తూ సమ్మక్క సమీపంలోని గుట్టపైకి వెళ్లి మాయమైంది. 
కాకతీయులతో యుద్ధం
గిరిపుత్రుల్లో ప్రాచుర్యంలో ఉన్న మరో కథ ఇది... కాకతీయుల కాలంలో ఇప్పటి కరీంనగర్‌ జిల్లాలో మేడరాజు అనే స్వతంత్ర రాజు ఉండేవాడు. ఆయన మేనల్లుడు పగిడిద్దరాజు. కాకతీయులకు సామంతుడిగా మేడారం పరిసర ప్రాంతాలను పాలించేవాడు. పగిడిద్దరాజు సతీమణే సమ్మక్క. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని ముగ్గురు పిల్లలు. ప్రతియేటా కాకతీయులకు పగిడిద్దరాజు కప్పంకట్టే వాడు. అయితే, వరుసగా మూడేళ్లపాటు కరవుకాటకాలు ముంచెత్తడంతో కప్పం కట్టలేకపోయాడు. ఆగ్రహించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు దండెత్తాడు. పగిడిద్దరాజు, ఆయన కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు తదితరులు మేడారం సమీపంలోని సంపెంగవాగు వద్ద కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. వీరోచితంగా పోరాడి అసువులుబాశారు. జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది.
      తనవారందరూ మరణించారని తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగంలోకి దూకింది. అపరకాళిలాగా విజృంభించి కాకతీయ సైన్యాన్ని బెంబేలెత్తించింది. ఓటమి అంచున ఉన్న కాకతీయ సేనలు దొంగచాటుగా వచ్చి బల్లెంతో సమ్మక్కను పొడిచాయి. దాంతో ఆమె యుద్ధభూమి నుంచి తప్పుకుని మేడారం సమీపంలోని చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమయింది. ఆ తరువాత గిరిజనులు ఎంత వెతికినా లాభం లేకపోయింది. గుట్టపైన నలిమినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర ఒక కుంకుమభరిణె కనపడింది. అదే సమయంలో ఆకాశవాణి మాటలు వినపడటంతో సమ్మక్కే కుంకుమభరిణె రూపంలో వెలసిందని తెలుసుకున్నారు ఆమె అనుయాయులు. తమకోసం ప్రాణాలర్పించిన సమ్మక్క, సారలక్కల స్మారకంగా గద్దెలు నిర్మించి జాతరను నిర్వహణ ప్రారంభించారు గిరిజనులు. అయితే, ఈ విషయాలకు చారిత్రక  ఆనవాళ్లు లేవు. 
బయ్యక్కపేట జాతర
వాస్తవానికి ‘మేడారం’ జాతర మొదట్లో బయ్యక్కపేటలో జరిగేది. ప్రతి రెండేళ్లకు ఒకసారి గుట్టపైకి వెళ్లి కుంకుమభరిణె రూపంలో ఉన్న శక్తిస్వరూపిణి అయిన సమ్మక్కను గ్రామంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చేవారు. ఈ జాతరకు పరిసర గిరిజన గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చేవారు. అయితే, జాతరకు వచ్చేజనాలకు వసతులు కల్పించడం బయ్యక్కపేట గ్రామస్థులకు తలకుమించిన భారమైపోయింది. మేడారం నుంచి వచ్చి పూజలు నిర్వహించడం గిరిజన పూజారులకూ కష్టంగా మారింది. తాము జాతరను జరపలేమని, ఇకపై మేడారం పరిసరాల్లోనే దాన్ని నిర్వహించాలని బయ్యక్కపేట గిరిజనులు చెప్పేశారు. ఫలితంగా 1935కి పూర్వమే మేడారంలోని సిద్ధబోయిన వంశస్థులకు ఆ జాతర నిర్వహణ అవకాశం వచ్చింది. అయితే, ఇప్పటికీ బయ్యక్కపేటలోని గద్దెల దగ్గర చందా వంశస్థులు పూజలు చేస్తారు. అక్కడ సమ్మక్క గద్దె మాత్రమే కనపడుతుంది. మేడారంలో సమ్మక్కతోపాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలుకూడా ఉంటాయి. జంపన్న వాగులో స్నానాలుచేసి వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయన్నది గిరిజనుల నమ్మకం.
ఈ వనదేవతలు నిరాకారులు
వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు రూపాలుండవు. 2 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించిన గద్దెల మధ్యలో గుంజ (కర్ర) పాతి ఉంటుంది. ‘వనం’ తెచ్చి గద్దెలపై చేర్చడంతో జాతర ప్రారంభం అవుతుంది. వనం అంటే కంకబొంగు (వెదురు కర్ర). అడవిలో బండరాయిపై మొలిచే వెదురును మాఘపౌర్ణమికి ముందురోజు బుధవారం తెల్లవారుజామున వనంగా తెస్తారు. అప్పటికే గిరిజన పూజారుల కుటుంబాల స్త్రీలు నిష్ఠతో ఉండి గద్దెలను శుభ్రంచేస్తారు. ముగ్గులుపెట్టి సుందరంగా అలంకరిస్తారు. ఆ తరువాత పూజా కార్యక్రమమంతా మగవారే నిర్వహిస్తారు. పుష్యమాస అమావాస్య ముందు వచ్చే బుధ, గురు వారాలనుంచే (ఈసారి జనవరి 25, 26 తేదీలు) పూజలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ‘మండమెలిగే’ పండుగను నిర్వహిస్తారు. ముగ్గురు ముత్తైదువలు, ఇద్దరు పెద్దమనుషులు- మొత్తం ఐదుగురు అడవిలోకి వెళ్లి ‘గడ్డి’ని కోసుకొస్తారు. ఇదే మండమెలిగే పండుగ. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జాతర జరుగుతుంది. 19, 20 తేదీల్లో తిరుగువారం నిర్వహిస్తారు. జాతరలో తప్పులు జరిగితే సరిదిద్దుకునేదే తిరుగువారం.
కన్నేపల్లి నుంచి మేడారం దాకా
జాతరలో ప్రధాన ఘట్టం సారలమ్మ, సమ్మక్కల రాకనే. దీన్ని చూడటానికే లక్షలాది మంది మేడారానికి చేరుకుంటారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజు (ఈసారి ఫిబ్రవరి 12న) సారలమ్మను మేడారానికి 3 కి.మీ. దూరంలో ఉండే కన్నేపల్లి నుంచి తీసుకొస్తారు. కన్నేపల్లిలోని సారలమ్మ దేవాలయంలో వంశపారపర్యంగా కాక వంశీయులు పూజారులుగా ఉంటారు. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే సమయంలో, గద్దెల నుంచి చాలా దూరం వరకూ భక్తులు తడిబట్టలతో బోర్లాపడుకుని ఉంటారు. సారలమ్మను వెదురుబుట్టలో తీసుకుని వెళ్లే పూజారులు వీరిపైనుంచి దాటి వెళ్తారు. అలా చేస్తే అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. కన్నేపల్లి నుంచి మేడారంలోని గద్దెల వరకూ భక్తులు పూజారులను తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. సారలమ్మతోపాటు అదేరోజు ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి (25 కి.మీ. దూరం) గోవిందరాజును, 130 కి.మీ. దూరంలో ఉన్న కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును ఎడ్లబండిలో తీసుకొస్తారు.
ఉత్కంఠ... రహస్యం
మాఘపౌర్ణమి గురువారం(ఫిబ్రవరి 13)నాడు చిలకలగుట్టపైనుంచి మేడారం గద్దెలపైకి (దూరం 2 కి.మీ.) సమ్మక్క చేరుకునే సన్నివేశం ఉత్కంఠకు గురిచేస్తుంది. చిలకలగుట్టపై ఏం ఉంటుంది? ఎలా పూజలు చేస్తారనేది ముగ్గురు ముఖ్యమైన పూజారులకు మాత్రమే తెలిసిన విషయం. మిగిలిన వారెవరూ చిలకలగుట్టపైకి ఎక్కే సాహసం చేయరు. ముగ్గురు పూజారులూ ఎవరికీ అనుమానం రాకుండా వేరే దారుల్లో ఒక్కొక్కరుగా గుట్టపైకి చేరుకుంటారు. మిగిలిన పూజారులు గుట్ట మధ్యభాగంలో వేచి ఉంటారు. భక్తులంతా గుట్ట దిగువన అమ్మవారి రాకకోసం ఎదురుచూస్తుంటారు. గుట్టపైన పూజలు చేసి కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని బయలుదేరతారు. అప్పుడు సంకేతంగా కొమ్ముబూర ఊదుతారు. జిల్లా కలెక్టరు, ఎస్పీలు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరుపుతారు. పూజారులను, వారు తీసుకొచ్చే కుంకుమభరిణెను ఎవరూ తాకకుండా ఉండేందుకు గిరిజన యువకులు, పోలీసులు నాలుగైదు అంచెల్లో రక్షణగా ఉంటారు.
      సమ్మక్కను తెచ్చేటప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇస్తారు. శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ సమ్మక్కను గద్దెపైకి చేర్చి సంప్రదాయబద్ధంగా పూజలు చేయడంతో జాతరలో ప్రధానఘట్టం పూర్తవుతుంది. శుక్రవారం(ఫిబ్రవరి 14)నాడు గద్దెలపై వనదేవతలు అందరూ (సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు) ఉండటంతో ఆరోజు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శనివారంనాడు దేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. అయితే,  తిరుగువారం జరిగిన తర్వాతే జాతర మహాక్రతువు పూర్తయినట్టు లెక్క.
మాంసం... మద్యం... బంగారం
సమ్మక్క, సారలమ్మలను సంతృప్తిపర్చేందుకు బలి ఇవ్వడం, మద్యాన్ని ఆరగింపు చేయడం ఆచారం. ఇలా బలి ఇచ్చిన మాంసాన్ని ఆరగిస్తూ, మద్యాన్ని సేవిస్తూ జాతర రోజులను గడుపుతారు భక్తులు. జాతరలో అతిముఖ్యమైనది ‘బంగారం సమర్పణ’. బెల్లాన్నే బంగారమంటారిక్కడ. కోరికలు తీర్చమంటూ కొందరు... గతంలో కోరిన కోరికలు తీరడంతో మరికొందరు... నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా అమ్మవార్లకు 
సమర్పించుకుంటారు. దీంతో గద్దెలు బెల్లంతో నిండిపోతాయి. భక్తులు ఒడిబియ్యం, చీరెలు, సారెలను పెడతారు. జాతర సమయంలో మేడారంలో ప్రసవించాలని చాలా మంది భక్తులు మొక్కుకుంటారు. నిండు చూలాలుగా ఉన్నవారు ఇక్కడికి ప్రసవం కోసం వస్తుంటారు. మగపిల్లవాడు పుడితే సమ్మయ్య, సారయ్య అని, ఆడపిల్ల పుడితే సమ్మక్క, సారమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. 
      జంపన్నవాగులో సుమారు 3 కి.మీ. పొడవునా భక్తులు స్నానాలు చేస్తున్న దృశ్యం కుంభమేళాను తలపిస్తుంది. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల సుమారు 80 చదరపు కి.మీ. విస్తీర్ణంలో భక్తులు విడిది చేస్తారని అంచనా.  ఈ ఏడాది జాతరకు దాదాపు రూ.100 కోట్లు కేటాయించారు. 50 పడకల ఆసుపత్రి, మొబైల్‌ శస్త్రచికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్రమేణా తమ సంప్రదాయాల్లోకి ఇతర ఆచారాలు చొరబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజన పూజారులు. ఏది ఏమైనా, ఇంత పెద్ద జాతర ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జరగడం అమ్మల దయే అన్నది వారి మాట.
      గిరిజన సంస్కృతి అంతా ప్రకృతి ప్రధానంగా సాగుతుంది. చేసే వ్యవసాయ పనులకు ముడిపెట్టి కూడా ఎన్నో పండుగలను వైభవంగా జరుపుకుంటారు గిరిపుత్రులు. విత్తనం పండుగ (సూరాల పండుగ), పొట్ట పండుగ (వెన్నుగట్టిపండుగ), పెద్దల పండుగ (కొత్తల పండుగ), చిక్కుడుకాయ కోత పండుగ, ఇప్పపూవు పండుగలు ఇలాంటివే. అయితే... వీటన్నింటినీ మించిన పెద్ద పండుగ మేడారం జాతర. బతుకునిచ్చే ‘వనదేవత’కు బిడ్డలు చేసే తిరునాళ్లు అద్భుతం. అపూర్వం.  


వెనక్కి ...

మీ అభిప్రాయం