పీడనపై గర్జించిన జ్వాలారేఖ

  • 77 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆల్తి కార్తీక్‌

  • ప్రత్తిపాడు, పశ్చిమగోదావరి
  • 7989399353
ఆల్తి కార్తీక్‌

‘‘ఛంఘిజ్‌ఖాన్‌ అంటే ఏమిటి? మానవుడిగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? 123 గుడిసెలు లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పావు వంతు వరకూ జయించి మూడు శతాబ్దుల పర్యంతం స్వర్ణయుగాన్ని అనుభవించిన  ఇక మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు? నాగరీకులమని చెప్పుకుంటూ, కుళ్ళు రాజకీయాలలో మునిగి తేలుతూవుండే చుట్టూవున్న సామ్రాజ్యాధి నేతలు, నిరంతరం అగ్నిని వర్షించుతున్నా లెక్కచేయక అచంచులుడై నిలచి, విజయాన్ని చేబట్టి తన మంగోల్‌ ప్రజానీకానికే కాక, ఆసియాఖండానికి యావత్తూ మహోజ్వలమైన భవిష్యత్తును నిర్మించిన ఆ మానవుడి హృదయాన్ని వ్యక్తం చేయడానికే నేను యిన్ని వందల పేజీలుగా యీ ప్రయత్నం చేశాను. ఈ నవలలో రచించిన పాత్రలన్నీ నా ఊహలో జనించిన ఆదర్శప్రాయులైన దేవతలు కారు. 12, 13 శతాబ్దాల సంధిలో యీ భూమిమీద పుట్టి, కష్టనిష్ఠురాలను భవించిన మానవులు- అందుచేత ప్రతి పాత్రలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి’’

- తెన్నేటి సూరి

స్వేచ్ఛ లేకపోతే మనిషి బతకలేడు. ప్రాణం కన్నా విలువైనదిగా భావిస్తూ దాని కోసం నిరంతరం సంఘర్షణ చెందుతాడు. అతని చుట్టూ ఉండే స్థానిక జీవన పరిస్థితులు తన స్వేచ్ఛని నిర్దేశిస్తాయి. వాటిని దాటుకుని స్వేచ్ఛని సాధించడమో, విఫలమైనా పోరాడుతూ ఉండటమో చేస్తుంటాడు. లేదా స్తబ్ధుగా నిమిత్తమాత్రుడై కాలాన్ని చప్పరిస్తాడు. జీవితపాఠంలో అంతమయ్యే స్థితిపట్ల ఎరుక కలగకపోయినా, లేకపోయినా స్తబ్ధత ఏర్పడుతుంది. ఉధృతంగా వీచే గాలికి ఆరిపోయే ముందు కూడా దీపం ఒక్కసారి ఉజ్వలంగా వెలుగుతుంది. అలాగే అధికారం అనే అవకాశదీపం ఎదురైతే కత్తులడ్డుపెట్టి మరీ దాన్ని చేజిక్కించుకోవడమనే బలమైన స్థానికత గోబీ భూముల్లో ఉంది. ఈ స్థానికత సాంఘిక జీవనాన్ని సామూహికంగా ప్రభావితం చేస్తుంది. అది స్వేచ్ఛా నిర్భంధానికి దారితీసి మార్పునకు సాధ్యం కానంత బలీయమవుతుంది. తద్వారా ఏర్పడే పీడనను నిరోధించడానికి తిరిగి హింసే ఆయుధంగా కనిపిస్తుంది. ఆ హింసాయుధంతో సాధించే ఫలం స్వేచ్ఛ అయితే అది మానవత్వమవుతుంది. లేకపోతే రాక్షసత్వమవుతుంది. అలాంటి గోబీ ఎడారుల్లో యుద్ధాన్ని రక్తంలో ముంచి గీసిన మంగోల్‌ వర్ణచిత్రం ఛంఘిజ్‌ఖాన్‌. చరిత్రకారుల దృష్టిలో రాక్షసుడి ముసుగు తొడుక్కొని, గోబీ ప్రజలను స్వేచ్ఛాపథంలోకి నడిపించిన ఈ నాయకుడి జీవితాన్ని, చరిత్ర అట్టడుగునున్న అసలు నిజాలతో వెలికితీసి అక్షరబద్ధం చేశారు తెన్నేటి సూరి. కమ్యూనిజం సిద్ధాంతాలను ఆచరించిన ఆయన హెన్రీ.హెచ్‌.హౌవర్తు రాసిన మంగోల్‌ చరిత్రను ఆధారంగా చేసుకుని నవలా రూపంలో దీన్ని మలిచారు. 
గోబీలో పుట్టిన జగజ్జేత
ఓనాన్‌ నదీ తీరంలో బూర్ఖాన్‌ పర్వతం మీద సారీ- కీహర్‌ మైదానాల్లో ఉండే మంగోల్‌ జాతి అనేక గోబీ తండాల్లో ఒకటి. దాని నాయకుడు యాసుకై మెర్కిట్‌ తండా మీద దాడిచేసి యూలన్‌ను ఎత్తుకొచ్చేయడంతో ‘ఛంఘిజ్‌ఖాన్‌’ నవల.. మొదలవుతుంది. 
      చెల్లెలంటే పంచప్రాణాలైన అన్న కరాచర్‌ కూడా యాసుకై పంచన చేరతాడు. ఓ కాలు లేకపోయినా తన మేధస్సుతో యాసుకైకి ఇష్టుడై, మంత్రిగా మారతాడు. కరాచర్‌ రాకతో మంగోల్‌లో మూఢవిశ్వాసాలను పెంచే మతగురువు షామాన్‌ ప్రాధాన్యం తగ్గిపోతుంది. కొంతకాలానికి యూలన్‌ మగబిడ్డను కంటుంది. అప్పుడే తార్‌తార్‌ తండా మీద విజయం సాధించిన యాసుకై, కుడి అరచేతిలో మధ్యలో ఎద్దు మూపురంలా ఉన్న కండతో పుట్టిన తన బిడ్డను చూసి జగజ్జేత అవుతాడని ఆకాంక్షిస్తాడు. టెమూజిన్‌ (ఉక్కుమనిషి) అని పిలుస్తాడు. కెరెయిట్‌ జాతి నాయకుడైన తుఘ్రల్‌ఖాన్, చైనా గోడ పక్కనే ఉన్న పెద్ద సారవంతమైన భూభాగాన్ని ఆక్రమించుకుంటాడు. సింగ్‌పాల్‌ను రాజధానిగా చేసుకుని నాగరిక నగరాల్ని నిర్మిస్తాడు. అయితే తమ్ముడు మర్గీ నైమాన్‌ తండాలతో కలిసి తనను సింహాసనం నుంచి దింపేశాడని యాసుకైకి చెప్పి సాయం చెయ్యమంటాడు. నైమాన్, కెరెయిట్‌ తండాల మీద దాడి చేసి తిరిగి తుఘ్రల్‌ఖాన్‌ను సింహాసనం ఎక్కిస్తాడు యాసుకై. పెద్దవాడవుతున్న టెమూజిన్‌కు పెళ్లి సంబంధం చూడటానికి బయలుదేరిన అతన్ని దారిలో సోదరుడు, టైజూట్‌ నాయకుడు టర్గుటాయ్‌ ఆతిథ్యం పేరిట సారాలో విషం కలిపి చంపేస్తాడు. టెమూజిన్‌ను కూడా బంధిస్తాడు. ఇదే అదనుగా యూలన్‌ సవతి కొడుకు పెగ్షీబీగీ జాజరెట్‌ తండాలతో కలిసి మంగోల్‌ను నాశనం చెయ్యాలనుకుంటాడు. తప్పించుకు వచ్చిన టెమూజిన్‌ పెగ్షీని చంపి, మంగోల్‌ జాతినంతా టెంగెరీ- ఖుర్రాలోకి (దివ్యపర్వత చతుష్టయం) మారుస్తాడు. అక్కడ టర్గుటాయ్‌తో యుద్ధం చేసి టైజూట్‌ తండా పారిపోయేలా చేస్తాడు. 
      తనను తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన యాసుకై బలం చూసి ఈర్ష్య చెందిన తుఘ్రల్‌ఖాన్, మంగోలులను నాశనం చెయ్యాలనుకుంటాడు. యాసుకై మరణానికి సంతాపం తెలుపుతూ సింగ్‌పాల్‌కి అతిథిగా రమ్మని టెమూజిన్‌కు వర్తమానం పంపుతాడు. తమ్ముడు చమూగాతో సింగ్‌పాల్‌ వెళ్లిన టెమూజిన్‌ని తార్‌తార్‌ తండాల మీద యుద్ధం చేయడంలో సాయం కోరతాడు తుఘ్రల్‌ఖాన్‌. తిరిగి మంగోల్‌ చేరిన టెమూజిన్‌.. మెర్కిట్, నైమాన్, టైజూట్‌ తండాలు ఏకమై బలమైన శక్తిగా తయారయ్యాయని తెలుసుకుంటాడు. తుఘ్రల్‌ఖాన్‌ ఇదే అదనుగా మంగోలులను నాశనం చెయ్యడానికి సాయం పేరుతో అయిదువేల మంది సైన్యాన్ని పంపిస్తాడు. వారిని తెలివిగా బర్గూ మైదానానికి తరలిస్తాడు టెమూజిన్‌. కెరెయిట్‌ సేనని మంగోల్‌ సైనికులనుకుని ఈ మూడు తండాలు కలిసి నాశనం చేసేస్తాయి. తమ సేనలను కూడా చాలా వరకు నష్టపోయిన ఈ మూడు తండాల మీద తెల్లారుతూనే దాడి చేసి మెర్కిట్, నైమాన్, టైజూట్‌ నాయకులను చంపేస్తాడు టెమూజిన్‌. తార్‌తార్‌ తండా కూడా వీటితో కలిసి అంతమైపోతుంది. తన అధికారంలోకి వచ్చిన నైమాన్‌కు తమ్ముడు చమూగాను రాజును చేస్తాడు. ప్రజల్ని నిరాయుధుల్ని చేసి వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెడతాడు చమూగా. బర్గూ విజయంతో తిరుగులేని నాయకుడిగా మారిన టెమూజిన్‌ను అంతం చెయ్యడానికి శాంతి యుద్ధం పేరుతో గోబీ తండాలను సమీకరిస్తుంటాడు తుఘ్రల్‌ఖాన్‌. చైనా, క్వారిజం చక్రవర్తులు కూడా మంగోలుల మీద యుద్ధం ప్రకటిస్తారు. చమూగా అహింసా విధానాలను పట్టించుకోని నైమాన్‌ ప్రజలు అతణ్ని పక్కన పెట్టి, మంగోలుల మీద దాడికి  సిద్ధమవుతారు. చైనా, కెరెయిట్, తురుష్క సేనలతో సర్వసైన్యాధ్యక్షుడిగా ఖాల్‌టా మైదానానికి చేరుకున్న తుఘ్రల్‌ఖాన్‌కు, తమను కూడా సైన్యంలో కలుపుకోమనే మంగోల్‌ తండాలు ఎదురవుతాయి. అతను ఒప్పుకోవడంతో రోజుకు నాలుగైదు తండాలు సైన్యంలో చేరతాయి. తుఘ్రల్‌ఖానుకు తాను ఏవిధంగా సాయపడిందీ లేఖలో వివరంగా రాసి, సంధి చర్చలకు పిలుస్తాడు టెమూజిన్‌. తుఘ్రల్‌ఖాన్‌ సమాధానమివ్వడు. ఆ రాత్రి నిద్రపోతున్న కెరెయిట్‌ సైనికులను నిద్రలోనే చంపేసి, తెల్లారేసరికి సమస్త సేనలను నాశనం చేసేస్తారు మంగోల్‌ సైనికులు. ఖాల్‌టా చేరిన టెమూజిన్‌ తుఘ్రల్‌ఖాన్‌ తల నరికి ఛంఘిజ్‌ఖాన్‌గా అవతరిస్తాడు. జగజ్జేతగా అతను ప్రపంచ జైత్రయాత్రకు బయల్దేరడంతో నవల ముగుస్తుంది. 
ఆదర్శ నాయకుడు
‘ఛంఘిజ్‌ఖాన్‌ నా ఆదర్శ వీరుడు’ ని తన జీవిత చరిత్రలో రాసుకున్నారు జవహర్‌లాల్‌ నెహ్రూ. దాని వెనుక గోబీ స్థానికతను అర్థం చేసుకున్న ఆయన నిశిత పరిశీలన ఉంది. పన్నెండో శతాబ్దపు చైనాలో నూటికి తొంభై మంది దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. మతాల్ని, కళల్ని ఆధారంగా చేసుకుని ప్రజల్లో మూఢవిశ్వాసాలు, అవినీతిని, నిరాశావాదాన్ని నింపి, తమ పాదాల కింద తొక్కిపెట్టారు రాచరిక భూస్వాములు. చైనా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల చక్రవర్తులైన కిన్, హియాలు సంప్రదాయం పేరుతో సరదాగా యుద్ధాలు చేసుకుంటూ తీవ్ర ప్రాణనష్టం కలుగజేశారు. చైనా చుట్టూ రక్షణగా గోడ కట్టుకుని, గోడ బయటకు సేనలను పంపి గోబీ తండాలను పీడించేవారు. అలాంటి దుర్మార్గాల మీద ఎదురుతిరిగిన ఛంఘిజ్‌ఖాన్‌ను రాక్షసుడన్నారు జర్మన్‌ చరిత్రకారులు. ఘోరమైన సైనిక శాసనాల ద్వారా విజయాన్ని సాధించాడంటూ హిట్లర్‌కు ప్రేరణ కలిగించి, ఒక దేశాన్ని నాశనం చేయించారు. ఆదర్శ నాయకత్వంతోనే ఛంఘిజ్‌ఖాన్‌ అన్ని వేల మంది సైనికులను సమీకరించగలిగాడని తెలుసుకోలేకపోయారని తెన్నేటి సూరి ఈ నవలలో వివరించే ప్రయత్నం చేశారు. 
      మనిషిని జంతువుని వేరు చేసేది ఆత్మవిశ్వాసమేనని నమ్మే ఛంఘిజ్‌ఖాన్, బలహీనతలను కప్పిపుచ్చడమే దాన్ని బలంగా మార్చుకునే మార్గమని తెలియజేస్తాడు. తనకు పెద్దగా సైన్యం లేకపోయినా, దానిపైన శత్రువుకు అనుమానం రాకుండా ఉండాలని ఏ సమయంలోనైనా సాయం చేయడానికి సిద్ధమని తుఘ్రల్‌ఖానుకు వర్తమానం పంపిస్తాడు. మంగోల్‌ బిడ్డలకు చిన్నతనం నుంచే గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్పి బలమైన సైనిక వ్యవస్థను తయారు చేస్తాడు. కొయ్య బరిసెలు, ఉండేలు బద్దలూ పట్టుకుని పోరాడే మంగోల్‌ సేనకు తన సమయస్ఫూర్తి, మాటల చాతుర్యంతో ఆధునిక ఆయుధాలు అందిస్తాడు. చైనా నుంచి తుపాకీమందు చేసే విద్యను గోబీకి తెచ్చి, తనవారితో తుపాకులు పట్టిస్తాడు. మత విద్వేషాలకు మంగోల్‌లో చోటివ్వక, అలా చేసిన మతపెద్దల తలలు నరికి హెచ్చరికగా బూర్ఖాన్‌ పర్వతం మీద వేలాడదీస్తాడు. తన భార్య బుర్టీని ఎత్తుకుపోయిన వారిపై దండెత్తి ప్రాణనష్టం చేయడం ఇష్టం లేక, ఆ సమస్యకు ఇంకో పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తాడు. తనపై దండెత్తే ప్రతి తండానూ సంధికి పిలుస్తాడు. వాళ్లు ఒప్పుకోక పోయినప్పుడే యుద్ధం చేసి శాంతి చేకూరుస్తాడు. శత్రువు చేతిలోని ఆయుధమే మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయిస్తుందని నిరూపిస్తాడు ఛంఘిజ్‌ఖాన్‌. ఇతని ప్రస్థానం.. ఈ క్రమంలో అతనికి ఎదురైన ముళ్లబాటలు, ఆయా సమయాల్లో తన అంతఃసంఘర్షణలను దృశ్యమాలికల్లా పాఠకుల ముందుకు తెస్తారు రచయిత.
పాత్రలకు జవజీవాలు
ధైర్యానికి ప్రతిభ తోడైతేనే అది జాతిని ముందుకు నడిపిస్తుంది. మృగ లక్షణాలతో ఉన్న మంగోల్‌ జాతిని తన జ్ఞానంతో వెలుగుదారిలోకి నడిపించిన వాడిగా కరాచర్‌ సేవియన్‌ పాత్రను రూపుదిద్దారు తెన్నేటిసూరి. చేతిపనులు చేసే కరాచర్‌ ఏ వస్తువునైనా, అవకాశాన్నయినా ఉపయోగకరమైనదిగా మార్చగలిగే సృజనశక్తి సంపన్నుడు. యాసుకైకి మంత్రిగా మంగోల్‌ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తాడు. ఆత్మరక్షణ ఎప్పుడూ ముఖ్యమని నమ్మే కరాచర్, గెలిచిన యుద్ధాలలో ఎప్పుడూ సంపదలు తీసుకోకుండా సైనికులను తమకు అప్పగించాలని షరతు విధిస్తాడు. తర్వాత కాలంలో ఈ విషయంలో ఛంఘిజ్‌ఖాన్‌కు ప్రేరణగా నిలుస్తాడు. 
      ఉలిదెబ్బలు తిన్న కొద్దీ రాయి శిల్పంగా మారుతుందని ఒక సుభాషితం. రాయి స్థానంలో పువ్వుంటే అది వర్తించదు. రాయిలా ఉండాల్సిన గోబీలో పువ్వులాంటి సుకుమారుడైన చమూగా ఆలోచనలు కూడా వర్తించవు. చైనా సాహిత్యాన్ని, ఒంటెత్తు బౌద్ధ గ్రంథాలను ఆపోసన పట్టి మంగోల్‌లోనే విద్యాధికుడనిపించుకున్న చమూగా, వ్యవసాయమే ప్రగతి మార్గమని గుడ్డిగా నమ్ముతాడు. నైమాన్‌ రాజుగా వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేస్తాడు. దారిద్య్రంలో ఉన్నవారంతా వ్యవసాయం చెయ్యాలంటాడు. ఆ బక్కజీవులను వేధించుకు తినే రాబందులను ముందు అంతంజేస్తే తప్ప శాంతిస్థాపన జరగదన్న  మాటలను పట్టించుకోడు. పంటలు పండించడం గొప్ప కాదు, పండిన వాటిని కాపాడుకునే శక్తిని ముందు సంపాదించుకోవాలన్న ఛంఘిజ్‌ఖాన్‌తో విభేదిస్తాడు. హింసే ధర్మంగా ఉన్నచోట చివరకు తన ఆలోచనలు నిలబడలేకపోవడంతో మనోవ్యథ చెంది, గోబీ మహాశక్తి ముందు మోకరిల్లిపోతాడు. అలాగే యూలన్, యాసుకై, తుఘ్రల్‌ఖాన్, షామాన్, కూలన్‌ ఇలా ప్రతి పాత్రకు సొంత వ్యక్తిత్వాన్ని కల్పించి, వాటికి ఈ నవలలో ప్రాణప్రతిష్ఠ చేశారు తెన్నేటి సూరి. ‘‘కష్టాలు వచ్చాయని  భయపడకండి. ఒక్కొక్క కష్టాన్ని యెదుర్కొన్నప్పుడల్లా మానవజాతి ఒక్కొక్క మెట్టు పైకి లేవగలుగుతుంది’’ లాంటి సంభాషణలు సార్వజనీన విలువలు నింపుకుని స్ఫూర్తికలిగిస్తాయి. 
వచనా విహారం
మంగోల్‌ జీవన సంస్కృతులను, మతాచారాలను, గోబీ వాతావరణాన్ని దాని ఆత్మతో సహా ఈ నవలలో పొందుపరిచారు సూరి. శిశిర కాలంలో మంగోల్‌ సైనికులు ఆహారం దొరక్క గుర్రాల వెన్నుల మీది రక్తనాళాల్ని కత్తిరించి, రక్తం పీల్చుకుని ఆకలి తీరాక ఆ నాళాలకి మైనంతో పూతపూయడాన్ని, చలిని తట్టుకోడానికి గోబీ స్త్రీలు ఒంటినిండా వెన్నపూస రాసుకోవడం లాంటి విషయాలతో మనం ఆ ప్రాంతంలో ఉన్న అనుభూతిని కలిగింపజేస్తారు. గోబీ రాత్రుల్లో చలిని తట్టుకోవడానికే గుర్రాలు మామూలు కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయనే సూక్ష్మవిషయాలను కూడా నిశిత పరిశీలనతో రాసి, ఈ నవలను జీవశక్తితో నింపారు. అద్భుతమైన వేగంతో సాగిపోయే సూరి వచనం పాఠకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే ‘ఆంధ్రపత్రిక’లో వారం వారం ధారావాహికగా ప్రచురితమవుతున్నప్పుడే విశేష ఆదరణను పొందిందీ నవల. ఆ తర్వాత పుస్తక రూపంలోకి వచ్చి, ఎనిమిదికి పైగా పునర్ముద్రణలను పొందింది. తెన్నేటి సూరి ఇంకా ఛార్లెస్‌ డికెన్స్‌ రాసిన ‘ఏ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌’ను ‘రెండు మహానగరాలు’గా తెలుగులోకి అనువదించారు. ‘విప్లవరేఖలు, సుబ్బలక్ష్మి’ కథాసంపుటాలను వెలువరించారు. సూరి కవితలు ‘అరుణరేఖలు, మహోదయం’ పొత్తాలుగా ప్రచురితమయ్యాయి. మహిళా చైతన్యం కోసం, తెలంగాణ రైతాంగ పోరాటం గురించి ఈయన రాసిన పాటలు ప్రాచుర్యం పొందాయి. 
      సామూహిక ఐక్యతతోనే విజయం సాధ్యమని ఈ రోజున వస్తోన్న చైతన్యోద్యమాలు, మనకున్న వేల పుటల ఉద్యమ సాహిత్యం చెబుతున్నాయి. భావజాల జ్ఞానాన్ని పక్కనబెడితే, స్వేచ్ఛను పొందడానికి పోరాటమే శరణ్యమని నమ్మి ముప్పాతిక వంతు ప్రపంచాన్ని జయించేసింది మంగోల్‌ జాతి. అలాంటి సామూహిక చైతన్యాన్ని చెదిరిపోకుండా పట్టుకుని ఏకీకృత లక్ష్యం వైపు సాగేలా చేసిన మానవతావాదిగా ఛంఘిజ్‌ఖాన్‌ను చరిత్ర గుర్తించుకోవాలని తెన్నేటి సూరి ‘ఛంఘిజ్‌ఖాన్‌’ నవల రాశారు. ఆ ప్రయత్నం సఫలం కావడమే, ఈ నవలను గొప్ప తెలుగు పుస్తకాల్లో ఒకటిగా నిలిపింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం