పొట్టికి లేదు పోటీ

  • 26 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

‘‘మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు’’ అని మహా కవి గురజాడ అప్పారావు చెప్పారు గానీ అది సరికాదు. ఎవరు మంచి? ఎవరు చెడ్డ ఎవరు తేల్చి చెప్పగలరు! అలా కాకుండా పొట్టి, పొడుగు అనేవి రెండు వర్గాలు అని ఉంటే అదిరిపోయేది. ఈ రెండింటిలో పొట్టికి లేదు పోటీ అంటే తిరుగులేదు.
      పొట్టికి ఉన్న ప్రత్యేకతే వేరు. పొట్టివాడు సాక్షాత్తు దేవుడు. పొడుగు వాడు కేవలం జీవుడు. దశావతారాల్లో పొట్టివాడికో అవతారం ఉంది. అదే వామనావతారం. మరి పొడుగువాడికో! వాడి మొహం వాడికేమీ లేదు.. జెండా కర్రలాగా నిలబడి ఉండటం తప్ప! 
      వామనుడు తనకన్నా పొడుగువాడైన బలిచక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగి యావత్‌ ప్రపంచాన్ని ఆక్రమించేశాడు. అంతేకాదు, దానం చేసిన వాడి నెత్తినే పాదం మోపి తొక్కేశాడు. వామనుడి తెలివి మనకు రావాలంటే ఎన్ని జన్మల్లోనైనా పొట్టివాడిగానే పుట్టించాలని దేవుణ్ని ప్రార్థిస్తూ తపస్సు చేయడం తప్ప గత్యంతరం లేదు. పొడుగువాడైన దేవేంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ఏ ఊర్వశినో, మేనకనో పంపిస్తే వాళ్లు డ్యాన్సు చేసేటప్పుడు కాస్త కళ్లు మూసుకుంటే సరి! వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోతారు. 
      రూపం సంగతి అలా ఉంచితే, జ్ఞాన దీపం సంగతేంటి? పొట్టివాడికి ఉన్నంతగా పొడుగువాడికేదీ! నాయనమ్మ మాడు!! పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అన్నారు కానీ ఎంత పొడుగు వాడైనా, ‘ఎగు భుజంబులవాడు’ అనిపించుకున్నా ఏం ప్రయోజనం ఉంది? ఆజానుబాహుడనిపించుకున్నా లాభమేముంది?
      పొడగరిని పట్టుకుని ఆజానుబాహుడు అంటారు కదా. నిజానికి ఆజానుబాహుడంటే మోకాళ్ల వరకు చేతులు ఉన్నవాడని అర్థం. అంతే కానీ ఆరడుగుల ఎత్తు ఉన్నవాడని ఎక్కడా అర్థం లేదు. ‘మా దాశరథికి కూడా మోకాళ్ల వరకు చేతులు ఉంటాయ’ని ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి చమత్కరించారు.
      పొట్టివాడు దేశ సేవ చేయడంలో పొడుగువాడికన్నా ఎప్పుడూ ముందుంటాడు. ఆదా చేయడం కన్నా దేశ సేవ ఎంత సోదా చేసినా దొరకదు కదా మరి! పొట్టివాడికి దుస్తుల ఖర్చు తక్కువ. ఎంత అందగాడైనా ఎంత అరగదీసినా సబ్బుల ఖర్చు ఎక్కువ కాదు. అంతెందుకు, స్నానం చేయడానికి నీళ్ల ఖర్చూ తక్కువేగా. ఆ మేరకు ఆదా అయ్యే డబ్బు, భావితరాలవారి కోసం భద్రంగా ఉండిపోతుంది. దాని వల్ల ఎన్ని ‘లాభాలు’! ఆ విధంగా పొట్టివారు దేశ వనరులకు సంరక్షకులే కదా? 
      ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి గానీ పొట్టివాడికి మించిన వింత ఏముంది? పొట్టివాడు ఒక పెద్ద చిత్రం. పొట్టివాళ్లకున్న పేరు ప్రతిష్ఠలు పొడుగు వాళ్లకు ఎక్కడున్నాయి? పొట్టి వాళ్ల మీద ప్రత్యేకంగా సినిమాలు తీశారు కానీ పొడుగువాళ్ల మీద ఏమున్నాయి? ఆరా తీస్తే ‘పొట్టి ప్లీడరు’ అనే చలనచిత్రం వచ్చిందిగానీ పొడుగు ప్లీడరు అనే సినిమా రాలేదుగా! అంటే పొట్టివాడికి ఉన్న జనాకర్షణ పొడుగువాడికి ఏది? కమలహాసన్‌ది, షారుఖ్‌ఖాన్‌ది మరగుజ్జు పాత్రల సినిమాలున్నాయి! షారుఖ్‌ది - జీరో, కమల్‌ - అపూర్వ సహోదరులు. ఇది తెలుగు, హిందీల్లోకి డబ్‌ అయ్యింది. అది ఎన్ని జన్మలకు రావాలి? పొట్టి వీరయ్యకు సినిమాల్లో ఎంత పేరొచ్చింది! పొడుగువాళ్లు ఆయన ముందు బలాదూర్‌ కాలేదా!
      ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంది. ఇల్లు కట్టడం పెద్ద సమస్యేం కాదు! గృహ నిర్మాణానికి ‘బిల్లు కట్టి చూడు’ అనేదే సవాల్‌. కానీ ఆ ఇల్లు కట్టడంలోకూడా పొట్టివాడికి కొంత డబ్బు ఆదా అవుతుంది. గృహ ద్వారబంధాల ఎత్తు తగ్గిస్తే డబ్బు కలిసి వస్తుంది. అంతే కాదు, పొట్టివాడిగా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? కాళ్లు బెర్తును దాటి బయటికి రావు కాబట్టి రైల్లో ప్రశాంతంగా పడుకోవచ్చు. బస్సుల నుంచి విమానాల వరకూ ఎక్కడైనా దర్జాగా ఏ ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. 
      పొట్టివాడిగా ఉండటం అన్నిటికన్నా ‘ప్రధాన’ం. ఉదాహరణకు మన దేశానికి రెండవ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి పొట్టివారు. పాకిస్తాన్‌కు తిరుగులేని గుణపాఠం చెప్పిన మహానుభావుడు. అలాగే నిజాంను ఎదిరించిన మహాకవి దాశరథి పొట్టివాôే. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్థాన కవిగా చేశారు. 
      ఆరడుగుల అందగాడంటూ తెలుగువారు పొడుగుకూ అందానికీ ముడిపెడతారు. కానీ, ‘షార్ట్‌ అండ్‌ స్వీట్‌’ అని ఇంగ్లిషువాడు ఎక్కడో చెప్పి ఏడ్చాడు. పొట్టిగా ఉన్నవాడు తియ్యగా ఉంటే సరిపోతుంది. అతగాడి శ్రమ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా పొట్టికి పట్టంకట్టిన తెల్లవాళ్లను       గడగడలాడించిన టిప్పు సుల్తాన్‌ కూడా పొట్టివాడేనని చరిత్రకారులు పొల్లుపోకుండా చెప్పారు. 
      పొడుగుతో పోటీపడితే పొట్టి నిస్సందేహంగా గెలుస్తుంది. కావాలంటే మన అనధికార జాతీయ క్రీడ క్రికెట్లో చూడండి.. తాడెత్తు బౌలర్లు విసిరే బంతుల్ని లాగిపెట్టి మైదానం బయటికి కొట్టే బ్యాట్స్‌మెన్లలో గట్టివారు పొట్టివారే కదా. గావస్కర్, సచిన్, సెహవాగ్, బ్రెండన్‌ మెక్‌కల్లామ్, డేవిడ్‌ వార్నర్, అజింక్య రహానె.. ఇలా ఎందరు లేరు చెప్పండి! 
      మందులు వాడో మంత్రాలు వాడో పొట్టివాడు పొడుగువాడు కావచ్చుగానీ, పొడుగువాడు పొట్టికావడం దుర్లభం. పొట్టివాడు సహజసిద్ధమైన కారణాలవల్ల దారుణాలకు ఒడిగట్టడు. అహింసాపరంగా ఉంటాడు. ఎంత కోపమొచ్చినా ఎదుటివాణ్ని (అతడు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల) అంత తేలిగ్గా కొట్టలేడు. పొడుగువాణ్ని చేసుకోవాలి, పొడుగువాణ్ని చేసుకోవాలని అమ్మాయిలు కలలు కంటారు గానీ పొట్టివాణ్ని చేసుకుంటే ప్రాణం ఎంత హాయిగా ఉంటుందో ఊహించుకోలేరు.
      ‘‘పొట్టి పొట్టి పొట్టిదాన’ అన్న జానపద గీతం విన్నా చాలు మనసు పరవశమందుతుంది. పొట్టి పిల్లా అనే పాట కూడా ఆనందంలో ముంచెత్తుతుంది. ఇలాంటివి యవ్వనంలో ఉన్నవాళ్లను ఆకర్షిస్తే, పొట్టి సంగీతం ఆ ‘బాల’ గోపాలాన్ని అలరిస్తుంది. 
      పొట్టివాళ్లకు ఉన్న సంస్కారం పొడుగువాళ్లకు ఎప్పుడు రావాలి? పొడుగువాళ్లు పొట్టివాళ్లను ఎగతాళి చేస్తారు గానీ పొట్టివాళ్లు పొడుగువాళ్లను చూసి మందు కొట్టి తూలినప్పుడు కూడా మాట తూలరు. సంస్కారం అంటే అదీ! సభ్యత అంటే ఇదీ! 
      పొట్టివాడు గట్టివాడు అంటారు. ఒట్టివాడు అని సృష్టి మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు అన్న పాపాన లేదు.
      ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. అలాగే పొట్టివాడు పుట్టినా, చచ్చిపోయినా ఇబ్బంది పెట్టడు. పొట్టివాడు పుట్టినప్పుడు కన్నతల్లికి భారం కాడు. చనిపోయాక పుడమి తల్లికి కూడా భారం కాడు. పొట్టివాడూ జిందాబాద్‌!


వెనక్కి ...

మీ అభిప్రాయం