ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా!

  • 172 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డి.కస్తూరి రంగనాథ్‌

  • షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా
  • 8008573907
డి.కస్తూరి రంగనాథ్‌

‘‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం.. మింగినాను హలాహలం’’.. ఇది ఓ ప్రేమికుడి హృదయఘోష. క్షీరసాగర మథనంలో అమృతంతో పాటు హాలాహలం పుట్టినట్టు, ప్రేమసాగర మథనంలో మధురానుభూతులు, మరపురాని జ్ఞాపకాలతోపాటు విరహవేదనలు, విషాద కథలూ జనిస్తాయి. ‘‘మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది’’ అంటూ మనసు గాయాల బాధను పంటిబిగువన ఓర్చుకునే ప్రేమికులెందరో! ఆ భగ్న హృదయాల ప్రణయ లోతులను చూడాలంటే సినీ సాహితీ సాగరంలోకి ప్రవేశించాల్సిందే!
‘‘మనసున
ఉన్నదీ.. చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా’’ అనుకునే వెండితెర ప్రేమికులకు కవుల కలాలే కదా గళాలవుతాయి. చిలిపి సరదాల ప్రేమ పాటల నుంచి ఆలుమగల అనుబంధ గీతాల వరకూ తెలుగు సినిమాల్లో ప్రణయ సాహిత్యం పరవళ్లు తొక్కింది. ఆ అక్షర ప్రవాహంలో ప్రత్యేక పాయ.. విరహ, విషాద ప్రేమగీతాలు. ఒకటిగా పెనవేసుకు పోయిన హృదయాలు తాత్కాలికంగానో, శాశ్వతంగానో దూరమైపోయిన దృశ్యాలకు తగిన పాటలు రాయడమంటే.. ఆ ప్రేమికుల గుండెల్లోకి పరకాయ ప్రవేశం చేయడమే. ఆనాటి పింగళి, సముద్రాల నుంచి మనసుకవిగా ముద్రపడిన ఆత్రేయ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, సినారె, వేటూరి, సీతారామశాస్త్రి, చంద్రబోస్‌లను దాటి నేటి రామజోగయ్యశాస్త్రి, అనంత్‌శ్రీరాంల వరకు ఎందరో కవులు భగ్నపేమికుల మనసును మన ముందు పరిచారు.
ప్రేమే నేరమౌనా..
‘‘మాపై పగేలా’’.. అంటూ పెద్దలు నిర్మించిన అడ్డుగోడలను తలచుకుంటూ విలపించే యువతీ యువకులది నాటి తరం. 1940-50 దశకాల్లో ప్రేమికులు పిరికివారు. ప్రేమ విఫలమైతే తట్టుకోలేకపోయారు. విషాద ప్రేమకథలకు ఆద్యులైన ‘లైలా మజ్ను’ల గాథలో ఎదురైన అగాథాలను స్పృశిస్తూ సాగిన పై గీతమే దీనికి ఉదాహరణ. ఇదే చిత్రంలో విడిపోయిన ప్రేయసిని తలచుకుంటూ ‘‘విధి బలీయమని తెలుసు.. తెలుసు నాకు నీ మనసు.. తనువులు వేరైనా మన మనసొకటేనే ప్రియతమా’’.. అంటూ సాగే గీతం అప్పటి ప్రేమికులతో కంటతడి పెట్టించింది. ‘‘ఏడ తానున్నాడో బావా.. జాడ తెలిసిన పోయిరావా.. అందాల ఓ మేఘమాల.. మమతలెరిగిన మేఘమాలా.. నా మనసు బావకు చెప్పిరావా’’.. అంటూ ‘మల్లీశ్వరి’ పడే ఆవేదనకు దేవులపల్లి అక్షరరూపం నేటికీ సజీవం. ‘‘ప్రేమ కన్న మరి పెన్నిధి ఏమని, ఏమి ధనాలు తెత్తునని.. సమసి చూచు ఆ రాజ కుమారిని నిమిషమె యుగముగ గడపమని ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు’’.. అంటూ సాగే పింగళి గీతం ‘పాతాళభైరవి’ని చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించింది. 
      ‘దేవదాసు’ చిత్రంలో సముద్రాల రాఘవాచార్య కలంలోంచి జాలువారిన సిరాచుక్కలు శ్రోతల కళ్లలో కన్నీటిచుక్కలయ్యాయి. ఆ గీతాలు తెలుగువారి గుండెల్లో నేటికీ పదిలంగా ఉండిపోయాయి. ప్రేమ దూరమై బతుకు భారమైనప్పుడు ‘‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా.. ఆశా నిరాశేనా.. మిగిలేదీ చింతేనా’’.. అంటూ ప్రేయసిపడే వేదన గుండెలను పిండేస్తుంది. ‘‘కల ఇదనీ.. నిజమిదనీ.. తెలియదులే.. బ్రతుకింతేనులే’’ అనే ప్రియుడి ఆవేదన, ‘‘జగమే మాయ.. బ్రతుకే మాయ..’’ అంటూ పలికే వైరాగ్యం, ‘‘కుడియెడమైతే పొరపాటు లేదోయ్‌.. ఓడిపోలేదోయ్‌.. సుడిలో దూకి ఎదురీదకా.. మునకే సుఖమనుకోవోయ్‌’’.. అని తనను తాను ఓదార్చుకున్న తీరు ఎప్పటికీ అజరామరమే. ఇదే దశాబ్దంలో ‘‘పేదలనే రాజులనే పేరునా.. ప్రేమికుల బలిగొనే జహాపనా’’.. అన్న ‘అనార్కలి’ కన్నీటికి సముద్రాల అక్షర రూపమిస్తే.. ‘‘పెనుచీకటాయె లోకం.. చెలరేగే నాలో శోకం.. విషమాయె మా ప్రేమా.. విధియే పగాయె’’.. అన్న ప్రేయసి పరివేదనను శ్రీశ్రీ తన కలంతో పలికించారు. ‘‘వెన్నెల కూడా చీకటియైనా.. మనసున వెలుగే లేకపోయినా.. నీకోసమె నే జీవించునది.. ఈ విరహములో..ఈ నిరాశలో’’ అన్న శశిరేఖ అభిమన్యుల ఎడబాటును ‘మాయాబజార్‌’లో బొమ్మకట్టారు పింగళి.  
మనసు కవి మాటలు
తరాలు మారుతున్న కొద్దీ 1960- 70 దశకాల్లో ప్రేమికుల్లో కొంత మార్పు కనిపించింది. ప్రేమంటే ప్రాణాలు తీసుకోవడమే కాదు.. త్యాగాలు చేయాలి; ప్రేమించిన వారికోసం ఎంత దూరమైనా వెళ్లాలనే ధోరణి వచ్చింది. ‘‘సమాజానికీ, దైవానికీ బలియైతి నేను.. వెలియైతినే.. ఓ బాటసారి.. నను మరువకోయి’’.. అన్న ప్రియురాలి మూగవేదనతో మొదలైన 60వ దశకంలో ‘‘ఎక్కడ ఉన్నా ఏమైనా.. మనమెవరికి వారై వేరైనా.. నీ సుఖమే నే కోరుకున్నా.. నినువీడి అందుకే వెళుతున్నా’’.. అంటూ త్యాగం చేసే స్థాయికి ప్రేమికుడు ఎదిగాడు. ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ.. జరిగేవన్నీ మంచికనీ.. అనుకోవడమే మనిషి పనీ’’ అనుకుంటూ తనను తాను సమాధానపరచుకున్నాడు. ‘‘వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా.. మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువుకదా’’ అని ప్రేమికులకు నీతిబోధ చేశాడు.    ‘‘వలపుకన్నా తలపే తీయనా.. కలయికకన్నా కలలే తీయన.. చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా.. నిన్నకన్నా రేపే తీయనా.., కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..’’ అంటూ ఊహల ప్రపంచాలు, తీయని జ్ఞాపకాలే చాలని 70వ దశకపు ప్రేమికుడు చాటి చెప్పాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఇలాంటి పాటలతో ఆత్రేయ మనసుకవిగా మారిపోయారు. ప్రేమబాధలో కూరుకుపోయిన ఎందరో ప్రేమికులకు తన అక్షరాల ద్వారా ఓదార్పునిచ్చారు. ‘‘మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే.. మనసున్న మనిషికీ సుఖములేదంతే’’ అంటూనే ‘‘అంతా మట్టేనని తెలుసు.. అదీ ఒక మాయేనని తెలుసు.. తెలిసీ తెలిసీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు’’ అని ప్రశ్నించారు. ‘‘మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష’’ అంటూ నిందించారు. ‘‘మనసు లేని బతుకొక నరకం.. మరువలేని మనసొక నరకం.. మనిషికెక్కడ ఉన్నది స్వర్గం.. మరణమేనా దానికి మార్గం’’ అంటూ పూర్తి వైరాగ్యాన్ని పలికిస్తూనే, ‘‘పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు’’ అంటూ ఉత్తేజాన్నీ నింపారు. ‘‘మనసు మూగది మాటలు రానిది.. మమత ఒకటే అది నేర్చినది.. భాష లేనిది బంధమున్నది.. మన ఇద్దరినీ జతకూర్చినది’’ అని మనసు గొప్పతనాన్ని చాటుతూనే ‘‘మౌనమె నీ బాధ ఓ మూగమనసా.. తలపులు ఎన్నయినా కలలుగ కంటావు.. కల్లలు కాగానే కన్నీరవుతావు’’ అంటూ దాని మీద జాలిపడ్డారు. 
      ‘‘నేనొక ప్రేమ పిపాసినీ.. నీవొక ఆశ్రమ వాసివీ.. నా దాహం తీరనిదీ.. నీ హృదయం కరగనిదీ’’ అంటూ ప్రేమకోసం తపించింది నాటి యువత! ‘‘మరుమల్లియ కన్నా తెల్లనిది.. మకరందము కన్నా తీయనిదీ మన ప్రణయం అనుకుని మురిసితిని.. అది విషమని చివరకు తెలిసినదీ’’ అని ఇష్టసఖిని నిష్ఠూరమాడే ప్రియులు, ‘‘నీ చెలిమే నేను కోరితినీ.. ఈ క్షణమే ఆశవీడితినీ’’ అని త్యాగాలు చేసిన ప్రియురాళ్లు ఈ రెండు దశాబ్దాల్లో ఎందరో ఉన్నారు. అయితే ‘‘కలచెదిరిందీ.. కథమారింది.. కన్నీరే ఇక మిగిలిందీ’’ అంటూ ప్రేమకోసం ప్రాణాలు అర్పించిన కొత్త దేవదాసులు; ‘‘విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్టలే’’నని నమ్మి ప్రేమకు బలైన యువతీ యువకుల ‘మరోచరిత్ర’ను కూడా ఈ దశాబ్దపు ద్వితీయార్థం కళ్లకు కట్టింది. ‘‘ఏనాడు గెలిచింది వలపు.. తానోడుటే దాని గెలుపు.. గాయాన్ని మాన్పేది మరుపు.. ప్రాణాన్ని నిలిపేది రేపు’’ అంటూ ప్రేమికులకు ధైర్యానిచ్చింది. ‘‘ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం.. ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం’’ అన్న సందేశంతో ముగిసింది.
వందనం.. అభివందనం..
తాను మరణిస్తున్నానని తెలిసి, ప్రేయసికి మరో పెళ్లి చేసి ‘‘ఆగదు ఏ నిమిషము నీకోసమూ.. ఆగితే సాగదు ఈ లోకము’’ అంటూ ‘ప్రేమాభిషేకం’ చేశాడో కథానాయకుడు. ‘‘ఆకాశదేశానా.. ఆషాఢ మాసానా.. మెరిసేటి ఓ మేఘమా.. విరహమో.. దాహమో.. విడలేని మోహమో.. వినిపించు నా చెలికీ మేఘసందేశం’’ అంటూ కళాకారిణి ప్రేమలో పడి కట్టుకున్న ఇల్లాలికి దూరమయ్యాడో నాయకుడు. ‘‘అమరం అమరం మనకథ అమరం.. ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం.. ఏ చరిత్ర రాయని కావ్యం’’ అంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ జంట.. ‘‘ప్రేమలేదని ప్రేమించరాదని సౌఖ్యమే లేదని’’ నిందిస్తూనే చివరికి గెలిచిన ప్రియుడి కథలతో ప్రారంభమైన 1980- 90 దశకాల్లో సాహసవంతులైన ప్రేమికులు కనిపిస్తారు. ‘‘ఇది హోరుగాలి అని తెలుసు.. అది వరద పొంగు అని తెలుసు.. హోరుగాలిలో, వరద పొంగులో మునక తప్పదని తెలుసు.. అయినా పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం’’ అంటూనే కష్టాలకోర్చి ప్రేమ నావను ఒడ్డుకు చేర్చిన యువకులు, ‘‘ప్రేమంటే తెలుసా నీకు.. తెలియందే ప్రేమించకూ.. మనసిచ్చానని.. బదులే లేదని పిచ్చిగా నిందలు వేయకూ.. ప్రేమను చిచ్చుగా మార్చకూ’’ అంటూ తమను తాము తెలుసుకుని ప్రేమించిన అమ్మాయికి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసిన వారూ ఉన్నారు. ‘‘ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే ప్రతిరూపమా.. నా గుండెలో నిండినా గానమా.. నను మనిషిగా చేసినా త్యాగమా’’ అంటూ దూరమైన ప్రేయసిని తీయని జ్ఞాపకంగా మార్చుకుని ముందుకు సాగినవారూ లేకపోలేదు. ‘‘వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ.. దీపమేమో మత్తుగా తిరుగుతున్నదీ.. ధూమమేమో విరగబడి కాల్చుచున్నదీ.. నీ చివరి పిలుపు కొరకు.. ఈ చావు రాని బతుకు వేచి వేచి వేగలేక ఎదురు చూస్తున్నదీ.. ప్రేయసి రావే.. ఊర్వశి రావే’’ అంటూ విలపించిన ప్రేమికులు; ‘‘నిప్పులోన కాలదు.. నీటిలోన నానదు.. గాలిలాగ మారదు.. ప్రేమ సత్యము.. గగనాలు భువనాలు తిరిగేది ప్రేమతో.. ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ’’ అని నినదిస్తూ ప్రేమయాత్రలు చేసినవారూ కొల్లలు. ‘‘గగనానికి ఉదయం ఒకటే..కెరటానికి సంద్రం ఒకటే.. జగమంతట ప్రణయం ఒకటే’’ అని నిరూపిస్తూ ప్రేయసికి తనకు ఇష్టమైనవారితో పెళ్లి జరిపించి, ‘‘ఆనందమానందమాయే.. మది ఆశల నందనమాయే’’ అంటూ ప్రేమకథలకు కొత్త ముగింపునిచ్చిన ప్రేమికులు ఈ దశాబ్దాల్లో కనిపిస్తారు. ‘‘దీపాన్ని చూపెడుతుందో.. తాపాన బలి పెడుతుందో.. అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం.. ఏ క్షణాన - ఎలాగ మారునో ప్రేమించే హృదయం’’ అంటూ ‘ఆలయాన హారతిలో, ఆఖరి చితి మంటలలో’ కన్నవారిని దూరం చేసుకున్న ప్రేమికులు ఈ కాలంలోనే అందరినీ ఏడిపించారు. ‘‘రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ. జ్యోతిని జ్వాలగ మార్చే ప్రేమ.. నీతి మరచి యేమార్చే ప్రేమ.. ఇదేనా ప్రేమ’’ అని ద్వేషిస్తూనే.. ‘‘ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా’’ అని నిలదీస్తూనే ప్రేమకేతనం ఎగరేసిన వారున్నారు. విభిన్న ప్రేమకథలకు అద్దంపట్టిన ఈ దశాబ్దాలు మరపునకు రానివి!
ఏ చోట ఉన్నా..
కొత్త సహస్రాబ్దిలోకి అడుగు పెట్టాక ప్రేమికుడి శైలి పూర్తిగా మారిపోయింది. వారికి తగ్గట్టుగానే కవులు కూడా జీవితంలో బాధనూ ఆహ్వానించాలని, ఆస్వాదించాలనే ప్రేరణతో తమ కలాలు కదిలించారు. ‘‘నీ కోసమే.. ఈ అన్వేషణ.. నీ ధ్యాసలో ఈ ఆలాపన.. ఎడబాటు రేపిన విరహవేదనా నరకయాతనా.. కాలమే దీపమై దారి చూపునా’’ అంటూ జంట హృదయాలు తపించినా- ‘‘వేయి జన్మాల  చెలిమి నీవే.. తెలుసు నా గుండెకీ.. కోటి దీపాల వెలుగు నీవే.. తెలుసు నా కంటికీ’’ అంటూ తమ ప్రేమను గెలుచుకున్నారు. ‘‘ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం.. గతమంటూ ఏంలేదని తిరిగిందా మన జ్ఞాపకం.. కనులు మూసుకొని ఏం లాభం.. కలై పోదుగా ఈ సత్యం.. ఎటూ తేలనీ ఈ మౌనం.. ఎటో తెలియని ప్రయాణం.. కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు.. చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు’’ అంటూ తమ స్నేహాన్ని అవాంతరాలు దాటించి ప్రేమగా మలచుకున్నారు. ‘‘ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ.. ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ.. అర్థం కాని పుస్తకమే అయినా గానీ ఈ ప్రేమ.. జీవిత పరమార్థంలాగే అనిపిస్తుంది ఈ ప్రేమ’’ అంటూ ప్రేమకోసం పరితపించి; ‘‘ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా.. సముద్రమంతా నా కళ్లల్లో కన్నీటి అలలవుతుంటే.. ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే.. రేపులేని చూపు నేనై.. శ్వాసలేని ఆశనేనై మిగలనా.. నువ్వే నువ్వే కావాలంటూంది పదేపదే నాప్రాణం’’ అంటూ మనసులు ఇచ్చిపుచ్చుకున్న జంటలు కన్నుల పంటలు పండించాయి. 
      ‘‘నువ్వే నా శ్వాస.. మనసున నీకై అభిలాష.. చితికైన నీతోనే.. వెతికేది నేనిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ’’ అంటూ ప్రియురాళ్లు; ‘‘ఊరుకో హృదయమా.. ఉప్పెనై రాకుమా.. మాట మన్నించుమా.. చెయ్యెత్తి దీవించే వేళ.. నీ కంటిలో జలపాతాలా’’ అని కుంగిపోయిన ప్రియులూ; ‘‘పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి.. కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి.. నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే.. నిను చేరుకోనిదే గుండెకు సందడుండదే’’ అంటూ ప్రేమతీరాల్లో కలుసుకున్నారు. కలలు నిజం చేసుకున్నారు. ‘‘నువ్వు ఎవ్వరి యెదలో పువ్వుల రుతువై ఎప్పుడు వస్తావో.. నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు వెళతావో.. తెలియదే ఎవ్వరికీ.. తేలదే ఎప్పటికీ.. తీరాలు లేవే ప్రేమా నీ దారికీ’’ అంటూ కుమిలిపోయే వారిని ఓదార్చుతూ ప్రేమ జీవితంలో భాగమే.. ప్రేమే జీవితం కాదని చాటిన ప్రేమికులూ చాలామందే ఉన్నారు. 
పోయే పోయే..
‘‘ఓ మై బ్రదరు.. చెపుతా వినరో వన్‌సైడు లవ్వేరా.. ఎంతో బెటరు.. నా సలహాలు వింటే అసలు.. ఇకపైనా ఎవరూ మరి మజ్నూలవరు’’ అంటూ ప్రేమికులకు కొత్తదారి చూపిన కథానాయకులూ వచ్చారీ కాలంలో! ‘‘వన్‌వే రూటులో వెళ్లిపో సూటిగా.. ఎవరూ ఎక్కడా ఆపరు గనుక.. వన్‌సైడ్‌ ప్రేమనే చేసెయ్‌ స్వేచ్ఛగా.. ప్రేమను ఇమ్మనీ అడగవు గనక.. మదన పడి మెదడు చెడే ట్రాజిక్ లవ్‌ కన్నా.. అసలు ఫెయిలయ్యే ఛాన్స్‌లేని వన్‌సైడ్‌ లవ్‌ మిన్నా.. ఈ కిటుకే తెలిసి ఉంటె దేవదాసు ఐనా.. కుడి యెడమైతే పాటపాడి గ్లాసు దాసుడౌనా’’ అంటూ హితబోధ చేశాడు. ‘‘నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని.. నీ ప్రేమే లేకుంటే బతికేదీ ఎందుకనీ.. ఎవరికి చెప్పుకోనూ నీకు తప్ప.. కన్నులకు కలలు లేవు నీరు తప్ప’’ అని ప్రేమ విఫలమై బతుకుతున్నవారికి ‘‘నిన్నలా మొన్నలా లేదురా.. ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా.. అన్నిటా అంతటా తొందరా.. రొమాన్సు పద్దతే మారిపోయిందిరా’’ అంటూ నచ్చజెప్పాడు మరో ప్రేమికుడు. ‘‘విరహాలు.. వియోగాలు బీసీ నాటి సరంజామ.. అవి నీకు అవసరమా’’ అంటూ భుజంతట్టాడు.  
      ‘‘ఎప్పటికీ తన గుప్పెట విప్పదు.. ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు.. తప్పుకునేందుకు దారినివ్వదు.. తప్పు అనేందుకు కారణముండదు.. చిక్కుల్లో పడడం తనకేం సరదా.. బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా.. అలలు ఆగని సంద్రంలా మది ఆగితే ఎలా’’ అనుకుంటూ ఓ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రేమికుడికి విఫలప్రేమే చరిత్ర సృష్టిస్తుందని చెప్పాడు ‘ఆర్య’ అనే కుర్రాడు. ‘‘మైలవ్‌ ఈజ్‌ గాన్‌’’ అని గర్వంగా ప్రకటించుకున్నాడు. ‘‘పోయే పోయే లవ్వే పోయే.. పోతే పోయిందే.. పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే’’ అని నృత్యం చేశాడు. ‘‘వెలుగంత ఆరిపోయె, కథ మారిపోయె ఇక చీకటెంత బాగుందే.. గెలుపంత జారిపోయె, నను వీడిపోయె ఇక ఓటమెంత బాగుందే’’ అంటూ నవ్వాడు కూడా! ‘‘ప్రేమించి గెలిచినోళ్లు.. షాదీ జరిగినోళ్లు ఇళ్లలోనే మిగిలిపోతారే.. లవ్‌ చేసి ఓడినోడు.. లోకాన్నేలుతాడు.. హిస్టరీలోన మిగిలిపోతాడే’’ అంటూ చరిత్రకెక్కిన భగ్న ప్రేమికులను గుర్తుచేసి ఊరడించాడు. 
      మనసు పిచ్చిది. ‘‘అడిగా అడిగా ఎదలో లయనడిగా.. కదిలే క్షణమా చెలి ఏదనీ.. నన్నే మరిచా.. తన పేరే తలచా.. మదినే అడిగా తన ఊసేదనీ’’ అంటూ హృదయాన్ని కలవరపరుస్తుంది. ‘‘నమ్మక తప్పని నిజమైనా.. నువ్విక రావని చెబుతున్నా.. ఎందుకు వినదో నా మది ఇపుడైనా’’ అని తపించేలా చేస్తుంది. ఈ క్రమంలో ‘‘వరించే ప్రేమా నీకో వందనం.. సమస్తం చేశా నీకే అంకితం.. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై నేను చేసినానే క్షణమొక యుగమై’’ అంటూ నిట్టూర్చేవారూ ఉంటారు. ‘‘ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే’’ మిగిలినవారు, ‘‘ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా.. చెరో ప్రపంచం చేరిన వారూ’’ కనిపిస్తుంటారు. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ భాషలో చెప్పాలంటే.. కోల్పోయిన ప్రేమను తలచుకుని కుమిలేకంటే- హత్యలు, ఆత్మహత్యల్లాంటి దారుణాలకు తెగించేకంటే తమ కాలనీకి వచ్చిన మరో ఐశ్వర్య కోసం వెతకడం మంచిది!! ఇంతకూ దాదా గారేమంటారంటే- ‘‘ఓడిపోవడం తప్పుకాదురా.. చచ్చిపోవడం తప్పుసోదరా.. చావొక్కటే దారంటే ఇక్కడుండేవాళ్లు ఎంతమందిరా.. జీవితం అంటె జోక్‌ కాదురా.. దేవుడిచ్చినా గొప్ప గిఫ్టురా.. దాన్ని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికీ లేదురా.. నవ్వేయరా.. చిరు చిందేయరా.. బాధకూడ నిన్ను చూసి పారిపోద్దిరా.. దాటేయరా.. హద్దు దాటేయరా.. ఏ ఓటమీ ఇంక నిన్ను తాకలేదురా’’! భగ్నప్రేమికులూ వింటున్నారా..!


వెనక్కి ...

మీ అభిప్రాయం