ప్రపంచీకరణ, ఇతర కారణాల వల్ల ఏటా ప్రపంచంలో ఎన్నో భాషలు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు మానవ సమూహాల జీవన వాహికలుగా నిలిచినవే. వారి పురోగతికి తోడ్పడినవే. ఇవి అంతరించడమంటే ఒక జాతి సంస్కృతి, సంగీతం, కళలు లాంటివన్నీ కనుమరుగవడమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే అంతరించే భాషల్ని పరిరక్షించేందుకు శ్రమిస్తోంది ‘వికీటంగ్స్’. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా ఈ సంస్థ నిస్వార్థ కృషి మీద ప్రత్యేక వ్యాసమిది..
ప్రపంచంలో దాదాపు ఏడు వేల పైచిలుకు భాషలున్నాయి. వీటిలో ఇరవై మూడు భాషల్ని సగానికి పైగా ప్రపంచ జనాభా మాట్లాడుతోంది. మిగిలిన వాటిలో మూడో వంతు కేవలం పదివేలలోపు ప్రజలు మాట్లాడేవే. ఇవన్నీ క్రమంగా అంతర్ధానమయ్యే దశకు చేరుకుంటు న్నాయి. ప్రాంతీయ భాషల్ని పరిరక్షించుకోకపోతే ప్రస్తుతం ఉన్న 50 నుంచి 90 శాతం భాషలు ఈ శతాబ్దం చివరి నాటికి అంతరించి పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రతి రెండు వారాలకు కనీసం ఒక భాష తన ఉనికిని కోల్పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యునెస్కోతో పాటు అనేక సంస్థలు ప్రపంచంలోని భిన్న భాషలు, సంస్కృతులను కాపాడేందుకు స్వచ్ఛందంగా కృషిచేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ వికీటంగ్స్. అమెరికాలోని బ్రూక్లిన్ కేంద్రంగా ఇది పనిచేస్తోంది.
వీడియోల రూపంలో
న్యూయార్క్కి చెందిన చరిత్రకారుడు, డిజైనర్ డానియల్ బోగ్రే యుడెల్, డిజైనింగ్ సాంకేతిక నిపుణుడు ఫ్రెడ్డీ ఆండ్రేడ్, దక్షిణాఫ్రికాకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ లిండీ బెట్స్ కలిసి 2014లో ‘వికీటంగ్స్’ సంస్థను స్థాపించారు. స్పెయిన్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి స్థానిక భాష కాటలాన్ మీద స్పానిష్ ఆధిపత్యం, కాటలాన్ ప్రజల ఆవేదన చూసి డానియల్ బోగ్రేకి అంతరించే భాషల పరిరక్షణ ఆలోచన వచ్చింది. మిగిలిన ఇద్దరు ఆయనకు జతకలిశారు. అంతరించిపోతున్న భాషల్ని వీడియోల రూపంలో నమోదు చేసి ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తేవడం వికీటంగ్స్ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో అన్ని ఖండాల్లో నలభైకి పైగా దేశాల్లోని 170 భాషల వ్యాకరణం, సంస్కృతి, సంప్రదాయాల సమాచారాన్ని వికీటంగ్స్ భద్రపరిచింది. ప్రతి భాషకు సంబంధించి దాదాపు 305 నిమిషాల వీడియోలు రూపొందించింది. 70 దేశాలకు చెందిన 400 భాషల ఉచ్చారణను నమోదు చేసే వెయ్యి వీడియోలను ఒకచోటికి తెచ్చింది. ముగ్గురితో మొదలైన ఈ సంస్థకు ప్రస్తుతం ప్రతి ఖండంలో వెయ్యి మందికి పైగా వలంటీర్లు, ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల మంది ప్రత్యేక ప్రతినిధులున్నారు.
ప్రపంచంలో అంతరించే దశలో ఉన్న ఎన్నో భాషలు తమకంటూ ప్రత్యేక లిపి లేనివే. వీటిని వీడియోల రూపంలో భద్రపరుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల సొంత భాషలో తమ అనుభవాలు చెప్పాలని అడుగుతున్నారు. అలా ఆ భాషల పదాలు సేకరిస్తున్నారు మాట్లాడే సమయంలో పదాల ఉచ్చారణ, వ్యక్తి హావభావాలు, భావోద్వేగాలు లాంటి వాటిని నిశితంగా రికార్డు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రికార్డు చేసిన తర్వాత ఆ పదాలను వింగడించి నిఘంటువులు రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల వీడియోలకు సబ్టైటిళ్లు అందించే భాషాసేవా సంస్థ ‘అమరా’ వీకీటంగ్స్కు సబ్టైటిళ్లు ఇస్తోంది. సమాచారం సేకరించే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలను కూడా వలంటీర్లు wikitongues.org వెబ్సైట్లో పంచుకుంటున్నారు. ఎనభై ఆరేళ్ల మరియా విల్కాక్స్ ‘ఉక్చుమ్నీ’ అనే అమెరికన్ గిరిజన భాషను మాట్లాడు తున్న ఏకైక వ్యక్తి. వికీటంగ్స్ ఆమెను కలిసి ఆ భాష గురించి బయటి ప్రపంచానికి తెలియజేప్పే ప్రయత్నం చేసింది. ఆ భాషా నిఘంటువు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా విభిన్న దేశాలకు చెందిన భిన్న భాషలను ఈ సంస్థ నమోదు చేస్తోంది.
భారతీయ వీడియోలు
ప్రస్తుతం అంతర్జాలం విస్తృతమవడంతో ఆయా భాషల సమాచారం సేకరించడం వికీటంగ్స్కు సులువైంది. తమ వెబ్సైట్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తమ భాషకు సంబంధించిన పరిశోధనలు, వ్యాసాలు, ప్రాజెక్టులు, వీడియోలను పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాజకీయం, విద్య, సంస్కృతి లాంటి వాటితో భాషకున్న సంబంధం గురించిన వ్యాసాలూ ఈ సైట్లో కనిపిస్తాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వికీటంగ్స్ తన కార్యక్రమాలను పంచుకుంటోంది. ప్రస్తుతం కిక్స్టాటర్ సంస్థ సహకారంతో ‘పోలి’ అనే సాప్ట్వేర్ను వికీటంగ్స్ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఆసక్తి ఉన్న వారు నచ్చిన భాషలు నేర్చుకోవచ్చు. మొదట్లో వికీటంగ్స్ వ్యవస్థాపకులే సొంత ఖర్చులతో ఆయా ప్రాంతాలకు వెళ్లి భాషల్ని రికార్డు చేశారు. ప్రస్తుతం విరాళాలతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వికీటంగ్స్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు, హిందీ, భోజ్పురి, భాగ్రి (వాయవ్య భారత్), గర్వాలీ (ఉత్తరాఖండ్), కురుక్స్ (ద్రవిడ భాష), శ్రీలంక తమిళం, మార్వారీ (రాజస్థానీ మాండలికం), సంతాలీ, కశ్మీరీ, బీజాపూర్ కన్నడ, బెంగాలీ, హర్యాన్వీ లాంటి 30 దాకా భారతీయ భాషల వీడియోలు నిమిషం నుంచి పది నిమిషాల నిడివిలో ఉన్నాయి.
ఆయా రంగాల ప్రముఖులు మాట్లాడే టెడ్ టాక్స్ లాంటి వేదికల్లో కూడా వికీటంగ్స్ గురించి చాలా మంది ప్రసంగించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు, ప్రస్తుత కార్యనిర్వాహక సంచాలకులు డానియల్ బోగ్రే యుడెల్ కూడా ఈ వేదిక మీద మాట్లాడారు. ‘‘మన శత్రువుల సంస్కృతిని నాశనం చేస్తే వాళ్లని కూడా అంతమొందించినట్లే అని 1892లో అమెరికన్ జనరల్ రిచర్డ్ హెన్రీ ప్రాట్ తన సైనిక పటాలంతో చెప్పారు’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ‘‘భాషలనేవి కేవలం భావాల్ని పంచుకునేవే కాదు, మనల్ని మనలాగా ఉంచేవి కూడా’’ అంటూ మాతృభాషల ప్రాముఖ్యాన్ని వివరించారు. కేవలం ముగ్గురితో ప్రారంభమై వికీటంగ్స్ ప్రస్తుతం ప్రపంచభాషా ఉద్యమంగా మారింది. మన దేశంలో కూడా ఎన్నో భాషలు.. ముఖ్యంగా గిరిజన భాషలు ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. వీటి పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. వీటి గొప్పదనం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలి. అప్పుడే మన సాంస్కృతిక విలువల్ని కాపాడుకోగలం.
‘‘ప్రపంచంలో వలసలు ఎక్కువయ్యాయి. బతుకు తెరువుకోసం నగరాలకు వెళ్తున్న వారు అక్కడి భాషను తప్పక నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో తల్లితండ్రులు తమ సొంత భాష కన్నా ఉపాధి కల్పించే భాషే ముఖ్యమనే భావ నతో పిల్లల్ని పెంచుతున్నారు. దీని వల్ల తమ పిల్లల్ని పరాయి భాష, సంస్కృతికి దాసులుగా చేస్తున్నామన్న విషయం గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యాలయాలను ఉపాధి కేంద్రాలుగా చూడటం మొదలుపెట్టాయి. స్వయం అభివృద్ధి గురించి ఆలోచించడం మరచిపోయి విదేశాలకు, విదేశీ కంపెనీలకు నౌకర్లుగా తమ పౌరులను తయారు చేయడమే గొప్పగా భావిస్తున్నాయి. అయితే, మాతృభాషను కోల్పోవడం వల్ల ఒక జాతి మొత్తం సాంస్కృతిక దోపిడీకి గురవుతుంది. తెలియ కుండానే వారి భాష, సంస్కృతి సమసిపోయి ఉపాధికల్పిస్తున్న వారి సంస్కృతిని ఆరాధించే పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా మనుషుల్లో ఉండే విభిన్న జీవన శైలులు అంతరించిపోతాయి. ఈ వైవిధ్యం కారణంగానే అంటురోగాలు లాంటివి ప్రబలినప్పుడు మొత్తం మానవాళి ఒకేవిధంగా ప్రభావితం కావడం లేదు. ఎవరి మాతృభాషను వాళ్లు తప్పనిసరిగా గౌరవించుకోవాలి. ప్రస్తుతం ఒకరిద్దరి నాలుకల మీద నిలిచి ఉన్న భాషలు కూడా ఒకప్పుడు ఎందరో పురోగతికి కారణమైనవే. ఆ గౌరవంతోనైనా వాటిని భద్రపరచాలి. వాటి ప్రత్యేకతను భావితరాలకు వివరించాలి. ప్రతి భాషలో దానికంటూ ప్రత్యేక శబ్దాలుంటాయి. అవి అక్కడి వాతావరణానికి తగ్గట్టు, అక్కడి ప్రజల జీవనశైలిని బట్టి ధ్వనిస్తాయి. వారి సంగీతం, గానాలకు ఆ ప్రత్యేకత ఉంటుంది. వాటిని మనం చేజార్చుకోకూడదు’’
- వికీటంగ్స్ బృందం