పోరాని చుట్టమొచ్చాడు బొడ్డువంచి కోయమన్నాట్ట 

  • 153 Views
  • 0Likes
  • Like
  • Article Share

కాకిగోల
‘‘ఎక్కువ నలుపైతే ‘కాకినలుపు’. ఎక్కువ గోలపెడితే ‘కాకిగోల’. గుంపుగా గుమికూడితే ‘కాకిమూక’. బారులు తీరి కూర్చుంటే ‘కాకులబడి’. హీనమైన బతుకు ‘కాకిబతుకు’. ఆకస్మిక చావు ‘కాకిచావు’. ముట్టరాని కూడు ‘కాకికూడు’. కర్ణకఠోర సంగీతం ‘కాకి సంగీతం’. కనిపించినంతనే పొడిచే పగ ‘కాకిపగ’. కుహనా బంగారం ‘కాకిబంగారం’. దిక్కూ దివాణం లేనివాడు ‘ఏకాకి’. లోకానుభవం లేనివాడు ‘పిల్లకాకి’. అపురూపమైంది ‘తెల్లకాకి’. నమ్మరాని కథ ‘కాకమ్మకథ’. లోకులు పలుగాకులు. చొరరానిది ‘కాకులు దూరని కారడవి’. కష్టనిష్ఠూరాలలో చిక్కుకున్నవాడు ‘కంపనబడ్డ కాకి’. పనికిమాలిన పనిచేయడం ‘కాకదంత పరీక్ష’. వీధిలో పారవెయ్యవలసింది ‘కాకి ముట్టిన కుండ’. ఇంత దేనికీ.. కాకి అంటేనే అల్పం అని నిఘంటు అర్థం!

-  నార్ల వెంకటేశ్వరరావు ‘పిచ్చాపాటీ’ నుంచి


పోరాని చుట్టమొచ్చాడు బొడ్డువంచి కోయమన్నాట్ట
వచ్చిన చుట్టం పట్ల విరసంగా ఉన్న సమయంలో ప్రయోగించే సామెత ఇది. వెనకటి రోజుల్లో ఇంటికి బంధువొస్తే తాంబూలమిచ్చి మర్యాద చేయడం ఆచారం. చుట్టానికి లేత తమలపాకులు కోసివ్వడం ఇష్టంలేని ఇంటి యజమాని, ఆకులు కోసేవాడితో బొడ్డువంచి కొయ్యమన్నాడట. జాగ్రత్తగా మంచి ఆకులు కోసివ్వు నాయనా! అనే భావన స్ఫురిస్తున్నా.. బొడ్డు వంచి కోస్తే తాంబూలానికి పనికిరాని ముదురాకులే గతి అనే అసలు అర్థమూ ఉంది.


అడ్డ
కొలత విశేషం. స్థలం అనే మరో అర్థం ఉంది. నింబోలిఅడ్డ అనేది హైదరాబాదులో ఓ స్థల నామం. రిక్షావాళ్ల అడ్డ అంటే రిక్షాలు నిలిపే స్థలం. శ్రీకాకుళంలో అడ్డ అంటే లైటు చిమ్నీ అనే అర్థముంది. ఎడ్లబండి ఇరుసు మీద అడ్డంగా బిగించే పెద్దకొయ్యను కోస్తాంధ్రలో ‘అడ్డ’ అని పిలుస్తారు. నీటి పారుదల, వాగు, ఏరు అనే అర్థంలో గడ్డ అనే మాట వాడుకలో ఉంది.


బంగాళాదుంప
పోర్చుగీసు వారు తెచ్చిన ఆహార పదార్థం. మొదట బెంగాల్లో దిగుమతి అయ్యి అక్కణ్నుంచే ఇతర ప్రాంతాలకు వ్యాప్తిచెందడంతో ‘బంగాళా దుంప’ అనే పేరొచ్చింది. గుండ్రంగా ఉంటుంది కాబట్టి కన్నడిగులు ఉరలగడ్డ అనీ, ఉర్దూ ప్రభావంతో తెలంగాణలో ఆలుగడ్డ అనీ అంటారు. 


ఆచంద్రతారార్కం 
ఆచంద్రతారార్కం అంటే చంద్రుడూ, నక్షత్రాలూ, సూర్యుడూ ఉన్నంతవరకూ అని. పూర్వం రాజులు తమ కీర్తి ప్రతిష్ఠలు శాశ్వాతంగా నిలిచిపోవాలని కోరుకునేవారు. సూర్యచంద్రులు, నక్షత్రాలు శాశ్వతమైనవి కాబట్టి అలా తమ పేరూ చిరకాలం నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ శాసనాల మీద ఆ బొమ్మలు చెక్కించేవారు. ఆచంద్రార్కం అంటే కేవలం సూర్య చంద్రులు. ఆచంద్రతారకం అంటే చంద్రుణ్ని, నక్షత్రాలనూ కలిపి చెప్పడం. ఆరవితారకం అంటే సూర్యుణ్ని, నక్షత్రాలను పేర్కొనడం. వీటిలోని ‘ఆ’కు ఆఙ అనే ఉపసర్గ మూలం. దీనికి పర్యంతం, హద్దు అని అర్థాలున్నాయి. ఆ కల్పం అంటే కల్పం ఉన్నంత వరకూ, ఆమరణాంతం అంటే మరణం వరకూ అని అర్థం. ఆమరణ నిరాహార దీక్ష కూడా ఇలా ఏర్పడిందే.


బొప్పాయి
పోర్చుగీసు వారి ఈ ఫలరాజానికి ‘పపయ, పప్పాయ, పొప్పడ, పొప్పాయి, బొప్పర, బొప్పాసి, బొప్పాయ’ అని రూపాంతరాలున్నాయి. కృష్ణా గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో బొబ్బాయి అని, మరికొన్ని చోట్ల పరంగికాయ అని వాడుక. పాశ్చాత్య దేశవాసులను ‘ఫరంగీలు’ అనేవారు అప్పట్లో! అలా ఇది ‘పరంగికాయ’ అయ్యింది. ‘మదనానప, కారుబొప్పాయి’ అని మరికొన్ని అర్థచ్ఛాయలున్నాయి. కన్నడంలో పప్పాయి, మలయాళంలో పప్పాయం, తుళులో ఒప్పంగాయ కొంకణిలో పొప్పాయిగా వ్యవహరిస్తారు. గోదావరి ప్రాంతాల్లో బొప్పాసి అనే నామాంతరం కనిపిస్తుంది.


గొర్తివెద - చల్లువెద
రైతు విత్తనాలు చల్లడంలో రెండు పద్ధతులు పాటిస్తాడు. దుక్కి దున్నిన తర్వాత విత్తనాల్ని చేతిలోకి తీసుకుని అన్ని వైపులకి సమానంగా పడేటట్టు చల్లడం మొదటిది. గొర్తి లేదా గొర్రు సాయంతో విత్తడం రెండో పద్ధతి. గొర్రు అంటే డమరుక లాంటి చెక్క సాధనం. దీనికి నాలుగు రంధ్రాలుంటాయి. దీన్ని జడిగం అనీ అంటారు. నాలుగు రంధ్రాలకూ సరిగా నాలుగు వెదురు బొంగుల్ని అమర్చి గుంటకకు బిగిస్తారు. ఒడి కట్టుకుని, అందులో విత్తనాలు పోసుకుని మగవాళ్లు గుంటక తోలుతుంటే స్త్రీలు రెండు చేతులతోనూ ఆ జడిగంలో విత్తనాలు వదులుతారు. అవి సరిగ్గా చాళ్లలో పడతాయి. దాని వెనుకే దిండు లేక అడ్డ అనే కొయ్యలు లేని దిమ్మను తోలతారు. అప్పుడా చాళ్లలోని విత్తనాలు కప్పెడిపోతాయి. దీన్ని గొర్తివెద అనీ, చేతితో చల్లే దాన్ని చల్లువెద అనీ అంటారు.


పకాలి
తరవాణిని కళింగాంధ్రలో ‘పకాలి (ళి)’ అంటారు. ఇది ఒడియా పదం. ఒడియాలో పఖాల్‌ అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని నీళ్లలో వేసి పెట్టడం అని అర్థం. ‘బాలి (ముక్క), దద్ద (పెత్తండ్రి), కంబారు (పనివాడు), బెసారో/ బెసారు (అన్నీ కలిపి వండిన కూర)’.. ఇవన్నీ ఒడియా నుంచి అరువు తెచ్చుకున్న పదాలే.


గవ్వ
చేతిలో చిల్లుగవ్వ లేదంటారు కదా. చిన్నపిల్లల ఆటవస్తువుగా చెలామణీలో ఉండే ఈ గవ్వలు ఒకప్పుడు ద్రవ్యవిశేషంగా ప్రచారంలో ఉండేవి. పదహారు గవ్వల విలువ ఒక దమ్మిడీకి సమానం. గవ్వలిచ్చి అంగడిలో ఏ వస్తువునైనా కొనుక్కునేవారు. వీటి గురించి ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. ‘‘కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకూ పకీరులు నిండిఉన్నారు. గనుక సవారీ మీద నెవరు వచ్చినా అడుగడుగునకు పకీరులు పొగడి భిక్షం అడగకమానరు. వారికి కొన్ని గవ్వలయిన యిచ్చిపోకపోతే అవమానము తోచుచున్నది. చెన్నపట్టణపు రూపాయి 1కి అక్కడి పైసలు 50. పయిసా 1కి 20 పుండేల గవ్వలు. పుండే 1కి గవ్వలు నాలుగు’’ అని హైదరాబాదులో తాము మజిలీ చేసిన రోజుల గురించి ఆయన చెప్పారు. ‘‘మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుకొని యఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలను విసరివైచుచు..’’ అని కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’లో ప్రస్తావించడాన్ని బట్టి నిన్నమెన్నటివరకూ ఈ గవ్వలు ద్రవ్యంగా వినియోగంలో ఉండేవని తెలుస్తుంది. ‘‘అచ్చనగండ్లు విన్నాణంపు దోసిళ్లు మువ్వంపు మువ్వన్నె గవ్వలాట’’ అన్న కవి ప్రయోగం పిల్లలాడే గవ్వలాటను గుర్తుచేస్తుంది. 


కిచ్చడి
‘నానా వస్తువులు చేర్చి వండు చిత్రాన్నం’ అని నిఘంటువు మాట. పారసీలో కిచ్‌లీ పదమే మరాఠీలో ఖిచడీ/ ఖిచిడీగా రూపాంతరం చెందింది. పప్పు, బియ్యం, వెన్న వీటితో తయారయ్యే ప్రసిద్ధ వంటకమిది. ‘‘చారులు దియ్యకూరలు బయ్యడులుం గిచ్చడులును’’ అని శ్రీనాథుడి ప్రయోగం.


చెప్పుకోండి చూద్దాం
ఇంటి వెనుక కుప్పవేసి
కుప్పకు నిప్పుపెట్టి
కుప్ప కాలిపోతేనూ
అప్పులెల్ల తీరిపోయె
ఈ పొడుపునకు విడుపు కుమ్మరి ఆవం. మట్టితో చేసిన కుండలను ఆరబెడతారు. గడ్డిని కప్పి కుప్పగా పెట్టి కాలుస్తారు. కాల్చిన కుండలను అమ్మి అప్పులు తీర్చుకుంటారని శ్రామిక జనజీవన చిత్రణని తెలిపే పొడుపు కథ ఇది.


వెనక్కి ...

మీ అభిప్రాయం