సినీగీత సుధా శరధి

  • 233 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కుంతి

  • తెలుగు ఉపాధ్యాయులు, జవహర్ నవోదయ విద్యాలయం
  • సికింద్రాబాదు
  • 8790920745
కుంతి

‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా కురిపించిన కవి కేసరి దాశరథి కృష్ణమాచార్య. ‘రుద్రవీణ, కవితా పుష్పకం, పునర్నవం , తిమిరంతో సమరం’ లాంటి పొత్తాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారాయన. అయితే, సినీ గీత రచనలో కూడా అంతే ప్రసిద్ధిని అందుకున్నారు దాశరథి. అద్భుత భావుకతతో అలతి అలతి పదాలతో ఆయన అందించిన సినీ గీతాలు ఇప్పటికీ శ్రోతలను అలౌకిక ఆనందంలో ఓలలాడిస్తూనే ఉన్నాయి.  
పాట
గాయపడిన గుండెకు ఊరట. నిరాశలో కూరుకున్న మనసుకు బాసట. ఉత్సాహ వీచిక. ఉల్లాస తరంగ డోలిక. మేలిమి మణుల్లాంటి ఎన్నో గీతాలతో సినీ సాహిత్యంలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నారు దాశరథి కృష్ణమాచార్య. ప్రేమ, విరహ, భక్తి, అభ్యుదయ, విషాద, హుషారు గీతాలెన్నో దాశరథి కలం నుంచి జాలువారాయి. 
‘వాగ్దానం’ (1960) చిత్రంలోని ‘నా కంటి పాపలో నిలిచిపోరా’’ పాటతో దాశరథి సినీ గీత ప్రస్థానం మొదలైంది. ఆనాటి ప్రసిద్ధ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, అశ్వత్థామ, పెండ్యాల, వేణు, ఘంటసాల, సత్యం, కోదండపాణి, కె.వి.మహదేవన్, ఆది నారాయణరావు తదితరులు దాశరథి పాటలకు బాణీలు అందించారు. ఘంటసాల, పి.సుశీల, జానకి, జిక్కి, పి.లీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం తదితరుల గళాల్లో ఆయన పాటలు నవ జీవం పోసుకున్నాయి.
మారుమోగే పాట 
దాశరథి కృష్ణమాచార్య సినీ గీతాలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి వీణ పాటలు. విపంచి గీతాల విషయంలో ఆయన సాహిత్యం వీణాతంత్రుల నాదమంత శ్రవణ సుభగంగా ఉంటుంది. ‘ఆత్మీయులు’ చిత్రం కోసం ఆయన రాసిన ‘మదిలో వీణలు మ్రోగే’ పాటను నిత్యం తలచుకునేవారు నేటికీ కోకొల్లలు. వీణ స్వర తరంగాల నడుమ ‘‘సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది/ పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది’’ అనే చరణాలు అలరిస్తాయి. ‘‘అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామి’’ (అమరశిల్పి జక్కన) పాట కూడా ఓ ఆణిముత్యమే. వీణ, ఇతర వాద్య పరికరాల నడుమ సుశీల గొంతు నుంచి పరుగులెత్తే ఈ పాట ప్రతి మదిని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ‘‘కనులు చేపలై గంతులు వేసె/ మనసు తోటలో మల్లెలు పూసె/ దోసిట వలపుల పూవులు నింపీ...’’ లాంటి చరణాలతో అభిసారికని చిత్రిస్తూ జావళీని తలపిస్తుందీ పాట. అలాగే ‘‘నేనే రాధనోయి గోపాలా అందమైన ఈ బృందావనిలో’’ (అంతా మన మంచికే); ‘‘వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులేే’’ (రెండు కుటుంబాల కథ); ‘‘నీవు రావు నిదుర రాదు’’ (పూలరంగడు); ‘‘పాడెద నీ నామమే గోపాలా’’ (అమాయకురాలు) లాంటి ఎన్నో వీణ గీతాలను అందించారు దాశరథి. వీటిలో చాలా భాగం కన్నయ్య, రాధ, గోపెమ్మల వలపు నేపథ్య మాలికలే. 
      ప్రేమ, విరహ గీతాలు రాయడంలోనూ దాశరథిది అందె వేసిన చెయ్యే. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో/ ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’ (కన్నెవయసు) పాట అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది. ‘‘నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే/ బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవేే’’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు నుంచి మంద్రంగా సాగే ఈ పాటని ఎన్ని సార్లు విన్నా అద్భుతంగానే ఉంటుంది. ‘‘రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో...’’ (శ్రీదేవి) పాట కూడా ప్రేమ రస గుళికే. ‘‘కొమ్మల్లో కోయిలమ్మా కోయ్‌ అన్నది/ నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ/ మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది’’ చరణాలతో బాలు, జానకి గొంతుల్లో హుషారుగా పరుగులెత్తే ఈ పాట లేఖలు ఇచ్చిపుచ్చుకునే ప్రేమికుల మదిలో మారుమోగుతూనే ఉంటుంది. ‘‘దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే/ పారిజాతమే నీవై నీవై’’ పాట చక్కని లయతో ఆకట్టుకుంటుంది. ఇక ‘‘నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే...’’ (మంచి మనసులు) పాటలోని మూడు చరణాలూ వరుసగా ప్రేమ, పెళ్లి, తొలిరేయి నేపథ్యాలతో సాగుతాయి. ‘‘నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో/ నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో...’’ లాంటి పంక్తులు ఇందులో ప్రధాన ఆకర్షణ. ‘‘కొండలన్ని వెదికేను కోనలన్ని తిరిగేను చెలియా సఖియా నీకోసమే’’ (వసంత సేన); ‘‘విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో...’’ (బందిపోటు దొంగలు), ‘‘ఓ బంగరు రంగుల చిలకా పలుకవే..’’ (తోటరాముడు) ఇలా దాశరథి రాసిన వలపు గీతాలు అనేకాలు.
పోరాట స్ఫూర్తి గీతం 
మనుషులన్నాక జీవితంలో నిరాశలు, కష్టాలు సహజం. ఈ నిరాశకి కవితా బొమ్మ కడితే సాటి హృదయాలకు అది సాంత్వనగా నిలుస్తుంది. కల్లోల సమయాల్లో ఆదరువవుతుంది. నిరాశలో ఉన్న మనసుల్ని ఆర్ద్రంగా తడిమే ఎన్నో గీతాలు దాశరథి కలం నుంచి జాలువారాయి. ‘‘మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా/ వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి..’’ (రాము) వాటిలో ఒకటి. ‘‘ఆకాశానికి అంతుందీ నా ఆవేదనకు అంతేదీ/ మేఘములోనా మెరుపుంది నా జీవితమందునా వెలుగేది/ తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా’’ ఇలా సాగుతూ ప్రతి మదినీ కదిలించే పాట ఇది. ముఖ్యంగా ఇందులో ‘‘మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు/ సుఖము శాంతి ఆనందం నా నొసటను రాయుట మరిచాడు..’’ లాంటి పంక్తుల్ని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు కదా! ‘‘నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే’’ (మూగనోము) పాట ప్రేమలో గాయపడిన వ్యక్తి గుండె మంటకు అక్షర రూపం. ‘‘గులాబినై నీ జడలో మురిశానే ఆనాడు/ బికారినై నీకోసం తిరిగానే ఈనాడు/ చెలీ చెలీ నా మదిలో చితులెన్నో రగిలేను...’’ లాంటి చరణాలతో ఘంటసాల గళం నుంచి సాగే ఈ పాట విన్న ప్రతి హృదయంలో మౌనం రాజ్యమేలాల్సిందే. ఇక ‘‘నీకేలా ఇంత నిరాశా నీ కన్నులలో కన్నీరేల’’ (ఆరాధన)  పాట ప్రతి మదిలో సాంత్వన నింపుతుంది. ‘‘ఆశ నిరాశలు దాగుడుమూతలు/ అటేలే ఈ లోకం.../ కష్ట సుఖాల కలయికలోనే ఉన్నదిలే జీవిత మాధుర్యం/ చీకటి కొంత వెలుతురు కొంత/ ఇంతే జీవితమంతా...’’ అని జీవన తాత్వికతని వివరిస్తూ ‘‘నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం’’ అని గొప్ప ఓదార్పునిస్తుందీ గీతం. ‘‘నీకోసం నీకోసం నా గానం నా ప్రాణం నీకోసం’’ (పునర్జన్మ) పాటా ఓదార్పు నేస్తమే. ‘‘నీ కన్నుల వెలుగులో నీలి నీడలెందుకో/ నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో/ నీ బాధలు పంచుకొనగ నేనుంటికి కాదా’’ లాంటి పల్లవులతో కష్టకాలంలో ఆత్మీయ నేస్తం తోడు ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే పాట ఇది.   
      ప్రతి కవికీ సామాజిక బాధ్యత ఉంటుంది. లోకం పోకడలు, నైతిక విలువల పతనం చూసిన కవి మనసులోని కల్లోలం కైత రూపుకట్టాల్సిందే. మానవాళికి సంస్కరణా సందేశం వినిపించాల్సిందే. సందర్భాన్నిబట్టి ఆయా చిత్రాల కోసం ఇలాంటి ఎన్నో గీతాల్ని అందించారు దాశరథి. ‘ఒకే కుటుంబం’ చిత్రంలోని ‘‘మంచిని మరచి వంచన నేర్చి/ నరుడే ఈనాడు వానరుడైనాడు...’’ పాట మనుషుల్లో దిగజారుతున్న మానవత్వాన్ని చిత్రిస్తుంది. ‘‘చదువూ తెలివీ పెంచాడు/ చంద్రలోకము జయించాడు/ నీతులు చెప్పి గోతులు తవ్వి/ పాతాళానికి చేరాడు/ మెదడే పెరిగి హృదయం తరిగి/ నడురే ఈనాడు వానరుడైనాడు’’ అంటూ మనిషి ఎంత అభివృద్ధి సాధిస్తున్నా నైతికంగా కునారిల్లుతున్న వైనాన్ని తెలియజెప్పారు ఈ పాటలో. ‘‘అందరి చెమట చిందించాడు/ సంపద ఎంతో పెంచాడు/ పెంపకమంటూ వచ్చేసరికి/ అంతా తనదే అన్నాడు...’’ చరణంలో దోపిడీ వ్యవస్థనూ బొమ్మకట్టారు దాశరథి. ‘‘ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా’’ (కథానాయకుడు) పాట కూడా లోకంలోని దుర్మార్గాన్ని కళ్లకుకట్టేదే. ‘‘డాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు/ పాపం పుణ్యం పరమార్థాలు పంచకు రానీరు/... మంచిని చేసే మనిషిని నేడు వంచన చేసేరు/ గొంతులు కోసే వాడికి నేడు గొడుగులు పట్టేరు/ దొంగలు దొరలై ఊళ్లే దోచిరి ఇదే ప్రపంచమయ్యా’’ అంటూ ఆవేదనతో కూడిన ఆవేశాన్ని చూపించారు ఈ పాటలో. కేవలం సామాజిక అవకరాల్ని తెలియజెప్పడమే కాకుండా ‘‘ఆవేశం రావాలి ఆవేదన కావాలి/ గుండెలోని గాయాలు మండించే గేయాలు’’ (మనసు మాంగల్యం) అనే పోరాట స్ఫూర్తి గీతాన్నీ రాశారు దాశరథి. ‘‘తరతరాల దోపిడీల ఉరితాళ్లను తెగతెంచి/ నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి/ మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలి..’’ అని పిలుపునిస్తారు ఇందులో.
అక్షరాల్లో అమృతం
ఆధ్యాత్మిక, భక్తి గీతాలు రాయడంలో కూడా దాశరథికి గొప్ప పట్టు ఉంది. ‘‘నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో...’’ (రంగుల రాట్నం) పాటైతే ఇప్పటికీ అందరి ఇళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. ‘‘మముగన్న మాయమ్మ అలిమేలు మంగ/ విభునికి మా మాట వినిపించవమ్మా...’’ అంటూ తమ బాధల్ని భక్తులు అమ్మ ద్వారా స్వామికి తెలియజెప్పాలని చూడటం ఇందులోని ప్రత్యేకత. ‘‘కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా/ కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా’’ అనే నిరసనా ఇందులో కనిపిస్తుంది. ఇదే చిత్రంలోని ‘‘చేర రూపమున సోమకు జంపి...’’ పాటలో దశావతారాలను వర్ణన కనిపిస్తుంది. ‘‘రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య’’ పాట అయితే భక్తిని తారస్థాయికి తీసుకెళుతుంది. ‘‘నను పాలింపగ నడచీ వచ్చితివా’’ (బుద్ధిమంతుడు) పాటలో ‘‘కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు/ కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు/ కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు/ ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని ననుపాలింపగ నడిచీ వచ్చితివా’’ అంటూ అచంచల భక్తివిశ్వాసాలున్న భక్తుడి గుండెలో దేవుడు కొలువుదీరడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెబుతారు. ‘కరకు రాతి గుళ్లలో భగవంతుడు ఖైదీ’ అనే పలుకునూ ఇందులో వినవచ్చు. ‘‘కన్నయ్యా నల్లని కన్నయ్యా/ నిను కనలేని కనులుండునా’’ (నాదీ ఆడజన్మే) పాటలో నల్లగా ఉందన్న కారణంగా అందరూ ఈసడించుకుంటున్న ఒక మహిళ ఆవేదనని ఆ నల్లనయ్యకి వినిపించారు. ‘‘గుణమెంచ లేనింట పడవైతువా/ నన్ను వెలివేయు వారికే బలిచేతువా/ బంగారు మనసునే ఒసగినావు/ అందు అందాల గుణమునే పొదగినావు/ మోముపై నలుపునే పులిమినావు/ ఇట్లు నన్నేల బ్రతికింప దలచినావు’’ చరణాలతో మనసుని కదిలించే పాట ఇది. ‘‘స్వామీ వేంకట రమణా/ తల్లివీ తండ్రివీ నీవే...’’ (పట్టుకుంటే పదివేలు); ‘‘కొండపై నిండుగ కొలువున్న/ మాతల్లి కనకదుర్గ నీకు జేజేలు’’ (అగ్ని పరీక్ష); ‘‘మంగళ గౌరీ మము గన్న తల్లీ...’’ (చిట్టి చెల్లెలు); ‘‘శ్యామ సుందరా ప్రేమ మందిరా’’ (భక్తతుకారాం); ‘‘పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను’’ (పూజ) లాంటి ఎన్నో భక్తి రసాత్మక గీతాలెన్నో దాశరథి కలం నుంచి జాలువారాయి.  
      కృష్ణమాచార్య పాటల్లో అన్యదేశ్యాలు, ముఖ్యంగా ఉర్దూ పదాలు చాలా సహజంగా ఇమిడిపోయి అలరిస్తాయి. ఖుషీ, నిషా, హుషారు, హమేషా, మజా, నవాబు, గరీబు, బేజారు లాంటి చాలా పదాలు ఆయన పాటల్లో లడ్డూల్లో జీడిపలుకుల్లా చవులూరిస్తాయి. ‘‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ/ హుషారు గొలిపే వెందుకే నిషా కనులదానా’’ (ఇద్దరు మిత్రులు), ‘‘అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు/ భలే భలే మోగునులే వలపు సితారు’’ (దేవత) లాంటి పాటలు వాటికి ఉదాహరణలు. దాశరథి పాటల్లో పదాలు, పదబంధాలు ప్రకృతికి దగ్గరగా ఉండి కవిత్వాన్ని రసవంతం చేస్తాయి. ఆయన పాటల్లో పూలు విరిసెను, తేనె కురిసెను, పూలబాల, పూలమేడ, మచ్చలేని జాబిల్లి, ముళ్లులేని సిరిమల్లి, పూలబాణం, వెన్నెల రేయి, పూలతోట, ముత్యాల జల్లు, రతనాల మెరుపు, పువ్వు, గువ్వ, వాగు, తీగ, పుట్ట, పిట్ట వంటి పదాలు తరుచుగా దొర్లుతుంటాయి.
ఒక్కటి ఒక్కటి మూడు!
హిందీ పాటల్ని తెలుగులోకి తెస్తున్నప్పుడు చేసినప్పుడు మూలం కన్నా ఆ బాణికి మరింత ఆందమైన పాటల్ని మన భాషలో కూర్చారు దాశరథి. ‘నైనా భర్‌సే- ఓ నా రాజా’ (ఆమె ఎవరు?); ‘ఆధా హై చంద్రమా- నా కంటి పాపలో నిలిచిపోరా’ (వాగ్దానం); తుమ్హారీ నజర్‌ క్యోం కఫా హోగయీ- ఈ వేళ నాలో ఎందుకో ఆశలు’ (మూగనోము) లాంటి పాటలే అందుకు నిదర్శనం. ఇంకా ‘భూలోకంలో యమలోకం’ చిత్రం కోసం ప్రశ్న జవాబుల రూపంలో ఒక పాట రాశారు దాశరథి. ‘ఓ మీసమున్న మొనగాడాయ్‌... ఒక్కటి ఒక్కటి మూడు ఈ లెక్కకు కావలె ఏడు’ చెప్పగలవా అంటుంది ఆ అమ్మాయి. ‘అందమైన ఒక మొనగాడు చక్కని చుక్కకు సరిజోడు/ గడిచెనో లేదో ఒక ఏడు - జో లాలీ కలిగెను వారికి పసివాడు’ అని బదులిస్తాడా పడుచువాడు. ‘జమీందార్‌’లో ‘‘అమ్మాయిగారు చాలా చాలా కోపంగా ఉన్నారు..’’ పాటలో ‘‘అది జడా - వాలు జడ - తొలి వలపు కొరడా - అది మన్మథుని చెరకు గడా...’’ లాంటి అంత్య ప్రాసలు అలరిస్తాయి. ‘‘వినిపించని రాగాలే/ కనిపించని అందాలే/ అలలై మదినే తలచే/ కలలో ఎవరో పిలిచే’’ (చదువుకున్న అమ్మాయిలు) పాట వింటుంటే మనసులో అదో తెలియని పరవశం. ‘గోదారీ గట్టుందీ గట్టుమీన సెట్టుందీ...’ (మూగమనసులు) పాట ఒక కన్నెపిల్ల మనసుని తెలుపుతున్నట్లున్నా ‘‘పిట్ట మనసు పిసరంతైనా/ పెపంచమంతా దాగుందీ/ అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుందీ’’ చరణాల్లో లోతైన తాత్వికతా గోచరిస్తుంది. ‘‘చిన్నారి పొన్నారి పువ్వూ...’’ (నాదీ ఆడజన్మే) ఆలుమగలు ఒకరికోసం ఒకరు పాడుకునే లాలిపాటలాగే అనిపిస్తుంది. ‘‘అందాలా పసిపాపా/ అన్నయ్యకు కనుపాపా’’ (చిట్టిచెల్లెలు) పాట తెలుగు నాట అందరు అన్నాచెల్లెళ్ల మది దోచుకుంది. ‘‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’’ (మాతృదేవత) పాటను సుశీల కంఠం నుంచి వింటుంటే మనకులో అదో పరవశం. ఇలా దాశరథి సృష్టించిన భావ గాన తరంగాలెన్నో. 
      దాశరథి కృష్ణమాచార్య సినీ గీతాల్లో అధికభాగం సుశీల, ఘంటసాలలు పాడినవే. సుశీల పాడిన చాలా పాటలు ప్రఖ్యాతి పొందాయి. ‘‘దాశరథి ఒక శక పురుషుడు, మహాకవి. ఆయన కవితా శరథి’’ అని కొనియాడారు గాన గంధర్వులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘‘దాశరథి గారిది మెత్తని మనసైనా ఆయన భావాలూ, భాషణలూ చాలా దిట్టమైనవి. అద్భుతమైనదాయన కవితా విజృంభణ శక్తి’’ అని ప్రశంసించారు దిగ్గజ సినీ గాయకులు పీబీ శ్రీనివాస్‌. దాశరథి రాసిన 124 సినీ గీతాలు కె.ప్రభాకర్‌ సంకలనంలో 2010లో పొత్తంగా వచ్చాయి. మేలిమి భావాల ఊటతో వైవిధ్యభరత సినీ గీత సేద్యం చేసిన దాశరథి  కలం బలం అమేయం... సంగీత, సాహిత్యప్రియులకు గొప్ప వరం.


మదిలో వీణలు మోగించే ఆయన కవితా విపంచి నా గొంతులో ఎన్నో మధుర గీతాలు పలికించింది. ఆత్రేయగారు ‘మనసు’ పాటలకు ఎలా ప్రసిద్ధులో, అలా దాశరథిగారు వీణ పాటలు రాయడంలో ప్రత్యేకత సాధించుకున్నారు. ఆయన రాసిన గీతాల్లో సగానికి పైగా నేను పాడినవే కావడం నా అదృష్టం. తెలుగు సాహిత్య సువాసనలతో సినిమా పాటల్ని సుసంపన్నం చేసిన కవి దాశరథి

- పి. సుశీల. 


వెనక్కి ...

మీ అభిప్రాయం