శిష్యదేవోభవ

  • 31 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

‘‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణు..’’ అన్న మాటలకు మన తాతల చిన్నప్పుడే కాలం చెల్లిపోయింది. ఎవడు గురువు? ఎవడు శిష్యుడు? ఎందులో ఎవరు గురువు? ఎందులో ఎవరు శిష్యుడు? ఎప్పుడు ఎవరు గురువు? ఎప్పుడు ఎవరు శిష్యుడు? అని తేల్చి చెప్పడమూ కష్టమే. మంచి చెప్పడమూ కష్టమే.  అందువల్ల ‘‘శిష్యబ్రహ్మ శిష్య విష్ణు/ శిష్య దేవోమహే శ్వరః/ శిష్య సాక్షాత్‌ పరబ్రహ్మ/ తస్మైశ్రీ శిష్యవేనమః’’ అని చెంపలు వేసుకుని గురువులు బారులు తీరితే తప్ప మోక్షం రాదు. ఏతా‘వాత’ ఇందుకు గురువుకు శిష్యుడు పెట్టే ప్రతి ‘వాతా’ సాక్ష్యమే. 
      ‘‘శిష్యోత్సాహము గురువుకు/ శిష్యుడు తనదరికి రాగ చేరదు జనులా/ శిష్యుని కనుగొడి పొగడగ/ శిష్యోత్సాహమ్ము చెందును సుమతీ!’’ అని ప్రతి గురువూ అనుకోవాల్సిందే. అందువల్ల ‘శిష్యుణ్నే పూజించుమన్నా’ అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. చాటుగా చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. 
      ‘‘తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు/ పుట్టనేమి వాడు గిట్టనేమి’’ అన్న పద్యం ఉంది. తల్లిదండ్రులు పెద్దవాళ్లు, కొడుకు చిన్నవాడు కదా! మరి తల్లిదండ్రుల మీద వాళ్ల కన్న కుర్రాడు దయ చూపించడమేంటి? అది అంతే. అలాంటప్పుడు శిష్యుడూ గురువుల మీద దయ చూపించాల్సిందే. ‘చైల్డ్‌ ఈజ్‌ ది ఫాదర్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అన్నప్పుడు ‘డిసిపిల్‌ ఈజ్‌ దీ గురు ఆఫ్‌ గురు’ అనొచ్చుగా!
      ‘నగురు రధికం’ అంటారు. గురువు కన్నా గొప్ప వాడు లేడని దీని అర్థం. నిజానికి శిష్యుడి కన్నా గొప్పవాడు లేడు. గురువు పరువు తీయాలనుకుంటే శిష్యుడికి క్షణాల్లో పని. గురువు నేర్పని అజ్ఞానాన్ని ఆయన చెడామడా ప్రచారంలో పెట్టేస్తే సరి! గురువుగారి గాలిపోతుంది. నలుగురిలో గురువుగారు చులకనైపోతాడు. గురువు గారి రుణం తీర్చుకోవడానికి ఉన్న మార్గాల్లో ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. గురువుగారు అందుకోసం ముందు జాగ్రత్తగా శిష్యులతో భక్తిశ్రద్ధలతో మసలుకోవాలి. వీలైనప్పుడల్లా ‘శిష్యదక్షిణ’ ఇచ్చుకోవాలి. తాను చనిపోయిన తర్వాత కూడా శిష్యుడు చాలా కాలం ఈ భూమ్మీద ఉంటాడు. ఆ కాలంలో తన గురించి ఎంత చెడుగా చెప్పినా కనీసం ఖండించడానికి కూడా తాను బతికి ఉండడు. పోనీ స్వర్గం నుంచో, నరకం నుంచి ఖండన ప్రకటనలు పంపించడానికి వీలు పడదు. అందువల్ల శిష్యవ్యవహా రంలో బుద్ధిగా ఉండడం గురువుకే శ్రేయస్కరం. ఛాత్రుడు అంటే విద్యార్థి. గురువు గారి తప్పులు బయటికి కనపడ కుండా కాపాడుకోవడం శిష్యుడి విధి అన్న విషయమూ గురువులు మరచిపోవడం అవసరం. 
       ఆచార్య తూమాటి దొణప్ప తన శిష్యులను ఉద్దేశించి ‘‘మిమ్మల్ని నేను పైకి తీసుకువస్తాను. మీరు నన్ను కిందికి లాగకండి’’ అని అన్నారు. గురువులందరూ ఇలా అర్థిస్తే వాళ్లకే క్షేమం.
      గురువులకు, శిష్యులకు ఓ గొప్ప తేడా ఉంది. శిష్యులకు గురువులు మహా అయితే పాఠాలు చెబుతారు. వాటికేం.. అవి ఎక్కడైనా దొరుకుతాయి. ఆన్‌లైన్‌ లోనూ దొరికే వాటికి లైన్‌లో నిలబడాల్సిన అవసరమే లేదు. వాటికి పెద్ద విలువేమీ లేదు. మరి గురువులకు శిష్యులు నేర్పేవో గుణపాఠాలు! అవి ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చేవి. ఇవి ఎంతో విలువైనవి. అందుకే శిష్యుడు ఏం కోరుకుంటాడు? తన వంటి శిష్యుడు తనకు రాకూడదని!
      ఏది ఏమైనా గురువులు తమ శిష్యుల విషయంలో తమ జాగ్రత్తలో తాము ఉండడం మంచిది- వాళ్ల దేహాలకైనా.. దేశానికైనా! గురువులూ తస్మాత్‌ జాగ్రత్త! జాగ్రత్త!


వెనక్కి ...

మీ అభిప్రాయం