కృష్ణా తీరంలో సాహితీ సిరి

  • 169 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వేదార్థం మధుసూదన శర్మ

  • కొల్లాపూర్
  • 9063887585
వేదార్థం మధుసూదన శర్మ

తెలుగు సాహిత్య చరిత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాది ఓ విశేష స్థానం. వెలకట్టలేనంతటి సాహిత్య సంపదకు ఇది ఆలవాలం. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, జటప్రోలు, గోపాలపేట తదితర సంస్థానాలు ఇక్కడ అక్షర వనాలను విరబూయించాయి. వీటిలో ప్రస్తుతం నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని జటప్రోలు సంస్థానం చేసిన సాహితీసేవ ప్రత్యేకమైంది. ‘‘ఈ సంస్థానమునందు సర్వజ్ఞసింగ భూపతి కాలమునుండి నిన్నమొన్నటి దాక సాగిన నిరంతర సాహితీసేవ, నిత్యకల్యాణము పచ్చతోరణముగా నెగడిన సాహితీప్రియత్వమును జగత్ప్రసిద్ధములు’’ అన్న ఆచార్య తూమాటి దొణప్ప మాటలు అక్షరసత్యాలు.
తడియార లేదు మాధవరాయచంద్రికా
      పరిణయాక్షర మషీపంకమందు,
చినగ దింకను సదాశివశాస్త్రి సరసభూ
      పాలీయ టీకార్థ్ర పత్రి వితతి, 
మార్మ్రోత లిడుచుండె మల్లాదివారికి
      చెవిలోన వెల్లాల సింహగర్జ, 
ముడి విప్పలేదింక మొన్న శ్రీపాదవా
      రందిన వేయి రూప్యముల మూట 
నేటికినీ స్నేహలత పూచు నిరుపమాన 
సుమములాంధ్రికి తలలోన సొమ్ములగుచు
ప్రాజ్యగుణమైన జటప్రోలు రాజ్యమహిమ
వినక, మారాష్ట్రమును కొల్తవేయదగునె  
- జటప్రోలు సంస్థానం సాహితీసేవను గుర్తు చేసుకుంటూ ఓ సందర్భంలో ప్రసిద్ధ సాహితీవేత్త కేశవవంతుల నరసింహశాస్త్రి చెప్పిన పద్యం.

      జటప్రోలు.. కొల్లాపూర్‌ తాలుకా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని కృష్ణాతీర గ్రామం. ఇది కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో, సంగమేశ్వర క్షేత్రానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. సీతమ్మను ఎత్తుకుపోతున్న రావణుడికి అడ్డంపడిన జటాయువు ఈ ప్రదేశంలో ప్రాణాలొదిలినట్టు, ఆ పక్షి రెక్క పడినట్టు.. అందుకే ఈ గ్రామానికి ‘జటప్రోలు’ అనే పేరు వచ్చినట్టు చెబుతారు.
      దాదాపు నాలుగు వందలేళ్ల పాటు జటప్రోలు సంస్థానాన్ని సురభి రాజులు పాలించారు. చెవిరెడ్డి అనే నామాంతరం కలిగిన పిల్లలమర్రి బేతాళ నాయకుడు వీరి వంశానికి మూల పురుషుడు. ఈ రాజులు విజయనగర ప్రభువులకు, గొల్కొండ సుల్తానులకు, అసఫ్‌జాహీలకు సామంతులుగా ఉన్నారు. వీరిలో రాజా లక్ష్మణరాయలు క్రీ.శ.1840లో రాజధానిని జటప్రోలు నుంచి కొల్లాపూరుకు మార్చాడు. స్వతంత్ర భారతంలో సంస్థానాల విలీనం వరకు ఇక్కడి నుంచే పాలన సాగింది. 
వసుచరిత్రకు దీటుగా..
జటప్రోలు సంస్థానం ఎందరో కవి పండితులకు నిలయం. స్థానికులతో పాటు ఇక్కడ ఆశ్రయానికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్న వారెందరో విశిష్ట రచనలు చేశారు. ఈ సంస్థాన ప్రభువులు కూడా కృతులు వెలయించారు. ఈ ప్రాంతంలోని అయ్యవారి పల్లె, వెల్లటూరు, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎల్లూరు, సింగోటం, పెంట్లవెల్లి మొదలైనవి పండిత గ్రామాలుగా పేరు గడించాయి.
      ఈ సంస్థానాన్ని పరిపాలించిన వారిలో సురభి మాధవరాయలు (1620-1670) కవి పండితుడు. కావ్య, నాటక, అలంకార శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఈయన ‘చంద్రికా పరిణయం’ అనే ప్రబంధాన్ని రచించాడు. ఇది రామరాజ భూషణుడి వసుచరిత్రకు దీటైన కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ‘‘వసుచరిత్రమువలె శ్లేషభూయిష్ఠమయి మృదుపదఘటితమయి యత్యంత ఫ్రౌఢముగా నున్నది’’ అంటూ కందుకూరి  పేర్కొన్నారు. ‘‘వసుచరిత్ర కన్న శ్లేషగాంభీర్యము గలిగి రసనిష్యంద నంబున విజయవిలాసముం బురణించుచు కల్పనాఫ్రౌఢియందు ఆముక్త మాల్యదం దలపించుచు అటనట న్యాయవైశేషికాది శాస్త్రమర్యాదల ననుసంధించుచు నుండు నీయతి ఫ్రౌఢ ప్రబంధము’’ అంటూ వేదం వేంకటరాయశాస్త్రి అభివర్ణించారు.  
      మధుమాస వర్ణనలో భాగంగా వచ్చే వసుచరిత్రలోని ‘‘లలనాజనాపాంగ వలనా వసదనంగ’’ పద్యం ప్రఖ్యాతం. ‘చంద్రికా పరిణయం’లో అదే మధుమాసాన్ని వర్ణించే ఈ పద్యమూ అంతే శ్రావ్యంగా ఉంటుంది.. 
సుమనోగ సమచూత సుమనోగణపరీత
      సుమనోగణిత సారశోభితాళి 
కలనాద సంతాన కలనాదసమనూన

      కలనా దలితమాన బలవియోగి 
లతికాంతరిత రాగలతికాంత సపరాగ

      లతికాంత పరియోగ లక్ష్యకాళి 
కమలాలయాస్తోక కమలాలయదనేక

      కమలా లసిత పాక కలితకోకి 
జాలక వితానక వితానపాళిభూత 
చారు హరిజాత హరిజాత తోరణోల్ల 
సద్వ్రతతికా వ్రతతిగావ్రజ క్షయాతి 
భాసురము పొల్చె వాసంతవాసరంబు 

      ‘చంద్రికా పరిణయం’ ఆరు ఆశ్వాసాల కావ్యం. ఇందులో నాయిక చంద్రిక, నాయకుడు సుచంద్రుడు.  శృంగార రస ప్రధాన కావ్యమిది. దీని మీద డా।। వెలుదండ సత్యనారాయణ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు.  
దిగ్గజాలకు నెలవు
సురభి పాలకుల అండదండలందుకున్న మహామహోపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి (1600 -1650) గొప్ప విద్వత్కవి. మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరిట భర్తృహరి సుభాషిత త్రిశతిని ‘మల్లభూపాలీయం’గా తెలుగులోకి తెచ్చాడు. ఇది తొలి తెలుగు సుభాషిత త్రిశతి. ‘సురభిమల్లా! నీతి వాచస్పతీ!’ పేరిట నీతి, ‘సురభిమల్లా! మానినీ మన్మథా!’ పేరుతో శృంగార, ‘సురభిమల్లా! వైదుషీ భూషణా!’ అనే వైరాగ్య శతకాల సమాహారమిది. బాలసరస్వతి ఇంకా ‘భ్రమరగీతి, కార్తికేయాభ్యుదయం, రాఘవయాదవ పాండవీయం’ తదితర రచనలు చేశారు.
      ఈ కోవలోనే ఈ సంస్థానపు ప్రోత్సాహంతో ఎందరో కవి పండితులు విశేష అక్షరసేద్యం చేశారు. వారిలో వెల్లాల సదాశివ శాస్త్రి (1861- 1926) ప్రముఖులు. ఈయన ‘కావ్యాలంకార సంగ్రహ విమర్శనం, ఆంధ్ర దశ రూపక విమర్శనం, వీరభద్రీయ ఖండనం, వెలుగోటి వారి వంశ చరిత్ర, సురభి వంశ చరిత్ర’ తదితర 27 గ్రంథాలను రచించారు. మాధవరాయల ‘చంద్రికా పరిణయం’ కావ్యానికి అవధానం శేషశాస్త్రితో కలిసి వ్యాఖ్యానం రాశారు.
ఆయనకు సరిజోడు
ఈ సంస్థానంలోనే మరో సంస్కృతాంధ్ర పండితులు తెలకపల్లి రామచంద్ర శాస్త్రి (1902- 1989). ‘అభినవ కాళిదాస’ బిరుదాంకితులు. ‘కవికాంతా స్వయంవరం’ నుంచి ‘రవీంద్ర తపఃఫలం’ వరకు 15 రచనలు వెలయించారు. లలితాస్తవ ఝరి, హయగ్రీవ శతకం, హనుమత్‌ సుప్రభాతం, కృష్ణవేణీ స్తుతి’ తదితర ఈయన రచనలు కోమల పదావళి, సరసమధుర శబ్ద సంయోజన, భావానుగుణ భాష, స్వాభావికమైన అలంకార రచన, వివిధ రసాల సహజ సుందర అభివ్యక్తీకరణ, ఔచిత్య పోషణ, పాత్రల సజీవ చిత్రణలకు నిదర్శనాలు.
      ఆనాడు సంస్థానాల్లో కవి పండితుల మధ్య శాస్త్ర చర్చలు, వాదోపవాదాలు సర్వసాధారణం. తెలకపల్లి రామచంద్ర శాస్త్రి, వెల్లాల సదాశివశాస్త్రి మధ్య కూడా ఇలాంటి వాదోపవాదాలు జరిగి, రచనలుగా రూపుదిద్దుకున్నాయి. అలా తెలకపల్లి ‘భారతీ తారా మాల’ కృతిని వెలయిస్తే, వెల్లాల ‘భారతీ తారామాల ఖండనం’ రాశారు. సదాశివ శాస్త్రి ‘రామచంద్ర పంచకం’ పేరిట తెలకపల్లిని విమర్శిస్తే, ‘సదాశివాష్టకం’ పేరిట రామచంద్ర శాస్త్రి ప్రతివిమర్శ చేశారు.  
ఒకరు ‘కందకవి’
జటప్రోలుకే చెందిన ఎల్లూరి నరసింగ కవి (1860- 1920) శతక, యక్షగాన, ప్రబంధాలను రచించారు. ఈయన కూడా ‘వెల్లూరి వెంకటాచల రమణా’ అనే మకుటంతో సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. ఆళ్వారుల్లో ఎనిమిదో వారైన తొండరడిప్పొడి ఆళ్వారును చూతపురి నృసింహస్వామి భక్తుడిగా రూపుదిద్ది ‘చూతపురి విలాసం’ అనే యక్షగానాన్ని రచించారు. దీనిని 1980లో డా।। కపిలవాయి లింగమూర్తి పరిష్కరించి ప్రచురించారు. నరసింగ కవి మరో రచన ‘రాచకన్యకా పరిణయం’. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ని వధించి, పదహారువేల మంది రాజకన్యలను పరిణయం ఆడటం దీని ఇతివృత్తం. భాగవతంలోని చిన్న వస్తువును గ్రహించి 1150 గద్య పద్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఎల్లూరి నరసింగ కవి. డా।। తలముడిపి బాల సుబ్బయ్య ఈ కావ్యం మీద పరిశోధన చేశారు. 
      ఈ సంస్థానం వాసి గంధం వెంకట నర్సింహాచార్యులు (1896-1956) ‘మాధవ శతకం, ధ్రువచరిత్రం, మణిహారం, భక్తామృతం’ తదితర రచనలు వెలువరించారు. ‘కందకవి, మాధవ భక్త శేఖరుడు’ బిరుదాంకితులైన ఈయన మొదటి రచన మాధవ శతకం. ఇందులోని పద్యాలు ప్రసిద్ధ శతక పద్యాలను స్ఫురణకు తెస్తాయి.   
      వంశమునందు నొక్క గుణవంతుడు నేర్పరి ఉండెనేని/ స్సంశయ మొప్ప యెల్లరును జక్కగ వృద్ధికి దెచ్చుగాని తా/ సంశయ మొందునే ధనము జారునటంచును గీర్తియె ప్రధా/ నాంశముగా దలంచి తనువైనను వీడును గాదె మాధవా!
      వేమన శతకంలోని ‘కులములోన నొకడు గుణవంతుడుండిన, కులము వెలయు వాని గుణము చేత...’ అనే పద్యఛాయలు ఇందులో కనిపిస్తాయి. నర్సింహాచార్యుల మిగిలిన రచనలూ అర్థభావ గాంభీర్యంతో ప్రకాశిస్తాయి. 
సరస్వతికి ‘వంద’నం
జటప్రోలు పాలకుల ప్రోత్సాహంతో దాదాపు వంద మంది కవి పండితులు తర్క, మీమాంస, న్యాయ, అలంకార, వ్యాకరణ శాస్త్రాల్లో రచనలు చేశారు. ప్రబంధాలు, ద్వ్యర్థి, త్య్రర్థి, ఉదాహరణ కావ్యాలు, నాటకాలు, అనువాదాలు, శతకాలు, యక్షగానాలు, చరిత్రలు, క్షేత్ర మహాత్మ్యాలను వెలువరించారు. ఈ సంస్థానాన్ని కొంతకాలం పరిపాలించిన రాజా వేంకట లక్ష్మారావు తమ పండితులను బయటి ప్రాంతాలకు పంపించి, వివిధ శాస్త్రాల్లో వారు మరింత నైపుణ్యం సాధించేలా చేయూతనిచ్చారు. ‘‘నైజాం సర్కారున/ రాజిలు జటప్రోలు నాఁగ రాజస్థానం/ బోజన్‌ లక్ష్మారాయఁడు/ తేజంబున నేలునట్టి ధీరుండయ్యెన్‌’’ అంటూ ‘ఆంధ్రాభ్యుదయం’లో ఈయన గురించి చెప్పారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. వేంకట లక్ష్మారావు ఆజ్ఞ మేరకు శ్రీపాద ‘చంద్రికా పరిణయం’ అనే నాటకాన్ని రచించారు. ఇందులోని కథ మాధవ రాయల రచనకు భిన్నమైంది. లక్ష్మారావు సతీమణి రాణి వెంకట రత్నమాంబ కూడా కవి పండితులను ఆదరించారు. 
      స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల సాహితీవేత్తలు కూడా ఈ సంస్థాన ప్రభువుల సత్కారాలందుకున్నారు. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, హరికథా చక్రవర్తి దీక్షిత దాసు, వేదాంత విద్వాంసులు ముదిగొండ వేంకట రామ శాస్త్రి తదితరులు వీరిలో ప్రముఖులు. సాహిత్య పరంగా జటప్రోలు సంస్థానానికి ఎనలేని గౌరవాన్ని కల్పించిన వారు వాజపేయయాజుల రామసుబ్బరాయ కవి(1895- 1982). రాసురాట్కవిగా ప్రసిద్ధులైన ఈయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి 1928లో ఉద్యోగరీత్యా ఈ సంస్థానానికి వచ్చారు. కొల్లాపూర్‌లో నలభై సంవత్సరాలు జీవన యాత్ర సాగించి, దాదాపు పాతికేళ్లు ఆస్థానకవిగా ఉన్నారు. శతాధిక గ్రంథరచన చేశారు. (ఈయన సాహితీకృషిపై పూర్తి వ్యాసం ‘అక్షరపుష్పాల స్నేహలత’ను teluguvelugu.in లోని ‘వ్యాసాలు’లో చూడవచ్చు)
      ఇలా ఎందరో సాహితీవేత్తలను పోషించిన జటప్రోలు సంస్థానం, తెలుగు సాహిత్యానికి నిండు మాగాణి అయ్యింది. సురభి ప్రభువుల సాహితీసేవల మీద డా।। నాయకంటి నరసింహ శర్మ, డా।। ఎం. నరసింహులు తదితరులు పరిశోధక పట్టా లందుకున్నారు. ‘తెలంగాణలో కవులు లేరు’ అనే అపవాదును తొలగించడానికి సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవుల వివరాలతో గోలకొండ కవుల సంచికను తెచ్చారు. అందులో అధికులు పాలమూరు కవులే! వీరిలో అత్యధికులు జటప్రోలు సంస్థాన వాసులే. ఈ సంస్థాన సాహిత్యం మీద మరిన్ని పరిశోధనలు జరగాలి. మరుగున పడిన ఇంకొందరు కవులు వెలుగులోకి రావాలి. 


మరికొందరు జటప్రోలు కవులు
కవితార్కిక సింహ వేదాంతాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పెద్ద రాఘవాచార్యులు, శ్రీనివాస రాఘవాచార్యులు, శేషభట్టరు సింగరాచార్యులు, సురభి నరసింగ రావు, సురభి చిన మాధవరావు, యణయవల్లి కృష్ణమాచార్యులు, అక్షింతల సుబ్బశాస్త్రి, అవధానం శేషశాస్త్రి, నీలకంఠ శాస్త్రి, వనం సీతారామ శాస్త్రి, పల్లా చంద్రశేఖర శాస్త్రి, ఓరుగంటి లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీధర కృష్ణశాస్త్రి, గొట్టిముక్కల విశ్వనాథ శాస్త్రి, వెల్లాల శంకర శాస్త్రి, వెల్లాల త్య్రంబక శాస్త్రి, వెల్లాల మహేశ్వర శాస్త్రి, పత్రి పురుషోత్తమ శాస్త్రి, పత్రి విశ్వేశ్వర శాస్త్రి, సిరివెల్లి వాసుదేవ శాస్త్రి, భైరవ శాస్త్రి


వెనక్కి ...

మీ అభిప్రాయం