‘విమర్శ’ మంచిదే!

  • 214 Views
  • 10Likes
  • Like
  • Article Share

    డా।। పి.విజయకుమార్‌

  • సహాయ ఆచార్యులు
  • అనంతపురం
  • 9063702546
డా।। పి.విజయకుమార్‌

తెలుగు పోటీపరీక్షల్లో ‘సాహిత్య విమర్శ’కు చాలా ప్రాధాన్యముంది. వ్యాఖ్యానాలు, వ్యాసాలు, పరిశోధనలను ‘విమర్శ’లో భాగంగానే భావిస్తారు. ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాల నుంచి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశ పరీక్షలతో పాటు సెట్, సెట్‌ తదితరాల్లోనూ దీని మీద ప్రశ్నలు తారసపడతాయి. ఈ నేపథ్యంలో విమర్శకు సంబంధించిన మౌలిక భావనలను తెలుసుకుందాం.

విమర్శ అనేది ప్రధానంగా బుద్ధివ్యాపారానికి సంబంధించింది. విమర్శ అంటే వస్తుతత్త్వ పరిశీలనం కాబట్టి సాహిత్య తత్త్వ వివేచనాన్ని ‘సాహిత్య విమర్శ’ అంటారు. ‘మృశ్‌’ అనే ధాతువుకి ‘ని’ అనే ఉపసర్గ చేరడంతో ‘విమర్శ’ పదం ఉద్భవించింది. దీనికి విమర్శన, అనుశీలన, పర్యాలోచనం, మీమాంస, వివేచనం సమాలోచన, సమీక్ష, స్పృశించడం లాంటి పదాలు సమానార్థకాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. 
       ఆంగ్లంలో ‘క్రిటిసిజమ్‌’కి సమానార్థకంగా తెలుగులో ‘విమర్శ’ అంటున్నారు. గ్రీకు మాట ‘క్రిటైన్‌’.. ఈ ‘క్రిటిసిజం’ పదానికి మూలం. సాహిత్యం మీద అవగాహన పెంచేది విమర్శ. సాహిత్య ప్రగతికి ఇది దోహదం చేస్తుంది. తెలుగునాడులో సాహిత్య విమర్శ క్రీ.శ.19వ శతాబ్ది నుంచి విస్తరించింది.
‘విమర్శ’ అంటే...
* ‘కప్పివుంచితే కవిత్వం.. విప్పి చెప్పితే విమర్శ’      - సినారె
* హృదయం లాంటిది కవిత్వం.. మెదడు లాంటిది విజ్ఞానం.. సంస్కారం లాంటిది విమర్శ’       - జి.వి.సుబ్రహ్మణ్యం
* ‘ఒకరు చేసిన పనియందలి బాగోగులను ఇంకొకరు వివేచించి తెలుపుట విమర్శ’         - పింగళి లక్ష్మీకాంతం
* ‘నేర్పుతో చేయబడిన ఒక పని యొక్క తత్త్వాన్ని తెలిసికొని దానికి గుణాన్నిచ్చిన తగు అభిప్రాయం కలుగచేసుకొని ఆనందించుటయే విమర్శ’           - కోరాడ రామకృష్ణయ్య
* ‘ఏదైనా గ్రంథంగాని, కళారూపం గాని లెస్సగా పరిశీలించి దానిని గూర్చి మననము చేసి చర్చా పురస్సరముగా అందలి బాగోగులను ప్రదర్శించుట విమర్శ’ - దివాకర్ల వేకంటావధాని
* ‘ఏదైనా ఒక గ్రంథమును గైకొని అందలి లోపములను, ఔచిత్యా నౌచిత్యములను, భావగంభీరతను, అలంకార రచనా పాటవమును, ధ్వని విశేషమును, శయ్యా సౌభాగ్యమును, వస్తునిర్మాణ సౌష్ఠవమును, పాత్రపోషణ, రసపోషణ, సన్ని వేశ కల్పనాదులను, వేయేల.. ఆ గ్రంథమునకు సంబంధిం చిన సర్వ విషయములను కూలంకషముగ చర్చించి వాఙ్మ యమున నా గ్రంథమునకు గల స్థానమును నిరూపించు టయే విమర్శ అనబడును’       - కె.వి.ఆర్‌.నరసింహం
* ‘విమర్శ రూపిణీ విద్యా అని పరాదేవిని విమర్శ రూపిణిగా పూర్వులు వర్ణించారు. వేదాంతము నందు విమర్శయనగా ఆత్మానాత్మ వివేకము, వాఙ్మయము నందు కావ్యగత గుణదోష విచారము విమర్శనామంతో చెల్లుతున్నది’ 
- ఖండవల్లి లక్ష్మీరంజనం
* ‘ఒక వస్తువు యొక్క స్వరూపమును బాగుగా పరిశీలించి దాని మంచి చెడులను వివరించుటయే విమర్శనం. కావున విమర్శ అనగా వస్తుతత్త్వ నిరూపణమని స్పష్టమగుచున్నది’      - యస్‌.వి.రామారావు
* ‘సాహిత్యాన్ని సౌకల్యంగా పరిశీలించి రాగద్వేషాలకు అతీతంగా సాహిత్యంలోని అర్థాలను, సొగసులను, లోపాలను. ఎత్తిచూపడం సాహిత్య విమర్శ అవుతుంది’      - దాశరథి రంగాచార్య
* ‘అలంకారాది శాస్త్ర సంప్రదాయాలను వినియోగిస్తూ కవిత్వమనే శిల్పాన్ని విషయంగా చేసుకొని చేసే చర్చ విమర్శ’       - జగన్నాథస్వామి
విమర్శ- పాశ్చాత్యుల భావన

* ‘వస్తుతత్త్వాన్ని తెలిపేది, దాని గుణగణాల్ని నిర్ధారించేది విమర్శ’  - హడ్సన్‌
* ‘ఏదైనా సాహిత్యం లేదా లలితకళల గుణగణాలు, లక్షణాల గురించి అక్షరరూపంగా చేసిన పరిశీలన విమర్శ’        - ఎడ్మండ్‌ గూస్‌
* ‘విమర్శకుడు ఇష్టారాజ్యంగా, మంచిగా గాని, చెడుగా గాని చేసే పని విమర్శ’               - విక్టర్‌ హ్యూగో 
* ‘సాహిత్యంలోని కళాత్మకతను విశదీకరించి సాహిత్య విలు వల్ని వ్యాఖ్యానిస్తూండే బుద్ధివ్యాపారం విమర్శ’      - ఎట్‌కిన్స్‌
* ‘సాహిత్య దృక్పథంతో- సాహిత్యం గుణగణాల్ని, దాని జయాపజయాల్ని లెక్కవేసి చెప్పేది విమర్శ’  - సెంట్స్‌బరి
* ‘రాగద్వేషాలకు అతీతంగా ప్రపంచంలో ఉత్తమమైన దాన్ని నేర్చుకోవడం, దాన్ని వ్యాప్తి చేయడం విమర్శ’       - ఆర్నాల్డ్‌
* ‘కళాకారుడు ఏమి వ్యక్తీకరించాలని ప్రయత్నించాడు? అభివ్యక్తీకరణలో ఎంతమాత్రం సఫలుడయ్యాడు? ఆ అంశం అభివ్యక్తీకరణకు అర్హమైందేనా? అన్న మూడు ప్రశ్నలకు జవాబు ఇచ్చేది విమర్శ’  - స్టిన్‌గాన్‌
* ‘కళారూపాల్ని అక్షరరూపంలో వ్యాఖ్యానించేది విమర్శ’    - టి.యస్‌.ఇలియట్‌
* ‘అనుభూతుల తారతమ్యాలను వివేచించి, వాటి విలువల్ని అంచనా వేసేది విమర్శ’          - ఐ.ఎ.రిచర్డ్స్‌
* ‘విమర్శ ఏకకాలంలోనే శాస్త్రమూ, కళా రెండూను. నిర్దిష్టమైన సాహిత్య రూపాన్ని పరీక్షించడంలో, గుణదోషాల్ని పరామర్శించడంలో సిద్ధాంతాలు చేయడంలో విమర్శ శాస్త్రంగా పనిచేస్తుంది. సాహిత్య రూపాల్ని ఉత్తేజపరచడంలో అది కళారూపంగా పనిచేస్తుంది’  - జోసెఫ్‌.టి.షిప్లే
      విమర్శ స్థూలంగా ఆలంకారిక విమర్శ (అస్వతంత్ర విమర్శ), స్వతంత్ర విమర్శ అని రెండు రకాలుగా కనిపిస్తుంది. ఆధునిక కాలంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో మార్పులు, ఆ ప్రభావాలు సాహిత్యం మీద ప్రభావం చూపడం, ఎన్నో ప్రక్రియలు ఆవిర్భవించడం తదితరాలతో వివిధ విమర్శనా పద్ధతులు సాహిత్య విమర్శలో భాగస్వామ్యమయ్యాయి. గ్రాంథిక, నైతిక, మనోవైజ్ఞానిక, సాంఘిక, కళాత్మక, పౌరాణిక, చారిత్రక, తులనాత్మక, మార్క్సిస్ట్, కవిజీవిత.. ఇలా ఎన్నో విమర్శలు ఆధునిక సాహిత్య విమర్శలో చోటుచేసుకున్నాయి. విమర్శకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు..                

1. ‘శతఘ్ని’ ఎవరి రచన?    
అ. తిరుపతి వేంకట కవులు ఆ. పింగళి కాటూరి కవులు     ఇ. వేంకట రామకృష్ణ కవులు    ఈ. సత్యాంజనేయ కవులు
2.    నెల్లూరులో 1899 జనవరిలో కొమాండూరు రామానుజశర్మ ప్రారంభించిన సారస్వత మాసపత్రిక? 
    అ. కళావతి ఆ. సరస్వతి ఇ. మంజువాణి ఈ. శ్రీవాగ్వల్లి
3. ‘ప్రారంభం, నిర్వహణ, ఉపసంహారం ఇవే కళావస్తువు నాణ్యం తెలియజేసే నికషాలు’ అన్నదెవరు?    
    అ. చలం ఆ. కె.వి.రమణారెడ్డి  ఇ. శ్రీశ్రీ    ఈ. ఆరుద్ర
4. ‘నన్ని చోడదేవ కుమార సంభవ విమర్శనము’ గ్రంథకర్త?     
    అ. శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి    ఆ. అమరేశం రాజేశ్వరశర్మ  ఇ. శలాక రఘనాథశర్మ  ఈ. అప్పజోడు వేంకటసుబ్బయ్య
5. ‘గురజాడ తొలిక్రొత్త తెలుగు కథలు’ పేరిట వస్తుశిల్ప దృష్టులతో వివేచించిందెవరు?     
    అ. మొహమ్మద్‌ ఖాసింఖాన్‌    ఆ. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి    ఇ. కేతు విశ్వనాథరెడ్డి    ఈ. గుమ్మా శంకరరావు
6. ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దనపై తొలి విమర్శ గ్రంథం ‘మనుచరిత్ర హృదయావిష్కరణము’ కర్త?     
    అ. విశ్వనాథ     ఆ. జనమంచి శేషాద్రిశర్మ    ఇ. పల్లా దుర్గయ్య    ఈ. కోదండ రామాచార్యులు
7. ‘శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనము’ సిద్ధాంత గ్రంథకర్త? 
    అ. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు     ఆ.శిష్టా లక్ష్మీకాంతశాస్త్రి    ఇ. ధూళిపాళ్ల శ్రీరామమూర్తి    ఈ. పి.వి.ఎల్‌.వి.ప్రసాదరావు
8. ‘ఆంధ్రప్రబంధము అవతరణ వికాసములు’ పేరుతో అనుశీలన చేసిందెవరు?  
    అ. పుట్టపర్తి నారాయణాచార్యులు        ఆ. కాకర్ల వెంకట రామనరసింహం        ఇ. అంతటి నరసింహం    ఈ. దివాకర్ల వేంకటావధాని
9. ‘చలం శ్మశాన సాహిత్యం’ పేరిట నిరసన ప్రకటించింది?
    అ. గొట్టిపాటి వెంకటసుబ్బయ్య     ఆ. రంగనాయకమ్మ        ఇ. నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు         ఈ. పురాణం సుబ్రహ్మణ్యశర్మ
10. శాసన విమర్శ అనే వ్యవహారం కలిగిన విమర్శ?     
    అ. లక్షణ విమర్శ    ఆ. సూత్ర విమర్శ        ఇ. స్వతంత్ర విమర్శ    ఈ. కవిజీవిత విమర్శ
11. లక్ష్య లక్షణ సమన్వయంతో సంప్రదాయ మార్గంలో కొనసాగే వ్యాఖ్యానాలు, శబ్దసాధుత్వ చర్చలు, ఛందోలంకార విమర్శలు తదితరాలు ఏ విమర్శకు ఉదాహరణలు?     
    అ. స్వతంత్ర విమర్శ    ఆ. చారిత్రక విమర్శ        ఇ. కవిజీవిత విమర్శ    ఈ. ఆలంకారిక విమర్శ
12. కవి జీవితానికి, కావ్యరచనకు ఉన్న సంబంధాన్ని పరిశీలించి.. వాటి సమన్వయంతో చేసే విమర్శ?     
    అ. చారిత్రక విమర్శ    ఆ. కవిజీవిత విమర్శ        ఇ. పరిష్కరణ విమర్శ    ఈ. తులనాత్మక విమర్శ
13. కావ్య మూలప్రతి నిర్ణయించడం, లేదా శుద్ధ ప్రతిని రూపొందించడం ఏ విమర్శ లక్ష్యంగా చెప్పవచ్చు?     
    అ. స్వతంత్ర విమర్శ    ఆ. నవ్య విమర్శ        ఇ. సూత్ర విమర్శ    ఈ. పరిష్కరణ విమర్శ
14. కవి స్థానాన్ని నిర్ణయించడానికి, కావ్యతత్త్వాన్ని నిరూపించడానికి ఉపకరించే విమర్శ?     
    అ. స్వతంత్ర విమర్శ    ఆ. సూత్ర విమర్శ        ఇ. చారిత్రక విమర్శ    ఈ. తులనాత్మక విమర్శ
15. ‘కళ కళ కొరకే’ అనే వాదానికి ఊపిరిపోసిందెవరు?  
    అ. పి.బి.షెల్లీ    ఆ. ఛార్లెస్‌ లాంచ్‌        ఇ. లేహంట్‌     ఈ. ఆస్కార్‌ వైల్డ్‌
16. ‘థియరీ ఆఫ్‌ ఇమిటేషన్‌’ పేరుతో అనుకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?     
    అ. ప్లేటో     ఆ. అరిస్టాటిల్‌        ఇ. రస్కిన్‌    ఈ. ఆర్నాల్డ్‌
17. దక్షిణాపథంలో చరిత్ర పరిశోధనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు?     
    అ. విలియం బెంటిక్‌    ఆ. మెకంజీ    ఇ. సి.పి.బ్రౌన్‌    ఈ. విలియం బ్రౌన్‌
18. తెలుగులో పాశ్చాత్య పరిశోధన పద్ధతులకు, గ్రంథ పరిష్కరణ విధానానికి పునాది వేసిన పాశ్చాత్యుడు?     
    అ. కాల్డ్వెల్‌    ఆ. సి.పి.బ్రౌన్‌        ఇ. ఆర్నాల్డ్‌    ఈ. అరిస్టాటిల్‌
19. బ్రౌన్‌ ఆస్థానంలోని పండితుడు?     
    అ. జూలూరి అప్పయ్యశాస్త్రి    ఆ. రావిపాటి గురుమూర్తిశాస్త్రి        ఇ. గరిమెళ్ల వెంకయ్య    ఈ. అందరూ
20. ‘శాకుంతలము యొక్క అభిజ్ఞానత’ ఎవరి విమర్శగ్రంథం?     
    అ. వేదం వేంకట రాయశాస్త్రి    ఆ. విశ్వనాథ         ఇ. కట్టమంచి    ఈ. అక్కిరాజు రమాపతిరావు
21. ‘సరస్వతీ నారద విలాపము’ ద్వారా ప్రబంధాల ధోరణిని నిరసించిందెవరు?     
    అ. చిలకమర్తి    ఆ. కందుకూరి        ఇ. పింగళి లక్ష్మీకాంతం    ఈ. వల్లంపాటి 
22. ‘కవి ప్రగతి శీలీ, ప్రతిభా శాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు’ అని చెప్పి గురజాడను ప్రగతిశీల కవిగా ఉగ్గడించిన వారు?     
    అ. ఆరుద్ర     ఆ. కె.వి.రమణారెడ్డి        ఇ. శ్రీశ్రీ    ఈ. శివసాగర్‌
23. ‘ఆంధ్రభారత కవితా విమర్శనము’ ఎవరి గ్రంథం?     
    అ. దండూరి రామకృష్ణమాచార్య        ఆ. కోరాడ రామకృష్ణయ్య        ఇ. పింగళి లక్ష్మీకాంతం    ఈ. చాగంటి శేషయ్య 
24. 1971లో కోవెల సుప్రసన్నాచార్య ఏ రచన సాహిత్య అకాడమీ ఉత్తమ విమర్శ బహుమతి పొందింది?     
    అ. సారస్వత వివేచన     ఆ. సాహిత్య వివేచన         ఇ. కవితా లోకనం    ఈ. ఆధునిక యుగంలో కవిలోకం 
25. 1959లో ‘సప్తతంతువు’ పేరుతో ఏడు వ్యాసాల సంపుటి వెలువరించిందెవరు?     
    అ. కేతవరపు రామకోటిశాస్త్రి ఆ. భూపతి లక్ష్మీనారాయణరావు        ఇ. ఎస్వీ జోగారావు    ఈ. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
26. ‘కవిత్వవేది’ ఎవరి కలంపేరు?     
    అ. కల్లూరి వేంకటనారాయణరావు     ఆ. శిష్టా రామకృష్ణశాస్త్రి        ఇ. వంగూరి సుబ్బారావు       ఈ. వేటూరి ప్రభాకరశాస్త్రి
27. ‘తెలుగు వాఙ్మయము- సంగ్రహచరిత్ర’ సంకలనకర్త?  
    అ. కొర్లపాటి శ్రీరామమూర్తి    ఆ. కూర్మా వేణుగోపాలస్వామి        ఇ. దివాకర్ల వేంకటావధాని    ఈ. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
28. 1958లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఏ రచన తెలుగుభాషా సమితి బహూకృతికి పాత్రమైంది?     
    అ. తెలుగు రచయిత్రులు     ఆ. ఆంధ్ర కవయిత్రులు        ఇ. ఆంధ్ర రచయిత్రుల సమాచార సూచిక         ఈ. ఆంధ్ర సాహిత్య వికాసం
29. ‘ఆంధ్ర కవి సప్తశతి’ గ్రంథకర్త?     
    అ. పెనుమాడు వేంకటశేషయ్య        ఆ. బులుసు వేంకటరమణయ్య         ఇ. టేకుమళ్ల కామేశ్వరరావు    ఈ. కోరాడ మహదేవశాస్త్రి
30. ‘రెడ్డియుగమున ఆంధ్రగీర్వాణ సాహిత్య వికాసము’ను 1962లో విశదీకరించిందెవరు?     
    అ. తురగా కృష్ణమూర్తి    ఆ. దిగవల్లి వెంకటశివరావు        ఇ. కురుగంటి సీతారామయ్య    ఈ. టేకుమళ్ల అచ్యుతరావు
31. ‘‘కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికీ తెలుసు’’ అన్న పలుకులెవరివి? 
    అ. అలిశెట్టి ప్రభాకర్‌    ఆ. రంగాచార్య        ఇ. దాశరథి        ఈ. కాళోజి
32. ‘భారతంలో బీజప్రాయంగా, ఎర్రనలో అంకుర ప్రాయంగా, సోమన్నలో మొలకగా పొడచూపిన ప్రబంధలత శ్రీనాథుని చేతిలో కొనసాగి చిగిర్చి మారాకు వేసింది. అది పుష్పఫల సమన్వితమగుట రాయలకాలంలోనే. మనుచరిత్రయే ఆ లతకుపూచిన తొలిపూవు, పండిన తొలిఫలం’ అన్న విమర్శకుడు?     
  అ. కొర్లపాటి శ్రీరామమూర్తి     ఆ. కట్టమంచి రామలింగారెడ్డి     ఇ. పింగళి లక్ష్మీకాంతం      ఈ. కె.వి.ఆర్‌.నరసింహం
33. ‘నిగమశర్మ అక్క’, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’ వ్యాసాల రచయిత?
   అ. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ  ఆ. దివాకర్ల వేంకటావధాని   ఆ. పింగళి లక్ష్మీకాంతం        ఈ. వేటూరి ప్రభాకరశాస్త్రి
సమాధానాలు:
1.(ఇ); 2.(ఈ); 3.(ఇ); 4.(అ); 5.(ఆ); 6.(ఆ); 7.(ఇ); 8.(ఆ); 9.(ఇ); 10.(అ); 11.(ఈ); 12.(ఆ); 13.(ఈ); 14.(ఈ); 15.(ఈ); 16.(ఆ); 17.(ఆ); 18.(ఆ); 19.(ఈ); 20.(ఆ); 21.(ఆ); 22.(ఇ); 23.(ఆ); 24.(ఆ); 25.(ఇ); 26.(అ); 27.(ఆ); 28.(ఆ); 29.(ఆ); 30.(అ); 31 (అ); 32.(ఇ); 33.(అ)


వెనక్కి ...

మీ అభిప్రాయం