జనచైతన్య కవితా నినాదం

  • 64 Views
  • 0Likes
  • Like
  • Article Share

తొలితరం తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని రూపుదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సాహితీవేత్తల్లో ఒకరైన రుద్రశ్రీ అసలు పేరు చిట్టిమల్లె శంకరయ్య. వెంకటయ్య, మహాలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్‌ 15న జనగామలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, హన్మకొండలో ఉన్నత విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తిచేశారు. ఆంధ్రభాషాభివర్ధిని డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ‘తెలుగుసాహిత్యంలో దేశీయవైద్యం’ అనే పరిశోధనా పత్రాన్ని ఎంఫిల్‌ పట్టా కోసం రూపొందించారు. ‘ఆంధ్రసాహిత్యంలో ఆయుర్వేదం’ అనే అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. భావ కవిగా రచనా వ్యాసంగాన్ని కొన సాగించి అనతికాలంలోనే అభ్యుదయ కవిగా తనను తాను దిద్దితీర్చుకున్నారు. ‘అరాత్రికం, ఇంద్రచాపం, విశ్వసుందరి, బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్, అమృత బిందువు, రూపాయి ఆత్మకథ, ప్రేమ గజళ్లు’ కవితా సంపుటాలు, ‘పంచామృతం’ గేయనాటిక ఈయన రచనలు. రుద్రశ్రీ 1969లో ‘జనని తెలంగాణ’ ఉద్యమ కవితా సంకలనానికి సంకలనకర్తగా వ్యవహరించారు. 2019లో ఈ రచనను తెలంగాణ సాహిత్య అకాడమీ పునర్ముద్రించింది. ‘జనని సాహితి’ని స్థాపించి, ఔత్సాహిక కవుల రచనలను సమీకరించి ‘జనని’ పేరిట సంకలనంగా తీసుకొచ్చారు. అందులో ‘నేను తెలంగాణ పౌరుణ్ని, ప్రజాస్వామ్య పాలనలో, జై తెలంగాణ అనండి!’ అనేవి రుద్రశ్రీ గళమెత్తిన తెలంగాణ ఉద్యమ నినాదానికి ప్రతిధ్వనులు. ‘‘సౌహార్దం ఇంకకముందే/ సౌమనస్యం ప్రిదలకముందే/ మావనతా సురభిళం దుర్గంధం కాకముందే/ మంచి అనే కాగడా వెలుగులో/ శాశ్వత పరిష్కారమేంటో సమాలోచించు త్వరగా!’’ అంటూ స్వరాష్ట్ర సాధన కోసం త్వరపడమని సూచించారు. ఉద్యమ నిర్మాణానికి కవితాశక్తిని వినియోగించిన కవి రుద్రశ్రీ 2021 జనవరి 15న కీర్తిశేషులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం