కటకటాల కథలూ.. కన్నీళ్లూ!

  • 67 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

  • స‌హాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాల‌యం
  • డిచ్‌ప‌ల్లి, నిజామాబాదు
  • 9866917227
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

పదహారణాల ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి. నలభై ఆరు సంవత్సరాల ఆళ్వారుస్వామి జీవితం పలు పోరాటాల అనుభవసారం. చెదరని చిరునవ్వుతో అనేక బాధల్ని ఎదుర్కొన్న ఆయన దాశరథి చెప్పినట్టు ‘‘నిత్య ధారావాహిని వంటి జీవన విధానం’’తో బతికిన రచయిత. ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి ప్రాణపాత్రుడైన వట్టికోట వారిద్దరిలానే ఆనాటి నిజాం వ్యతిరేక ఉద్యమ దృశ్యాల్ని తన రచనల్లో ఆవిష్కరించారు. తాను స్వయంగా అనుభవించిన జీవితపు వాతావరణాన్నే తన రచనల్లో చూపించారు. ‘తెలంగాణ గోర్కీ’గా మన్ననలందుకున్న వట్టికోట కథా సంపుటి ‘జైలు లోపల’. 1952లో ప్రచురణ పొందిన ఈ సంపుటిలోని కథలు ఆనాటి తెలంగాణ వర్ధమాన కథా రచయితలకు గొప్ప నమూనాలుగా నిలిచాయి.
తమకు
బాగా తెలిసిన జీవితాన్నే వస్తువుగా ఎంపిక చేసుకున్న రచయితల రచనల్లో వాస్తవికతకు అగ్ర తాంబూలం దక్కుతుంది. ఈ రచనలు పలు పర్యాయాలు ఆలోచనాత్మకాలవుతాయి. ఆళ్వారుస్వామి అన్ని రచనలూ అలాంటివే. ఆయన ‘ప్రజల మనిషి’, ‘గంగు’ (అసంపూర్ణం) అనే రెండు నవలలు రచించారు. ఈ నవలలు 1935- 48 సంవత్సరాల మధ్య కాలంనాటి తెలంగాణకు నిలువుటద్దాలు. ఆనాటి నిజామాంధ్ర మహా సభల ప్రభావం, స్వభావం, ఆర్యసమాజం, అతివాద ఉద్యమాల అంకురదశ- ఇవన్నీ ఆ రెండు నవలల్లో కనబడతాయి. ఇంత వాస్తవికంగా ఆనాటి తెలంగాణ వాతావరణాన్ని ఆళ్వారుస్వామి చిత్రించేందుకు కారణం.. ఆయనకు నాటి ఆంధ్ర మహాసభ ఉద్యమాలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం. 1932లో నిజామాబాద్‌లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభ నుంచి తెలంగాణ ప్రజా జీవితంతో ఆయన అనుబంధాన్ని కొనసాగించారు. ఆనాటి అనుభవాలు ప్రజల మనిషి, గంగు నవలల్లో ఆవిష్కృతమయ్యాయి. ‘జైలు లోపల’ కథా సంపుటి కూడా ఆ కోవలోదే. సుదీర్ఘ కాలపు జైలు జీవిత అనుభవాల్ని తన ప్రాపంచిక దృక్పథంతో మేళవిస్తూ ఆళ్వారుస్వామి రచించిన అరడజను కథలే ‘జైలు లోపల’.
      ఆళ్వారుస్వామి 1942లో హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జైలుకు వెళ్లారు. ఏడాదిపాటు ముషీరాబాద్‌ కారాగారంలో ఉన్నారు. తర్వాత విడుదలైనా పోరాట జీవనాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. హైదరాబాద్‌ ప్రజల రేషన్‌ కష్టాలపై ఒక కరపత్రాన్ని ప్రచురించారు. సర్కారుకు ఆగ్రహం కలిగింది. పర్యవసానం మరో మారు కారాగారవాసం. ఇక, నిజాం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొని అయిదు సంవత్సరాల పాటు జైళ్లలో ఉన్నారు. ఆళ్వారుస్వామిని ఆ కాల వ్యవధిలో నిజాం సర్కారు హైదరాబాద్, సికిందరాబాద్, సంగారెడ్డి, వరంగల్లు, నిజామాబాద్, గుల్బర్గా జైళ్లల్లో నిర్బంధించింది. నిజామాబాద్‌ జైలులో (1948) ఆయనకు దాశరథితో పరిచయమైంది. అనేక జైళ్లలో ఎంతోమంది సామాన్యుల్ని చూశారాయన. వారి జీవితాల్ని అర్థం చేసుకున్నారు. వారి హృదయ వేదనల్ని తెలుసుకోగలిగారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘పరిగె, మెదడుకు మేత, పతితుని హృదయం, అవకాశమిస్తే, విధిలేక, మాకంటే మీరేం తక్కువ’ కథలు రచించారు. వీటితో కూడిన ‘జైలు లోపల’ తెలుగు కథానిక ప్రక్రియలో వెలువడిన తొలితరం విశిష్ట సంపుటుల్లో ఒకటి. ‘‘నిజానికి మన దేశం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేర ప్రవృత్తి గలవారు కారు. తక్కిన 15 మంది కూడా స్వభావతః నేరకాండ్రు కాదు. పరిస్థితులే వారిని ఆ విధంగా చేశాయి’’ అన్న పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలు కూడా ఆళ్వారుస్వామిని ఆలోచింపజేసి ఉంటాయి. అందుకే ఈ కథా సంపుటి జైలు లోపలి ఖైదీల అంతరంగ తరంగాల్ని తెలుపుతుంది.
ఆరు కథలు
ఖానాపురం వెట్టి మనిషి మల్లయ్య విషాద జీవన కథనం ‘పరిగె’ కథ. ఆనాటి సమాజంలో అమానవీయమైన ధోరణికి ప్రతీక వెట్టి. జీతభత్యాలు నోచుకోని పని వెట్టి చాకిరి. మల్లయ్య చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. చెల్లెలు పన్నెండేళ్ల పసిపిల్ల. తండ్రి రోగంతో మంచం మీద ఉన్నాడు. అతడికి పెడదామంటే ఇంట్లో మెతుకు లేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని వడ్ల గింజలైనా తెచ్చుకునేందుకు మల్లయ్య బయటికి వెళ్తాడు. ‘పరిగె’ గింజలైనా దొరుకుతాయని ఆశపడతాడు. పంట కోసిన తర్వాత అక్కడక్కడా ఇంకా మిగిలి ఉన్న వరి కంకులు ‘పరిగె’. సాధారణంగా పరిగె సేకరించుకుంటే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కష్టపడి పరిగె ఏరుకున్న మల్లయ్య సంతోషంతో ఇంటిదారి పడతాడు. అతని మీద దొంగతనం మోపుతారు. తాను దొంగతనం చేయలేదనీ, పరిగె తెచ్చుకుంటున్నాననీ ఎంత చెప్పినా ఎవరూ వినని పరిస్థితి! మల్లయ్య జైలు పాలవుతాడు. ముగ్గురు నిరుపేదల కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. నాటి భూస్వామ్య సమాజం- దానికి మద్దతు పలికే అధికార యంత్రాంగం నిరుపేదల మీద సాగించిన అణచివేతను అత్యంత సహజంగా పరిగె కథ చిత్రించింది. ఆరంభం, ముగింపు ఆధునిక కథానిక ప్రక్రియకు చక్కగా సరిపోయాయి.
      మరొక కథ ‘మెదడుకు మేత’. మత సామరస్యం ఆవశ్యకత, సౌభ్రాతృత్వ భావనతో కూడిన మానవీయ విలువల అవసరాన్ని ఈ కథ ద్వారా రచయిత ప్రబోధించారు. ఆళ్వారుస్వామి పరిపూర్ణమైన లౌకికవాది. మత వైషమ్యాలు సమాజంలో ఉండరాదని కోరుకున్న రచయిత. ‘మెదడుకు మేత’ కథలో మూడు ముఖ్య పాత్రలు. అందులో హుకుం సింగ్, లతీఫ్‌లు రెండు వేరు వేరు మతాల అభిమానులు. ఎలాంటి మతాభిమానం లేని మోహన్‌బాబు రాజకీయ ఖైదీ. ముగ్గురూ జైలు లోపలి జీవులే! హుకుం సింగ్, లతీఫ్‌ల మాటల్లో వారి వారి మతతత్వాలు ప్రస్ఫుటమవుతాయి. మతతత్వ దృష్టికి బదులుగా మానవీయ దృక్పథం ఉండాలన్నది మోహన్‌బాబు అభిమతం. చిన్న చిన్న చర్చలు, విభిన్న అభిప్రాయ ప్రకటనల్ని నేర్పుతో చేర్చడం ద్వారా రచయిత మెదడుకు మేత కథకు ఒక ప్రత్యేకతను సాధించారు.
      మూడవది ఖైదీలోని ఆర్ద్రమైన మానసిక చిత్తవృత్తిని చిత్రించిన కథ ‘పతితుని హృదయం’. ఉరిశిక్షకు గురైన ఖైదీని గురించి అదే జైలులో ఉన్న మరో ఖైదీ ప్రకటించిన దుఃఖ స్పందన ఈ కథ. గండయ్య అనే ఖైదీ బాధను చిన్న కథలో ఆళ్వారుస్వామి చిత్రించారు. 
ఓ నిరపరాధి కథ
‘అవకాశమిస్తే’ అనేది నాలుగో కథ. ఇది మిగతా కథలకంటే భిన్నంగా సాగుతుంది. కథలో ప్రధాన భాగం సంభాషణలే. అయితే ఇవి చాలా చోట్ల సంక్షిప్తంగా ఉంటాయి. ఈ కథను నాటకీకరించి దాన్ని ప్రదర్శించేందుకూ అవకాశం ఉంది. శాస్త్రి భర్త, సరోజ భార్య. ఇద్దరి మధ్యా సరదాగా జరిగిన వాదోపవాదాల సంభాషణల సారంగా కథ సాగుతుంది. సంభాషణలో భాగంగా జైలులో చూసిన పఠాను దుస్థితి వర్ణన ఉంటుంది. ‘పఠాను మిలిటరీలో చేరతాడు. కుటుంబానికి దూరంగా ఉద్యోగం. మిలిటరీ క్యాంపులో ఏదో జరగడంతో పన్నెండేళ్ల జైలు శిక్ష. తాను నిర్దోషినని చెప్పినా వినేవారు లేరు. దుర్భరమైన జైలు జీవితం. పఠాను పిచ్చివాడయ్యాడు. చివరకు చచ్చిపోయాడు. అతడికి అవకాశం కనుక ఇస్తే జీవితంలో రాణించగలిగేవాడే’ అంటూ శాస్త్రి పాత్ర ద్వారా చెప్పిస్తాడు రచయిత. ఓ నిరపరాధి వ్యథను పఠాన్‌ రూపంలో ఈ కథలో చిత్రించారు ఆళ్వారుస్వామి.
      అయిదోది ‘విధిలేక’ కథ. నర్సయ్య ఇందులో ముఖ్య పాత్ర. స్నేహితుడు లక్ష్మయ్య జైలు దొంగ. అతణ్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కాదు. తానే దొంగగా మారతానేమోనని లక్ష్మయ్యకు దూరంగానే ఉంటాడు. అనుకోకుండా జరిగిన దోపిడీ ఘటనలో అమాయకుడైన నర్సయ్య జైలుకు వెళ్తాడు. అక్కడ వృత్తి దొంగలతో పరియం ఏర్పడుతుంది. జైలులో దొంగతనం నైపుణ్యాలు నేర్చుకుంటాడు. జైలు నుంచి విడుదలయ్యి లక్ష్మయ్య ముఠాలో చేరతాడు. మొదటిసారి దొంగతనం చేయబోయి పట్టుబడతాడు. ‘‘బీదతనం, నిరాదరణ, నిరుద్యోగం, దుష్ట సహవాసం- వీటి ఒత్తిడే నన్నీ రూపానికి తెచ్చాయి. నావంటి వాళ్లందరికీ ఇదే కారణమైందని నా అనుభవం, జీవితం ద్వారా ఒక తిరుగులేని నిర్ణయానికి వచ్చాను’’ అంటాడు నర్సయ్య. విధి అతడి జీవితంతో ఆటలాడుకుంటుంది. బలీయమైన విధి, బలహీనమైన వ్యక్తిత్వాల మధ్య మనిషి నలిగిపోయిన తీరును ‘విధిలేక’ కథ చిత్రిస్తుంది
      ‘మాకంటే మీరేం తక్కువ’ కథ చివరిది. రంగడు, వెంకడు, ఇంద్రసేనారెడ్డి- ఇవీ ఈ కథలోని పాత్రలు. పోరాట కాలంలో రంగడు, వెంకడు దొంగతనాలు చేసేవారు. నాటి పోరాటంలో ఒక నాయకుడు ఇంద్రసేనా రెడ్డి. రంగడు, వెంకడు జైలులో ఉంటారు. పోరాటం ముగిసాక వీళ్లున్న జైలుకు ‘సందర్శకుడి’గా వస్తాడు రెడ్డి. అప్పుడు రంగడు, వెంకడు తమ పాత పరిచయాన్ని అతనితో ప్రస్తావిస్తారు. పోరాట విరమణ తర్వాత ప్రభుత్వ పదవులను సంపాదించుకున్న వారికి ప్రతీకగా రచయిత ఇంద్రసేనారెడ్డి పాత్రను చిత్రించారనిపిస్తుంది. అతనితో రంగడు ‘‘మేము బయట పడగానే మీకాడికే వస్తాం. ఏదైనా కొలువిప్పించురి’’ అని అడుగుతాడు. ‘‘దొంగలనెవరు కొలువుంచుకుంటారురా మీ పిచ్చిగాని’’ అంటాడు ఇంద్రసేనారెడ్డి, ‘‘మీరు సర్కారు నడిపితే మేము చప్రాసి కొలువులకు కూడా పనికి రామా’’ అన్నది రంగడి సూటి జవాబు!!
మరికొన్ని విశేషాలు
‘జైలులోపల’ కథలన్నీ సంక్షిప్తమైనవే. ఈ సంక్షిప్త స్థాయిలోనే పాఠకుడిలో విస్తారమైన ఆలోచనలు కలిగించే నేర్పును రచయిత చూపించారు. పరిగె కథలోని ఆరంభ వాక్యాలు ఇందుకు ఉదాహరణ.
      ‘‘సాయంత్రము 7 గంటల సమయము. ఖైదీలను గదుల్లో పెట్టి తాళం వేసి వరండాలో జవానులు మాటా మంతీ సాగించారు. తాము ఉద్యోగం చేసిన వివిధ జైళ్లలో చేసిన ఘనకార్యాలను, ఖైదీలు చేసే సాహస చర్యలు, వాని నణచుటకై అవలంభించే వివిధ పద్ధతులను తమ అమూల్య అనుభవాలుగా చెప్పుకుంటున్నారు జవానులు’’ 
      ఈ వాక్యాల ద్వారా ఆనాటి పోలీసు యంత్రాంగం ప్రజానీకాన్ని అణచివేసే క్రమంలో చూపించిన అత్యుత్సాహం ఎలాంటిదో చెప్పారు రచయిత. తెలంగాణ ప్రాంతంలో వినిపించే ‘బుగులు’ (గుబులు), ‘కొయ్యకాలు’, (వరిపొలం కోసివేసిన మడి), ‘సరుదుకుంటు’ (సర్దుకుంటు), బిరబిర (తొందరగా) లాంటి మాటల్ని ప్రయోగించారు. ‘మణోబాధ’, ‘స్వార్థులు’, ‘మనోనెమ్మది’ లాంటి అరుదైన పదాలూ ఉంటాయి. 1946- 51 మధ్యలో కారాగారంలో ఉన్నప్పుడు వట్టికోట ఈ కథలను రచించారు. వీటిని ఒక్కచోటకు చేర్చి దేశోద్ధారక గ్రంథమాల పదమూడో ప్రచురణగా 1952లో ‘జైలు లోపల’ సంపుటిని వెలువరించారు. ఆ తర్వాత కాలంలో ‘విశాలాంధ్ర’ సంస్థ దీన్ని తిరిగి ప్రచురించింది. ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ అభిప్రాయపడినట్టు ‘‘ఆళ్వారుస్వామి తమ కథానికల్లో ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. భౌతిక వాస్తవికతను మానసిక వాస్తవికతతో కలగలిపి సరళాతి సరళమైన సంవిధానంలో రాయటం వల్ల ఈ కథలు జీవితానికి దగ్గరగా ఉన్నాయి’’.


వెనక్కి ...

మీ అభిప్రాయం