విజయనగర శిల్పం పెన్నాతీరంలో ఓ అద్భుతం

  • 99 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సూగూరు రవీందర్‌రావు

  • అనంతపురం
  • 8008102323
సూగూరు రవీందర్‌రావు

సూక్ష్మమైన పనితనంతో కనువిందు చేసే ప్రాచీన ఆలయాలు అనగానే కర్ణాటకలోని హొయసలుల నిర్మాణాలు జ్ఞప్తికి వస్తాయి. తెలుగునాట కూడా అలాంటి విశిష్ట శిల్పకళానైపుణ్యానికి వేదిక.. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరాలయం. విజయనగర నిర్మాణశైలికి మచ్చుతునక అయిన ఈ కోవెలది అయిదు శతాబ్దాలకు పైబడిన చరిత్ర!
‘‘అదే
పెన్న! అదే పెన్న! నిదానించి నడు!’’ అంటూ విద్వాన్‌ విశ్వం ఆలపించిన ‘పెన్నేటిపాట’ తెలుగువారందరికీ సుపరిచితమే. ఆ పినాకినీ నదీతీరంలోదే బుగ్గ రామలింగేశ్వరాలయం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఈ సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రానికీ కాశీ విశ్వనాథాలయానికీ ఓ అరుదైన సామీప్యముంది. అక్కడ పడమటి దిక్కులో ప్రవహించే గంగానది.. ఆ గంగమ్మను వీక్షిస్తూ పశ్చిమాభిముఖంగా విశ్వేశ్వరుడు కనిపిస్తాడు. ఇక్కడ కూడా అదే పడమర దిక్కులో పారే పెన్నానదికి అభిముఖంగా బుగ్గ రామలింగేశ్వరుడు కొలువయ్యాడు. దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి. వీటికి భిన్నంగా పశ్చిమాభిముఖంగా నిర్మితమవడమే రామలింగేశ్వరాలయం ప్రత్యేకతల్లో ఒకటి. వైశాఖమాసంలో సాయంత్రం వేళ సూర్యకిరణాలు గర్భగుడిలోని రామలింగేశ్వరుణ్ని తాకడాన్ని తిలకించిన వారు తన్మయభరితులవుతారు.  
      ఈ ఆలయ నిర్మాణానికి సంబంధిం చిన కథ ఒకటి తాడిపత్రి కైఫీయత్తులో కనిపిస్తుంది. ఈ ప్రాంత పాలకుడైన రామలింగ నాయని ఆవులు పినాకినీ తీరంలోని నీలాద్రి పర్వతం దగ్గర మేసేవట. వాటిలో ఓ ఆవు నీలాద్రి గుట్ట మీదకు వెళ్లి అక్కడి పుట్టలోని రామలిం గేశ్వరుడికి పాలు పట్టేదట. ఓరోజు అది గమనించిన కాపరి దాని మీదకు గొడ్డలి విసిరాడట. ఆ రోజు రాత్రి రామలింగ నాయని కలలోకి ఈశ్వరుడు వచ్చి.. కాపరి విసిరిన గొడ్డలి తనకు గాయం చేసిందని, నన్ను ఆ పుట్టలోంచి వెలికిదీయించి అక్కడే గుడి కట్టించమని కోరాడట. ‘‘మరునాడు వుదయమున సకల పురజన ములతో పోయి, ఆ పుట్ట బులాయించి తీయించి చూచినందున రామలింగేశ్వర లింగం విస్తారంగా కనుపడినందున విద్యానగరము రాయల వారికి ఈ వర్తమానం వ్రాయించి పంపించి రాయల వారి ఆజ్ఞ ప్రకారము నరకారు ద్రవ్యం ఖర్చు చేయించి... ...దేవాలయము యేర్పరచి నూతనంగా కట్టించినారు’’ అన్నది కైఫీయత్తు కథనం. పెన్నానది ఎండిపోయిన సందర్భాల్లోనూ దానికి 17 అడుగుల ఎత్తులో ఉండే గర్భగుడిలోని లింగం కింద నుంచి నీరు నిరంతరం పొంగు తూంటుంది. అలా ఈ కోవెలకు ‘బుగ్గ’ రామలింగేశ్వరాలయమనే పేరు వచ్చింది. 
ఇదీ చరిత్ర!
విజయనగర మండలాధీశుడు పెమ్మసాని తిమ్మనాయుడి కుమారుడు రామలింగ నాయుడు బుగ్గరామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.1450లో దీని నిర్మాణం ప్రారంభమై రెండు దశాబ్దాలకు పూర్తయ్యింది. రామాచారి అనే స్థపతి ఆధ్వర్యంలో 17 వేల మంది శిల్పులు ఈ ఆలయాన్ని దిద్దితీర్చారు. (కైఫీయత్తులో ‘‘లింగనాచారీ మొదలయి కాశవాండ్లకు పని యిచ్చి’’ అని ఉంటుంది) నిర్మాణంలో మూడు రకాల గ్రానైట్‌ రాయిని వాడారు. స్థానికంగా కొంతరాయిని తీయించి వినియోగించారు. మిగిలిన రాళ్లను వజ్రగిరి కొండలు, తలమంచిపట్నం నుంచి ఎల్లమలగుంట మీదుగా బండ్ల మీద తీసుకొచ్చారు. ఎర్రమల కొండల  కనుమ దారుల్లోంచి జరిగిన ఈ రాళ్ల తరలింపు గురించి కూడా తాడిపత్రి కైఫీయత్తు వివరిస్తుంది. 
      రామలింగేశ్వరాలయానికి పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో చూపుతిప్పుకో నివ్వని శిల్పసంపదలకు వేదికలైన గోపురాలుంటాయి. ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ అండ్‌ ఈస్ట్రన్‌ ఆర్కిటక్చర్‌’ పుస్తక రచయిత, పురావస్తు నిపుణుడు, చరిత్రకారుడు జేమ్స్‌ ఫెర్గ్యుసన్‌ వీటిని ‘అద్భుతాలు’గా వర్ణించారు. పశ్చిమ గోపురం మీద విజయనగర సామ్రాజ్యపు అధికారిక ‘వరాహ ముద్ర’ కనిపిస్తుంది. దీన్లోంచి లోపలికి వెళ్లగానే గర్బ గుడికి ఎదురుగా దిద్దితీర్చిన నందీశ్వరుడు కనిపిస్తాడు. దక్షిణ గోపురం మీద వివిధ దేవతలు, పక్షులు, జంతువుల ప్రతిమలు, పూల- జ్యామి తీయ ఆకృతులు కనువిందు చేస్తాయి. ఉత్తర గోపురం మీద అష్టదిక్పాలకుల శిల్పాలు వారి వాహనాలతో సహా దర్శనమిస్తాయి. విశేషంగా తీర్చిదిద్దిన మహిషాసురమర్దిని శిల్పం కూడా ఈ గోపురం మీద కనిపిస్తుంది. ఇక్కడే ఆలయ నిర్మాత రామలింగ నాయని ప్రతిమ (ఇది స్థపతి రామాచారి విగ్రహం అని కొందరి వాదన!) ఉంటుంది. 
అద్దాల్లాంటి రాళ్లు
ఆలయం మూడు గోపురాల మీద అనేక అవతారాల్లోని శివుడి విగ్రహాలు ఉంటాయి. కేవల, దక్షిణ, ఉమామహేశ్వర, వృషభరుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, భిక్షతన, హర్యద్ర తదితర మూర్తులను శిల్పులు చెక్కారు. ఉత్తర, దక్షిణ ద్వారాలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన నాలుగు స్తంభాలకు ఎండకు అద్దంలా మెరిసే రాళ్లను పొదిగారు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఈ రాళ్లకు ఎదురుగా నిలబడే వ్యక్తుల ప్రతిబింబాలు వాటిలో స్పష్టంగా కనిపించడం విశేషం. ఈ రాళ్లలో ఒక్కొక్క దాని విలువ రూ.50 లక్షల దాకా ఉంటుందని పురావస్తు శాఖ అధికారులు చెబుతారు. గోపురాల బయటి వైపు రామాయణ, మహాభారత, శివపురాణ కథల శిల్పాలు అందంగా దర్శనమిస్తాయి. ప్రాకారోత్సవాల కోసం ఈ గోపురాలను అసంపూర్తిగా వదిలేశారని అంటారు. 
      గర్భగుడికి ఎదురుగా పదహారు స్తంభాలతో రంగమండపం ఉంటుంది. వీటిలో కొన్నింటిని మెల్లగా తడితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఈ మండపంలోనే తన కాలిలో ముల్లును తీస్తున్న సేవకుడి తల మీద తన చెయ్యి ఉంచిన రాణి శిల్పం ఒకటి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. విజయనగర రాజుల కాలంలో పక్షుల వేటకు వెళ్లిన రాణికి కాలిలో ముల్లు గుచ్చుకుందట. ఓ సేవకుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా బాధకు తాళలేని రాణి, సేవకుడి తలమీద చేయివేసి ‘నెమ్మదిగా తొలగించ’మని అడిగిందట. ‘అమ్మగారూ.. ముల్లు గుచ్చుకుంటేనే మీరు నొప్పికి ఓర్చుకోలేకపోతున్నారు. మీరేసే బాణాలకు ఆ పక్షులు ఎంతగా విలవిల్లా డతాయో ఆలోచించండి’ అని ఆ సేవకుడు వినమ్రంగా చెప్పాడట. దాంతో ఆ రాణి వేటకు స్వస్తి చెప్పిందని గాథ. ఇలాంటి విశేష శిల్పాలు అనేకం ఆలయ ఆవరణలో కనిపిస్తాయి. సొగసైన సాగరకన్య, ఏనుగులను ఎత్తుకెళ్లేంత గండబేరుండ పక్షులు, నాలుగు చేతులు- నాలుగు కాళ్లతోనే సంపూర్ణంగా కనపడే ముగ్గురు వ్యక్తులు, సింహాలను లొంగదీసుకునే పరాక్రమవంతులు, మావటిని ఎత్తిపడేసే గజరాజు, నేటి పట్టుచీరల అంచుల్లా ఆకృతుల శిల్పాలు నాటివారి నిర్మాణ కౌశలానికి అద్దంపడ తాయి. లక్ష్మీదేవికి అర్ధశరీరమిచ్చిన విష్ణుమూర్తి రూపం ఇక్కడే కనిపిస్తుంది. తల నుంచి తోక వరకు ఆద్యంతాలు కనిపెట్టలేని నాగబంధం లాంటి ప్రహేళికల ప్రతిమలు కూడా విజయనగర శిల్పుల నైపుణ్యాలకు ఉదాహరణలే.  
అలనాటి శాసనాలు
ప్రాంత, కోవెల చరిత్రను వివరించే వివిధ శాసనాలు కూడా ఆలయ ఆవరణలో కనిపిస్తాయి. గుడిలోని ఓ రాతిమీద జైనుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి.  విజయనగర ప్రభువులకు ముందు క్రీ.శ.1199లో జైన సామంత రాజు ఉదయాదిత్యుడి ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేదని ఓ శాసనం చెబుతోంది. గుడి ఆవరణలో ప్రతిష్ఠించిన కాశీ విశ్వేశ్వరుడు, నంది విగ్రహాల దగ్గర కూడా శిలా శాసనాలు ఉన్నాయి. వీటిని క్రీ.శ.1470లో విజయనగర సంగమ వంశ చివరి పాలకుల్లో ఒకరైన రెండో విరూపాక్ష రాయలు వేయించాడు. శ్రీరాముడు పెన్నానదిలో ఈశ్వరుణ్ని లింగరూపంలో ప్రతిష్ఠించాడని, నదికి 120 అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టాడని, శివలింగం కింద నుంచి గంగాజలం ఎల్లవేళలా ఉబికి వస్తుంటుందని ఈ శాసనాలు చెబుతాయి. ప్రముఖ జానపద గాయకులు అమళ్లదిన్నె గోపీనాథ్‌ వెలుగులోకి తెచ్చిన ‘‘నీదు మహిమ తెలియలేదుగా గంగా భవానీ/... ఎంత మోసమాయె పెన్నా/ నీ మాయ తెలియ లేదు..’’ పాటలో కూడా ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. పెన్నానదికి వరదలు వచ్చి తీరప్రాంతాలకు తీవ్రనష్టం కలిగించిన అరుదైన చారిత్రక సందర్భాన్ని ఈ జానపద గీతం నమోదు చేసింది. ‘‘...పేరూరు గంగమ్మ గుడి పేరు గాని లేచెనన్నా/ గూళము చంద్రాని గుడి గుద్దుకొని పారెనన్న/... కత్రిమోల కట్టు కాల్వ కదలకుండా లేచిపోయె/... తాడి పత్రి రామేశ్వరం గోపురాలె తన్నుకొనె..’’ అంటూ సాగుతుందీ పాట. 170 ఏళ్ల కిందట, అంటే 1851లో పెన్నానదికి వచ్చిన వరదల్లో ఆలయ దక్షిణ గోపురం దెబ్బతిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన ‘టెంపుల్స్‌ ఆఫ్‌ తాడిపత్రి’ (1976) పుస్తకమూ చెబుతుంది.    
      గర్భాలయంలోని రామలింగేశ్వరుణ్ని నేరుగా తాకే, అభిషేకం చేసుకునే అవకాశం లేదు. దీనికి భక్తులు అసంతృప్తికి గురికాకూడదనే స్వామివారి ఉత్తర ద్వారం పక్కన కాశీ విశ్వేశ్వరుణ్ని ప్రతిష్ఠించారు. ఈయనను తాకి దర్శించుకున్న తర్వాతే బుగ్గరామలింగేశ్వరుణ్ని దర్శించుకోవడం ఆనవాయితీ. అలాగే, పూర్వం పడమటి వైపున ఉన్న యాగశాలను ఆగ్నేయ మూలకు మార్చారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు రుద్ర, గణపతి, నవగ్రహ హోమాలు జరుగుతాయి. ఆలయ ఆవరణలోనే మూడొందల ఏళ్ల శమీ వృక్షం ఉంది. ఆలయ పైకప్పు లోపలి భాగం, గుడి నిర్మాణం హొయసల ఆలయాల నిర్మాణ శైలికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి స్తంభాలు పంజర నిర్మాణ పద్ధతిలో (పెద్దస్తంభానికి చిన్నదాన్ని జతచేయడం) కనిపిస్తాయి. ఇవి హంపీ విఠలేశ్వరా లయ స్తంభాలను ప్రతిబింబిస్తాయి. రాజరాజేశ్వరి, కోదండ రామ, వీరభద్ర ఉపాలయాలు, భూటాన్‌లో మాత్రమే కనిపించే వజ్రవరాహిణి దేవి శిల్పం, ఉత్తర, దక్షిణ ప్రవేశ మార్గాల్లోని ఏకశిలా స్తంభాలు, ఇంద్రలోకాన్ని కళ్లకుకట్టే శిల్పాలతో అలరారే ఈ ఆలయం తెలుగువారి చారిత్రక వారసత్వ సంపదల్లో విలువైంది. 

తాడిపత్రి కైఫీయత్తు అందించినవారు కట్టా నరసింహులు


వైశాఖంలో రోజూ పొద్దున చింతల వెంకటరమణ స్వామి పాదాలను, సాయంత్రం బుగ్గరామలింగేశ్వరుడి పాదాలను సూర్యకిరణాలు తాకడం విశేషం. నిర్మాణ నైపుణ్యం, ఆధ్యాత్మికతల అరుదైన సమ్మేళనమిది.

- శంకరయ్య, రామలింగేశ్వరాలయ పూజారి 


తాడిపత్రిలోని రెండు ఆలయాలు ఆంధ్రలోని చూడచక్కటి కోవెలల్లో ప్రత్యేకమైనవి. విజయనగర శిల్పకళ అధ్యయనంలో చాలా ముఖ్యమైనవి. ఇక్కడి నిర్మాణాలు, శిల్పాలు, చిత్రకళ అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా బుగ్గ రామలింగేశ్వరాలయ గోపురాల మీది శిల్పకళ విలక్షణమైంది. 

- ఎన్‌.ఎస్‌.రామస్వామి, ‘టెంపుల్స్‌ ఆఫ్‌ తాడిపత్రి’ రచయిత


వెనక్కి ...

మీ అభిప్రాయం