సలక్షణ సంగీత ప్రతిధ్వని

  • 67 Views
  • 0Likes
  • Like
  • Article Share

కర్ణాటక సంగీతంలో మేరునగమైన పెమ్మరాజు సుర్యారావు 1934 ఆగష్టు 20న మచిలీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ. తండ్రి ఆకాంక్ష మేరకు చిన్ననాడే గాత్రసంగీతంలో మెలకువలు నేర్చుకుని పద్యాలను పాడటం సాధన చేశారు. విజయవాడ, మచిలీపట్నాల్లో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. చదువు పూర్తయ్యాక పూర్తి సమయం సంగీత శిక్షణకే కేటాయించారు. పారుపల్లి రామకృష్ణయ్య శిష్యులైన మద్దులపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. విశ్వనాథ సమక్షంలో సాహిత్యాన్ని, మంగళంపల్లి సాన్నిహిత్యంలో సంగీత మర్మాల్ని అవగతం చేసుకుని సంగీత సాహిత్యాల మీద పట్టు సాధించారు. సత్యనారాయణాగ్రహారంలో శరభయ్య ఆలయ కమిటీ నిర్వహించిన సంగీత ఉత్సవాల్లో తొలిసారి తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసి, సంగీతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. విజయవాడ ఆకాశవాణిలో భక్తిసంగీతంలో గాయకుడిగా గుర్తింపు పొందారు. బాలాంత్రపు రజనీకాంతరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి లాంటి దిగ్గజాల సమక్షంలో తన ప్రతిభను ప్రదర్శించి అపార సంగీతానుభవాన్ని గడించారు. మంగళంపల్లి కచేరీలకి పదేళ్లపాటు గాత్ర విద్వాంసుడిగా వ్యవహరించారు. ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. సంగీత సన్మండలి అనే సంస్థ ద్వారా అనేక మందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న, ఉగాది, హంస పురస్కారాలు అందుకున్నారు. సువర్ణఘంటాకంకణ, సామగానలహరి జీవిత సాఫల్య సత్కారాలనూ స్వీకరించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీతతో పాటు అనేకమంది శిష్యులను దిద్దితీర్చిన ఈ సంగీత శిరోమణి 2021 ఫిబ్రవరి 3న కీర్తిశేషులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం