అస్తిత్వానికి ఆరోప్రాణం అమ్మభాషే

  • 105 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా. భారతి జొన్నలగడ్డ

  • తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • హైదరాబాద్‌
  • 9440494415
డా. భారతి జొన్నలగడ్డ

బహస జివా బంగ్సా
‘మలాయ్‌’ భాషలోని ఈ సామెతకు అర్థం... ‘భాష అనేది జాతి ఆత్మ’
టొకు రియో, టొకు ఒహొహొ
‘నా భాష... నా చైతన్యం’... ఇది ‘మవోరీ’ మంచిమాట.
యామ్‌ ఫియర్‌ ఎ చైల్లియస్‌ ఎ చనైన్‌ కైల్లిద్‌ ఇ ఎ షావుఘై
      ఈ ‘స్కాటిష్‌’ సూక్తి ఏమంటోందంటే... ‘సొంత భాషను తద్వారా సొంత ప్రపంచాన్ని కోల్పోయిన వ్యక్తి అతను’
అమ్మభాషంటే ఆత్మగౌరవానికి ప్రతీక. సొంత వ్యక్తిత్వానికి సూచిక. జాతి సాంస్కృతిక దీపిక. దాన్ని దూరం చేసుకోవడమంటే మన అస్తిత్వంపై మనకే నమ్మకం లేనట్లు! ఇంకా చెప్పాలంటే... మన తలను మనమే తీసేసుకుంటున్నట్లు!
      మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతికి, వాతావరణానికి అనుగుణమైన భాషను అనుకరణ ద్వారానో, పోలిక ద్వారానో సృష్టించుకున్నాడు. ఆ భాష ద్వారా అనుస్యూతమైన ఒక సంస్కృతిని రూపొందించుకున్నాడు. భాషా సంస్కృతుల సాయంతో ప్రత్యేకమైన జీవ జాతిగా ఎదిగాడు. గుంపుల దశ నుంచి మానవ సమాజం జాతులుగా ఎదగటానికి భాషా సంస్కృతులు వారధులయ్యాయి. ఆ వారధులు కూలిపోతే మళ్లీ చరిత్ర చీకటియుగాల్లోకి జారిపోవాల్సి వస్తుంది. ఆ ప్రమాదాన్ని తప్పించాలంటే ప్రతి అమ్మభాషనూ సంరక్షించాలి. ముఖ్యంగా ఆంగ్లం లాంటి ‘ప్రపంచ’ భాషల దాడిలో దెబ్బతింటున్న తెలుగు లాంటి వాటిని! 
      ఆంగ్లం వల్లే తెలుగు పిల్లలకు ‘తెలుగు’ సాంస్కృతిక సంపదలు అందకుండా పోతున్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచి వారికి ఆంగ్లాన్ని మాత్రమే నేర్పుతూ మనవైన సంప్రదాయాలు, వాటి ద్వారా తెలుగు జాతి రక్తంలో ఇంకిపోయిన విలువలకు వారిని దూరం చేస్తున్నాం. ఉదాహరణకు మూడేళ్ల వయసు పిల్లాడు  బడికెళ్లగానే ‘రైన్‌ రైన్‌ గో అవే’ అన్న ‘రైమ్‌’ను నేర్చుకుంటున్నాడు. పాశ్చాత్య వాతావరణానికి వర్షం అంత అనుకూలం కాదు కాబట్టి అక్కడి పిల్లలు దానిని వద్దనుకోవచ్చు. కానీ, మన వాతావరణానికి వర్షం అవసరం. మన సంప్రదాయంలో వర్షం అతిథి. అతిథిని సాదరంగా ఆహ్వానించి, మర్యాద చేసే అలవాటును మన పిల్లలు నేర్చుకోనివ్వకుండా చేస్తోందీ రైమ్‌. దీనికి బదులు ‘వానా వానా వల్లప్పా, వాకిలి తిరుగూ చెల్లప్పా’ గీతాన్ని నేర్చుకుంటే మన ‘పద్ధతులేంటో’ పిల్లాడికి తెలుస్తాయి. మన సంస్కృతిలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటూ పెరుగుతాడు వాడు. కానీ ఆ అవకాశం మనం ఇవ్వట్లేదు. 
      పైన చెప్పుకున్నదొక్కటే కాదు... ‘ఎప్పుడూ నిజమే మాట్లాడాలని’ నేర్పే శతకాలను వదిలి ‘అబద్ధమాడటం గొప్పని, దాన్ని సమర్థించుకోవడం తెలివని’ చెప్పే భావాలను చిన్నారుల చేత బట్టీపట్టిస్తున్నాం. బతుకులోని పరమార్థాన్ని విడమరిచే సుభాషితాలను పక్కనబెట్టి ‘అల్లరిచిల్లరి మాటలతో నృత్యాలు చేయించే’ అరువు పాటలను వల్లెవేయిస్తున్నాం. మూలాలను మరచి, పాశ్చాత్య పునాదులపై భావితరాన్ని నిలబెట్టాలనుకునే ఈ ప్రయత్నాలు చేటు తెస్తాయి. ప్రపంచంలో మనకంటూ ఉన్న సొంత గుర్తింపును అదృశ్యం చేస్తాయి. 
క్షరమవుతున్న అక్షరాలు 
తెలుగు భాషకు అక్షరాలు 56. కానీ, ఇప్పుడు విద్యార్థులు, యువతరం ఉపయోగిస్తున్న అక్షరాలు ఎన్ని? శకటరేఫం(ఱ) వంటివి ఎప్పుడో కనుమరుగయ్యాయి. ‘ళ, శ, ణ’ లాంటివి, కొన్ని ఒత్తులూ వ్యవహారంలో ఎక్కువగా వినిపించట్లేదు. క్రమంగా ఇవి కూడా అంతరించవచ్చు. మరి భవిష్యత్తులో ఈ అక్షరాలు ఉన్న పదాలు ఎక్కడైనా చదవాల్సివస్తే పరిస్థితి ఏంటి? ఈ రోజు ప్రాచీన శానస భాషను చదవటానికి ఎంత కష్టపడాల్సి వస్తోందో... భవిష్యత్తులో ఈ అక్షరాలున్న పదాలని అర్థం చేసుకోవడానికీ అంతే ఇబ్బంది ఎదురవుతుంది. ఒకవేళ వాటిని అర్థం చేసుకునే వారు లేక... ఆ పదాలు తెలిపే సాంస్కృతిక, సామాజిక విషయాలన్నీ కనుమరుగైతే మన వైవిధ్యాన్ని కోల్పోయినట్లే కదా. అంటే మన భాష ద్వారా ప్రపంచానికి అందే జ్ఞానం నశించిపోతుందన్న మాటే కదా. అలాంటి పరిస్థితులు జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయని యునెస్కో లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నా వినకపోతే ఎలా? మరోవైపు... ఆధునిక సాంకేతిక సౌకర్యాలకు, యంత్ర సామగ్రికి తెలుగులో పదాలు తయారు చేసుకోలేకపోతున్నాం. ఆయా అవసరాలకు ఆంగ్ల పదాలనే వాడుతున్నాం. దీంతో ఆనేక అన్యభాషా పదాలు మన పలుకులోకి చొచ్చుకొస్తున్నాయి. మనకంటూ ‘సొంత గొంతు’ లేకుండా చేస్తున్న ఈ పదాలను ఎంత త్వరగా వదిలించుకోకపోతే... అంత త్వరగా మన భాష ఆంగ్లంలో విలీనమవుతుంది. అప్పుడు తెలుగు వారున్నా... తెలుగు జాతి లేనట్లే! 
      పట్టణీకరణతో పెరుగతున్న వలసల కారణంగా పల్లెలు ఖాళీ అవుతున్నాయి. కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. వాటితో పాటే ఆయా వృత్తులకు సంబంధించిన పారిభాషిక పదజాలమంతా చీకట్లో కలిసిపోతోంది. కాలగతిలో వచ్చే మార్పులకు మనిషి తలొగ్గడం తప్పనిసరి అయినా... ఆయా వృత్తులకు సంబంధించిన పదాలను నమోదు చేయాలి. నిఘంటువుల్లోకి ఎక్కించాలి. తద్వారా సాహిత్యం ద్వారా ఆ పదజాలం అజరామరత్వాన్ని పొందే అవకాశాన్ని కల్పించాలి. ఒక భాషలోని పదాలను, వాక్య ప్రయోగాలను, ఉచ్చరణ విధానాలను నాణ్యంగా నమోదుచేయడం, భావితరాల అవగాహన కోసం భద్రంగా పరిరక్షించడానికి జరుగుతున్న కృషికి సంబంధించిన సూచనలు... ఆ భాష స్థితిగతులను ‘లెక్కించే’ ప్రమాణాల్లో భాగమని యునెస్కో చెబుతోంది. మరి ఆ పని తెలుగునాట జరుగుతోందా? 
చేతులు కలిపి...    
తెలుగు భాషా వైవిధ్యం మూడు కాలాల పాటు పచ్చగా ఉండాలంటే... తెలుగు ప్రాంతంలో తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా కఠినంగానైనా అమలు చేయాలి. సాహిత్య భాషగా, వ్యవహార భాషగా దాన్ని సమున్నత స్థితిలో నిలపటానికి ప్రయత్నించాలి. విదేశాల్లో ఉన్న తెలుగువారు భాషను కాపాడుకోవడం కోసం వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకుని, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవతరానికి అమ్మభాషను అందించేందుకు ప్రత్యేక తెలుగు బడులనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని తెలుగు వారూ తెలుగును ప్రేమించాలి. పిల్లలకు ప్రాథమిక విద్యను తెలుగులోనే చెప్పించాలి. కొత్తగా వస్తున్న ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థకాలను తయారు చేసుకోవాలి. ఆంగ్ల వాడుకను సాధ్యమైనంత తగ్గించాలి. తెలుగు భాషా సంస్కృతులు అందిస్తున్న విలువలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో కార్యోన్ముఖులు కావాలి. ఇప్పటికే ఈ దిశగా ఉద్యమిస్తున్న వారందరూ భాషను రక్షించే ఒకే వేదిక మీదకు రావాలి. తెలుగు భాషా పరిరక్షణకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషించాలి. వాటిని ఆచరణలోకి తేవాలి. అప్పుడే... విశ్వవీధుల్లో తెలుగు పతాకం రెపరెపలాడుతుంది. తెలుగు జాతి అస్తిత్వం ఆచంద్రతారార్కమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం