‘కథా తెలంగాణం’ ఘనం ఘనం!!

  • 46 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ముదిగంటి సుజాతారెడ్డి

  • హైదరాబాదు
  • 040 27566534
డా।। ముదిగంటి సుజాతారెడ్డి

తెలంగాణలో కవిత్వం లేదన్నట్టుగానే కథ లేదన్న అపోహ ఉండేది. తెలంగాణలో కథ 1960, 70 లలో పుట్టిందన్న భ్రమ సాహితీ లోకంలో ఉండేది. తెలంగాణలో కూడా కథ గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథతోనే పుట్టింది. ఇంకా చెప్పాలంటే అంతకుముందే పుట్టింది. పెరిగింది. సామాజిక బాధ్యతతో మనుగడ సాగించింది. 
ఆంధ్ర ప్రాంతంలో కథ బెంగాలీ, ఇంగ్లిషు కథల ప్రభావంతో పుడితే తెలంగాణలో కథ హిందీ, ఉర్దూలలోని ప్రేమ్‌చంద్‌ కథల ప్రభావంతో పుట్టింది. తెలంగాణ నుంచి మొదటి కథ మాడపాటి హనుమంతరావు రచించిన ‘హృదయ శల్యము’. ఈ కథ గురజాడ ‘దిద్దుబాటు’ కథ అచ్చయిన ‘ఆంధ్రభారతి’ పత్రికలోనే అచ్చయింది. ‘దిద్దుబాటు’ 1910 ఫిబ్రవరి పత్రికలో అచ్చయితే ‘హృదయశల్యము’ 1912 జనవరిలో అచ్చయింది. మాడపాటి మొత్తం 13 కథలు రచించారు. వాటిల్లో ‘హృదయ శల్యము’ ‘నేనే’ కథలు స్వతంత్రమైనవి. కాగా మిగిలిన కథలు ప్రేమ్‌చంద్‌ ఉర్దూ కథలకు స్వతంత్ర అనువాదాలు. ప్రేమ్‌చంద్‌ కథనం, సామాజిక దృష్టి కోణం తెలంగాణ రచయితలను బాగా ప్రభావితం చేశాయి. 
      తెలంగాణ నుంచి మాడపాటే మొదటి కథకుడు కాదని 1898 నుంచే కథలు, స్కెచ్‌లు రాస్తున్న భండారు అచ్చమాంబ మొదటి కథకురాలు అని ఇప్పుడు బయటపడిన కథల సమాచార అధ్యయనం వల్ల తెలుస్తుంది. అచ్చమాంబ నైజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న మునగాల సంస్థానంలో దివాన్‌గా పనిచేస్తున్న కొమర్రాజు వెంకటప్పయ్య గారి కుమార్తె. తెలంగాణ వైతాళికులలో ఒకరుగా పేరొందిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అచ్చమాంబకు స్వయానా సోదరుడు. చిన్ననాడే తండ్రిని కోల్పోవటంతో అచ్చమాంబ తల్లి వెంట మేనమామ దగ్గరికి దేవరకొండకు వచ్చింది. తరువాత తల్లి కోరిక మేరకు మేనమామ మాధవరావుతో అచ్చమాంబకు వివాహం జరిగింది. మాధవరావుకు మహారాష్ట్రలోని నాగపూర్‌కు బదిలీ అయింది. అచ్చమాంబ అక్కడే హిందీ, మరాఠీ భాషలు నేర్చుకుంది. అయినా మాతృభాష తెలుగును మరువలేదు. చక్కని సరళ గ్రాంథికంలో రాయటంలో ప్రావీణ్యం సంపాదించుకుంది. 1898-1904 మధ్యకాలంలో పన్నెండుకథలు రచించింది. సంఘ సంస్కరణోద్యమం, స్త్రీ విద్యావశ్యకతలను గుర్తించిన ప్రభావంతో ఆమె కథా రచన చేసింది. సమాజ సేవలో మునిగి ఉండే ఆమె సామాజిక స్పృహ, రాజకీయ స్పృహతో మంచి లోతైన అవగాహనతో ఆమె కథలు రాశారు. ఆమె మొదట కథలు, ‘ప్రేమ పరీక్షణము’, ‘ఎరువు సొమ్ము పరువు చేటు’(1898). ఈ కథలు దొరకలేదు. 1901లో ఆమె రాసిన ‘లలితా శారదలు’, ‘గుణవతియగు స్త్రీ’ కథలు ఇప్పుడు దొరుకుతున్నాయి. ‘జానకమ్మ’, ‘దంపతుల ప్రథమ కలహం’ (1902) కథలు మంచి కథనం, ఇతివృత్తం కలిగినవి.
      తెలుగులో 19వ శతాబ్దం చివరి దశకంలో కథలు, కథానికలు రాసే ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ కూడా అసమగ్రంగా ఉండటమే కాక, కాశీమజిలీ కథల వంటి అద్భుత కథలు. వాటిలో సామాజిక బాధ్యత కనిపించదు. సంఘ సంస్కరణోద్యమం ప్రభావంతో సామాజికావగాహనతో రచించిన అచ్చమాంబ, మాడపాటివారే తెలంగాణ మొదటి కథకులు.
హితబోధిని నుంచి మీజాన్‌ వరకూ 
ఆ తరువాత తెలంగాణలో 1920లలో ఒద్దిరాజు సోదరులు, ఆదిరాజు వీరభద్రరావు, సి.ఆర్‌.అవధాని, నందగిరి వెంకట్రావు, నందగిరి ఇందిరాదేవి వంటి వారు ఆనాటి నైజాం సమాజాన్ని, చరిత్రను ప్రతిబింబించే కొన్ని కథలు రాశారు. గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమాలు, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో మాతృభాషాభిమానం కలిగి తెలుగులో పత్రికలు నడపటం కవిత్వం, కథలు, ఉపన్యాసాలు రాయడం తెలంగాణలో ఆరంభమైంది. హితబోధిని, తెనుగు, నీలగిరి, గోలకొండ, ఆంధ్రాభ్యుదయం, సుజాత, మీజాన్‌ వంటి పత్రికలకు చదువుకున్న వాళ్లు, ఆంధ్రోధ్యమంలో పాలు పంచుకునేవాళ్లు రచనలు చేశారు. బడారు శ్రీనివాసరావు 1913లో ‘హితబోధిని’ పత్రికను ఆరంభించి రెండు సంవత్సరాల కాలం నిరాటంకంగా నడిపారు. ఆ పత్రికలో ఈయన కథలు రెండు అచ్చయ్యాయి. వాటిలో దొరుకుతున్న కథ ‘రాజయ్య సోమయాజులు’. తెలంగాణ నుంచి వచ్చిన పత్రికల్లో 1913లో అచ్చయిన మొదటి కథ ఇది. వయస్సు మీరిన వృద్ధుడు ఎనిమిదేండ్ల బాలికను వివాహమాడే వృత్తాంతం ఈ కథకు నేపథ్యం. రాజయ్య సోమయాజులు ఇంద్రియ పటుత్వం కోసం ఒక మలయాళ వైద్యుని ఆశ్రయించటం, ఆ వైద్యుడు కుయుక్తులను పన్నటం వంటి సన్నివేశాలను రచయిత హాస్యస్ఫోరకంగా, అప్పటి వివాహ వ్యవస్థను, బాలికా వివాహాల వల్ల కలిగే అనర్థాలను చెపుతున్న చక్కని కథ. నాటకీయతలో కథ రసవంతంగా నడిచింది. కథనం సంభాషణలు వ్యవహార భాషలో ఉండటం విశేషం. తెలంగాణ నుంచి తొలినాళ్లలోనే ఇంత గొప్ప కథ రావటం చెప్పుకోదగ్గ విశేషం.
      తెలంగాణ నుంచి 1930 దశకంలో కాల్పనికవాద కథలు కూడా వచ్చాయి. 1930లో కొందరు యువరచయితలు ‘సాధన సమితి’ని స్థాపించి భావకవిత్వం ధోరణిలో కథలు, కవిత్వం, నాటికలు రాశారు. ఈ సమితి కథా సంపుటాలను ప్రచురించింది. బూర్గుల రంగనాథరావు, నెల్లూరి కేశవస్వామి, ధరణికోట శ్రీనివాసులు, హీరాలాల్‌ మోరియా, నందగిరి ఇందిరాదేవి ఈ సమితిని నడిపారు. ‘కథలెట్లా వ్రాయాలి’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 1946లో వీరు అఖిలాంధ్ర కథానికల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి సురవరం ప్రతాపరెడ్డి, అడవి బాపిరాజు, చింతా దీక్షితులు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. 1943లో బూర్గుల రంగనాథరావు ‘వ్యాహ్యాళి’, ధరణికోట ‘మాయింట్లో’ వంటి కథా సంపుటాలను ప్రచురించి కథారచనకు ఆ రోజుల్లో ప్రోత్సాహాన్నిచ్చారు.
      తెలంగాణ ఆంధ్రోద్యమం రాజకీయోద్యమంగా మారి నైజాం రాష్ట్ర విమోచన పోరాటం సాగింది. ఆంధ్ర మహాసభ కాంగ్రెసు, కమ్యూనిస్టులుగా విడిపోయి వేరువేరుగా తమదైన రీతిలో విమోచనోద్యమాన్ని నడిపారు. ఈ సమయంలో అభ్యుదయ భావాలు గల రచయితలు తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోతున్న ప్రజల జీవితాలను చిత్రిస్తూ ఎన్నో కథలు రచించారు. వృత్తి పనుల వాళ్లు, రైతులు, భూస్వాముల అత్యాచారాలు, దోపిడీకి గురైన వృత్తాంతాలను రచయితలు కథలుగా మలచారు. సురవరం ప్రతాపరెడ్డి ‘సంఘాల పంతులు’, వట్టికోట ఆళ్వారుస్వామి ‘పరిగె’, కాంచనపల్లి ‘దావతు’, ఆవుల పిచ్చయ్య ‘దౌరా’, పొట్లపల్లి రామారావు ‘న్యాయం’, భాగ్యరెడ్డివర్మ ‘వెట్టి మాదిగ’, భాస్కరభట్ల కృష్ణారావు ‘ఇజ్జత్‌’, పి.వి.నరసింహారావు ‘గొల్లరామవ్వ’, కె.ఎల్‌.ఎన్‌. ‘అమరవీరుడు’, మంద రామారెడ్డి ‘సర్కారుకిస్తు’ వంటి ఎన్నో గొప్ప కథలను రచించారు. ఈ కథలు చక్కని కథనం ఇంపైన తెలంగాణ మాండలికంలో రాసినవే. 
సామాజిక ఇతివృత్తాలతో...
‘వెట్టి మాదిగ’ (1932) తెలుగులో మొట్టమొదట దళితుడు రాసిన దళిత కథ. తెలంగాణ నుంచి సామాజిక కథలే కాక నందగిరి వెంకట్రావు, కె.రాములు వంటి వారు చారిత్రక ఇతివృత్తాలతో చాలా కథలు రాశారు. హాస్య చమత్కార కథలు కూడా తెలంగాణ తొలితరం కథకులు రచించారు. వరంగల్లు నుంచి అడ్లూరి అయోధ్య రామకవి ప్రధానంగా రజాకార్ల అత్యాచారాలను చిత్రిస్తూ ‘తెలంగాణ మంటల్లో’ కథా సంపుటిని 1948లో విజయవాడ నుంచి ప్రచురించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ కె.ఎల్‌.ఎన్‌., కాంచనపల్లి, వట్టికోట, పి.వి.నరసింహారావు, ఆవుల పిచ్చయ్య, బి.ఎన్‌.రెడ్డి మొదలైనవారు ఎన్నో కథలు రచించారు. కాంచనపల్లి ‘చెరువొడ్డున’, వట్టికోట ‘మెదడుకు మేత’, కేశవస్వామి ‘యుగాంతం’ వంటి కథలు నైజాంలో హిందూ ముస్లింల మధ్య ఉన్న సఖ్యతను చెప్పే కథలు. సురవరం కథలు, నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్‌ కథలు’ కూడా హిందూ ముస్లింలలో ఎటువంటి వైషమ్యాలు లేవని చిత్రించిన కథలు. 1930, 1940 దశకాల్లో నైజాంలోని ప్రజా జీవితాన్ని, స్త్రీల సమస్యలను, సంఘ సంస్కరణల భావాలను చిత్రించే కథలు ఎన్నో వెలువడ్డాయి.
      భండారు అచ్చమాంబ ‘జానకమ్మ’, మాడపాటి ‘నేనే’, షబ్నవీసు ‘బాలికా విలాపము’, సురవరం ‘వింత విడాకులు’, కాళోజీ ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’ వంటి కథలెన్నో సంఘ సంస్కరణ భావాలను ప్రభావవంతంగా చిత్రిస్తాయి. 1940లో తెలంగాణలో అచ్చయిన మొదటి కథాసంకలనం ‘కమ్మతెమ్మెరలు’. దీనిలో తెలంగాణ సామాన్య ప్రజల జీవిత వాస్తవికతను కళ్లకుకట్టే కథలున్నాయి. చాలా కథలు కథనంలో, సంభాషణల్లో తెలంగాణ మాండలికం ప్రయోగం ప్రధానంగా సాగినవే. ఇది కథల్లో వాస్తవికతను తీసుకురావడానికి దోహదం చేసింది. యథార్థతను మన ముందు నిలబెడుతుంది. చెరుకుపల్లి సోదరులు రాసిన ‘చేలల్లో’, ‘పల్లెబడి’ కథలు మాండలికంలో రక్తి కట్టించిన కథలు. మొత్తం కథను మాండలికంలో నడిపిన మొట్టమొదటి కథ తెలంగాణ నుంచే వచ్చింది. 1939లో అభ్యుదయ రచయితల సంఘం పత్రిక ‘తెలుగుతల్లి’లో, ఆ తరువాత ‘అభ్యుదయ’లో అచ్చయిన బి.సీతారామారావు రాసిన ‘గరీబోన్ని’ కథ ఒక కుమ్మరి కష్టాలను చిత్రిస్తుంది.
      ఇక రచయిత్రుల్లో మాండలికంలో కథలు రాసిన మొట్టమొదటి రచయిత్రి యశోదారెడ్డి. ఆమె ‘మావూరి ముచ్చట్లు, ‘ఎచ్చెమ్మ కథలు’ ప్రసిద్ధమైన కథా సంపుటాలు. 1927లో సిరుగూరి జయరావు ‘పరమాణువులో మేజువాణి’ తెలుగులో వచ్చిన మొట్టమొదటి విజ్ఞాన శాస్త్ర కథ.
      తెలంగాణ నుంచి తొలితరం కథకుల కాలంలో రచయితలు రాసుకున్న కథాసంపుటాలు, అణా గ్రంథమాల వేసిన  కథాసంపుటాలు కాక 1940లో అచ్చయిన ‘కమ్మతెమ్మెరలు’, ‘గీతాంజలి’(1945), ‘కథాగుచ్ఛం’(1953), ఆళ్వారుస్వామి అచ్చువేసిన ‘పరిసరాలు’ (1956) ఇలా ప్రసిద్ధమైన కథా సంకలనాలు వచ్చాయి.
      తెలంగాణ తొలితరం కథకులు కేవలం వాదాల జోలికి పోకుండా తెలంగాణలో జరుగుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులను చిత్రిస్తూ కథలు రాశారు. సంఘసంస్కరణల నుంచి సాయుధ పోరాటం వరకు సమగ్రంగా స్పష్టతతో చిత్రించిన కథలు ఈ కాలంలో వచ్చాయి. 1940 దశకంలో జరిగిన సాయుధ పోరాటాన్ని చిత్రించే కథలను కూడా ఇక్కడివారు రచించారు. వీటిలో ఆనాటి సమాజాన్ని చిత్రించారు. చరిత్రను కథల్లో నిక్షిప్తం చేశారు. అట్లా చేసిన గౌరవం తెలంగాణ తొలితరం కథకులకు మాత్రమే దక్కింది. వస్తువుల్లో వైవిధ్యం, కథనంలో భాషాప్రయోగంలో విశిష్టతలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలా తెలంగాణ తొలితరం కథలు సామాజిక బాధ్యతతో కూడిన లోతుగా తరచి చూసి తెలుసుకోవలసినవి.


వెనక్కి ...

మీ అభిప్రాయం