అగ్రరాజ్యంలో తెలుగు సౌరభాలు

  • 98 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

తెలుగు కవితా సౌరభాలు ఇప్పుడు అమెరికాలోనూ గుబాళిస్తున్నాయి. మన వారిని కార్యోన్ముఖులను చేసిన చైతన్యదీపికలు అగ్రరాజ్యంలో సైతం ప్రకాశిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి బీజావాపన చేసింది ప్రముఖ తెలుగు సాహితీవేత్త అయితే, పాలుపంచుకుంటున్నది అమెరికన్‌ జాతీయురాలు కావడం విశేషం.
వేల ఏళ్ల విశిష్టభాష ఇది

నాకు కవిత్వానువాదం కంటే కల్పనపైనే మక్కువ ఎక్కువ. కానీ ఆర్‌.వి.ఎస్‌.సుందరం వల్ల కవిత్వంపై ఆసక్తి కలిగింది. శివారెడ్డి కవిత్వం అంటే చాలా ఇష్టం. గురజాడ, శ్రీశ్రీ, గద్దర్‌ తదితరుల కవిత్వం లోని సామాజిక స్పృహ నన్ను ఆకర్షించింది. శ్రీశ్రీ, గద్దర్, శివారెడ్డి లాంటి కవుల్లోని ఆవేశాన్ని, సమాజం పట్ల వారి అవగాహనను, చైతన్యాన్ని ఆంగ్లంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 
నా పరిశోధన కోసం దాదాపు ఏడేళ్లు భారతదేశంలో గడిపాను. హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, చెన్నై మొదలైన చోట్ల చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయి. అమెరికాలో వెల్చేరు నారాయణ రావు చాలా సాయం చేశారు. తెలుగునాట పప్పు వేణుగోపాలరావు భాష నేర్పారు. విమల, చేకూరి రామారావు, రంగనాథాచార్యులు, అట్లూరి మురళి, పిల్లలమర్రి రాములు, భాగ్యలక్ష్మి, సి.వి.రామచంద్రరావు మొదలైన వాళ్లెంతో మంది నా పరిశోధనకు తోడ్పడ్డారు.
      తెలుగు చాలా విశిష్ట భాష. ప్రపంచ ప్రాచీన భాషల్లో ఒకటి. గొప్ప సాహిత్యం, వ్యాకరణ సంప్రదాయం, ఛందశ్శాస్త్ర చరిత్ర తెలుగు సొంతం. తెలుగులో ప్రతి మాండలికమూ ఆ భాషలో అంతర్భాగమే. తెలుగు రచయితలంతా ప్రాంతాలకతీతంగా తామంతా తెలుగుకవులమే అనే భావన పెంపొందించుకోవాలి. తెలుగు మాట్లాడేవాళ్లు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అమెరికాలో ఉన్నా తెలుగుభాష, తెలుగు సంస్కృతిని వారు ఆచరించడం మర్చిపోలేదు. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగుభాష ఎప్పటికీ కనుమరుగవదు. తెలుగు భాషాభివృద్ధికి సి.పి.బ్రౌన్‌లాంటి వారు చేసిన అపారమైన సేవను తెలుగువారంతా గుర్తించాలి. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.

- లిజామిషెల్‌


వారికి ఉత్సుకత కలిగిస్తున్నాయి
అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగువారి పిల్లల్లో అసలు తెలుగురాని వాళ్లూ ఉన్నారు. మన ఊళ్లల్లో ఉన్న వారి అవ్వ, తాతల్తో అమ్మభాషలో మాట్లాడేందుకు వారు ఉబలాట పడుతుంటారు. అలాంటి వాళ్లూ తెలుగు నేర్చుకునేందుకు వస్తున్నారు. నేను అక్కడ పాఠాలు చెబుతున్న విద్యార్థుల్లో శామ్‌ అనే అమెరికా విద్యార్థి కూడా ఉన్నారు. ఆయన తెలుగులో చేరిన డచ్‌ పదాలపై పరిశోధన చేస్తున్నారు. నాయక రాజుల కాలంలో డచ్‌ భాష పదాలు తెలుగులోకి ప్రవేశించాయి. మధురై, తంజావూరు తదితర ప్రదేశాల్లో తెలుగు శాసనాలున్నాయి. పరిశోధనలో భాగంగా వాటిని చదివేందుకు శామ్‌కు తెలుగు భాషా పరిజ్ఞానం అవసరం. నిరుడు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠాల్ని చెప్పినపుడు గురజాడ, శ్రీశ్రీ, మరికొందరి కవితలు తీసుకెశ్లాను. వాటిలో భావ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. బోధనలో భాగంగా వాటిని ఆంగ్లంలోకి అనువదించాలని భావించాను. ఈ ప్రక్రియలో లిజా మిషెల్‌తో కలసి ముప్ఫై కవితల్ని తర్జుమా చేశాం. అట్లాంటా కేంద్రంగా ప్రచురితమవుతున్న అంతర్జాల పత్రికలో ఆంగ్లంలోకి తర్జుమా చేసిన శివారెడ్డి కవితల్ని కూడా ఉంచాం. అక్కడి ఆచార్యులు, విద్యార్థులు తెలుగువారి సామాజిక స్పృహ, కవితాసక్తిపై ఉత్సుకత చూపుతున్నారు. స్పందననుసరించి మరిన్ని కవితల్ని అనువదించనున్నాం.
      ఆలోచనలను, అభిప్రాయాలను అనువదించడం పెద్ద కష్టం కాదు. అనుభూతులను అన్యభాషల్లోకి తీసుకెళ్లడం మాత్రం కత్తి మీద సామే. అనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని అనువదించేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్నా మూలంలోని ‘సౌందర్యం’ చెడిపోతుంది. మూలభాషలోని ‘నుడికారాన్ని’ ఒడుపుగా లక్ష్యభాషలోకి తర్జుమా చేయగలిగినప్పుడే అనువాదకుడి ‘లక్ష్యం’ నెరవేరుతుంది. అలా జరగాలంటే... ‘శబ్ద’ వారధుల మీదుగా భావప్రసారం చేసే కవి విలక్షణతను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా లక్ష్యభాషలో అక్షరాలను ఏర్చికూర్చాలి. మామూలు కవిత్వాన్ని అనువదించేటప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే, ఇక శబ్దతీవ్రత, భావసాంద్రత అధికంగా ఉండే శ్రీశ్రీ, కాళోజీ లాంటి వారి కవితలను ఇతర భాషల్లోకి తీసుకెళ్లాలంటే ఇంకెంతగా శ్రమించాలి?   
      గురజాడ, కాళోజీ, శివారెడ్డి, గద్దర్, శివసాగర్, శ్రీశ్రీ, రాయప్రోలు తదితరుల రచనలను విదేశీయులకు పరిచయం చేయడానికి అంత శ్రమ తీసుకున్నారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్‌ లిజామిషెల్, ప్రముఖ సాహితీవేత్త, అధ్యాపకులు ఆర్‌.వి.ఎస్‌.సుందరం. గురజాడ ‘దేశమును ప్రేమించుమన్నా’, శ్రీశ్రీ ‘కదిలేది కదిలించేది, మరో ప్రపంచం’, రాయప్రోలు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’, కాళోజీ ‘నా గొడవ’ తదితరాలను వీరు తర్జుమా చేశారు. ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉత్తేజపరచే ప్రబోధాత్మక కవితల్ని తర్జుమాకు ప్రాతిపదికగా ఎంచుకున్నారు.
కన్నకొడుకుగా ఆయన... దత్తపుత్రికగా ఆవిడ
కవితానువాదంలో ముఖ్య భూమిక పోషించిన ఆర్‌.వి.ఎస్‌.సుందరం తెలుగువారికే కాదు కన్నడిగులకూ సుపరిచితులు. కన్నడ, ఆంగ్లం, సంస్కృతం, హిందీ, తమిళ భాషల్లోనూ అభినివేశం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషల్లో సుమారు వంద పుస్తకాల్ని రచించారు. తెలుగు విశ్వవిద్యాలయం తొలి జానపద విజ్ఞానాచార్యులుగా పనిచేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో కన్నడ అధ్యయన సంస్థ నిర్దేశకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అతిథి ఉపన్యాసకులు. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్ని బోధిస్తున్నారు.
      పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో  125 ఏళ్ల కిందటే సంస్కృత బోధన ఆరంభమైంది. గత శతాబ్దం ఐదో దశకం నుంచి తెలుగునూ బోధిస్తున్నారు. మన భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పరిశోధన గ్రంథానికి ఇక్కడి నుంచే డాక్టరేట్‌ లభించింది. ఈ విశ్వవిద్యాలయంలోని దక్షిణ ఆసియా అధ్యయన విభాగంలో అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌ లిజామిషెల్‌. దక్షిణ భారతదేశంలో భాష సమాజంలో, రాజకీయాల్లో ఎలాంటి పాత్ర వహిస్తోందనే విషయంపై ఆమె విస్తృత పరిశోధన చేశారు. ‘దక్షిణాది రాజకీయాలపై భాషల ప్రభావం’పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. తెలుగు భాషా సంస్కృతులంటే అభిమానం. ఆమె తన పరిశోధనలో భాగంగా తెలుగు నేర్చుకున్నారు. తెలుగు కవితలను ఆంగ్లంలోకి అనువాదం చేసేందుకు సుందరంతో కలిసి విశేషకృషి చేశారు. మిషెల్‌ భర్త రాము భారతీయుడు. ఈ దంపతులు ఇటీవల పుణెలోని శిశు సంరక్షణాలయం నుంచి హృదయ సంబంధ రుగ్మతతో బాధపడుతున్న రోహన్‌ అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం