భావి పౌరులకు ‘బోధన’ పద్ధతులు

  • 191 Views
  • 0Likes
  • Like
  • Article Share

దేనికైనా మార్పు సహజం. మారనిది మార్పొక్కటే. బోధనలో ఆధునిక ధోరణులు ఆవిర్భవించాయి. ప్రాచీనకాలంలో విద్య గురుముఖతః జరిగేది. పూర్వకాలంలో మతానికి, సంస్కృతికి సంబంధించిన ఉద్యమాలన్నింటికి మూలకందాలైన విద్యాపీఠాల్లో ‘అరణ్యకళాశాలలు’ ఎన్నదగినవి. అరణ్యకళాశాలలను ఉద్దేశించి భారతీయుల ఉత్కృష్ట ఆశయాలు ఇక్కడే పుష్పించనారంభించాయని సర్వేపల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు.  
      పద్మినీసేన్‌ గుప్తా తన ఎవిరిడే లైఫ్‌ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియా అనే గ్రంథంలో తమ అధీనమందున్న భావిపౌరులను దేశనాయకులుగాను, సాహితీపరులుగాను సరిదిద్దడం, విధేయత, ఓర్పు, శారీరక కృషి అలవాటు చేయడం, ఆత్మసంయమనం పాదుకొల్పడం, ధర్మనిర్వహణ కర్తవ్యపాలనపట్ల దీక్షాభిమానాలను పెంపొందింప చేయడం, సచ్చిదానంద సాక్షాత్కారానికి సాధన అనేవి గురువులకు ఆదర్శాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
      ప్రాచీన విద్యాపద్ధతి శాస్త్రీయంగా నిర్ణయించిన విద్యాబోధన సూత్రాల ప్రాతిపదికతో ఏర్పడింది కాదు. ఆధునిక కాలంలో వివిధ దేశాల్లోని విద్యావేత్తలు అనేక ప్రయోగాలు చేసి, అపారమైన విద్యాబోధనానుభవాన్ని సంతరించుకొని ఎన్నో వినూత్న విద్యావిధానాలను కనుగొన్నారు.
క్రీడా పద్ధతి
బాలబాలికల మనోవికాస దశలను, సహజ ప్రవృత్తులను, అభిరుచులను ఆధారంగా చేసుకొని ఏర్పడే పద్ధతి క్రీడాపద్ధతి. విద్యార్ధుల మానసిక ప్రవృత్తులకు అనుగుణంగా విద్యావేత్తలు ప్రతిపాదించిన ఆధునిక బోధనాపద్ధతుల్లో క్రీడా పద్ధతి ప్రధానమైంది.
* శ్రాంతినుంచి విశ్రాంతిచెందడమే క్రీడ - పల్‌విక్‌
* ‘‘మానవునిలో ప్రకృతిసిద్ధాలైన సహజాతాల అపరిపక్వమైన రూపమే క్రీడ’’ - మ్యాక్‌డొగల్‌
* ‘‘పిల్లల సంపూర్ణాభివృద్ధి కోసం క్రీడా పద్ధతి అమూల్యమైన సాధనం - ప్రొ.బెల్‌
* ‘‘క్రీడ అంటే జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధన’’ - కారల్‌ గ్రూస్‌ ఉదా:- ఆడపిల్లల బొమ్మలాట, మాతృత్వ గుణాభివ్యక్తీకరణ
* ‘‘మానవజాతి తరతరాలుగా పొందిన పరిణామ పునరభినయమే శిశు క్రీడల్లో కనిపిస్తుందనీ, జాతిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవదశల్లో ప్రతివ్యక్తిలోనూ క్రీడారూపంలో వ్యక్తమై బహిర్గతమవుతాయి’’ - స్టాన్లీహాల్‌
*  క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యావిధానంలో ఉపయోగించుకుంటే బోధనవిధానం తప్పక ఫలవంతమవుతుంది - పెర్సీనన్‌
* విద్యావిధానంలో క్రీడాపద్ధతి ఉత్తమమైంది - కాల్యెల్‌కుక్‌
* మానసికావస్థనుబట్టి క్రీడ కృషిగా మారుతుంది. కృషే క్రీడవుతుంది - గలిక్‌
* డాల్టన్, మాంటిస్సోరి, హ్యూరిస్టిక్, ప్రాజెక్ట్‌ మొదలైన నవీన పద్థతులకి ఇదే ప్రాతిపదిక.
ప్రాథమిక స్థాయిలో బోధనాంశాలు
ప్రాథమిక దశలో కొన్ని అంశాలను క్రీడాపద్ధతి ద్వారా బోధించవచ్చు.
మాధ్యమిక స్థాయిలో బోధనాంశాలు
* సంభాషణా వ్యాసంగాలు
* నాటకీకరణ పాఠాలు
* తప్పొప్పులను కనుగొనే సాధన అభ్యాసాలు
* రిక్తస్థాన పూరణాభ్యాసాలు
* సమస్యాపూరణం
* వాక్యాల పరస్పరమార్పు
ఉన్నతస్థాయి
ఉన్నత పాఠశాల దశలో సాంఘిక, విజ్ఞానశాస్త్ర, చరిత్ర, భాషా పాఠ్యాంశాలను ఈ క్రీడా పద్ధతిద్వారా సమర్థవంతంగా బోధించవచ్చు.
* ఆచార్యుడు ఆనందమయుడు, విద్యాశాల వినోదారామం అనే భావన విద్యార్థుల్లో కలిగించి ఆటపాటల ద్వారా బోధించే పద్ధతి క్రీడాపద్ధతి.
* క్రీడా పద్ధతిని ఎత్తుగడ పద్ధతితో పోల్చవచ్చు
భాషాక్రీడలు - రకాలు
అ) పదాలు - రచనలు 
ఆ) అభినయ గీతాలు
ఇ) గేయాలు; ఈ) అనుకరణ
ఉ) ఏకపాత్రాభినయం
ఊ) పద్య పఠన పోటీలు
ఎ) భాషా సంబంధ విషయాలపై ప్రహేళికలు; ఏ) సమస్యాపూరణం;
ఐ) సంభాషణారీతి; ఒ) చిత్రపట వర్ణన ఆధారంగా కథా రచన
మాంటిసోరి పద్ధతి
విద్యా సిద్ధాంతం ఒక మహావృక్షంకాగా క్రీడాపద్ధతి దానిలోని ఒక కొమ్మయితే కిండర్‌గార్టెన్, మాంటిసోరి పద్ధతులు ఆ కొమ్మకు రెమ్మలు.
* బాలబాలికల మానసిక వికాసక్రమం అనుసరించి బోధించదగిన సిద్ధాంతంపై ఆధారపడిన పద్ధతి మాంటిసోరి పద్ధతి
* దీన్ని ఇటలీ దేశస్థురాలైన మేరియామాంటిసోరి ప్రవేశపెట్టారు.
* వృత్తిరీత్యా వైద్యురాలైన మాంటిసోరి ప్రవృత్తిరీత్యా ఎడ్వర్డ్‌ సీజన్‌ అనే విద్యావేత్త వికలాంగులు, బధిరాంధుల బాలబాలికల కోసం నడుపుతున్న పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరింది.
* రూసో, ప్రోబెల్, పెస్టాలజీ మొదలైనవారి పరిశోధన మార్గాలను సూచనలను, సంస్కరణలను అవగాహన చేసుకొని మాంటిసోరి ఈ పద్ధతిని అభివృద్ధి చేసింది.
* మాంటిసోరి విధానంలో విద్యార్థుల వయసునుబట్టి విద్య, ఆరోగ్యం, శారీరకాభివృద్ధి మొదలైనవి నేర్పుతారు.
* ఉపాధ్యాయినిలు కేవలం పర్యవేక్షకులు మాత్రమే
* ఈ విధానంలో బాలబాలికలు స్వేచ్ఛగా స్వశక్తిపై ఆధారపడి స్వీయాభివృద్ధిని పొందుతారు.
* స్వయం వికాసం, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, జ్ఞానేంద్రియ ప్రబోధం ఈ విద్యలోని ప్రధాన ఆశయాలు.
* శిశువులో నిసర్గమైన శారీరక, మానసిక శక్తులను క్రమమార్గంలో బహిర్గతమొనర్చి శిశువు సంపూర్ణవికాసానికి దోహదమొనర్చడమే ఈ విధానంలో ఉపాధ్యాయినిల లక్ష్యం.
* స్వయంప్రకటనకు, సమన్వయబోధనకు ఈ విధానంలో అవకాశం లేదు
* భావనాశిక్షణపట్ల నిర్ణయం, ఇంద్రియశిక్షణకు ప్రాధాన్యం, కాలనియమం లేకపోవడం, కాలవ్యయం, ధనవ్యయంతో కూడుకొని ఉండటం ఈ విద్యలోని అంశాలు.
కిండర్‌ గార్టెన్‌ పద్ధతి
* కిండర్, గార్టెన్‌ అనే జర్మన్‌ పదాలు కలిసి ‘కిండర్‌గార్టెన్‌’ పదం ఏర్పడింది
* కిండర్‌గార్టెన్‌ పద్ధతిని అమలుచేసిన విద్యావేత్త ప్రొబెల్‌
* కిండర్‌గార్టెన్‌ పద్ధతిని శిశువులతోట, బాలధ్యానపద్ధతి అనికూడ అంటారు
* తోటలో లేత మొక్కల్ని పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలనే సిద్ధాంతంపై కిండర్‌గార్టెన్‌ పద్ధతి ఆధారపడి ఉంటుంది.
* 3-7 సంవత్సరాల విద్యార్థులు మాత్రమే బోధనలో పాల్గొంటారు
* పిల్లల ఆరోగ్యం, విద్య కిండర్‌గార్టెన్‌ పద్ధతి లక్ష్యాలు.
* శారీరకాభివృద్ధి, సాంఘికవిజ్ఞాన పరిజ్ఞానం పెంపుదల ఈ పద్ధతి ఆశయాలు.
* కిండర్‌గార్టెన్‌ పద్ధతిలో బోధన తరగతి పద్ధతిలో జరుగుతుంది.
* ఈ విధానంలో బోధనా కాలపరిమితి 30 నిమషాలు మాత్రమే
* పాఠశాల నిర్వహణ దర్శకురాలి చేతిలో ఉంటుంది.
* గురువు కేంద్రంగానూ, తీర్పరిగానూ వ్యవహరిస్తారు
* ఈ విధానంలో శిశువర్గమంతటిపై దృష్టికేంద్రీకరిస్తారు.
* విద్యార్థుల కృషి సమష్టిగా సాగుతుంది
ప్రాజెక్టు పద్ధతి / ఉద్యమపద్ధతి
* విద్యకు జీవనరంగానికి సమన్వయం కలిగించే పద్ధతిని ‘ప్రాజెక్టు పద్ధతి’ అంటారు.
* ప్రాజెక్టు పద్ధతికే ప్రకల్పన, సమన్వయ, శాస్త్రీయ, యత్నముల, పథక, ఉద్యమ పద్ధతులనీ పిలుస్తారు.
* ఉపాధ్యాయుడు బాలబాలికల్లో నిద్రాణమైన శక్తులను మేల్కొలిపి వారి అభివృద్ధికి దోహదం కలిగించి వారికి భావనాది శక్తులను కలిగించడానికి, వారు భావి జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చే సమస్యల స్వభావాలను ఎరుకపరిచి జీవితరంగంలో వారు తమ నైసర్గిక సన్నివేశాలను ఎదుర్కొనడానికి సమర్థులుగా చేయగలగడం ప్రాజెక్టు పద్ధతి విశిష్టత.
* మిసెగల్‌ అనే ఆంగ్ల వనిత ప్రాజెక్టుపద్ధతిని ప్రవేశపెట్టింది
* స్వాభావిక పరిస్థితుల్లో సమస్యా పరిష్కార పద్ధతే ప్రాజెక్టు పద్ధతి -  స్టీవెన్‌సన్‌
* ప్రాజెక్ట్‌ పద్ధతిని జీవనవిధానంగా జీవితాంతర్భాగంగా అభివర్ణించింది - బల్లార్డ్‌
* కీల్‌ప్రోట్రిక్‌ ప్రాజెక్ట్‌ పద్ధతిని మొదటిసారిగా ప్రయోగించి ప్రయోజనం సాధించాడు
* ప్రాజెక్టు పద్ధతి జాన్‌ట్యూయి రూపొందించిన వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి
ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు
1. విభజన నుంచి సమన్వయం
2 ఉదాహరణ నుంచి సూత్రం
3 తెలిసిన దానినుంచి తెలియనిదానికి
4 సామాన్యం నుంచి విశేషజ్ఞానం
5 సంపూర్ణం నుంచి అంతర్భాగాలు తెలుసుకోవడం
6 సామాన్యాన్నిబట్టి ప్రత్యేకాన్ని, ప్రత్యేక విషయాన్నిబట్టి సామాన్యాన్ని తెలుసుకోవడం
7 అస్పష్టత నుంచి స్పష్టత
8 స్వానుభవం నుంచి శాస్త్రజ్ఞానం
ఈ పద్ధతిలో నిర్దేశించే ఉద్యమాలు రెండు రకాలు: 1. సంకీర్ణ ఉద్యమాలు 2 సామాన్య ఉద్యమాలు. సామాన్య ఉద్యమాలే విద్యార్థుల ప్రయోజనకారిగా ఉంటాయి. ప్రాజెక్టు పద్ధతి, మాధ్యమిక, ఉన్నతస్థాయి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
      డాల్టన్‌ పద్ధతి, కృత్యాధారణ పద్ధతి నాటకీకరణ పద్ధతులను ఆధునిక ధోరణుల్లో భాగంగా అధ్యయనం చేయాలి. 

- శివలీల


వెనక్కి ...

మీ అభిప్రాయం