ఒకొక్క కథ... ఒక్కొక్క శిల్పం

  • 160 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జంపాల చౌదరి

  • చికాగో, యు.ఎస్‌.ఏ
జంపాల చౌదరి

ఒక గ్రామమో, ప్రాంతమో కేంద్రంగా వరుసగా కొన్ని కథలు రాయడమనే ప్రక్రియ ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. ఈ ప్రక్రియకు ఒరవడి చుట్టింది, ప్రతిష్ఠ కల్పించింది మాత్రం సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఆ తర్వాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (గౌతమీ గాథలు), రామకృష్ణారెడ్డి (పెన్నేటి కథలు), నామిని (పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడి కథలు), ఖదీర్‌బాబు (దర్గామిట్ట, పోలేరమ్మ బండ కథలు) తదితరులు ఈ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కలిగించారు. ఈ క్రమంలోనే వేములవాడ కథలు, భట్టిప్రోలు కథలు... ఇలా వచ్చాయి. బహుశా వస్తూనే ఉంటాయి. రావాలి కూడా.
1974-76ల మధ్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో వారానికో కథగా వంద వారాలు వరుసగా ప్రచురితమైన అమరావతి కథల సంకలనమే ఈ పుస్తకం. 1978లో ఈ కథలన్నిటినీ ఒక సంపుటంగా నవోదయ పబ్లిషర్స్‌ (విజయవాడ) వారు ప్రచురించారు. అప్పటి నుంచీ పునర్ముద్రణ అవుతూనే ఉంది. 1979లో ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. ఇందులో కొన్ని కథలని ప్రముఖ దర్శకుడు శ్యాంబెనెగళ్‌ హిందీలో ‘అమరావతి కీ కహానియా’ పేర దూరదర్శన్‌లో లఘుచిత్రాలుగా అందించారు.
      ఈ కథలకు కేంద్ర స్థానమైన అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణా తీరాన ఉన్న గ్రామం. శాతవాహనుల రాజధానిగా, వజ్రయాన బౌద్ధానికి అధ్యయన పీఠంగా, చారిత్రకంగా ప్రముఖమైంది. ఈ ఊర్లో అశోకుడు కట్టించిన స్తూపం, పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయమూ ఉంది. రచయిత చిన్నతనంలో అమరావతి వ్యవసాయ ప్రధానంగా ఉన్న ఓ మాదిరి పల్లెటూరు. అన్ని ఊళ్లలాగే ఇక్కడా పలురకాల, వర్గాల, కులాల, మతాల మనుషులు. వివిధ మనస్తత్వాలు. పాత పద్ధతుల స్థానంలో కొత్త పోకడలు వస్తున్న సంధి కాలంలో తన మనసుపై ముద్ర వేసిన అనేక విశేషాలను వారానికో కథగా అందిస్తూ సత్యం  పాఠకుల్లో చాలా ఆసక్తి రేకెత్తించారు.
      కథలన్నీ నిడివిలో చిన్నవే. అచ్చులో మూడు, నాలుగు పేజీలు దాటనివే. కొన్ని కథలను లాక్షణికులు కథలుగా గుర్తించకపోవచ్చు. అయితేనేం, ఇవి హృదయాన్ని హత్తుకుంటాయి. మెదడులో ఆలోచనలను రేపుతాయి. పదేపదే చదవాలనిపిస్తాయి. మనసును పిండేస్తాయి. మనసారా నవ్విస్తాయి. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా పాఠకులు ఆ కథలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. స్థల కాలాలకు అతీతమైన ఈ సార్వజనీనత వల్లనే ఈ కథలు అన్ని వర్గాల, ప్రాంతాల పాఠకులను ఆకర్షించాయి. పరభాషలో కూడా దేశవ్యాప్త వీక్షకులను అలరించాయి.
      రచయిత ఒక్కడే, కథాస్థలం ఒక్కటే. అయినా కథావస్తువుల్లోనూ, రచనా శైలిలోనూ వైవిధ్యం. చెప్పిన తీరు, చెప్పిన విషయం ఒక్కో కథకు ఒక్కో రకంగా ఉండి, ఒక్క మనిషి ఇన్ని రకాల కథలు ఇన్ని రకాలుగా చెప్పగలడా అని అబ్బురపరుస్తాయి. కొన్ని కథల్లో రచయిత శైలి ఆ అమరేశ్వరుని శిరస్సు నుంచి జారిపడిన గంగలా పరవళ్లు తొక్కుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరికొన్ని కథల్లో అది కృష్ణమ్మ గలగల. ఇంకొన్ని చోట్ల అది బద్ధకంగా కదులుతున్న నిండుచెరువు నీరు. వరద ఉద్ధృతి, వానలో కృష్ణమ్మ అందం, శివరాత్రి వెచ్చటి చలి, గాలి స్తంభించిన వేసవి ఉక్క బాధ, అమ్మతల్లిలా వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆ బాధని తొలగించే పిల్లతెమ్మెర ఇచ్చే హాయి ఈ కథల్లో కనిపిస్తాయి.
      ఈ కథల్లో కొన్ని చారిత్రక కథలు (రాజహంస రెక్కలు విప్పింది, చెట్టు కొమ్మనున్న కథ, ఆఖరు వేంకటాద్రి నాయుడు). కొన్ని ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు (అటునుంచి కొట్టుకురండి). కొన్ని సరదా కథలు (ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే, అప్పడాల అసెంబ్లీ). కొన్ని ప్రేమ కథలు (వయసొచ్చింది, కాకితో కబురు). కొన్ని జీవన స్రవంతిలో కొద్ది క్షణాలను ఛాయాచిత్రంలా బంధించిన కథలు (స్తంభన, నేనూ మేల్కొనే ఉన్నాను). కొన్ని కథలకు అనుభూతి ముఖ్యమైతే (రెండు గంగలు, పున్నాగ వాన), మరికొన్ని తాత్విక ప్రధానమైనవి (నాన్న-నది, గుండె శివుడికిచ్చుకో, మట్టి-ఒఠ్ఠి మట్టి). 
      కథ చెప్పమని బలవంతం చేస్తున్న మనవళ్లకి తాత చెప్పిన కథ ‘రెండు గంగలు’. ఇందులో వర్షం ఎలా ఉందో చూడండి... ‘ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది. నాలోంచి కురుస్తోంది. జల్లుజల్లుగా కురుస్తోంది. భళ్లుభళ్లుగా కురుస్తోంది. వర్షపు చల్లదనం శిరస్సు నుంచి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది. ఆ చల్లదనం నరనరాల్లో పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాల పెట్టు. ఎన్ని మునకలు దానికి దీటు! వర్షమంతా నామీదే పడాలనిపించింది. నన్ను ముంచెయ్యాలని పించింది. ఆ సమయంలో నేను నడవటం మానేసి, వొరేయ్‌! ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నారా! కాసేపాగి అక్కడ నుంచి బయలుదేరి... రంగావఝల వారి చేను దాటి అలా కృష్ణ వొడ్డుకి వస్తిని గదా-  వరె వరె వరె! అదీ వర్షం.
      అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది. నీళ్లలో నీళ్లు! ధారలో ధార! ప్రవాహంలో ప్రవాహం! వానచినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్లు జలదరించినట్టు, ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు, ఓ పులకరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్న గుంత. అంతలో ఆ గుంత మాయం. మళ్లీ చినుకు. మళ్లీ గుంత. మళ్లీ మళ్లీ చినుకులు. అంతలో మాయమై మళ్లీ మళ్లీ గుంతలు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. కసకస చినుకులు. రేణురేణువుకీ చినుకులు. విసవిస, సరసర చినుకులు. రివ్వుమని, రయ్యిమని చినుకులు’... ఇలా అద్భుతమైన పదచిత్రాలతో సాగుతుంది.
      శైలిలోనూ, వస్తువులోనూ ఈ కథకు పూర్తిగా విభిన్నమైన కథ ‘వయసొచ్చింది’. అనాథ పిల్ల్లాడు బాబిగాడు టైలర్‌ జోగారావు పంచన చేరి చిల్లర పనులు చేసిపెడుతుంటాడు. ఇంకో అనాథ పిల్ల పోలితో పరిచయమైంది. బట్టలు సరిగాలేని పోలికి ఒక చోళీ కుట్టి పెడదామని వాడు పడ్డ కష్టం మనల్ని మురిపిస్తే, ఆ చోళీ ఆమెకు పనికి రాకపోవడం ఒక విధంగా విషాదమైనా, ఇంకో విధంగా కాదు. శ్రీశ్రీ రసన అని చెప్పింది ఇటువంటి కథలు కలిగించే అనుభూతి గురించే.
      రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గురించి రాసినా, ఎలికల బాచిగాడి గురించి రాసినా, రచయిత తన పాత్రలన్నిటినీ సమదృష్టితోనే చూశాడు. ఈ కథల్లోని మనుషులంటే రచయితకి ఉన్న గౌరవం, ప్రేమ, సానుభూతి స్పష్టంగా కనిపిస్తాయి. దారిద్య్రాన్ని ధైర్యంగా పంచుకుని ‘తులసి తాంబూలం’తో తృప్తిపడిన వేదపండితులు, ‘ముద్దేలనయ్యా మనసు నీదై యుండ’ అని సంగడితో చెప్పలేని కనకాంగి, ‘భోజన చక్రవర్తి’ అప్పంభొట్లు, తనకేం మిగల్లేదనే బాధ లేకుండా, నలుగురూ హాయిగా తిన్నారని ‘తృప్తి’ పడే బావగాడు, ‘పూలసుల్తాన్‌’, ‘ఏడాదికో రోజు పులి’ వేషం కట్టే నబీసాయబు, సోదెమ్మ గారికి బొట్టు పెట్టిన పోస్టుమాస్టరు కిష్టప్ప, సామి పెసాదం సామికే పెట్టిన సాంబడు, ‘ఏడుపెరగని’ కాటికాపరి ఏసోబు వంటి మరపురాని, మరవలేని ఎన్నో పాత్రలు ఈ కథల్లో కనిపిస్తాయి.
      ఇక ఈ కథల్లో ఆఖరుది రచయిత ఆ అమరేశ్వరుడికి చేసిన ‘మహారుద్రాభిషేకం’. ‘‘లే తండ్రీ, లే! తలారా తనివి తీర స్నానమాడు! స్నానమాడి శాంతించు నరుడా! దీవించు హరుడా! హరహర మహాదేవ! నరహర మహాదేవ!’’ అంటూ ‘అగాధాలు తవ్వి అంతరంగాలు తొలిచి ఆకాశగంగని పాతాళ గంగని కలబోసి ఒకే జాలుగా మళ్లించి స్వచ్ఛంగా’ తన గుండె పంటగా ప్రవహింపజేయడం పాఠకుడికి ఒళ్లు గగుర్పొడిచే గొప్ప అనుభవం.
      అమరావతిలో పుట్టి, ఏలూర్లో బీఏ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందిన సత్యం శంకరమంచి (1937-1987) చాలా కథలు, 4 నవలలు, ఒక నాటకం రాశారు. వివిధ పత్రికల్లో మారుపేర్లతో వ్యంగ్య శీర్షికలు నిర్వహించారు. ఆకాశవాణిలో ఉద్యోగం మొదలుపెట్టాక రచనా వ్యాసంగం తగ్గింది. ఆ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘మీరు అమరావతి కథలు అని ఎందుకు రాయకూడదు’ అని అడిగారాయన్నోసారి. ఆశువుగా 4 కథలు చెప్పటంతో ఈ ధారావాహిక మొదల యిందట. అమరావతి కథల తరువాత మళ్లీ పెద్దగా ఏమీ రాసినట్టు లేరు.
      తాను చేస్తున్న ఉద్యోగపు చాకిరీ నుంచి తీరిక దొరికినప్పుడు, పత్రిక డెడ్‌లైన్‌ ఒత్తిళ్ల మధ్య, రాసినదాన్ని మళ్లీ మళ్లీ సానపెట్టే అవకాశం లేకుండా, నూరు వారాలపాటు విరామం లేకుండా, వారానికొకటి చొప్పున ఈ కథల్ని ఇంత అపురూప శిల్పాలుగా చెక్కడం సత్యం శంకరమంచికి ఎలా సాధ్యమయిందో!
      ఈ పుస్తకంలో ఇంకో విశేషం, ఈ కథలకు దీటుగా బాపు గీసిన బొమ్మలు. ప్రతి కథ సారాన్నీ తన గీతల్లో పట్టుకుని, కథ కలిగించిన అనుభూతికి తన ప్రతిభతో బాపు మెరుగులు దిద్దారు. ముళ్లపూడి విశదంగా, వివశంగా రాసిన ముందుమాట మొగమాటపు మెచ్చుకోలు కాదు- పట్టరాని ఆనందం కలిగించిన ఇద్దరు అద్వితీయ కళాకారుల ప్రతిభకు నీరాజనం. ఎమ్వీయల్‌ చివరిలో మారేడుదళం సమర్పించారు. తెలుగునీ, తెలుగు జాతి జీవనాన్నీ అభిమానించే వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకమిది.


వెనక్కి ...

మీ అభిప్రాయం