తూరుపు కొండల్లో తెలుగు సూరీళ్లు

  • 914 Views
  • 0Likes
  • Like
  • Article Share

    స.వెం.రమేశ్‌

  • ఉడుములపేట, తమిళనాడు
  • 8500548142

‘‘బెజవాడ నుంచి.... ఆ.. ఆఁ... చీపురుపల్లి అని ఉందంట... అక్కణ్నుంచీ తీసుకొచ్చారు. ఆశ సూపించి తీసుకొచ్చారు. మాలిక్‌కు అమ్మేసి పోనారు. మా తాత చెప్పాడు’’
అలెక్స్‌ హేలీ ‘ఏడుతరాలు’లో చదివాం! ఆఫ్రికా నుంచి మనుషుల్ని పట్టుకొచ్చి బానిసలుగా అమెరికాలో అమ్మేశారని! ‘అయ్యో’ అనుకున్నాం! కానీ, అదేరకమైన దాష్టీకం తెలుగునేల మీద కూడా జరిగిందన్న విషయం మనకు తెలుసా? అక్కడ ఆ ఆఫ్రికాలో మనుషులకు సంకెళ్లు వేసి లాక్కొచ్చి అమ్మేస్తే... ఇక్కడ మన నేల మీద ఆశ చూపించి తీసుకెళ్లి అమ్మేశారు. ఎప్పుడో నూటయాభై ఏళ్ల కిందట తెల్లవాళ్లు చేసిన ఈ చీకటి వ్యాపారానికి సాక్ష్యాలు కావాలంటే బంగ్లాదేశ్‌ వెళ్లాలి. అక్కడి తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్న మనవాళ్లని కదిలించాలి. గుండె లోతులను తడుముకుంటూ... తరాల కిందట తామెట్లా అక్కడికి రావాల్సివచ్చిందో గుర్తుచేసుకుంటూ వాళ్లు చెప్పే మాటలు ఆలకించాలి. అవన్నీ ప్రత్యక్షంగా చూసివచ్చిన స.వెం.రమేశ్‌ ఏం చెబుతున్నారో చదవండి...

బంగ్లాదేశ్‌లో తెలుగువాళ్లు ఉన్నారా? నిన్నమొన్నటి వరకూ ఆ విషయమే మనకు తెలియదు. తెలిసిన తర్వాత అక్కడికి వెళ్లి వాళ్లని పలకరించివస్తే, మొత్తం ఆరు రాష్ట్రాల్లో మనవాళ్లు ఉన్నట్లు తేలింది. అయితే ఒక రాష్ట్రం వాళ్లకి మరో రాష్ట్రంలో ఉన్నవాళ్లకి సంబంధాల్లేవు. ఆ దేశ రాజధాని ఢాకాలో దాదాపు పదివేల మంది తెలుగువాళ్లు ఉన్నారు. ఇక సిలేట్‌ రాష్ట్రంలోనైతే 65 వేల మంది కనిపిస్తారు. మిగిలినచోట్ల ఉన్నవాళ్లతో కలిపితే, బంగ్లాదేశ్‌లో ఉన్న తెలుగువాళ్ల సంఖ్య రెండు లక్షలకు పైమాటే. ఇక్కడికి మనవాళ్ల వలసలు మూడు విడతల్లో జరిగాయి. 1840-50 ప్రాంతాల్లో మొదటిసారి తెలుగువాళ్లు అక్కడ అడుగుపెట్టారు. అమ్మకాలు జరిగింది అప్పుడే. ఆ తర్వాత 1900 తర్వాత రెండో విడత వలసలు... అవీ బ్రిటిష్‌వాళ్ల ప్రోద్బలంతోనే సాగాయి. ఇక బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో అంటే 1971-72లో మరికొంతమంది వెళ్లారు. ‘‘1971లో ఆనాటి బంగ్లాదేశం ప్రభుత్వం స్థానికంగా పనులు చేయడానికి భారత ప్రభుత్వంతో మాట్లాడి కొంతమంది తెలుగుప్రజలను విశాఖపట్నం నుంచి తీసుకువచ్చింది’’ అని చెబుతారు మూడో విడత వలసల్లో అక్కడికి వెళ్లిన కుటుంబాలకు చెందిన ఈతరం కుర్రాళ్లు. మొదటి రెండు విడతల్లో వెళ్లినవాళ్లలో కూడా దాదాపు చాలామంది కటకం నుంచి విశాఖపట్నం వరకూ ఉన్న తెలుగు కళింగ ప్రాంతానికి చెందినవాళ్లే.
ఆశపెట్టి... అమ్మేసి...
ప్రస్తుతం సిలేట్‌లో ఉండే తెలుగువాళ్లంతా మొదటి విడతలో అక్కడికి వెళ్లినవాళ్లు. తేయాకు తోటల్లో పనిచేయించడం కోసం వీళ్లని అక్కడికి తీసుకెళ్లారు బ్రిటిష్‌వాళ్లు. అప్పట్లో కళింగ ప్రాంతంలో కరవు రాజ్యమేలేదట. ఆంగ్లేయులు అదే అదునుగా భావించి మనవాళ్ల మీద వలవేశారు. సిలేట్‌ రాష్ట్రంలో లాంగ్లా అనే పల్లెలో ఓ పెద్దాయన దీని గురించి ఇలా చెప్పారు - ఇది వాళ్ల తాతగారు చెప్పిన కథ అట - అక్కడొక డబ్బుల చెట్టు ఉంది. దాన్ని వూపితే డబ్బులు రాలతాయి అని చెప్పి వీళ్లని పడవల్లో ఎక్కించుకుని వెళ్లారట. మరీ చెప్పాలంటే ఆ పడవల్లో కుక్కేసి తీసుకెళ్లారట. అప్పట్లో అక్కడి స్థానికులు తేయాకు తోటల్లో పనిచేసేవారు కాదట. అందుకని ఇక్కడినుంచి తీసుకెళ్లారట. ‘‘ఆ చెట్లు వూపితే డబ్బులు రాలాయి కానీ డబ్బులన్నీ తెల్లోళ్లకు రాలాయి, మనకు రాలేదు’’ అని వాళ్ల తాత చెప్పినట్లు ఆ పెద్దాయన గుర్తుచేసుకున్నారు. అక్కడ బాధలు పడలేక తెలుగువాళ్లలో కొంతమంది తప్పించుకురావడం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లకు స్వస్థలానికి ఎలా రావాలో తెలియదు. పడవల్లో తీసుకొచ్చారు కాబట్టి ఏ రోడ్డు ఎటుపోతుందో తెలియదు. దాంతో చిన్నచిన్న తెప్పలు కట్టుకుని బయటపడటానికి ప్రయత్నించారు. కానీ, దొరికిపోయారు. దెబ్బలు తిన్నారు. తర్వాత తోటల్లో పనిచేయకపోతే కొరడాలతో కొట్టేవారట యజమానులు. అలా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన మనవాళ్లు ఇప్పటికీ ఆ తోటల్లోనే పనిచేస్తున్నారు. కొంతమంది మాత్రం చిన్నపాటి వ్యవసాయదారులయ్యారు. సిలేట్‌లోని లాంగ్లా, రాంగీభోలా, ఘాజీపూర్‌, దొలాయి, పత్రకోల, చట్లాపూర్‌, ఇటా, కరీంపూర్‌, అమీన్‌బాగ్‌, డమాయి, శ్యాంసన్‌ నగర్‌, నర్సన్నటీలా, కాలిటి తదితర 17 పల్లెల్లో వాళ్లు స్థిరపడ్డారు. ఇవన్నీ మన పల్లెల్లాగే ఉంటాయి. వడ్లు పిడి కట్టుకోవడం, గడ్డివాములు వేసుకోవడం, ఒకటీ అరా ఆవుల్ని, మేకల్ని పెంచుకోవడం... అంతా తెలుగు గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది. ఢాకాలోని వాళ్ల ఆర్థిక పరిస్థితితో పోల్చితే వీళ్లు కాస్త మెరుగ్గా ఉన్నారు.
      ఢాకా తెలుగువాళ్లలో 99 శాతం మంది మాలలు, మాదిగలే. సిలేట్‌కు వచ్చేసరికి ఎక్కువ కులాలున్నాయి. వీళ్లలో ఎక్కువమంది తెలగాలు. తర్వాత కాపులు... వీళ్లలో కూడా దొడ్డకాపు, చిన్నకాపు అని ఉన్నారు. తర్వాత దేవాంగులు... వీళ్లనే ఇక్కడ దేవరోళ్లు అంటారు. రెడ్లు, యాదవులు, రజకులు, మాలలు, మాదిగలు కూడా ఇక్కడ ఉన్నారు. కులాల కట్టుబాట్ల మేరకే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సామీప్యం ఉన్న కులాలతో సంబంధాలు కలుపుకుంటున్నారు. అయితే, స్థానిక బంగ్లాదేశీయులు మాత్రం మొత్తం తెలుగువాళ్లందరినీ అంటరానివాళ్లుగా చూస్తారట. ఇళ్లలోకి రానివ్వరట. పనిచేసుకోవడానికి వచ్చారు, తెలుగు మాట్లాడతారు అనే చిన్నచూపు బాగా ఉంది. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే, బంగ్లాదేశ్‌ అధికారిక రికార్డుల్లో ఎక్కడా తెలుగువాళ్ల ప్రస్తావన ఉండదు. ఒడియా వాళ్లు 50 వేల మంది తమ దేశంలో ఉన్నట్లు నమోదు చేసుకున్న బంగ్లాదేశ్‌ యంత్రాంగం, 2 లక్షల మంది తెలుగువాళ్ల గురించి మాత్రం పెదవి కదపదు.
అమ్మభాష అంటే ప్రేమ
సిలేట్‌లో అయినా, ఢాకాలో అయినా అందరూ కళింగ యాసలోనే మాట్లాడతారు. అయితే రెడ్డి, మాదిగ కులాల్లోని కొన్ని ఇళ్లల్లో ఒకటి రెండు రాయలసీమ మాటలు వినిపించాయి. ముఖ్యంగా ‘ఈపొద్దు’ అనే మాట! దీన్నిబట్టి చూస్తే, కొద్దిసంఖ్యలో రాయలసీమ నుంచీ బంగ్లాదేశ్‌కు వలసెళ్లినట్లు అర్థమవుతుంది.
      సిలేట్‌ పల్లెల్లోని మనవాళ్లతో మాట కలిపి, ఎక్కడినుంచి వచ్చారని అడిగితే ‘‘దేశం నుంచి వచ్చా’’మని చెబుతారు. దేశం అంటే తెలుగునేల. మరి ఈ దేశంలో ఎక్కడా ఏంటి అంటే తెలియదు. సొంత నేలతో సంబంధాలు తెగిపోయాయి. (ఢాకాలోని వాళ్లకి మాత్రం ఇప్పటికీ తెలుగునేలతో రాకపోకలు ఉన్నాయి) అక్కడ ఓ గ్రామం నుంచి ఎవరో ఓ కుటుంబం- ముగ్గురు అన్నదమ్ములు- పదేళ్ల కిందట వెనక్కివచ్చి అనకాపల్లిలో స్థిరపడ్డారట. పోయిన సంవత్సరం వాళ్లు మళ్లీ అక్కడికి వెళ్లి ఆ పల్లెల్లో వాళ్లందరికీ చెప్పారట- ‘‘అక్కడ మనభాషే మాట్లాడతారు. అందులోనే రాస్తారు. అన్ని అంగళ్లపైనా మనభాషే ఉంటుంది. సినిమాలు, టీవీలన్నీ అందులోనే ఉంటాయి’’ అని! ఇదంతా విని వీళ్లు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే సిలేట్‌లో పెద్దవాళ్లు మాత్రమే తెలుగును పూర్తిస్థాయిలో మాట్లాడగలరు. పాతికేళ్లలోపు వాళ్లు కాస్త ఇబ్బందిపడుతూ మాట్లాడతారు. పిల్లలకైతే అస్సలు తెలుగు రాదు. ఇక తెలుగు రాయడం, చదవడం అయితే ఎవరికీ రాదు. అదేంటి అని అక్కడి యువతని అడిగితే, ‘‘తెలుగు నేర్పనాకి, రాయనాకి టీచర్లు లేరు. మాకెరికనేదు. ఇక మామేటి సెప్తాం పిల్లలకి’’ అంటారు. లోంగ్లాలోని పైడితల్లి అనే వ్యక్తి మాత్రమే తెలుగు చదవగలడు. ఢాకాలో ఉండేవాళ్లు మాత్రం తెలుగు బాగా మాట్లాడతారు. దాదాపు అందరూ చదువుతారు కూడా. సాయంత్రం పూట పిల్లలను కూర్చోబెట్టి అక్షరాలు నేర్పిస్తున్నారు. పుస్తకాలేవీ లేవు. కానీ, ఎప్పుడో విశాఖపట్నం వచ్చినప్పుడు తెచ్చుకున్న తెలుగు వాచకాలను జిరాక్సులు తీసుకుని... అచ్చులు, హల్లులు, గుణింతాల వంటివి నేర్పిస్తున్నారు.
      అయితే, ఈ రెండు ప్రాంతాల్లోనూ తెలుగుపట్ల అవ్యాజమైన ప్రేమ ఉంది. తెలుగు మాట్లాడటం రానివాళ్లు కూడా మాకు తెలుగు కావాలని అన్నారు. ముఖ్యంగా కుర్రవాళ్లు, నేర్పిస్తే మేం తెలుగు నేర్చుకుంటాం, భాష పోవడం వల్ల మా అస్తిత్వం పోతోందని చెప్పారు పెద్దవాళ్లయితే చాలా ఉత్సాహంగా మాకేదైనా బాంగ్లా - తెలుగు పుస్తకం పంపిస్తారా అని అడిగారు. రెండు ప్రాంతాల్లోని పిల్లలంతా బాంగ్లా మాధ్యమంలోనే చదువుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో బాంగ్లా తప్ప వేరే భాష లేదు. అంకెలు కూడా బాంగ్లాలోనే ఉంటాయి. అంగళ్ల మీద బోర్డులు కూడా బాంగ్లాలోనే. ఇంగ్లీషు బోర్డు ఎక్కడో ఒక్కటి కనిపిస్తుంది. దాంతో మనవాళ్లందరూ బయట బాంగ్లా మాట్లాడక తప్పని పరిస్థితి. వీళ్లకు ‘తెలుగు వాణి’ ద్వారా పుస్తకాలు ఇద్దామనుకుంటున్నాం.
పాటలే మంత్రాలు
స్థానిక పరిస్థితుల వల్ల సిలేట్‌ తెలుగువాళ్లు అమ్మభాషకు దూరమైనా, జానపదాలను నిలబెట్టుకున్నారు. పెళ్లి పాటలు, నలుగు పాటలు ఉన్నాయి. అప్పట్లో తేయాకు తోటల్లో పనిచేయడానికి వెళ్లినప్పుడు వీళ్లతోపాటు బ్రాహ్మణులెవ్వరూ వెళ్లలేదు. దాంతో పాటలతోనే పెళ్లితంతును పూర్తిచేయడం అలవాటైంది. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామాల్లో చిన్న చిన్న ఆలయాలు కూడా కట్టుకున్నారు. పూజల సమయంలో హారతి ఇస్తూ... మంత్రాలు తెలియకపోవడంతో- ‘స్వామీ హారతి తీసుకో... స్వామీ హారతి తీసుకో’ అంటారు. అక్కడి తెలుగువాళ్లలోని క్రైస్తవులు కూడా తెలుగులోనే ప్రార్థనలు చేసుకుంటారు. క్రీస్తును కీర్తిస్తూ పాటలూ పాడతారు.
      కోలాటం, గెంతుభజన ఇప్పటికీ ఆడతారు అక్కడి యువకులు. గెంతుభజనలో రామాయణాన్ని తెలుగులో పాడుతూ రాత్రంతా ఆడతారు. ఈ జానపద కళారూపం నాలుగైదు దశాబ్దాల కిందటి వరకూ విజయనగరం జిల్లాలో కనిపించేది. ఇప్పుడు కనుమరుగైందన్నది పరిశోధకుల మాట. అలాంటిది బంగ్లాదేశ్‌ తెలుగువాళ్లు దాన్ని నిలుపుకోవడం విశేషం. పొంగడాలు, తీపి ఇడ్డెనలు, వంకాయ కూర, చిక్కుడు వేపుడు, పప్పు... వంటల్లో కూడా తెలుగు కమ్మదనం అలాగే ఉంది.
      మొత్తమ్మీద తెలుగునేలకు దూరంగా బతుకుతున్నా... అక్కడి తెలుగువాళ్లకు తెలుగు అంటే అభిమానం ఉంది. తెలుగువాళ్లుగా గుర్తింపు పొందాలన్న ఆశ ఉంది. ఆసరాగా నిలిచే వాళ్లకోసమే వాళ్లందరూ ఎదురుచూస్తున్నారు. ‘‘ఎప్పుడో ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే చస్తాం. కానీ, మాకు మా భాష కావాలి. మాదైన గుర్తింపు కావాలి’’ అనేవాళ్లకి అండగా నిలబడాలి.మన పాలకులు స్పందించి చేయూతనందిస్తే, వాళ్లను ఆదుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.


అలా తెలిసింది!
బంగ్లాదేశ్‌లోని మనవాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన ప్రయాణంలో మలుపులెన్నో. 2009లో ఖైరుల్‌ కుయాదర్‌ అనే బంగ్లాదేశీ పాత్రికేయుడు ఢాకా ఇష్వార్డీ ప్రాంతంలోని ఓ మురికివాడలో మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. అక్కడి హిందువులు కొంతమంది ఆరోజు ‘నాగపంచమి’పండగ చేసుకుంటూ ఆయన్ను భోజనానికి పిలిచారు. ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర వడ్డించారు. వీళ్లెవరో గానీ, దేశవ్యాప్తంగా ఉండే సాధారణ హిందువులే అనుకుని వెళ్లిన ఖైరుల్‌కు వాళ్ల భాష తనకి కొత్తగా అనిపించింది. అడిగితే ‘తెలుగు’ అని చెప్పారు వాళ్లు. అసలు అలాంటి భాష అంటూ ఒకటి తమదేశంలో ఉందని తెలియని ఖైరుల్‌ చాలా ఆశ్చర్యపోయారు. దాంతో ఎవరు వీళ్లు అని ఆరాతీశారు. భారతదేశం నుంచి వచ్చిన తెలుగు ప్రజలు అని తెలిసింది. వెంటనే ‘ది డైలీ సన్‌’ పత్రికలో మనవాళ్ల గురించి వ్యాసం రాశారు. భారత్‌లో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష వీళ్లది, మన దగ్గర దయనీయమైన స్థితిలో బతుకుతున్నారు. వీళ్లకి యంత్రాంగం సాయం చేయాలి అంటూ రాసుకొచ్చారు. ‘‘మా అమ్మానాన్నలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా చిన్నపిల్లని. బ్రిటిష్‌ ప్రభుత్వ అధీనంలోని రైల్వేలో పనిచేయడానికి మా నాన్న వచ్చారు’’ అని 96 ఏళ్ల కమల అనే తెలుగు వృద్ధురాలు తనకి చెప్పినట్టు, ఇలా వివిధ సమయాల్లో ఇక్కడికి వచ్చిన తెలుగు కుటుంబాలు చాలా ఉన్నట్లు ఖైరుల్‌ పేర్కొన్నారు. ఆయన రాసిన ఆ వ్యాసం అనుకోకుండా 2014లో అంతర్జాలం ద్వారా ‘తెలుగు వెలుగు’కు లభ్యమైంది. వెంటనే ‘తెలుగు వెలుగు’ ఖైరుల్‌ను సంప్రదించింది. ‘‘పాపం వాళ్లు ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వాళ్లని కాపాడండి’’ అని ఆయన బదులిచ్చారు. ఢాకా వస్తే వాళ్లను కలిపిస్తానన్నారు. ఈ పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ బాగా అక్కరకొచ్చింది. ఎవరైనా చదువుకున్న బంగ్లాదేశీ తెలుగువాళ్లు ఉంటారేమో అని అందులో వెతికితే ‘‘బంగ్లాదేశంలోని తెలుగు ప్రజలు’’ అనే పేజీ కనిపించింది. కాస్తో కూస్తో చదువుకున్న కుర్రాళ్లు కొందరు అందులో తెలుగు యూనికోడ్‌లోనే రాస్తున్నారు. వాళ్లకు సందేశం ఇస్తే వేపాడ ఆనంద్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనికి ఫోన్‌చేసి మాట్లాడితే కొన్ని వివరాలు చెప్పాడు. వాటి ఆధారంగా కొంత సమాచారాన్ని ప్రోదిచేశాం. ఇంతలో ‘తెలుగు వాణి’ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లకి సేవలందిస్తున్న స.వెం.రమేశ్‌ బంగ్లాదేశ్‌ తెలుగువాళ్ల గురించి అడిగారు. అక్కడ కొద్దిమందితో ‘తెలుగు వెలుగు’కు పరిచయాలున్నాయని చెప్పగానే ఉత్సాహంగా ప్రయాణానికి నడుంకట్టారు. ఈ యాత్రలో ఆయనకు ‘తెలుగు వాణి’ సభ్యులు సుబ్బారెడ్డి, పాత్రికేయుడు- రచయిత ఉమామహేశ్వరరావు తోడయ్యారు. ఈ బృందం డిసెంబరు 2015లో ఢాకాకు పయనమైంది. అక్కడ వీళ్లకు ఆనంద్‌ సహకరించాడు.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం