మన పంచాంగం ప్రపంచాంగం

  • 544 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। దేవవరపు నీలకంఠరావు

  • విశ్రాంత తెలుగు పండితులు, కడియం
  • తూర్పుగోదావరి జిల్లా
  • 9989966012
డా।। దేవవరపు నీలకంఠరావు

తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పర్వదినం నాడు పంచాంగ శ్రవణానికి వెళ్లడం సంప్రదాయం. ఈ రోజు దేవాలయంలోనో, రచ్చబండ దగ్గరో పురోహితుడి నుంచి ఆ ఏడాది తమ జీవనం ఎలా సాగుతుందో, వాతావరణం ఎలా ఉంటుంది, పంటల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... భవిష్యత్తు ఎలా ఉంటుందో చూచాయగా తెలుసుకుని ఆశావహంగా కొత్త ఏడాది ప్రారంభించాలనుకుంటారు. సాధారణంగా రోజువారీ పనులకు ఆంగ్ల కాలమానం అనుసరించినా, పెళ్లిళ్లు, పండుగలు, గ్రహణాలు మొదలైన సమాచారానికి పంచాంగాన్ని అనుసరిస్తుంటారు. ‘పంచాంగం’ అని వినడమే కానీ, దాన్ని ఎలా చూడాలో చాలా మందికి తెలియదు. అందుకే ఆ వివరాలు...
పంచాంగం జ్యోతిశ్శాస్త్రంలో భాగం. ‘సిద్ధాంత స్కంధం’, ‘ఫలితస్కంధం’ అని జ్యోతిశ్శాస్త్రం స్థూలంగా రెండు భాగాలు. సిద్ధాంత భాగాన్నే ‘గణిత జ్యోతిషం’ అంటారు. అంటే కాలాన్ని లెక్కించడం. పంచాంగాలను ఈ గణితశాస్త్రం ప్రకారమే రాస్తారు. ఖగోళంలో సంచరించే గ్రహాల గమనాన్ని బట్టి కాలనిర్ణయం చేయడం ఇందులో ప్రధానాంశం. సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, రుతువులు, అయనాలు, సంవత్సరాలు, యుగాలు వంటి కాల ప్రమాణాలను, పరిమాణాలను, గ్రహగమనాలను ఆధారం చేసుకొని నిర్ణయిస్తారు. మనకు స్పష్టంగా కనిపించే గ్రహాలు సూర్యచంద్రులు.  మన కాలమానమంతా ఈ రెండు గ్రహాల ఆధారంగానే ప్రాచీన రుషులు నిర్ణయించారు. దీనికి అంకగణితం, రేఖాగణితం, దృక్సాధన వంటివి ఉపయోగపడతాయి.
పంచాంగం అంటే...?
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాల గురించి వివరించేదే పంచాంగం. తిథులు పాడ్యమి నుంచి పూర్ణిమ/ అమావాస్య వరకు మొత్తం పదిహేను. పక్షాలు రెండు. శుక్ల, కృష్ణ పక్షాలు. మొత్తం రోజులు ముప్ఫై. శుక్ల పక్షంలో చివరిరోజు పౌర్ణమి, కృష్ణ పక్షంలో అమావాస్య. వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు. నక్షత్రాలు అశ్వని నుంచి రేవతి వరకు మొత్తం 27. యోగాలు విష్కంభం మొదలు వైధృతి వరకు మొత్తం 27; కరణాలు ‘బవ’ నుంచి ‘కింస్తుఘ్నం’ వరకు మొత్తం 11. వీటి ప్రవేశ నిర్గమాదులు దినపంచాంగ వివరాల్లో ఉంటాయి.
గంటల్లోకి మారిస్తే
పూర్వ పంచాంగకర్తలు కాలమానాన్ని తెలియజేస్తూ వాటిని ఘడియలు విఘడియల్లో రాసేవారు. ఇప్పటి పాఠకులకు ఘడియలు విఘడియలతో పరిచయం లేదు కాబట్టి సులువుగా అర్థమయ్యేందుకు కొందరు సమయాలను గంటలు నిమిషాల్లోకి మార్చి రాస్తున్నారు. వీటినే ‘గంటల పంచాంగాలు’ అంటారు. 
మనది చాంద్రసౌరమానం
చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకొని కాలాన్ని లెక్కించే పద్ధతి ‘చాంద్రమానం’. సూర్యుడి గమనాన్ని ఆధారం చేసుకొని లెక్కించడం ‘సౌరమానం’. రెండుగ్రహాల గమనాన్ని ఆధారం చేసుకొనే విధానం ‘చాంద్రసౌరమానం’. ముస్లింలు చాలావరకూ చాంద్రమానాన్ని పాటిస్తారు. సౌరమానాన్ని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో, కొన్ని ఇతర దేశాల హిందువులు పాటిస్తున్నారు. మనం చాంద్ర సౌరమానం అనుసరిస్తున్నాం.
      అంతరిక్షంలో కనిపించే వాటిలో ముఖ్యమైనవిగా 27 నక్షత్రాలను మన పూర్వీకులు గుర్తించారు. వాటికి అశ్వని, భరణి... అని పేర్లు పెట్టారు. మొత్తం ఖగోళాన్ని వృత్తాకృతిలో భావించి దాన్ని 12 భాగాలుగా విడదీశారు. అవే ‘మేషం’ నుంచి ‘మీనం’ వరకు ఉన్న రాశులు. రాశి అంటే ఆయా ఊహా భాగాల్లో ఉండే నక్షత్రాల సముదాయం. చంద్రకళల ఆధారంగా చంద్రుడు ఒక రాశిలో సంచరించడానికి పట్టే కాలం సుమారు రెండున్నర రోజులుగా నిర్ణయించారు. అమావాస్య వెళ్లిన మరుసటి పాడ్యమి నుంచి మళ్లీ అమావాస్య వరకు పన్నెండు రాశులను చుట్టి రావడానికి చంద్రునికి పట్టే కాలం 29.53 రోజులు. ఇదే చాంద్రమానం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం మొదలైన మాసాలన్నీ ఇలా ఏర్పడినవే! పున్నమి నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటాడో ఆ నెలను ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. చిత్తా నక్షత్రానికి దగ్గరగా ఉంటే చైత్రం. ‘విశాఖ’ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ‘వైశాఖం’ అని ఇలా! చాంద్రమాసం ప్రకారం 12 నెలలకు 354.36 రోజులు అవుతుంది. అంటే చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు (సుమారుగా)!
      సూర్యుడు ఒక రాశిలో సంచరించడానికి పట్టే కాలం సుమారు 30 రోజులు. రాశుల పేర్లతోనే మేషమాసం, వృషభ మాసం, ధనుర్మాసం ఇలా పిలుస్తారు. సూర్యుడు 12 రాశులలో సంచరించడానికి పట్టే కాలం సుమారు 365 రోజులు. అంటే సౌరమానంలో కంటే చాంద్రమాన సంవత్సర దినాల సంఖ్య సుమారుగా 11 రోజులు తక్కువ. ఇలా మూడేళ్లు గడిచేసరికి 3×11=33 రోజులు తక్కువగా ఉంటాయి. అందువల్ల చాంద్రమాన సంవత్సరాన్ని సౌరమాన సంవత్సరంతో సమానం చేయడానికి ప్రతి మూడేళ్లకు ఒక అధిక మాసాన్ని కలుపుతారు. మన పర్వదినాలు, వ్రత దినాలు కొన్ని చాంద్రమానం ప్రకారం మరికొన్ని సౌరమానం ప్రకారం నిర్ణయించారు. జాతకచక్రాలు రాసేటప్పుడు చంద్రగమనాన్ని బట్టి ‘జన్మరాశి’ని; సూర్యగమనాన్ని బట్టి ‘జన్మలగ్నా’న్ని నిర్ణయిస్తారు. జన్మరాశిని బట్టి గోచార ఫలితం, లగ్నాన్ని బట్టి ఇతర జాతక విషయాలు చెప్తారు.
జన్మనక్షత్రం- జన్మరాశి 
వీటిని చంద్రచారాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి పుట్టిన సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నాడో అదే అతని జన్మనక్షత్రం. ఉదాహరణకు ‘రవి’ అనే వ్యక్తి 27.12.2013నాడు ఉదయం గం।।7.13 నిమిషాలకు రాజమండ్రిలో జన్మించాడనుకుంటే- ఆ సమయానికి చంద్రుడు చిత్తానక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. కాబట్టి అతడి జన్మనక్షత్రం చిత్త 3వ పాదం అవుతుంది. ఏయే నక్షత్రపాదాలు ఏయే రాశుల్లోకి వస్తాయో ఆ వివరాలు పంచాంగంలో ఇస్తారు. దాని ప్రకారం అతడిది తులారాశి.
జన్మలగ్నం
ఇక జన్మలగ్నం వివరాలు కూడా పట్టిక రూపంలో ప్రతినెలా తేదీల వారీగా ఇస్తారు. పగటి లగ్నాంతకాలం రాత్రి లగ్నాంతకాలం వేర్వేరుగా చూపిస్తారు. పుట్టిన సమయం పగలా రాత్రా అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన గంటలను పట్టికలో చూసుకోవాలి. లగ్నాల పేర్లు కూడా రాశుల పేర్లతోనే చలామణి అవుతున్నాయి. లగ్నకాల ప్రమాణం సుమారుగా రెండు గంటలుంటుంది. ఆ రెండు గంటల వ్యవధిలో ఎప్పుడు పుట్టినా అతడిది అదే లగ్నం అవుతుంది. 27.12.2013వ తేదీన పంచాంగ పట్టికలో ఉదయం గం।।5.46 నిమిషాల నుంచి గం।।7.49 నిమిషాల వరకు ధనుర్లగ్నం సూచించబడింది. అంటే పైన చెప్పుకున్న రవి జన్మలగ్నం ‘ధనుస్సు’. ఇంకా సూక్ష్మంగా చూడాలంటే నవాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ మొదలైనవి చూడాలి. 
గ్రహ సంచారమెలా?
సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక నెలపాటు సంచరించి ఆ తర్వాత పక్కరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఒక రాశిలో సుమారుగా రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. కుజుడు 45 రోజులు, బుధుడు 20 రోజులు, శుక్రుడు ఒక నెల, గురుడు ఒక సంవత్సరం, శని రెండున్నర సంవత్సరాలు, రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం ఆయా రాశుల్లో సంచరిస్తారు. అయితే ఆ గ్రహాలు ఆయా రాశుల్లోకి ఎప్పుడు ప్రవేశించేదీ సిద్ధాంతులు లెక్కించి ఆ వివరాలను పంచాంగంలో ‘రవ్యాది నవగ్రహ సంచారం’ శీర్షికతో పట్టికలా ఇస్తారు. ఇదే కాకుండా ఆయా గ్రహాలు రాశుల నక్షత్ర పాదాలలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి అనే సూక్ష్మాంశాలు దిన పంచాంగ పుటలలో చూపిస్తారు. ఈ దిన పంచాంగం కోసం పంచాంగంలోని చివరి పుటలను కేటాయిస్తారు.
గ్రహాలన్నీ ముందుకే నడుస్తాయా?
రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు ముందుకే నడుస్తాయి. రాహుకేతువులు మాత్రం వీటికి వ్యతిరేక దిశలో నడుస్తాయి. అయితే రవిచంద్రులు తప్ప మిగతా కుజ, బుధ, గురు, శుక్ర, శనులు మాత్రం అప్పుడప్పుడు కొన్ని నిర్దిష్ట సమయాల్లో కొంతకాలంపాటు ఆయా రాశుల్లో నుంచి వెనక్కి తిరిగి ప్రయాణించి- మళ్లీ కొద్దికాలం తరువాత అక్కడి నుంచి ముందుకు యథామార్గంలో వెళుతూ ఉంటాయి. ఆ విధంగా వెనక్కి మళ్లడాన్నే ‘వక్రత్వం’ అంటారు. వక్రప్రారంభాన్ని ‘వ.ప్రా’ అని; వక్ర త్యాజ్యాన్ని (వక్రత్వాన్ని వదిలి ముందుకు వెళ్లే పనిని) ‘వ.త్యా’ అని పంచాంగంలో సూచిస్తారు. ఏ గ్రహం వక్రత్వాన్ని పొందిందో ఆ గ్రహం పేరు పక్కన కుండలీకరణంలో (వ) అని రాస్తారు. కుజ గ్రహం వక్రత్వం పొందితే ‘కు(వ)’ అని సూచిస్తారు.
రాశి చక్రాలను ఎలా చూడాలి?
పూర్వ పంచాంగాలలో లేని ఈ సౌలభ్యం ఇప్పటి ప్రచురణల్లో లభ్యమవుతోంది. ఏ రోజున ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అనే వివరాలను చక్రాలలో పొందుపరచి చూపిస్తున్నారు. గ్రహాలలో అతివేగంగా సంచరించేది చంద్రగ్రహం. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు మాత్రమే ఉండి ఆ తరువాతి రాశిలోకి కదులుతాడు. కాబట్టి ఈ రాశి చక్రాలను పంచాంగంలో ప్రతి రెండు రోజులకు ఒకటి చొప్పున రాస్తారు. ఉదాహరణకు 27.12.2013 నాటి ఈ కింది చక్రాలను పరిశీలించండి. (మీరు పంచాంగంలో చూసే చక్రం ఈ రెంటిలోనూ ఏదో ఒక రకానికి చెంది ఉంటుంది)
      సవ్యచక్రం అంటే చక్రంలో రాశులను 1 నుంచి 12 వరకు గడియారంలో ముల్లు తిరిగే దిశలో సూచిస్తారు. 1. మేషం 2. వృషభం 3. మిథునం 4. కర్కాటకం 5. సింహం 6. కన్య 7. తుల 8. వృశ్చికం 9. ధనుస్సు 10. మకరం 11. కుంభం 12. మీనంగా భావించాలి. ఆరోజు ఉదయానికి గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తాయో వాటి పేర్లను సంక్షిప్తంగా రాస్తారు(ర=రవి; చం=చంద్రుడు; కు=కుజుడు). రెండోది అపసవ్య చక్రం. మేషాది రాశులను మొదటి చిత్రంలోలా కాకుండా వ్యతిరేక దిశలో సూచిస్తారు. పంచాంగ కర్తలు తాము అనుసరించే విధానాన్ని బట్టి కొందరు సవ్యచక్రాన్ని కొందరు అపసవ్య చక్రాన్ని గీస్తూ ఉంటారు. చక్రం సవ్యమైనా అపసవ్యమైనా ఏ రాశిలో ఉండాల్సిన గ్రహం ఆ రాశిలోనే ఉంటుంది. ఆ చక్రాలను చూసి ఆయా తేదీల్లో పుట్టినవారి జాతక చక్రాలను వేరే కాగితం మీద రాసుకుని భద్రపరచుకుంటే ఆ జాతకుడి ‘రాశిచక్రం’ సిద్ధంగా ఉన్నట్లే! రాశి చక్రంలో జన్మలగ్నాన్ని కూడా సూచించాలి కాబట్టి- ఇంతకుముందు చెప్పినట్టు జాతకుడి జన్మలగ్నం సరిచూసుకుని ఆ రాశిలో ‘ల’ అని రాసుకోవాలి.
మూఢం అంటే ఏంటి?
ఏ గ్రహాలైనా సూర్యునికి సమీపంగా నిర్దిష్టమైన కోణాల్లో వస్తే అస్తంగత్వం పొందుతాయి. అంటే శక్తిహీనమవుతాయి. ఈ అస్తంగత్వం అన్ని గ్రహాలకు ఉంటుంది. కానీ మన శాస్త్రజ్ఞులు చంద్ర, గురు, శుక్ర గ్రహాల అస్తంగత్వాన్నే దోషంగా పరిగణించారు. చంద్రుడు సూర్యుడితో కలిసే రోజే అమావాస్య. అంటే చంద్రుడి శక్తి లుప్తమైపోయిందన్న మాట! అలాగే గురుడికి అస్తంగత్వ దోషం పడితే ‘గురుమౌఢ్యమి’, శుక్రుడైతే ‘శుక్రమౌఢ్యమి’ అంటారు. ఈ మౌఢ్యమే వ్యావహారికంలో ‘మూఢం’. ఇవి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో పంచాంగంలో ఉంటుంది. మూఢాల్లో శుభకార్యాలు చేయడాన్ని శాస్త్రాలు నిషేధించాయి.
సాంకేతిక పదాలు- సంక్షిప్త పదాలు
ఈ పదాలను ఎక్కువగా రోజువారీ పంచాంగ పుటలలో రాస్తారు. అలాంటి కొన్ని పదాలు - వాటి వివరణ:
      ఇం.తే = ఇంగ్లిషు తేదీ; శా.తే=శాలివాహన శక తేదీ; క్రీ.శ=క్రీస్తుశకం; సూ.ఉ=సూర్యోదయం;  సూ.అ=సూర్యాస్తమయం; అమృ = అమృతకాలం; ‘ది’ లేక ‘దిన’=దినప్రమాణం; అహః=పగటికాల ప్రమాణం; భు=భుక్తి (అంటే సూర్యోదయ లగ్నం ఆ తేదీకి ఎంతకాలం గడిచిపోయిందో ఆ కాల ప్రమాణం); ఉ=ఉదయం; మ=మధ్యాహ్నం; సా=సాయంత్రం; రా=రాత్రి; తె=తెల్లవారు జామున; వ=వర్జ్యం (విడువ దగిన కాలం); దు=దుర్ముహూర్తం; ల=లగాయితు (నుంచి); శూన్యతిథి=పితృకర్మలు వంటివి నిర్వహించడానికి వీలైన తిథి ఆ రోజు ఉన్నప్పటికీ ఆ కర్మలు నిర్వహించవలసిన కుతప కాలానికి ఆ తిథి లేకుండా ముందే ముగిసిపోవడం; తిథి ద్వయం= కుతప కాలానికి అర్హమైన రెండు తిథులు ఉండటం. అంటే, ఒక తిథి అంత్య దశలోను దాని అనంతర తిథి ప్రారంభ దశలోనూ ఉంటాయి; ఏష్యతిథి= ఒక తిథి ఆ రోజు సూర్యోదయానంతరం ప్రారంభమై - ఆ మర్నాటి సూర్యోదయానికి ముందే ముగిసిపోవడం; అస్త= గ్రహం అస్తంగత్వం చెందడం; వ.ఆ= వక్రారంభం; వ.త్యా= వక్రత్యాగం; 3య= తదియ; 4ర్ది= చతుర్ది లేదా చవితి; 11శి=ఏకాదశి; 12శి=ద్వాదశి; ఉ.శృ= ఉత్తరశృంగం; ద.శృ= దక్షిణ శృంగం; స.శృ= సమశృంగం (ఈ ఉత్తర దక్షిణ సమశృంగాల ప్రస్తావన శుక్లపక్ష విదియ నాడు మాత్రమే ఉంటుంది. ఆ రోజునే నెలపొడుపు అవుతుంది. ఆ నెలవంక ఒక కొమ్ము ఉత్తర వైపునకు లేచినట్లుగా కనిపిస్తే ఉత్తరశృంగం. దక్షిణం వైపునకు లేచినట్లుంటే దక్షిణ శృంగం.  రెండు కొమ్ములూ సమానంగా సమశృంగం) ; శూన్యార్ఘం; సమార్ఘం; అత్యర్ఘం; (అర్ఘం అంటే ధర. శూన్యార్ఘం అంటే ఆ నెలంతా ధరవరలు బాగా తగ్గుతాయి. సమార్ఘం అంటే ధరలు సమస్థాయిలో ఉంటాయి. అత్యర్ఘం అంటే ఆ నెలలో సరకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ అర్ఘాన్ని నెలపొడుపు నాటి చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడన్న దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే పంచాంగాల్లో విదియనాడే ఈ ప్రస్తావన ఉంటుంది); ప్ర.గ్ర/ గ్ర.ప్ర = గ్రహ ప్రవేశం (ఆనాడు ప్రవేశించే గ్రహం); ప్రాగుదితం = గ్రహం తూర్పున ఉదయించడం;  ప్రాగస్తమయం = గ్రహం తూర్పున అస్తమించడం; పశ్చాదస్తమయం= గ్రహం పడమర దిక్కున అస్తమించడం.
      పై విశదీకరణను బట్టి 11.5.2013 నాటి దినవారీ పంచాంగ పేరాను పరిశీలిద్దాం (కింది పట్టిక).
      ఈ పట్టికలోని అంశాలను ఇలా అన్వయించుకోవాలి. 1. సూర్యోదయం గం.5.33 ని.లకు 2. సూర్యాస్తమయం గం.6.19 నిమిషాలకు, 3. 2013 మే నెల 11వ తేదీ. 4. ఆ రోజు రవిగ్రహం వేరే రాశిలోకి ప్రవేశిస్తుంది. 5. శని= ఆనాటి వారం శనివారం, శుక్లపాడ్యమి తిథి ఉదయం గం.6.11 నిమిషాలకు ముగుస్తుంది, కృత్తికా నక్షత్రం ఉదయం గం.9.27 నిమిషాలకు ముగుస్తుంది, ‘శోభన’ అనే యోగం ఉదయం గం.9.48 నిమిషాలకు ముగుస్తుంది. ‘బవ’ అనే కరణం ఉదయం గం.6.11ని.లకు ముగుస్తుంది; అమృతకాలం ఉదయం గం.6.50 ని. లగాయితు ఉదయం గం.8.34 ని. వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి గం.3.03 ని. లగాయితు రాత్రి గం.4.48 ని. వరకు ఉంటుంది; దుర్ముహూర్తం సూర్యోదయం గం.5.33 ని. నుంచి ఉదయం గం.7.16 ని. వరకు ఉంటుంది. (ప్రతి శనివారం దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి శనివారం ఉదయ దుర్ముహూర్తానికి ప్రారంభ సమయం ఇవ్వరు) కృత్తికా నక్షత్రం 1వ పాదం లోకి ‘రవి’ గ్రహం మధ్యాహ్నం గం.2.10ని. ప్రవేశిస్తాడు; ఆ రోజు పగటికాల ప్రమాణం ఘ31.58విఘ (దిన ప్రమాణాన్ని గంటల్లో చూపించరు); భుక్తి= ఉదయంలగ్నం మేషం. (దాని ప్రమాణం సుమారు 2 గం।।) అందులో 11.5.2013 నాటి సూర్యోదయానికి గం.1.31ని. తరిగిపోయింది. ఆనాడు చంద్రదర్శనం అవుతుంది. సమశృంగం. శూన్యార్ఘం.
తెల్లవారుజామున సందిగ్ధత!
పంచాంగంలో సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజుగా లెక్కిస్తారు. తిథి నక్షత్రాదుల సమాప్త కాలాలను దాని కనుగుణంగానే సూచిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే చోట్ల కాల సూచికలో మనకంతగా ఇబ్బంది ఉండదు గాని ‘తెల్లవారుజాము’ (‘తె’) దగ్గరకు వచ్చే సరికి సందిగ్ధత వస్తుంది. సాధారణంగా రాత్రి 3.30 దాటిన తరువాత సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని ‘తె’ అని సూచిస్తారు. ఉదాహరణకు 14.2.14వ తేదీ శుక్రవారం పూర్ణిమ తె.4.53 అని ఉందనుకోండి. అది 15.2.14 (శనివారం) సూర్యోదయానికి మొదటి సమయాన్ని సూచిస్తుంది. ఒక తిథి అంత్యకాలం నుంచి ఆ తరువాతి తిథి అంత్యకాలం వరకు లెక్కిస్తే సుమారుగా 22 గంటల నుంచి 26 గంటల వరకు కాలవ్యవధి ఉంటుందనే సాధారణ సూత్రాన్ని గుర్తుంచుకుంటే ఈ అనుమానానికి తావుండదు. నక్షత్రం విషయంలోనూ ఇదే సూత్రం. తిథి నక్షత్ర లగ్నాదులకు ఆయా ప్రదేశాలను బట్టి సవరించుకోవాల్సిన కాల పట్టికలను (-) లేదా (+) గుర్తులతో విడిగా సూచిస్తారు.
      పై వివరాలతో పాటు పంచాంగంలో నవనాయక ఫలితాలు, వాతావరణం, పంటలు, ధరవరలు, హోరాకాల వివరాలు, ప్రయాణ విషయాలు, గౌరీ పంచాంగం, భార్గవ పంచాంగం, తారాబల చంద్రబలాలు చూసుకొనే పద్ధతి, రాశి ఫలాలు, మూర్తిమత్వము. ఏలినాటి శని వివరాలు, వధూవరుల వివాహ పొంతన విషయాలు. కుజదోషం, వాస్తు విశేషాలు, గౌళి పతనం (బల్లిపాటు), అంగస్ఫురణం (అవయవాలు అదరడం), శకునాలు, స్వప్నాలు, పిడుగుపాటు తదితర అంశాలుంటాయి. అందుకే పంచాంగం ‘కాలవిజ్ఞాన సర్వస్వం’.


వెనక్కి ...

మీ అభిప్రాయం