‘సమాచారం’తో సాధించుకుందాం

  • 135 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

‘‘తెలుగు జానపద కళలు, కళారూపాలు, సాహిత్యం, చరిత్రలపై పరిశోధనకు రూ 8 కోట్లు కేటాయించాం. అకాడమీలను పునరుద్ధరిస్తున్నాం. వాటి నిర్వహణకు రూ 3.5 కోట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో తెలుగును తప్పనిసరి అంశంగా బోధించాలంటూ ఆదేశించాం’’
ప్రపంచ
తెలుగు మహాసభల తరువాత మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలివి. అయితే... కేటాయించిన సొమ్మును విడుదల చేశారా? విడుదల అయిన సొమ్మును క్షేత్రస్థాయిలో దేనికి వెచ్చించారు? ఆ ఖర్చు వల్ల తెలుగుకు ఒనగూరిన లాభమేంటి? ఎన్ని పాఠశాలలు తెలుగును బోధిస్తున్నాయి? బోధించని వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు? తప్పనిసరి తెలుగు బోధనపై ఎన్ని రోజులకోసారి సమీక్ష చేస్తున్నారు... ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరికితేనే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదన్న విషయం మనకర్థమవుతుంది. మరి ఆ జవాబులను తెలుసుకునేదెలా?
      తెలుగు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే ప్రకటన వచ్చింది. మరి అది నిర్వర్తించబోయే బాధ్యతలేంటి? సంబంధిత మంత్రికి ఉన్న అధికారాలేంటి? ఆయన కింద పనిచేసే అధికారులెవరు? వారి విధులేంటి? శాఖకు నిధుల కేటాయింపులెలా ఉన్నాయి? వాటిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఖర్చు చేయాలి? అసలు ఈ శాఖకు ప్రాథమికంగా నిర్దేశించిన లక్ష్యాలేంటి? వాటిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేంటి... వీటికి సమాధానాలు ఎవరు చెబుతారు?
      తెలుగును అధికార భాషగా అమలు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, భాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ మొన్నామధ్య రాష్ట్ర ప్రభుత్వానికి అధికార భాషా సంఘం (‘అభాసం’) ఓ నివేదికను సమర్పించింది. (దాని సంక్షిప్త రూపాన్ని తెలుగు వెలుగు డిసెంబరు, 2013 సంచికలో చూడవచ్చు) దానిపై ఇప్పటి వరకూ ఏం చర్యలు తీసుకున్నారు? ‘అభాసం’ సిఫార్సుల్లో ఎన్నింటిని ఆమోదించారు? ఇంకెన్నింటిని ఆచరణలోకి తెచ్చారు? నివేదికలోని అంశాలకు ప్రభుత్వ ఆమోదముద్ర పడేలా చూడటానికి ‘అభాసం’ చేసిన అనుశీలన ఏంటి... అసలింకా ఏయే వర్గాలు, సంస్థలు ‘తెలుగు’ గురించి ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు, సూచనలు ఇచ్చాయి? వాటిని పాలకులేం చేశారు... కచ్చితంగా బదులు రావాల్సిందే!
      2008 - 12 మధ్యలో ‘అభాసం’కు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.04 కోట్లు కేటాయించింది. మే 3, 2009తోనే పాత సంఘం  కాలపరిమితి పూర్తయిపోయింది. 2012 ఆఖరు వరకూ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ఆ నిధులపై అజమాయిషీ ఎవరు చేశారు? వాటిని దేనికి ఖర్చు చేశారు? వాటి వల్ల తెలుగుకు కలిగిన మేలేంటి? 2013లో ‘అభాసం’ కోసం ఎన్ని నిధులు విడుదల చేశారు? వాటితో క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలేంటి? వాటి ఫలితాలేంటి? రాష్ట్రంలో ‘అభాసం’ అంటూ ఏదీ లేని ఆ కాలంలో... ‘అభాసం’ ఆధ్వర్యంలో రూ.20.30 లక్షలను ‘ప్రచురణ’లకు వెచ్చించినట్లు ప్రభుత్వ దస్త్రాలు చెబుతున్నాయి. ఆ సొమ్ముతో ఎన్ని పుస్తకాలు/ పత్రికలు ప్రచురించారు? అసలు ఆ ప్రచురణలేంటి? అవి మార్కెట్లోకి వచ్చాయా... తెలుసుకుని తీరాల్సిన వివరాలే కదా ఇవి.
      దుకాణాల నామఫలకాలను తెలుగులో రాయని వారిపై చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖాధికారులు ప్రకటించారు కదా. ఇప్పటి వరకూ ఎన్ని దుకాణాలను తనిఖీ చేశారు? తెలుగులో పేర్లు రాయని ఎన్నింటిపై ఏయే చర్యలు తీసుకున్నారు? ప్రాచీన భాషా కేంద్రం ఏర్పాటుకు చేస్తున్న కృషి ఏంటి? విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న తెలుగు పరిశోధనల స్థితిగతులేంటి? వాటి వల్ల భాషకు కలుగుతున్న లబ్ధి ఎంత? తెలుగును సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి వెచ్చిస్తున్న సొమ్మెంత? దాని వల్ల వచ్చిన ఫలితాలేంటి... ఇలాంటి సందేహాలన్నింటినీ తీర్చేదెవరు?
      రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును మాత్రమే (ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉత్తర్వులు, నియమాలు, నిబంధనలు తెలుగులోనే ఉండాలి. ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకు తెలుగునే ఉపయోగించాలి), వాడాలని చెప్పే మెమో నం.167 (19.03.1988), జీవో ఎం.ఎస్‌. నం. 587 (28.10. 1988),  జీవో ఎం.ఎస్‌. నం. 218 (22.03.1990), జీవో ఎం.ఎస్‌. నం.420 (13.09.2005) తదితరాల అమలు ఎలా ఉంది? వాటిని ఉల్లంఘించి ఆంగ్లంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వాధికారులపై తీసుకుంటున్న చర్యలు ఏంటి? పాతికేళ్లుగా తెలుగును పట్టించుకోని ఎంతమంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు? తీసుకోకపోతే అందుకు కారణాలేంటి... తెలుగు వారందరికీ ఈ వివరాలు తెలియక్కర్లేదా? 
      ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి రూ.30 కోట్ల మేరకు ఖర్చులు రాసినట్లు వినికిడి. అన్ని నిధులు వ్యయమైతే సభల ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయెందుకు? భోజనాల్లో నాణ్యత పూజ్యమవడానికి బాధ్యులెవరు? ప్రతినిధులు, భాషాభిమానులను సభల దగ్గరికి తీసుకురావడానికి పెట్టిన ఉచిత బస్సులు చివరి రోజు ఏమై పోయాయి? కళారూపాల ప్రదర్శన, కార్యక్రమాల నిర్వహణలో అస్పష్టతకు కారణాలేంటి? మహాసభల తీర్మానాలను అమలు చేశారా? చేయలేదా?... వీటికి బదులిచ్చేదెవరు? అదీ సూటిగా, స్పష్టంగా!
      భాషాభిమానుల మదిలో మెదిలే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించాలి. ప్రభుత్వ కార్యాలయాల నుంచే ఈ సమాచారాన్ని సేకరించాలి. దాన్ని విశ్లేషించి... తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటున్న పాలకుల మాటల్లోని నిజానిజాలను పరిశీలించాలి.
      అయితే... ఒక్కమాట! మనం అడగ్గానే ప్రభుత్వాధికారులు సమాచారం ఇచ్చేస్తారా?
      ఇవ్వాలి. తప్పదు. 
      ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ఏ సమాచారమూ రహస్యం కాదు. సమాచార హక్కు చట్టం (2005) అమల్లోకి వచ్చాక కొన్ని మినహాయింపులకు లోబడి ప్రతి సర్కారీ దస్త్రమూ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతర భారతంలో రూపొందిన అతి గొప్ప చట్టాల్లో ఇదీ ఒకటి. భారత పౌరులెవరైనా ఏ కార్యాలయానికైనా ఒక్క దరఖాస్తు చేసి ఎలాంటి సమాచారాన్ని (రికార్డులు, నోట్‌ఫైళ్లు, పత్రాలు, మెమోలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, ప్రకటనలు, సలహాలు, అభిప్రాయాలు, లాగ్‌పుస్తకాలు, నివేదికలు, ఒప్పందాల ప్రతులు, ఈమెయిళ్లతో సహా ఎలక్ట్రానిక్‌ రూపంలో అన్ని వివరాలు) అయినా తీసుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తోంది.  అలాంటి ఈ శాసనంలోనే ఓ చక్కటి నిబంధన ఉంది. అది...
సెక్షన్‌ 4(4): అన్ని రకాల సమాచారాలనూ స్థానికంగా వాడుకలో ఉన్న భాషలో అందుబాటులో ఉంచాలి. 
      అంటే, మన రాష్ట్రంలో ఏ కార్యాలయంలోని సమాచారాన్ని అయినా తెలుగులో కావాలని అడిగి తీసుకునే హక్కు మనకు ఉంది. దస్త్రాలు అన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి... తెలుగులో మేం ఇవ్వలేం అని చెప్పడానికి అధికారులకు అవకాశం లేదు. దస్త్రాలు ఆంగ్లంలో ఉన్నా సరే, వాటిని తెలుగులోకి అనువదించి ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏడేళ్ల కిందటే ఆదేశించింది. జీవో ఎం.ఎస్‌. నం. 420 అమలుపై విశాఖపట్నానికి చెందిన తెడ్డు జ్యోతి, ఇతరులు వేసిన దావాపై జనవరి 3, 2007న ఈ తీర్పు వెలువడింది.
ఇవ్వకపోతే జరిమానాలే 
మనకు సమాచారం ఇవ్వడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రజా సమాచార అధికారి ఉంటారు. (‘తెలుగు’ కోసం ఏ కార్యాలయంలో ఎవరిని సమాచారం అడగాలో బాక్సులో చూడవచ్చు) ఆయన పేరిట దరఖాస్తు రాసి దరఖాస్తు రుసుం (గ్రామస్థాయిలో ఉచితం, మండలస్థాయిలో రూ.5, ఆపై రూ.10. తెల్లరేషనుకార్డుదారులు ఏ స్థాయిలోనూ రుసుం చెల్లించక్కర్లేదు) చెల్లిస్తే చాలు... మనం కోరిన వివరాలను వారు 30 రోజుల్లో అందించి తీరాలి. లేకపోతే వారికి రూ.25 వేల వరకూ జరిమానాలు పడతాయి. మరోమాట... సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాలే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలి. ఆ కార్యాలయంలో ఎవరెవరు పని చేస్తున్నారు, వారి విధులు, అధికారాలేంటి, విధి నిర్వహణలో వారు అనుసరించే విధానాలేంటి, వారి అధీనంలో ఉండే మాన్యువళ్లు, దస్త్రాలు, వారి దగ్గర ఉన్న పత్రాల కేటలాగు, వివిధ పనుల కోసం సంబంధిత కార్యాలయానికి మంజూరైన నిధులు, వాటి ఖర్చు నివేదికలు... ఎవరూ అడగకముందే ఇలాంటి వివరాలన్నింటినీ ప్రభుత్వ కార్యాలయాలే బహిరంగపరచాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఉచితంగా/ ముద్రణా ఖర్చుతో అందజేయాలి. 4(1)(బి) పరిధిలోకి రాని సమాచారం కోసం మాత్రం దరఖాస్తు దారులు పుటకు రూ.2 చెల్లించాలి. 
      సమాచార హక్కు చట్టం ప్రకారం... ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలను తనిఖీ చేయడానికి పౌరులకూ అధికారముంది. ఫలానా దస్త్రాలను తనిఖీ చేస్తామంటూ మనం దరఖాస్తు చేస్తే అధికారులు అనుమతించి తీరాలి. ‘తనిఖీ’ పూర్తయిన తరువాత మనకు కావాల్సిన పత్రాల ధ్రువీకృత నకళ్లను తీసుకోవచ్చు. 
      రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా మనది కాని భాషలో మన రాష్ట్రంలో పాలన సాగుతోంది. దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనదే. అడగందే అమ్మయినా పెట్టదు కదా. సమాచార హక్కు చట్టం కింద భాష అమలు, పరిరక్షణల గురించి భాషాభిమానులు దరఖాస్త్రాలను సంధిస్తున్నప్పుడే పాలకుల్లో మార్పు వస్తుంది. పాలనా భాషగా అమలు నుంచి భాషాభివృద్ధి వరకూ ఒక్కో అంశంపై మనం అడిగే ఒక్కో ప్రశ్న అంకుశంలా మారి పాలకులతో పని చేయిస్తుంది. తెలుగు కోసం వారు నిజమైన కృషి చేసేలా చూస్తుంది. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం