గెలిచి నిలిచిన ఇండోనేషియా!

  • 73 Views
  • 0Likes
  • Like
  • Article Share

భారతదేశంలాగే ఎన్నో రకాల భాషలు, విభిన్న ఆచారాలు, మతాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండోనేసియా. దీని ప్రధాన ఆర్థిక వనరు అక్కడి గనులు. ఇండోనేసియాది ప్రపంచంలోనే 15వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశాల్లో కూడా ఈ దేశం మొదటి వరసలో ఉంటుంది. 2017లో 32 కోట్ల డాలర్లు విద్య కోసం కేటాయించారు.
మొదట మలయా 
ఇండోనేసియా 17000 ద్వీపాల సమూహం. అధికార భాష ఇండోనేసియన్‌. ఒకప్పుడు ఈ భాష పేరు మలయా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది మాట్లాడుతున్న భాష ఇది. కేవలం ఇండోనేసియాలోనే కాకుండా మలేసియా, సింగపూర్, బ్రునై, థాయిలాండ్, తూర్పు తైౖమూర్, ఆస్ట్రేలియాలోని కోకో కీలింగ్‌ దీవుల్లో కూడా ఈ భాష మాట్లాడతారు. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండోనేసియాది నాలుగో స్థానం. 
      1928లో జరిగిన ఇండోనేసియా జాతీయోద్యమంలోనే మలయాని అధికార భాషగా ఎంచుకున్నారు. తర్వాత దాన్ని ‘భహషా ఇండోనేసియన్‌’గా మార్చారు. ఆ రోజు ‘ఇండోనేసియా బిడ్డలమైన మనందర్నీ ఐకమత్యంగా ఉంచే మన భాషను ఎప్పటికీ విడనాడమ’ని ప్రతిజ్ఞ చేశారు. ఇది ఆస్ట్రోనేసియన్‌ కుటుంబానికి చెందిన భాష. ఆగ్నేయ ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల మీదగా ఇది వ్యాప్తిచెందింది. 
      ఇండోనేసియాలో మాట్లాడే జావనీస్, బలనీస్, మలగాసి, ఫిలిప్పీనో, మావొరి లాంటివి కూడా ఆస్ట్రోనేసియన్‌ భాషలే. ఆస్ట్రోనేసియన్‌ అంటే ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలలో మూలాలున్న భాషలని అర్థం. ఈ దేశంలో దాదాపు 700లకు పైగా భాషలున్నాయి. ఆధునిక ఇండోనేసియన్‌ భాషను లాటిన్‌ అక్షరమాలను ఉపయోగించి రాస్తాను. 
డచ్‌ దాడి 
పదహారో శతాబ్దంలో డచ్‌ ఆక్రమణ తరవాత ఇండోనేసియా అధికార భాష డచ్‌ అయింది. ప్రభుత్వ కార్యాలయాలు, దరఖా స్తులు, దస్తా వేజులు, బోర్డులు డచ్‌ భాషను నింపుకున్నాయి. ప్రజలు డచ్‌ భాషనే మాట్లాడాలనే ఆదేశాలు కూడా వచ్చాయి. పాఠశాలల్లో విద్య డచ్‌ మాధ్యమంలోకి మారింది. అయితే డచ్‌ వారు ఇండోనేసియాను ఆక్రమించే ముందే మలయా భాష చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అందుకు  కారణం పురాతన   కాలం నుంచే ఇండోనేసియాలోని అన్ని దీవుల్లో వ్యాపార లావాదేవీల్లో మలయా భాషనే వాడుతూ వచ్చారు. 
      సుమత్రాన్‌ రాజ్యానికి రాజైన శ్రీవిజయాన్‌ కాలం (9వ శతాబ్దం) నుంచి ప్రస్తుతం మలేసియాలో ఓ రాష్ట్రమైన మలకాన్‌లో మలయా భాషను అధికార భాషగా ఉపయోగించేవారు. న్యాయవ్యవస్థ, పాలన, అన్ని వ్యాపార లావాదేవీల్లో మలయానే ఉపయోగించేవారు. 14వ శతాబ్దం తర్వాత కొన్ని మార్పులొచ్చాయి.
      జపాన్‌ ఆక్రమణ తర్వాత ఇండోనేసియాలో డచ్‌ భాషా విధానాలన్నీ రద్దుచేసి ఒక కొత్త విధానం రూపొందించారు. భాషా కమిషన్‌ని రూపొందించారు. దీని ప్రకారం కొత్త పదాలను జతచేస్తూ.. ఒక క్రమపద్ధతిలో ఇండోనేసియన్‌ భాషను దేశవ్యాప్తంగా పాలనలో, సాంకేతికతలో ఉపయో గిస్తారు. దీని వల్ల ఇండోనేసియన్ల భావ ప్రకటనకు మార్గం సులువైంది. పత్రికలు, రేడియో, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇండోనేసియన్‌ భాషనే వాడటం మొదలైంది. 1945 ఆగస్టు 15న ఇండోనేసియా స్వాతంత్య్రం తర్వాత వారి రాజ్యాంగంలో జాతీయ భాషగా ఇండోనేసియన్‌ను గుర్తించారు.
నిరక్షరాస్యతను ఎదిరించి.. 
స్వాతంత్య్రం తర్వాత ఇండోనేసియన్‌ భాష అభివృద్ధికి దేశంలోని నిరక్షరాస్యత ప్రధాన అడ్డంకిగా మారింది. చాలా మందికి చదవడం, రాయడం రాదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి అక్షరాస్యత 10శాతం కన్నా తక్కువ. 8.5 కోట్ల మందికి కేవలం ఆరు లక్షల మందే పాఠశాలల్లో ప్రాథమిక విద్య 
అభ్యసిస్తున్నారు. ఆశ్చర్యకరంగా 
500 మంది మాత్రమే మాధ్యమిక విద్య  చదువుతున్నారు. దాన్ని అధిగమించేందుకు ఇండోనేసియా విద్యా శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మాతృభాషలో పాఠ్యపుస్తకాలు ముద్రించింది. ఇండోనేసియన్‌ విద్యను దేశవ్యాప్తంగా బోధించేలా చేసింది. దేశ ప్రజలు ఇండోనేసియన్‌లో చదవడం, రాయడం వీటి ముఖ్య ఉద్దేశం. ‘ఇక చదువుదాం’ అనే నినాదం ఈ కార్యక్రమాల్లో బాగా ప్రచారమైంది. వీటి ఫలితంగా ఇండోనేసియాలో నిరక్షరాస్యత తగ్గడం మొదలైంది. 1980లో నిర్వహించిన సర్వేలో అయిదేళ్లకు పైబడిన వారిలో 39 శాతం మంది  ఇండోనేసియన్‌ చదవడం లేదా మాట్లాడటం నేర్చుకున్నారు. 1990 నాటికి ఇది 83 శాతం అయ్యింది. ప్రస్తుతం ఇండోనేసియా అక్షరాస్యత 95.56 శాతం.   
భాషాభివృద్ధికి వెన్నెముక 
ఇండోనేసియన్‌ భాషా కేంద్రం తమ మాతృభాషలో పరిశోధనలు నిర్వహిస్తుంది. భాషను ప్రామాణికం చేయడానికి కృషిచేస్తుంది. ఈ సంస్థ కేంద్ర విద్యా సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మొదట 1947లో భాషా సాంస్కృతిక పరిశోధన సంస్థగా ప్రారంభమైంది. తర్వాత ఎన్నో పేర్లతో రూపాంతరం చెందింది. 2009లో ఈ సంస్థకి ప్రత్యేక గుర్తు, జెండాని రూపొందించారు. ఇందులో నాలుగు ప్రధాన భాగాలు, 12 ఉప విభాగాలు, రెండు కేంద్ర విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో భాషకు సంబంధించిన పరిశోధనలు జరుగుతుంటాయి. నిఘంటు రూపకల్పన, అనువాద ప్రక్రియల అభివృద్ధి, కొత్త పదాల్ని మాతృభాషలో ప్రజలకు చేర్చడం, అంధులు, వికలాంగులకు భాష నేర్పడం ఇలా తమ దేశంతో పాటు విదేశాల్లో కూడా భాషా ప్రచారానికి కృషి చేస్తుంటుంది. దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయవవస్థ పత్రాలు, పాఠ్య పుస్తకాల ముద్రణ, వాటిలోని భాష ప్రామాణికత పరిశీలన కూడా ఈ సంస్థే చూస్తుంది. ఇండోనేసియన్‌ భాషలోని మాండలిక పదాలను సేకరించి అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే ప్రామాణిక భాషను తయారు చేస్తుంది. విదేశీయులకు తమ భాషలో శిక్షణ ఇస్తుంది.
తప్పనిసరి
ఇండోనేసియాలోని అన్ని దీవుల్లో అధికశాతం ఇండోనేసియన్‌ మాధ్యమంలోనే విద్యాభ్యాసం జరుగుతోంది. అధికార భాష ఇండోనేసియన్‌తో పాటు ప్రాంతీయ భాషలైన జవనీస్, బలనీస్‌ లాంటి వాటికీ ప్రాధాన్యం ఉంది. ప్రాంతీయ భాషా మాధ్యమంలో చదువుకోవాలనుకున్న వారు రెండో భాషగా తప్పనిసరిగా ఇండోనేసియన్‌ నేర్చుకోవాలి. అయితే, ప్రాంతీయ భాషల లిపిలో ప్రామాణికత అంతగా లేకపోవడం వల్ల చాలా మంది ఇండోనేసియన్‌ మాధ్యమంలోనే చదువుతూ తమ మాతృభాషను ఒక పాఠ్యాంశంగా అభ్యసిస్తున్నారు. 
      ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసించే వెసులుబాటు ఇండోనేసియన్‌ పౌరులకు ఉంది.  
      ఎన్నో ఒడుడొడుకులు దాటి తన మాతృభాషను అభివృద్ధి చేసుకుని అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ అభివృద్ధి పథంలో సాగుతున్న ఇండోనేసియా ఎన్నో దేశాలకు ఆదర్శం.


వెనక్కి ...

మీ అభిప్రాయం