మగ పురుగా వద్దు బాబోయ్‌!

  • 120 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

దేవుడనేవాడికి జాలీ, దయా లేవు! లేకపోతే ఆడవాళ్లను మాత్రమే సృష్టించి గమ్మున ఉండొచ్చు కదా! తాను మగాడై ఉండి, ఆ కష్టసుఖాలు తెలిసి ఉండి కూడా మగాళ్లను సృష్టించడం ఎందుకు? ఆడవాళ్లతో మగాళ్లను ‘మగపురుగులు’ అనిపించడం ఎందుకు? దేవుడి బుర్రలో ఏ పురుగు తిరిగి ఈ పని చేశాడో తెలీదు కానీ, ఇలా తీర్చుకున్నాడు కక్ష! 
      సృష్టి మొత్తం ఆడవాళ్లే ఉండి ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు. పోలీసు సిబ్బందీ అవసరం లేదు. నిర్భయ చట్టాల అవసరమే రాదు. వరకట్నాల వేధింపులూ ఉండవు. గృహహింసలూ ఉండవు. లైంగిక దాడులూ ఉండవు. జంకూ గొంకూ లేకుండా ఆడవాళ్లు ఎంచక్కా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. ‘‘స్వైర విహారధీరలగుసారసలోచనలున్న చోటికిన్‌/ భోరునలాతివారు చొరబూని నచో రసభంగమంచు’’ అంటూ శ్లేష కవితా చక్రవర్తి రామరాజ భూషణుడు ఎంత గొప్పగా చెప్పాడు! ఆటపాటల్లో మునిగితేలిన ఆడవాళ్ల దగ్గరికి మగాళ్లు వెళ్తే సారసలోచనలు రసభంగమై సాలోచనలు అవుతారట. అసలు మగాడే లేకపోతే ఈ గొడవలేం ఉండవుగా!
      దేవుడు ఆడాళ్లను, మగాళ్లను సృష్టించడం ఎందుకు? వాళ్ల మధ్య తంపులు పెట్టి ఆనందించడం ఎందుకు? తన భక్తులను కుప్పలు తెప్పలుగా పెంచుకోవడం కోసమే కదా దేవుడి కుట్ర. లేకపోతే ఇదంతా ఎందుకు? 
      పతియే ప్రత్యక్ష దైవం అంటూ బ్యానర్లు కట్టి, పతివ్రతల కర్తవ్యాల బోర్డులు పెట్టి ఆడవాళ్లను బానిసలు చేయడం ఏమన్నా బాగుందా? అంత అవసరమా? ఇందుకోసమైనా ‘నిర్మగ ప్రపంచాన్ని’ సృష్టించవచ్చు కదా!
      మహిళను అతివ అంటారు. అతివ అంటే ‘ఎక్కువగా మాట్లాడునది’ అని అర్థం. నిజానికి ఇదో తిట్టుమాట కింద లెక్క. దేవుడు ఆడవాళ్లకు మాటలు, మగాళ్లకు మూటలు ఇచ్చాడు. ఇదీ ‘దైవకరుణా సాగరమథనం’ లాంటిదే! మగాడి పట్ల ఇంత పక్షపాతమా! ఒక కార్యాలయంలోని 100 మంది రొమ్ములు విరుచుకుని, సొమ్ములు పరుచుకుని తిరిగే మగాళ్లు, ఇద్దరు ఆడ ఉద్యోగులు కలిసి నయాగరా జలపాతం జోరు చూడడానికి, హోరు వినడానికి వెళ్లారట! అయితే ఆశ్చర్యకరంగా నయాగరా జలపాతం నుంచి శబ్దం ఏదీ వినపడ లేదట; ఎందుకబ్బా! నయాగరా ఏంటి? అనుకున్న శబ్దం ఏదీ వినపడడం లేదేంటి? అని మగాళ్లు తర్కించుకుంటు న్నారట. అంతలో ఓ కొంటె కుర్రాడు ‘‘ఆడోళ్ల శబ్దం ఆపండి! లేకపోతే ఎంత లావు నయాగరా అయినా వినపడదు’’ అని కిసుక్కుమన్నాడట. ‘‘మమ్మల్ని ఆ‘డోళ్లు’ అంటావా? మా మాటల వల్ల నయాగరా శబ్దం వినపడటం లేదా?’’ అని ఆ ఇద్దరు ఆడవాళ్లు మగాళ్లను చీల్చి చెండాడారట. మగాళ్లు కూడా ఆడవాళ్లను లక్ష్మీదేవి స్వరూపాలు అనుకుని ‘సౌండ్‌ పార్టీలు’గా గుర్తిస్తే పోయేదేముంది? అమ్మాయి పుట్టగానే మనసులో ఇష్టం లేకపోయినా ‘లక్ష్మి పుట్టింది, లక్ష్మి పుట్టింది’ అంటారు కదా. అంతెందుకు? అందరినీ సృష్టించే బ్రహ్మకు నోట్లో సొంత నాలుక లేదు. ఆ నాలుక చదువులమ్మ సరస్వతీదేవి సొంతం.
      నాలుక విషయంలో ఆడవాళ్లందరూ సరస్వతీ స్వరూపాలే. అమ్మాయి కట్నం తెచ్చేటప్పుడు కనకదుర్గ, కాపురం మెద లుపెట్టిన తర్వాత కలకత్తా కాళిక. దీనికి సాక్ష్యం ఆమె తిరుగు లేని నాలుక అని భార్య పక్కన లేనప్పుడు వెక్కిరించే మగాళ్లకు లెక్కలేదు. నిజానికి ఆడవా ళ్లది ఒక నాలుక ధోరణి అయితే మగా ళ్లది రెండునాల్కల ధోరణి. అందులో ఒక నాలుక తనదైతే రెండోది భార్యది! అయితే మగడు వాలేని మగ వాడని పఠాభి సన్నాయి నొక్కులు నొక్కాడు.
      పురుషస్వామ్యం అయినా, పురుషాది Åపత్య సమాజమైనా ఆడవాళ్ల మీద ఆడ, ఈడ దూసే జోకుల బాకులు అన్నీ ఇన్నీ కావు. అందులో ఒకటి.. దసరా పండగ రోజుల్లో ఒక ఇల్లాలు తన నాలుక మీద పసుపు, కుంకుమ, పూలు పెట్టుకొని పూజ చేసుకుంటూ తన భర్తకు దర్శనమి చ్చిందట; అవేమైనా క్షుద్రపూజలా? అనుకుని ఇంటాయన ‘‘ఏం చేస్తున్నావు?’’ అని భార్యను అడిగాడట. దానికి సదరు గృహిణి అయిన ఆదిశక్తి ‘‘నేను ఆయుధ పూజ చేసుకుంటున్నానండీ!’’ అందట. అవును నాలుకకు మించిన ఆయుధమే ముంది? నాలుకకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. నోట్లో ఉన్న పళ్లన్నీ ఒక్క క్షణంలో రాలగొట్టించగలదు. అది ఆడ వాళ్ల భద్రత కోసం అనుకుంటే పొర పాటు. అంతకు మించి మగాళ్ల భద్రత కూడా అందులో తొంగి చూస్తుంది. 
      మగాళ్లు నానారకాల పాపాలు చేయడం, వాళ్లను వాటి నుంచి బయట పడేలా చెయ్యడానికి మేం పూజలు పునస్కారాలు చేయడం ఎందుకు? అని కొందరు ఆడవాళ్లు వాపోతుంటారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన చెప్పాడు. అంటే, పురుషుల్లో పుణ్యపురుషులు, పాపాత్ములు అని రెండు రకాలు ఉంటారు గానీ ఆడవాళ్లందరూ పుణ్యాత్ములే!!
      సందు దొరికితే చాలు ఆడవాళ్లమీద రాళ్లేసి ఆనందించడం మగాళ్లకు కొట్టిన పిండి, ఎక్కిన బండి. ‘‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరయా’’ అని పాటకూడా ఉంది. ఆ మాటలు విన్న ఓ ఆవిడ ఒళ్లు మండి ‘‘మగవాళ్ల మాటలకు అర్థాలే లేవయా?’’ అని ఎదురు దెబ్బతీసింది. ఆడవాళ్ల మాటలకు అర్థాలే ‘వేరయా’ అనే మాటను ఆమె అపార్థం చేసుకుంది. ‘వేరు’ అంటే మూలం అని అర్థం. అర్థం పర్థం లేని మాటలు ఆడవాళ్లు పలకరు అన్నది అంతరార్థం.
      ఆడవాళ్ల వాదనా పటిమ ముందు ఎంతటి మగాడైనా బలాదూరే. ‘‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా’’ అని ప్రశ్నించి ద్రౌపది ధర్మరాజు గాలి తీసేసింది. ఆ దెబ్బకు యమధర్మరాజు కొడుకు లబలబలాడాడు. అది ద్వాపరయుగం సంగతి. అంతకు ముందు త్రేతాయుగంలో సీతమ్మ వారు శ్రీరామ చంద్రుణ్ని తీసిన ఎదురుదెబ్బ అనితర సాధ్యమయింది. ‘‘మీ రాజ్యంలో పొలం దున్నితే పిల్లలు పుడతారట కదా!’’ అని శ్రీరామచంద్రుడు అంటే సీతమ్మవారు క్షణం కూడా ఊరుకోకుండా ‘‘మీ రాజ్యంలో పాయసం తాగితేనే మగపిల్లలు పుడతారట కదా!’’ అని వాగ్బాణాన్ని సంధించిందట.
      స్త్రీ అర్థం చేసుకోవడానికి పుడితే, మగాడు అపార్థం చేసుకోవడానికి పుట్టాడు. మగాడి బుర్ర అంతా అపార్థ నిఘంటువు. పైగా భార్య తనను అర్థం చేసుకోవట్లేదని వాపోతాడు. తాను తాగి తందనాలాడి, ఎక్కడెక్కడో చెడుతిరుగుళ్లు తిరిగివచ్చి తలుపు కొడితే తలుపు తీసిన అర్థాంగి మొగుడి మీద రుసరుసలాడితే తనను అర్థం చేసుకోవట్లేదని పతిదేవుడు మనసులో కుతకుత ఉడికిపోతాడు. నిజం చెప్పాలంటే ఆడవాళ్లకు భర్తల గురించి అసలు విషయాలు అర్థం కాకపోవడం వల్లనే ఈ సంసారాలు ఈ మాత్రమైనా ఉంటున్నాయి గానీ, లేకపోతే వీధివీధిలో కొంప కొల్లారేగా!
      మగాడికి అర్థం చేసుకునే బుర్ర కొరవడిందనడానికి ఇంకో సంగతి చెప్పాలి. ఒక పడుచుపిల్ల ఒక అబ్బాయితో..  ‘నీవంటే నాకిష్టం నీవంటే నాకు ఇష్టం’ అంటూ తెగ ఇష్టం చూపించి మెడలో తాళి కట్టించుకుంది. పెళ్లయి కాపురం పెట్టిన వెంటనే మొగుణ్ని వంటింటి గదిలోకి తోసి వంట చెయ్యమని పురమాయించింది. ‘ఇదేంటి? ఇలా చేస్తున్నావు’ అని మొగుడు కన్నెర్ర, ‘పన్నెర్ర’ చేశాడు. ‘ముందే చెప్పానుగా! నీ వంటే నాకు ఇష్టం! అని’ ఆమె అంది! ‘నలభీమపాకం అన్నారు కదా, మీరు నలుడు.. నేను దమయంతి’ అనేసింది. దాంతో మొగుడు, నలుడై, భీముడై గరిటె యుద్ధానికి దిగాడు.
      భార్యతో పెట్టుకున్న మొగుడు ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే. వాడిపోవాల్సిందే. ద్వితీయ భార్య అయితేనేం సత్యభామతో జరిగిన గొడవలో శ్రీకృష్ణ పరమాత్ముడే దెబ్బతిన్నాడు. జీవుడైనా దేవుడైనా అంతే.
      మొగుడు బతికినా, చచ్చినా స్త్రీకి కన్నీరే అని గొణిగే ఆడవాళ్లు ‘బోల్డు’ మంది. జీవితంలో మధ్యంతరంగా వచ్చే మొగుడు, అడుగడుగునా ఏదో వంకలు పెట్టి ఏడిపించే మొగుడు, అర్ధాంతరంగా చనిపోతే పుట్టుకతో వచ్చిన పసుపుకుంకుమలను కూడా పట్టుకుపోతాడని వాళ్ల వాదన. చివరకు భర్తపోయాక వితంతువుగా ముద్రవేసి శుభకార్యాలప్పుడో చివరకు ప్రయాణాలకు వెళ్లేటప్పుడో వివక్ష చూపిస్తారని చెబుతారు. ఆడ జీవితాలతో ఆడుకునే మగాళ్లు ఎందుకసలు?
      ‘ఆడదానిగా పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు’ అన్న సామెత ఇకముందు వినపడటానికి వీల్లేదు. కనపడటానికి వీల్లేదు. ఇక్కడి ప్రాచ్య దేశాలైనా, అక్కడి పాశ్చాత్య దేశాలైనా, ఆడైనా, ఈడైనా, ఏడైనా ఇలాగే ఉండాలి. అడుగుజాడ ఆడవారిదే.. పాలిచ్చే స్త్రీలే పాలించే పరిస్థితి ఉండాలి. ప్రమీల రాజ్యమే ప్రపంచానికి శరణ్యం!
      ‘ఆడవాళ్లకు సమాన హక్కులేంటి? ఆడవాళ్లకే అన్ని హక్కులున్నాయి. మగాళ్లకు సమానహక్కులు వస్తే అదే గొప్ప’ అనే మాటలు వద్దు. ‘మగవాణ్ని చూడం.. మగవాడితో మాట్లాడం, మగవాడి గురించి వినం’ అని ఆడవాళ్లంతా బిర్రబిగుసుకు కూర్చుంటే మగాడు ఏం చేస్తాడట; టట్టడాయ్‌: ఈ జగతిలో ‘‘ముందు ఆడ.. వెనక ఆడ.. కుడి ఎడమల ఆడ ఆడ’’ అయితేనే సుగతి! ప్రగతి!


వెనక్కి ...

మీ అభిప్రాయం