కష్ట కాలంలో కొత్త చిగుర్లు

  • 66 Views
  • 0Likes
  • Like
  • Article Share

చీకటి వెనకే వెలుగు ఉన్నట్టు ప్రతి సంక్షోభమూ ఏదో ఒక కొత్త అవకాశాన్ని సృష్టిస్తుంది. కొవిడ్‌-19 లాక్‌డౌన్లతో ప్రపంచం మొత్తం స్తంభించిన వేళ ప్రకృతి కూడా కాస్త అలా ఊపిరిపీల్చుకుంది. కాలుష్యం తగ్గి వాతావరణం తేటపడింది. అదే సమయంలో చిన్నారులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మాతృభాషలతో మరింతగా అనుసంధానమయ్యారని వివిధ పరిశోధనల్లో నిరూపితమైంది. ఆ విషయాన్ని వివరిస్తూ న్యూయర్క్‌టైమ్స్‌ పత్రికలో లండన్‌కు చెందిన పాత్రికేయురాలు, నవలా రచయిత్రి, జన్మతః జర్మన్‌ అయిన సోఫీ హార్డాక్‌ రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదమిది...     
లండన్‌లో
ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఓ ఆశ్చర్యకర మార్పును గమనించాను. అది నా మూడేళ్ల కొడుకు జర్మన్‌ మాట్లాడుతుండటమే. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి తనతో జర్మన్‌లోనే మాట్లాడుతున్నాను. కానీ నా భర్త బ్రిటిష్‌ వ్యక్తి, పైగా చుట్టూ ఎటుచూసినా ఆంగ్లవాతావరణమే! దాంతో నేను జర్మన్‌లో మాట్లాడినా మావాడు ఆంగ్లంలోనే బదులిచ్చే వాడు. ఈ అంటువ్యాధి కారణంగా కొన్ని నెలలపాటు అందరం ఇంటికే పరిమిత మవ్వాల్సి వచ్చింది కదా. దాంతో ఇంట్లో నా బిడ్డ తన మాతృభాషనే ఎక్కువగా విన్నాడు. ఈ క్రమంలో జర్మన్‌ నేర్చుకోవడంలో వాడు ఉత్సాహం ప్రదర్శించాడు. ఇప్పుడు వాళ్ల నాన్న ఆంగ్లంలో మాట్లాడుతు న్నప్పటికీ తను మాత్రం జర్మన్‌లోనే సమాధానం చెబుతున్నాడు. లాక్‌డౌన్‌ తీసేసిన తర్వాత కూడా ఇప్పటికీ తను ఇష్టపడుతోంది జర్మన్‌ భాషనే. 
      నా అనుభవం ప్రత్యేకమైనదేమీకాదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కారణంగా పాఠశాలలు, శిశు సంరక్షణ కేంద్రాలు (డేకేర్‌ సెంటర్లు) మూసేశారు. బ్రిటన్, అమెరికా లాంటి ఆంగ్ల ఆధిపత్యమున్న దేశాల్లో వివిధ భాషలు మాట్లాడే కుటుంబాలు ఎక్కువ. ‘‘కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆధిపత్య భాషల ప్రభావం వీళ్ల మీద తగ్గుతోంది. ఇక్కడి పిల్లలు వారి మాతృభాషలకు బాగా అనుసంధానమవుతున్నారు’’ అని బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ రీడింగ్‌ ఆచార్యులు లుడోవికా సెరాట్త్రెస్‌ అన్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్‌ కాలేజీల్లోని పరిశోధకులతో కలిసి సెరాట్రైస్‌ ఒక సర్వే నిర్వహించారు. బ్రిటన్, ఐర్లాండ్‌ దేశాల్లో ఒకటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడే ఏడువందల కుటుంబాల భాషా అలవాట్లను 2020 ఏప్రిల్‌ నుంచి జులై వరకు పరిశీలించారు. నార్వే పరిశోధకులు కూడా 200 కుటుంబాల మీద ఇదే సర్వే నిర్వహించారు. దీని ప్రకారం లాక్‌డౌన్‌కు ముందు ఈ కుటుంబాల పిల్లలు ఆయా దేశాల అధికార భాషలను ఉపయో గించేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల భాషలను ఎక్కువగా వాడుతున్నారు.  
వారసత్వ సంపద
సాధారణంగా పిల్లలు పాఠశాలల్లో స్థానిక అధికార భాషలోనే స్నేహితులను సంపాదించుకుంటారు. ఆ క్రమంలో ఆ భాషనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ సొంత భాషను పిల్లలకు నేర్పడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తమ వారసత్వానికి దూరమవుతారు. 200 కొరియన్‌- అమెరికన్‌ కుటుంబాల మీద జరిపిన ఓ అధ్యయనంలో పిల్లలు పాఠశాలలో చేరాక వారి మాటల్లో మాతృభాష వినియోగం 80 నుంచి 34 శాతానికి పడిపోయింది. ‘‘నా కొడుకు జర్మన్‌లోనే బుడిబుడి మాటలు నేర్చుకు న్నాడు. కానీ డే కేర్‌లో చేర్చిన తర్వాత మామూలు సంభాషణల్లోనూ ఆంగ్లానికి మారిపోయాడు. నా బిడ్డ ఆంగ్లంలో మాట్లాడిన ప్రతిసారీ ఎవరో మా సొంత భాషను మా నుంచి లాక్కున్నారని నాకు అనిపించేది’’ అని ఓస్లో విశ్వవిద్యాలయ పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలో ఎలిజబెత్‌ గ్రాసియా ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. సొంతభాషతో అనుసంధానమై జీవించడం వల్ల తరాల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొంటాయని, సాంస్కృతిక వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.   
ఆ ఆలోచనే తప్పు
అమెరికాలో కరోనాకు ముందు, తర్వాత  భాషాపరిశోధకులు కొన్ని ఆడియోలు రికార్డు చేశారు. మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో హియరింగ్‌ అండ్‌ స్పీచ్‌ సైన్సెస్‌ విభాగంలో సహాయ ఆచార్యులు యి టింగ్‌ హువాంగ్, బోస్టన్‌ కళాశాల మనస్తత్వ శాస్త్ర సహాయ ఆచార్యులు జాషువా హార్ట్‌షోర్న్‌ కలిసి 300లకు పైగా కుటుంబాలను ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంచుకున్నారు. వీరిలో మూడో వంతు మంది అనేక భాషలు మాట్లాడ తారు. ఆడియో రికార్డుల విశ్లేషణకు ఈ పరిశోధక ద్వయం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోంది. అనేక భాషలు మాట్లాడే పిల్లలు వాటిని జ్ఞానార్జనలో ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది సాయపడుతుంది. డాక్టర్‌ హువాంగ్‌ మాట్లాడుతూ ‘‘చాలా మంది పరిశోధకులు, విధాన నిర్ణేతలు ఒక పిల్లాణ్ని నీళ్లు నింపిన లోటాలానే చూశారు. వారి దృష్టిలో ఆ లోటా ఒక సమయంలో ఒక ద్రవాన్ని మాత్రమే నిల్వ ఉంచుకోగలదు. ఆ భావనతో తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు పిల్లలతో ఆంగ్లంలో మాత్రమే మాట్లాడుతూవారిమాతృభాషను అణచివేస్తున్నారు. పిల్లలు ఎన్నిభాషలైనా సరే, సరళంగా పరిస్థితులకు తగ్గట్టు ఉపయోగించగలరన్నది భాషా నిపుణుల అనుభవసారం’’ అంటారు.  
      డాక్టర్‌ హువాంగ్‌ అయిదేళ్ల వయసులో ఆవిడ తైవాన్‌ నుంచి అమెరికాకు వచ్చారు. అంతకు మునుపు తన తల్లితో మాండరిన్‌లోమాట్లాడేవారు. కానీ, అమెరికాలో అడుగుపెట్టాకఆంగ్లంలో సంభాషించడం ప్రారంభించారు. కానీ, తర్వాతి కాలంలో మాతృభాష ప్రత్యేకతను అర్థం చేసుకుని, తనవాళ్లతో తిరిగి తన భాషలోనే మాట్లాడుతున్నారు. ‘‘మాండరిన్లో నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అది నా తల్లిని, నా సొంత ఇంటిని గుర్తు చేస్తుంది. వలస కుటుంబాలను వారి మూలాలకు అనుసంధానిస్తుంది. చరిత్ర, సాంస్కృతిక జీవనానికి అమ్మభాష ఓ గుర్తు’’ అంటారావిడ. తన మనుమలను చూసుకోవడానికి హువాంగ్‌ తల్లి ఈమధ్యనే అమెరికాకు వచ్చారు. ఆవిడ వచ్చిన కొద్దిరోజులకే తన ఆరేళ్ల కుమార్తె మాండరిన్‌లో ఎక్కువగా మాట్లాడటం హువాంగ్‌ గమనించారు. 
ఈ మార్పు శాశ్వతమేనా?
పాఠశాలల మూసివేతలు కొందరు తల్లిదండ్రులకు ఆధిపత్య భాషలను సవాలు చేసి తమ మాతృభాషను నిలబెట్టుకునేందుకు ఊతమిచ్చాయి. మెడాడి సెస్సంటా.. ఉగాండాలోని మేకెరెరే విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్‌ భాషల బోధకులు. ‘‘ఉగాండాలో 42 కంటే ఎక్కువ దేశీయ భాషలు మాట్లాడతారు. కానీ బోధనా మాధ్యమం మాత్రం ఆంగ్లం! ఆ భాష వలసవాదుల వారసత్వం. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం స్థానిక భాష లుగాండా తన సొంతగడ్డ మీద బలం పుంజుకుంది’’ అంటారు. పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు తమ కుటుం బాలతో ఎక్కువ సమయం గడుపు తున్నారు. తమ భాషను సందర్భాను సారం ఎలా మాట్లాడాలో తెలుసుకుంటు న్నారు. అయితే పన్నెండేళ్ల తన కుమార్తె, ఆమె స్నేహితులు ఆంగ్లంలో చేసిన చర్చకు తీర్పు చెప్పమని అడిగినప్పుడు ‘‘మీ వాదనలు లుగాండాలో సాగితేనే నేను ఏదైనా చెబుతా’’నన్నారు సెస్సంటా. దానికి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందట! ‘‘విద్యావిషయిక అంశాలను తప్పనిసరిగా ఆంగ్లంలోనే చర్చించాలని మనం పిల్లల్లో కల్పించిన నమ్మకమే నా బిడ్డ ఆశ్చర్యానికి కారణం’’ అంటారు సెస్సంటా. అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. 
      కొవిడ్‌ -19 తర్వాత కూడా ప్రాంతీయ భాషలు ఇలాగే పురోగతి సాధిస్తాయా? అంటే చెప్పడం కష్టం. జీవితం సాధారణ స్థితికి చేరుకోగానే పిల్లలు ఆధిపత్య భాషలకు తిరిగి వస్తారని కొందరు పరిశోధకులు ఊహిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రస్తుత పరిస్థితుల వల్ల రెండో భాషను ఎలాంటి భయం లేకుండా ఉపయోగించే ధైర్యం పిల్లలకు వచ్చిందని, రాబోయే కాలంలో మాతృభాషల వాడకం పెరగొచ్చని ఆశాభావం వ్యక్తంజేస్తున్నారు.  
      ఈ సమయంలో, నా కొడుకు జర్మన్‌ భాషలోని ప్రేమను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మాతృభాష మాకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది. ఒక వేళ అది సాధ్యం కాకపోయినా, ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉన్నప్పుడు.. కాస్త నవ్వును, భద్రతా భావాన్ని అందించడానికి నా అమ్మభాష ఉందని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను.

అనువాదం: వెంకట ప్రసాద్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం