వెన్నుచలువ

  • 161 Views
  • 0Likes
  • Like
  • Article Share

వెన్నుచలువ
పిల్లలు లేనివాళ్లు మరెవరి పిల్లల్నో తెచ్చుకుని పెంచుకోవడాన్ని వెన్నుచలువ అంటారు. అలా పిల్లల్ని సాకడం వల్ల సంతానయోగం కలుగుతుందని ఒక నమ్మకం. అలా సాకే బిడ్డను ‘ఉప్పుప్పుగోనే’ అంటూ ఉప్పు మూటలాగా మోస్తే, తమ వెన్ను చల్లబడి పిల్లలు పుడతారనే నమ్మకం ఇప్పటికీ ఉంది. వెన్నుచలువ కోసం బిడ్డను పెంచుకుంటున్నామని ముందుగానే చెప్పి కన్నబిడ్డలకన్నా మురిపెంగా చూసుకుంటారు. పిల్లల్లో ఎవరిమీదైనా తల్లిదండ్రులు ఎక్కువ ఆపేక్ష చూపితే ‘‘వెన్నుచలువ బిడ్డా యేం! ఇంత ఇదవుతున్నారని’’ పెద్దలు మందలిస్తుంటారు.


దద్దళం
పైన మట్టి మేగిన చెక్కకప్పు అని గోదారి ప్రాంతంలో వాడుక. కావ్యభాషలో దద్దళం, దద్దడం అనే రూపాలున్నాయి. బోడిమిద్దె, చిన్నరాతి కప్పుగల గుడిసె, చిన్నగుడి, యుద్ధసాధనాలు నిలుపు రాతిమిద్దె అని నిఘంటు అర్థాలు. ‘రాతి పద్దడం’ అని పరమయోగివిలాసంలో ఒక ప్రయోగం ఉంది.


జోడు
కళ్లజోడును కంటి అద్దాలనీ, అంటుజోడుని- చెవులకు అట్టిపెట్టుకునే ఒక రకం కమ్మలను- తమ్మెంట్లు అనీ అంటారు. తమ్మి అంటే చెవి చివర బిళ్ల లాంటి భాగం. దాన్ని అంటిపెట్టుకుని ఉండేవి తమ్మెంట్లు. కమ్మ అంటే తాటాకు. ఒకప్పుడు తాటాకులతో తాళిని తయారుచేసేవారు. ఆ తాటాకుల స్థానంలో బంగారమూ, రాళ్లూ ఇతర లోహాలు వచ్చి చేరినా కమ్మలు, తాళిబొట్లకు ఆ పేర్లు అలా నిలిచిపోయాయి. ‘‘బాబూ జోడాలండీ!’’ అనే ప్రయోగం విశాఖ మాండలికంలో కనిపిస్తుంది. ‘దండాలండీ!’ అనే దానికి సమానార్థకమిది. రెండు చేతులు జతచేసి చేసే నమస్కారానికి జోడా అని పేరు.


చెప్పుకోండి చూద్దాం!
చుట్టమై చూడవస్తే
దయ్యమై పట్టుకున్నాడు
ఈ పొడుపుకి విడుపు రేగుచెట్టు. రేగుపళ్ల కోసం ప్రయత్నించినప్పుడు పండు దక్కుతుంది కానీ కట్టుబట్టలకు మళ్లు చిక్కుకుంటాయి. పండ్ల కోసం వెళ్లిన వ్యక్తి చుట్టమైతే ఆతిథ్యమిచ్చే రేగుచెట్టు దెయ్యం. అతిథిగా వచ్చినవాణ్ని గృహస్థు తన మర్యాదలతో ముంచెత్తుతుంటే వాటినుంచి తప్పించుకోవడానికి వీలులేని సందర్భంలో ఉపయోగించే సామెతను పోలిన పొడుపుకథ ఇది.


అంతస్తుగల ఇల్లు
మాది, మాడిగ, మేడ, మాలె, బంగలా అనే పదాలు వ్యవహారంలో ఉన్నాయి. చిత్తూరు, రాయలసీమ, నెల్లూరు, రాయచూరుల్లో మాది, మాడిగ వ్యాప్తిలో ఉన్నాయి. కోస్తాలో, చిత్తూరు తూర్పు భాగంలోనూ మేడ అంటారు. మహబూబ్‌నగర్‌ వాయవ్యభాగంలో మాలె నిలిచి ఉంది. బంగలా అనేది తెలంగాణలో వాడుక. కన్నడంలో మాడ, మాళిగె, మాడి అనే పదాలు తమిళంలో మాడి, మేడైగా వ్యవహారంలో ఉన్నాయి. బంగలా (బంగ్లా) ఏమో అర్థభేదంతో హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన అరువు మాట


కూటం
తమిళ, కన్నడాల్లో కూట్టు, కూటు, కూడు అనే క్రియతో కలిసి ఉండటంతో ఇది పూర్తిగా సంస్కృతేతర పదమంటారు. కూటం అనే పదానికి చేరు, చేరువగు, సమావేశమగు అనే అర్థాలున్నాయి. ఈ కూటు, కూడు ధాతువుల నుంచే కూటం, కూటువ, కూడిక లాంటి పదాలు ఏర్పడ్డాయి. కూటాం అనీ అంటారు. సమావేశస్థలం, చావడి, కొలువుకూటం, సభాభవనం అనే అర్థచ్ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. 


అర్థభేదక సామర్థ్యం
ఒత్తక్షరాలు రాయడంలో ఎంతో జాగ్రత్త అవసరం. సాధారణంగా చాలామంది మాటల్లో ఈ భేదం కనిపించదు. కానీ, దీన్ని గుర్తించడం అవసరం. ఉచ్చారణ భేదం వల్ల అర్థభేదం వచ్చే అవకాశముంది. దీనికి ఇవే ఉదాహరణలు..
అర్థం - భావం, డబ్బు; అర్ధం- సగం.
శోధ- పరిశీలన, వెదకడం; శోథ - నొప్పి, శూల.
పలం- మూడు తులాలు; ఫలం- పండు.
కరం- చెయ్యి, కప్పం; ఖరం- గాడిద 
గాతం- గుంట, పల్లం; ఘాతం- దెబ్బ, బాణం.   

- బూదరాజు రాధాకృష్ణ


కక్కర
కక్కర అంటే అడవికోడి అని నిఘంటు అర్థం. ‘‘కొక్కెరల్‌ కక్కెరల్‌ గువ్వలు’’ అని కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామంలో ప్రస్తావించాడు. కానీ అది ఏ పక్షి అన్నది తెలియడం లేదు. కక్కరేటువు అని మహాభారతంలో మరో ప్రయోగం కనిపిస్తుంది. కొక్కెర అనే పక్షిజాతిని తెలియజేసే ఈ పదానికి కక్కర అనే పాళీ పదం మూలమని, దీనినుంచే తెలుగులో కక్కెర ఏర్పడిందంటారు చీమకూర్తి శేషగిరిరావు.


అడుగులు
రాగి పిండితో సంకటిలో కలిపే బియ్యం లేదా జొన్న నూకలు. కళ్లంలోగాని, ఇంట్లోగాని ధాన్యాన్ని కొలవగా మిగిలిన గింజలు. గంజి కుండలో కింద అతుక్కుపోయిన మెతుకులు.


ఇడవలి
అగురుగడ్డి అని మరొకపేరు. చీపురుపుల్లల్లాంటి కాడలతో సువాసన కలిగిన వేళ్లతో ఉండే ఒక తృణవిశేషం. ఏటిచాళ్లలో ఒత్తుగా పెరుగుతుంది. పశుగ్రాసంగానూ, ఇంటిపైకప్పుల మీద పరవడానికి పనికొస్తుంది. వేరుతో తడికలు, విసెనకర్రలు అల్లుతారు. వేరు పేని పెండి కట్టడానికి తాడుగా కూడా వాడతారు. దీనినే ఔరు, ఉశీరం, లామజ్జకం, విడవలి అని పిలుస్తారు.


సొన 
ఇసుక తిన్నెల నుంచి పుట్టి, బుగ్గలా నిరంతరాయంగా జాలువారే నీటి కాలువ. మామిడి లాంటి కాయలను తొడిమ తుంచగానే కారే వసనీరు. పుండు నుంచి కారే రసిక. చేపలోని గుడ్లను చేపసొన లేదా చేపజెన అంటారు. పనస తదితరాల తొనను సొన అని కొన్ని ప్రాంతాల్లో వ్యవహరిస్తారు.


ఎర్రమొరం
ఎర్రకంచురాయి. భూఉపరితలం మీద సర్వసాధారణంగా దొరుకుతుంది. పొరలు ఏర్పడని ఈ జాతి రాయి.. గుండురాయి, కనికరాయి కలయికతో ఏర్పడుతుంది. ఒక్కోసారి మైకా బదులు నల్లపాలీష్‌ రాయి కనిపిస్తుంది. ఈ జాతి రాళ్లు పర్వత శ్రేణుల దగ్గర పొడుచుకుని వచ్చి గండశిలలుగా కనిపిస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం