ఖండాంతరాల తెలుగు ఖ్యాతి

  • 90 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు సాహిత్య విశిష్టతని ప్రపంచ వ్యాప్తంగా వెలిగిస్తున్న తెలుగు తేజం ఆచార్య వెల్చేరు నారాయణరావు. రచయితగా, సాహితీవేత్తగా, అనువాదకులుగా, విమర్శకులుగా, పరిశోధకులుగా తన ఖ్యాతిని చాటుకున్న ఆయన్ని మరో అరుదైన గౌరవం వరించింది. దేశంలోనే అత్యున్నత సాహితీ గౌరవమైన కేంద్ర సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోగా నారాయణరావు ఎంపికయ్యారు. 
‘‘విషయాన్ని
అర్థంచేసుకోడానికి ఒక భాష కావాలి. విషయాన్ని చెప్పడానికి ఒక భాష కావాలి. విషయాన్ని ఊహించడానికి ఓ భాష కావాలి. వీటిలో మొదటి ప్రయోజనం పొందడానికి మాత్రం ఆంగ్లం నేర్చుకుంటే సరిపోతుంది. అంటే, ఆ భాషలో ఉండే సమాచారాన్ని చదివి తెలుసుకోవడం కోసమే దాన్ని నేర్చుకోవాలి. మిగిలిన పనులకు ఆంగ్లాన్ని వాడకూడదు. వాడలేం కూడా’’ అని ఘంటాపథంగా చెప్పే మాతృభాషావాది ఆచార్య వెల్చేరు నారాయణరావు. దక్షిణ భారతదేశ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న సమకాలీన సాహితీవేత్తల్లో ప్రముఖులు ఆయన. బాల్యంలో శ్రీకాకులం జిల్లా అంబఖండిలో ఉన్న ఆయన ఏలూరు సమీపంలోని కొప్పాకలో మేనమామ ఇంటికొచ్చి సీఆర్‌రెడ్డి కళాశాలలో బీఏ చదివారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చేశారు. ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ మీద పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్నారు. విస్కాన్సిస్‌ విశ్వవిద్యా లయం దక్షిణాసియా అధ్యయన విభాగం అధ్యాపకుడిగా 1971లో అమెరికా వెళ్లి 40 ఏళ్లు అక్కడే పనిచేశారు. ప్రస్తుతం జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ సంస్థ, మ్యాడిసన్‌ విశ్వవిద్యాలయం మానవీయ విజ్ఞాన శాస్త్రాల పరిశోధన సంస్థల్లో ఫెలోగా ఉన్నారు. 
      తెలుగు సాహిత్యం, దక్షిణ భారత చరిత్ర, అనువాద రంగాలకు చేసిన సేవలకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోగా నారాయణరావు ఎంపికయ్యారు. ఈ గౌరవం అందుకున్న 14వ వ్యక్తి ఈయన. భారతదేశం నుంచి తొలి వ్యక్తి నారాయణరావే. గతంలో వీఎస్‌ నైపాల్, ఆచార్య డేనియన్‌ హెచ్‌హెచ్‌ ఇంగాల్స్, ఆచార్య కమిల్‌ వి జ్వెలెబిల్‌ లాంటివారు ఈ గౌరవం స్వీకరించారు. కళాపూర్ణో దయం, బసవపురాణం, ప్రభావతీ ప్రద్యు మ్నం, క్రీడాభిరామం, క్షేత్రయ్య పదాలు, అన్నమయ్య కీర్తనలు, చాసో కథలు ఇలా ఎన్నో గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదిం చారు వెల్చేరు. గురజాడ కన్యాశుల్కాన్ని ‘గాల్స్‌ ఫర్‌ సేల్‌’ పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ‘ద పొయట్‌ హూ మేడ్‌ గాడ్‌ అండ్‌ కింగ్స్‌’ పేరుతో శ్రీనాథుడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. ‘‘భారతీయులకు చరిత్ర లేదని అంటారు ఆంగ్లేయులు. తాము వచ్చాకే మనం చరిత్ర రాయడం నేర్చుకున్నామని చెబుతారు. కానీ, మనకు చారిత్రక స్పృహ ఉంది. మనవాళ్లు సాహిత్య రూపంలో చరిత్ర రాశారు’’ అంటారు నారాయణ రావు. అనువాదంలో గతంలో ఏకే రామానుజన్‌ పురస్కారం, రాధాకృష్ణన్‌ స్మారక పురస్కారం అందుకున్నారాయన.
      ‘‘ప్రపంచంలో ఎక్కడైనా కోకాకోలా పేరు ఆంగ్లంలోనే కనిపిస్తుంది. కానీ, ఇజ్రాయెల్‌లో మాత్రం హిబ్రూలో ఉంటుంది. మా ప్రాంతంలో వ్యాపారం చెయ్యాలంటే మా భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని కరాఖండీగా చెప్పారు వాళ్లు. ఎనిమిది కోట్ల మందిమి ఉండి మనం ఆ మాట ఎందుకు అనలేకపోయాం. భాష విషయంలో కొంత ఆభిజాత్యం ఉండాల్సిందే’’ అంటూ అమ్మభాష విషయంలో అందరూ కర్తవ్యోన్ముఖులు కావాలని సూచిస్తారు నారాయణరావు. ‘‘భాషా బోధన నుంచి పరిశోధన వరకూ తెలుగు కోసం ఎంతో శ్రమిస్తూ కూడా నేను చేసే పని చిన్నది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని చెప్పే నారాయణరావు భాషా సేవ ఎనలేనిది. ఇలాంటి అమ్మభాషా ప్రేమికులే తెలుగు భాషకు తరగని బలం.


వెనక్కి ...

మీ అభిప్రాయం