భట్టుమూర్తి.. భువన విజయపు దీప్తే!

  • 148 Views
  • 0Likes
  • Like
  • Article Share

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో భట్టుమూర్తి కూడా ఒకడని ప్రసిద్ధి. అయితే ఆధునిక సాహిత్య చరిత్రకారులు కొందరు దీన్ని అంగీకరించట్లేదు. క్రీ.శ.1544 నాటికే నరసభూపాలీయం, వసుచరిత్రలను భట్టుమూర్తి రాస్తే, 1557 నాటి చారిత్రకాంశాలు నరసభూపాలీయంలో, 1580 నాటి విషయాలు వసుచరిత్రలో ఎందుకున్నాయన్నది వారి మౌలిక ప్రశ్న. అయితే దీనికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. వాటన్నింటినీ విశ్లేషిస్తే భట్టుమూర్తి భువనవిజయంలోనే ఉన్నట్టు అవగతమవుతుంది.
కడప
జిల్లా కైఫియత్తులు రెండో సంపుటంలోని నందిపాడు కవుల్లో భట్టుమూర్తి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ‘‘స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబు 1466 (క్రీ.శ.1544) అగునేటి క్రోధి సంవత్సర కార్తీక శు12లు శ్రీమన్మహారాజాధిరాజ పరమేశ్వర వీరప్రతాప శ్రీ సదాశివదేవరాయలు విజయనగరమందు వజ్రసింహాసనారూఢులై పృథ్వీసామ్రాజ్యంబు యేలుచూ ఉండి అరవీటి బుక్కరాజు గార్కి పైపౌతృలయిన రామరాజు గార్కి పౌతృలయిన తిమ్మరా (274)జు గార్కి పుత్రులయిన చినతిమ్మరాజు గారికి నందపాటి గ్రామం అమరం మన్నించి రాయలవారు యిచ్చి వుండిరి గన్కు బహుసంవత్సరాలు అనుభవిస్తు ఉండినంతలో వారి పేరను కవిత్వ ప్రభావాలు కల్పనలు చేసిచెప్పి భట్టురామరాజు అనుమరాజు గారు చదివి వార్ని మెప్పించినందు నుంచి వారికి దయవొచ్చి నందిపాడు అగ్రహారం వ్రాయించి యిచ్చి వార్ని గ్రామానకు అనిపిరి...’’- ఇరవై రెండు పుటల ఈ కైఫియత్తులో నాలుగు సార్లు భట్టురామరాజు అనుమ రాజు ప్రస్తావన కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ పేరుతో సామీప్యమున్న కవులు ఇద్దరున్నారు. ఒకరు రామరాజు రంగప్ప రాజు. రెండో వ్యక్తి రామరాజ భూషణుడు (భట్టుమూర్తి). 
మరొకరు లేరు!
రంగప్పరాజు అరవీటి వంశస్థుడే! పొట్లపాటి తిమ్మరాజు(అళియరామరాజు పెదతండ్రి)కి మనవడు. ఇతను సాంభోపాఖ్యానం రాశాడు. ఇక రామరాజ భూషణుడు అరవీటి వంశస్థులకు ఆశ్రితుడు. భట్టుమూర్తిగా ప్రసిద్ధుడు. అళియరామరాజు ప్రోత్సహించడంతో రామరాజ భూషణుడిగా పేరుగాంచాడు. కైఫియత్తులో ‘‘చదివి వార్ని మెప్పించినందు నుంచి’’ అని స్పష్టంగా ఉంది. అందువల్ల అందులోని వ్యక్తి అరవీటి వంశేతరుడన్నది వాస్తవం. కాబట్టి అతను రామరాజభూషణుడే! ‘భట్టు’ అనేమాట భట్టుమూర్తి కులసూచకం. ఈ కైఫియత్తులో ‘శ్రీపతిరాజు వనం’ అనే మాట ఉంది. ఇది కూడా కులసంబంధమైందని కైఫియత్తుల పరిశోధకులు కట్టా నరసింహులు పేర్కొన్నారు. ‘రామరాజు’ శబ్దం తనకు ఆశ్రయమిస్తున్న అళియ రామరాజును సూచిస్తున్న పదం. ఈవిధంగా దాతల పేరు పెట్టుకోవడం భట్టుమూర్తి కుటుంబంలో ఉన్నదే! భట్టుమూర్తి తండ్రిపేరు సింగరాజు. కానీ, వెంకటరాయ భూషణుడని బిరుదు. అచ్యుత దేవరాయల కుమారుడైన వెెంకటపతిరాయల ఆస్థానానికి సింగరాజు భూషణంగా ఉండేవాడు. అందుకే ఆయనకు ఆ పేరొచ్చింది. ఈ విధానాన్ని అనుసరించే భట్టుమూర్తి ‘రామరాజభూషణుడు’ అయ్యాడు. ‘హనుమ’ తద్భవరూపం ‘అనుమ’. హనుమంతుని వరప్రసాదం వల్లే తనకు కవిత్వం అబ్బిందని భట్టుమూర్తి చెప్పుకున్నాడు. కులసూచకమైన ‘భట్టు’, ఆశ్రయప్రదాత ‘రామరాజు’, తన ఆరాధ్య దైవం ‘హనుమ’ కలిసి భట్టు రామరాజు అనుమరాజుగా కైఫియత్తులో కనిపించాడు.
      కావ్యాల్లో కూడా భట్టుమూర్తి పేరు ఏకరీతిగా లేదు. రామభూషణుడు, రామనృపభూషణుడు, రామరాజ భూషణుడు అని పలువిధాలుగా ఉంది. అలాగే కైఫియత్తులో మరోలా ఉంది. కైఫియత్తులు, కవితలు రాసేవారు పండితులు కాదు. సామాన్యులు. కైఫియత్తులో అగ్రహార ప్రదాన ప్రస్తావనా కాలం క్రీ.శ.1544. అయితే దాన్ని క్రీ.శ 1654లో రాశారు. అంటే దానం చేసిన 110 ఏళ్ల తర్వాత. ఆ స్థితిలో ఇలాంటి చిన్న సమస్యలు సహజమే! ఆ కాలంలో ఆ పేరుతో సామీప్యమున్న కవి రామరాజభూషణడు తప్ప మరొకరు లేరు. అమర నాయంకర స్థాయిలో అగ్రహార ప్రదానం చేసినట్లు కైఫియత్తు చెబుతోంది. ఆ స్థాయినందుకున్న ప్రముఖ కవుల్లో సంస్కృత తెలుగు భాషల్లో ఆ పేరుతో సామీప్యమున్న మరొకరు లేరు. వసుచరిత్ర లాంటి సంగీత సాహిత్య శ్లేష ప్రబంధం రాయడం వల్లనే నాయంకర స్థాయితో అగ్రహార ప్రదానం జరుగుతుంది తప్ప సాధారణ రచనలకు సాధ్యం కాదు కదా! 
అదే కారణం!
భట్టుమూర్తి అగ్రహార ప్రదానమూ చేశాడు. దీనికి హరిశ్చంద్ర నలోపాఖ్యానం (1-14)లో సాక్ష్యం ఉంది. నాయంకర స్థాయి అధికారాలుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అయితే, అగ్రహార ప్రదాన విషయం వసుచరిత్రలో లేదు! 1544 నాటికే వసుచరిత్ర పూర్తయ్యిందనడానికి కైఫియత్తు మాత్రమే కాదు, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్య్మములోని ‘‘గిరికానుషక్త బుద్ధిను/ పరిచరునింబోలు..; యమదంత చండమగుభుజ/ గమునకు’’ (2-242, 244) పద్యాలు బలమైన సాక్ష్యాలు. పాండురంగ మహాత్మ్యం రచన 1544 నాటికే జరిగిందని ఆచార్య నేలటూరి వెంకటరమణయ్య నిరూపించారు. ఆ కావ్య స్వీకర్త విరూరి వేేదాద్రి, అతని గురువు కందాళ అప్పణాచార్యులు 1544-45 నాటి వారని పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణుణ్ని అష్టదిగ్గజాల్లో ఒకడిగా శాసనాధారాలతో తేల్చారు. కాబట్టి, ఆముక్తమాల్యద, వసుచరిత్ర రచన పూర్తయిన తర్వాతనే పాండురంగ మాహాత్మ్యం రచన సాగిందని అర్థమవుతుంది. పైగా భట్టుమూర్తి తొలిరచన నరసభూపాలీయాన్ని రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యంలో అనుకరించినట్టు ‘‘జలధి దేవేరి కావేరి జనుల జూడ..’’ (నరసభూపాలీయం - నాంది - 35), ‘‘గంగా సంగమ మిచ్చగించునె మదిన్‌ కావేరి దేవిరిగా..’’ (1- 139) పద్యాలను బట్టి తెలుస్తుంది.
క్రీ.శ.1544 నాటికే నరసభూపాలీయం, వసుచరిత్రలను భట్టుమూర్తి రాశాడు కదా! మరి 1557 నాటి చారిత్రకాంశాలు నరసభూపాలీయంలో, 1580 నాటి విషయాలు వసుచరిత్రలో ఎందుకున్నాయి అన్నది ముఖ్య ప్రశ్న. అయితే, కృష్ణ దేవరాయల మరణం తర్వాత విజయనగర అంతఃపురం అంతర్గత ముఠాలుగా విడిపోయింది. భట్టుమూర్తి వీటిని సమీపంగా చూసి ఉంటాడు. అందువల్ల కావ్యాల రచన పూర్తయినప్పటికీ వారికి అంకితం చేయలేకపోయి ఉండవచ్చు. తల్లికోట యుద్ధపరాజయానికి ఈ కలహాలూ ఒక కారణంగా చరిత్రకారులు పరిగణిస్తున్నారు. వసుచరిత్ర ప్రథమాశ్వాసంలో భట్టుమూర్తి తిరుమలరాయల వంశాన్ని 90 గద్య పద్యాల్లో వర్ణించాడు. ‘‘అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన...’’ అని కావ్యం హఠాత్తుగా ప్రారంభం కావడాన్ని బట్టి కావ్యరచన ఎప్పుడో పూర్తయి, పీఠిక భాగాన్ని తర్వాత చేర్చారని అవగతమవు తుంది. సాధారణంగా కవులు కావ్యరచన పూర్తయిన తర్వాతే కావ్య స్వీకర్త కోసం అన్వేషణ మొదలు పెడతారు. కానీ, కావ్య స్వీకర్త కోరిక మేరకే కావ్య సృష్టి చేశామని కవులు చెప్పుకోవడం ఆనవాయితీ! ఒకరికి అంకితం చేయాలనుకొని కావ్యరచన చేయడం, అది వీలుకాక మరొకరికి సమర్పించటం ఆకాలంలో సాధారణమైన విషయం. అలాగే కృష్ణరాయలకుగానీ, అళియరామరాయలకుగానీ ఇవ్వాలని భట్టుమూర్తి వసుచరిత్ర రాసుంటాడు. కానీ ఆ కోరిక నెరవేరలేదు.
వారితో భర్తీ
భట్టుమూర్తి వసుచరిత్ర కన్నా ముందే పింగళి సూరన కళాపూర్ణోదయాన్ని రచించాడని సాహిత్య చరిత్రకారులంతా అంగీకరించారు. అయితే వసుచరిత్ర క్రీ.శ 1544కి ముందే రాసుంటే, కళాపూర్ణోదయంలో 1544 తర్వాత జరిగిన సంఘటనలు ఎందుకున్నాయి? అన్నది మరో ప్రశ్న. కళాపూర్ణోదయంలో కేరళలోని మృగేంద్రవాహన ఆలయ ప్రస్తావన ఉంది. ఈ కావ్యంలో చెప్పిన మంద్రశాస్త్రానికి కేరళ ప్రసిద్ధి! సూరన తర్వాతి రచన ప్రభావతీప్రద్యుమ్నానికి సంస్కృత హరివంశంలోని విష్ణుపర్వకథతో పాటు పన్నెండో శతాబ్దపు తిరువనంతపురం రాజకవి రవివర్మ రాసిన ‘ప్రద్యుమ్నాభ్యుదయం’ అనే నాటకం కూడా ఆధారమేనని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం నిరూపించారు. క్రీ.శ.1542లో సదాశివరాయలు పట్టాభిషేకాన్ని ఎదిరిస్తూ తిరువనంతపురం పాలకుడు తిరుగుబాటు చేశాడు. అతని మీదకి అళియ రామరాయలు తన పెదతండ్రి పొట్లపాటి తిమ్మరాజు పిల్లలైన విఠలుడు, చినతిమ్మరాజులను పంపాడు. వారు తిరువనంతపురం పాలకుల్ని ఓడించారు. క్రీ.శ.1558 వరకూ విజయనగర ప్రతినిధిగా విఠలుడు తిరువనంతపురంలోనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే పింగళి సూరన మలయాళ ప్రాంతాన్ని సందర్శించి ఉంటారని లక్ష్మీకాంతం అంచనా! 
      తిరువనంతపురం మీద దండెత్తిన చినతిమ్మరాజు, విఠలులతో సూరన కూడా వెళ్లి ఉంటాడు. కవులు ఇలా యుద్ధాలకు వెళ్లి రాజుల విజయాల్ని కీర్తించడం అప్పట్లో కనిపించేదే. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయగారి మల్లన లాంటి అష్టదిగ్గజ కవులు రాయల సైన్యం వెంట వెళ్లినట్లు కడప జిల్లా కైఫియత్తులు వివరిస్తున్నాయి. సూరనను తీసుకెళ్లిన చిన్నతిమ్మరాజే భట్టుమూర్తికి నందిపాడు అగ్రహారాన్నిచ్చాడు. అంటే ఒకే వ్యక్తి దగ్గర సూరన, భట్టుమూర్తులిద్దరూ ఉన్నారన్నమాట! అక్కడే ఇద్దరి మధ్యా స్పర్ధ ఏర్పడింది. ఆ స్పర్ధ తెలుగుజాతికి రెండు మహాప్రబంధాలను అందించింది. ఈ చినతిమ్మనకు సమీప బంధువే నంద్యాల కృష్ణంరాజు! నంద్యాల కృష్ణంరాజుకి సూరన కళాపూర్ణోదయం అంకితమైంది!
      దోనూరి కోనేరునాథుడు, అప్పయ దీక్షితులు, పింగళి సూరన, భట్టుమూర్తి లాంటి అగ్రశ్రేణి కవుల్ని పోషించిన సాహితీ ప్రేమికుడు చినతిమ్మరాజు! వసుచరిత్రను సంస్కృతీకరించిన కాళహస్తికవి అప్పయ దీక్షితుల శిష్యుడే! కృష్ణరాయల అష్టదిగ్గజ కవుల్లో వార్ధక్యం వల్లగానీ, ఇతర అనారోగ్య కారణాల వల్లగానీ ఎవరైనా కవులు మరణించి ఉంటే, వారి స్థానాన్ని యువకులైన పింగళి సూరన, భట్టుమూర్తి, రామకృష్ణలతో భర్తీ చేసి ఉంటారు! భువన విజయంలోకి ప్రవేశించే నాటికి భట్టుమూర్తి వయసు 20, 25 ఏళ్ల మధ్య ఉంటుందని అనుకుంటే, 1580 నాటికి ఆయన వయసు 80-85. వీరు భువన విజయంలోకి ప్రవేశించే నాటికి రాయలకు చివరి రోజులు. ఆ వృక్షం కూలిపోవడంతో ఆశ్రయించుకున్న పక్షులు పలు చోట్లకు ఎగిరిపోయాయి. అలా సూరన పొల్లపాడు, నంద్యాల వంశాల వారి వద్ద కుదురుకున్నాడు. రామకృష్ణుడు పొత్తపినాటిలోని రాయసకాడు విరూరి వేదాద్రిని ఆశ్రయించాడు. భట్టుమూర్తి పొట్టపాటి, ఆరవీటి వంశాల వంచన చేరాడు. 
అదే ఇది
నందిపాటి అగ్రహారాన్ని అమరనాయంకరంగా ఇచ్చిన చినతిమ్మన గురించి భట్టుమూర్తి వసుచరిత్ర పీఠికలో మాటమాత్రంగానైనా ఎందుకు చెప్పలేదు? అన్నది మరో సందేహం. దీనికి అనేక రాజకీయ అంశాలు కారణాలుగా తోస్తాయి. భట్టుమూర్తికి నందిపాటి అగ్రహారం నాయంకర ప్రాప్తికాలం 1544. వసుచరిత్ర పీఠిక రచనా కాలం 1580. వీటి మధ్య కనీసం 35 ఏళ్ల వ్యవధి ఉంది. 1580 నాటికి చిన తిమ్మన చరిత్రలో కలిసి పోయాడు. విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంలో ఘోరపరాజయం పాలైంది. ఈ యుద్ధం జరిగి (1565 జనవరి 23) 1580 నాటికి 15 ఏళ్లు. 1580 నాటికి భట్టుమూర్తి పెనుగొండలోని ఆరవీటి వారికి దగ్గరయ్యాడు. పింగళి సూరన నంద్యాల వారికి సన్నిహితుడ య్యాడు. అటు నంద్యాల వారికి ఇటు పెనుగొండ తిరుమలరాయలకు అభిప్రాయ భేదాలు రగులుకుంటున్న కాలమది. ఆవుకులోని చిన తిమ్మరాజు సంతతి నంద్యాలవారికి దగ్గరవుతున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ దాయాదుల మధ్య ప్రత్యక్ష యుద్ధాలే జరిగాయి. పెనుగొండవారు సిద్ధవటంలోని మట్లివారి సాయంతో నంద్యాల, అవుకు వారిని ఓడించారు కూడా! ఈ కారణాల వల్ల కూడా చినతిమ్మరాజు ప్రస్తావన వసు చరిత్రలో లేకపోయి ఉండవచ్చు. ఇలాంటివి ఆ రోజుల్లో చాలా సహజమే! నంది తిమ్మన తన పారిజాతాపహరణం లోని శ్రీకృష్ణదేవరాయల వంశవర్ణనలో రాయల సవతిసోదరుడైన అచ్యుత దేవరాయల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ఇవే అంశాలు పింగళి సూరన రచనల్లోని చారిత్రకాంశాల ప్రస్తావనలో కూడా వర్తిస్తాయి! 
      కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు అగ్రహార ఐతిహ్యం ప్రకారం దీన్ని శ్రీకృష్ణదేవరాయలు భట్టుమూర్తికి ఇచ్చినట్లు తాను విన్నానని ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. ఆ గ్రామస్థులు కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతారు. మొదట ఆ గ్రామం పేరు శ్రీరంగపురం. భట్టుమూర్తి దానికి దత్తతగా వచ్చాడు. అతని జన్మస్థలం బట్రేపల్లి. ఇది అనంతపురం జిల్లాలోని తలుపుల మండలంలో ఉంది. ఒకసారి కృష్ణరాయల ఏనుగులకు మేత అవసరమై గండికోట పాలకుడికి చెప్పగా, అతను కసునూరు (శ్రీరంగపురం) నుంచి జొన్న చొప్పను పంపించాడట. రాయలు సంతోషించి మీకేం కావాలో కోరుకొమ్మంటే, ‘మా గ్రామంలో భట్టుమూర్తి అనే పదహారేళ్ల కుర్రాడు కవిత్వం చెబుతాడు. అతణ్ని మీ అష్టదిగ్గజాల్లో చేర్చుకోండి’ అని ప్రార్థించారట. జొన్న చొప్పను (కసవు) పంపినందు వల్ల ‘కసవూరు’గా ఆ గ్రామ పేరుని రాయలే మార్చాడట. దీని గురించి స్పష్టత లేదు. అయితే, తిరుమల రాయలు అగ్రహార ప్రదానం చేశాడని భట్టుమూర్తి వసుచరిత్రలో ‘‘శ్రీరామ రక్షితిపున్మద గ్రజు జయశ్రీలోలు నానాకళా/ పారీణు బహు సంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించిత/ త్కారుణ్యంబున రత్నహారు హయవేదండాగ్రహారాది స/ త్కారంబదితి రామభూషణ కవీధన్యుండ నీవన్నిటన్‌’’ (1-17) పద్యంలో చెప్పాడు. ఆ అగ్రహారం ఇదే అయి ఉండాలి. పద్యం చెబుతున్న వ్యక్తి తిరుమల రాయలు. ఇతని తండ్రి పేరు శ్రీరంగ రాయలు. అంటే ఈ గ్రామాన్ని తండ్రి పేరుమీద తిరుమలరాయలు భట్టుమూర్తికిచ్చాడని ఒక అంచనాకు రావచ్చు. పదహారేళ్ల వయసులో కాకపోయినా యవ్వనంలోనే భట్టుమూర్తి భువనవిజయంలోకి ప్రవేశించాడన్నది సుస్పష్టం!


వెనక్కి ...

మీ అభిప్రాయం