అక్షరాలతో ఆడుకుందామా?

  • 200 Views
  • 1Likes
  • Like
  • Article Share

    విజయబక్ష్

  • విశ్రాంత తెలుగు రీడర్
  • మండపేట, తూ.గో. జిల్లా.
  • 9441382303
విజయబక్ష్

అపారమైన పదసంపదకు నెలవు మన తెలుగు. అందమైన, అర్థవంతమైన పదాలు మనకు కోకొల్లలు. తవ్వితీసే కొద్దీ, తరచిచూసే కొద్దీ ఎన్నో ఎన్నెన్నో చక్కటి పదాలు కనిపిస్తాయి. వాటిని చిన్నారుల దగ్గరకు తీసుకెళ్లాలి. ఆసక్తికరంగా బోధిస్తే తెలుగు పదాలతో పిల్లలు ప్రేమలో పడతారు. తమంతట తామే వచ్చి కొత్త కొత్త మాటలను నేర్పమని అడుగుతారు. అలా సొంత ఆసక్తితో నేర్చుకున్న అంశమేదీ వారి మెదడు నుంచి అదృశ్యం కాదు.
ఆటలా
నేర్చుకున్నది ఏదీ, ఎన్నటికీ మర్చిపోం. అమ్మభాషనూ కొత్తతరానికి అదే పద్ధతిలో నేర్పాలి. తెలుగు పదాలతో పిల్లలకు పరిచయం పెంచడానికి ఉపయోగపడే కొన్ని మార్గాలు చూద్దాం. 
      పిల్లలకు తెలిసిన పదాల నుంచే అర్థవంతమైన కొత్త పదాలను సృష్టించవచ్చు. ఉదాహరణకు ‘విజయనగర సామ్రాజ్యము’ నుంచి విజయ, సాగరము, సాయము, విజయము, జయ, జయము, నయము, నగరము, నగము, సామ్రాజ్యము, సారము, సాన, నగ, వినయము, జనము, విరజ, విజనము, రయము, రవము, సాము, గజము, గయ, గరము, రవి, సారవము, జర, జగము, రజము... దాదాపు ముఫ్పై దాకా వచ్చాయి. ఈ అక్షరక్రీడ చిన్నారులకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి, ఎక్కువ పదాలను సృష్టించడానికి అవకాశముండే వాటిని గుర్తించాలి. వాటిని పిల్లలకు ఇచ్చి వీలైనన్ని పదాలను తయారు చేయమనాలి. వారు రూపొందించిన వాటిలో అర్థవంతమైనవి ఏరి, వాటిని వివరించాలి. అప్పుడా పదాలు చిన్నారులకు గుర్తుండిపోతాయి. 
      వెనక నుంచి చదివినా అదే పదం వచ్చే మాటలెన్నో ఉన్నాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. తెనాలి రామకృష్ణుడి గురించి చెబుతూ తనను ‘వికటకవి’ అంటారని చెప్పండి. ఆ పదానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించమనండి. కొద్దిసేపటి తర్వాత చిన్నారుల వదనంలో ఆశ్చర్యంతో కూడిన దరహాసం దర్శనమిస్తుంది. వికటకవి లాంటివి కొన్ని... మిసిమి, నవీన, పులుపు, కిటికి, జలజ, వలువ ఇలాంటి ప్రత్యేకమైన పదాల గురించి తెలుసుకున్న పిల్లలు వారంతట వారే వాటి గొప్పదనాన్ని స్నేహితులతో చెబుతారు. 
      తెలుగులో పర్యాయ పదాలకూ లోటు లేదు. ‘కిన్నెర నడకలు’లో విశ్వనాథ ‘స్త్రీ’కి తరుణి, పడతి, సుదతి, ముదిత, కాంత, నాతి, ముగుద, వెలది, ఇంతి, నెలత, చాన, తెఱవ, అతివ, బాల, వనిత, కన్నె, ముద్దరాలు, మహిళ తదితర 18 పర్యాయపదాలు వాడారు. వాస్తవానికి ‘స్త్రీ’కి 294 పర్యాయ పదాలు (మార్చి 2013 ‘తెలుగు వెలుగు’లో చూడవచ్చు) ఉన్నాయి. పర్యాయపద నిఘంటువుల సాయంతో ఇలాంటి పదాలను చిన్నారులకు నేర్పవచ్చు. వీటితో పిల్లల భాషాశక్తి ఇనుమడిస్తుంది. భాష పట్ల మమకారాన్ని పెంచడమే కాదు, అమ్మానాన్నలతో పిల్లల అనుబంధాన్నీ బలపరుస్తుంది. 
      మామూలుగా మాట్లాడుతూనే మరికొన్ని నేర్పవచ్చు. ‘గడగడ’ ఒప్పజెప్పిన ప్పుడు, ‘గబగబ’ పరుగెత్తినప్పుడు.. ఇలాంటి ‘ధ్వన్యనుకరణ’ మాటలను ఉపయోగిస్తూ మాట్లాడితే వాటి గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఉవ్విళ్లూరుతారు. ఇతరులు మాట్లాడేటప్పుడు కూడా అలాంటి పదాల కోసం ఆసక్తిగా గమనిస్తారు. ఆలోచించాలే కానీ బోలెడన్ని పదక్రీడలు తడతాయి. ఒత్తులు, ద్విత్వాక్షరాలు లేకుండా... ఒకే ఒక్క అక్షరంతో అర్థవంతమైన వాక్యం రాయగల అవకాశమూ తెలుగులో ఉంది. 
కాకీక కాకికి కోక కాక కేకికా? దీని అర్థమేంటో చెప్పగలరా! కాకి ఈక కాకికి కోక (చీర) కాక కేకికా? (నెమలికా?) 
గుణింతంలో ‘గుడి’ని మాత్రమే ఉపయోగిస్తూ (అన్ని అక్షరాలకూ గుడే ఉంటుంది) పద్యం చెప్పారు ఓ కవి.
కినిసి సిరి దీసి నీలిగి
తిని సిగ్గిడి కింగిరికిని దిగి తీరితి గి
త్తిని జీరి నించి చిక్కిడి
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ

      హరిశ్చంద్రుడి చేత అసత్యం పలికించాలని ప్రయత్నించి విఫలుడైన విశ్వామిత్రుడి మానసిక స్థితిని ఊహిస్తూ ఓ కవి చెప్పిన పద్యమిది. అర్థమేంటంటే... చక్రవర్తిపై కోపంతో అతని ఐశ్వర్యాన్ని పోగొట్టాను. సిగ్గు విడిచి నీచకార్యానికి దిగాను. అగ్ని లాంటి ధరణీపతిని నిందించాను. కానీ, ఆ మహారాజు తన కీర్తిని నిలుపుకున్నాడు!
      ఏకాక్షర వాక్యాలు, గుణింతాలతో చెప్పే పద్యాలను చెబితే పిల్లలు ఎంత సంతోషపడతారో ఊహించండి. తామూ అలాంటి వాటిని రాయాలని ఎంత తపన పడతారో ఆలోచించండి. తెలుగును నేర్పే పద్ధతులను సులభతరం చేసే కొద్దీ చిన్నారులకు భాష తొందరగా అలవడుతుంది. వారి మనసుల్లో పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం