ప‌త్రిక అంటే ఇదీ అదీ

  • 127 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఉదయం కళ్లు తెరవగానే లక్షలాది మందికి వీధి గుమ్మం వైపే అడుగులు పడతాయి. కళ్లు రెండూ దేనికోసమో దేవులాడతాయి. కావాలనుకున్నది కనిపించకపోతే మనసు నీరసపడిపోతుంది. గేటు చప్పుడైనప్పుడల్లా ఆశ చిగురిస్తుంది. వీధి చివరకేసి ఆశతో ఎదురుచూపుల నిట్టూర్పులు. ఇంతలో అల్లంత దూరంలో వీధి మలుపు తిరుగుతూ సైకిల్, బెల్‌ ప్రణవనాదంలా వినిపిస్తుంది. ఇంతసేపూ దేనికోసం మనసు తహతహలాడామో అది అందుకోగానే పాశుపతాస్త్రం పొందిన అర్జునుడిలా ఆనందం... అక్షరాయుధాలు భద్రపరచిన అమ్ములపొది కదా అది!! అదే దినపత్రిక!
పత్రిక
అని మనం తలచుకోగానే దినపత్రికలే మనకు స్ఫురిస్తాయి. పూర్వం తాళపత్రం (తాటాకు), భూర్జపత్రం, గుడ్డ, తామ్రపత్రం (రాగిరేకు), తరువాత కాలంలో కాగితం. ఇలా కాలంతో మార్పుచెందింది. అయితే ప్రతి పదానికి అర్థాన్ని రూఢి పరిచేవి నిఘంటువులు. పత్రిక అనే పదానికి శబ్దరత్నాకరంలో కాగితం, వ్యవహారంలో రాసుకోడానికి ఉపయోగపడే ఒకానొక పత్రం అని ఉంది. శ్రీహరి నిఘంటువులో వివిధ విషయాలు ప్రచురించే ఒక పత్రిక అంటారు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో ‘రాతకాధారమైన తాటాకు, కాగితం’ అని ఉంది. ఢిల్లీసుల్తానుల పాలనా కాలంలో మనదేశంలో కాగితం వాడకం ప్రారంభమైంది. ప్రపంచంలో కాగితానికి చైనావారు ఆద్యులు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పత్రిక పదం ప్రయోగించిన మొదటి పద్యం.... 
అంచతొయ్యలి దేవతాపతి యాన చొప్పొనరించి యే
తెంచుటెన్నడు దాని చేత మదీయ హృద్గతి జెప్పియే
బంచుటెన్నడు గావున న్వెస బత్రికన్‌ లిఖియించి యా
యంచకిప్పుడు పంచెదన్పతికిందెల్పెడునట్లుగాన్‌

      ప్రభావతీ ప్రద్యుమ్నంలో పింగళి సూరన పత్రిక అనే శబ్దాన్ని ఇలా ప్రయోగించాడు.
      అక్షరం మౌఖికం నుంచి లేఖనం దిశగా ప్రయాణించే దశలో తొలుత శిలలే ప్రధాన సాధనాలయ్యాయి. కొండ గుహలు, దేవాలయ గోడలు, చదునురాళ్లు అక్షరాన్ని రక్షించిన ఆనవాళ్లుగా నేటికీ సాక్ష్యాలుగా నిలిచాయి. అందుకే శాశ్వతమైనవాటిని శిలాక్షరం అంటాం. తర్వాతి కాలంలో మనిషి ప్రకృతినుంచి ప్రతిఫలం పొందటం జీవ పరిణామంలో ప్రధాన ఘట్టం. తాళవృక్షాలు (తాటి చెట్లు) తమ ఆలోచనలకు శాశ్వతత్వాన్నిస్తాయని గమనించాడు. ఘంటాన్ని ఊని తాటాకులపై అక్షరాకృతుల్ని అమర్చాడు. వేల సంవత్సరాల సాహిత్యాన్ని, సంస్కృతినీ భావితరాలకందించింది తాళపత్రం. దీనిలో ప్రాచీన గ్రంథాలు, గీతాలు, రేఖాచిత్రాలు, శాసనాలు, పెళ్లి పత్రికలతో పాటు సమాచారాన్ని కూడా అందించింది. ప్రజల అమాయకత్వం, మూఢనమ్మకాల ఫలితంగా కొన్ని తాళపత్రాలు అంతరించిపోగా, మరికొన్ని అజాగ్రత్తవల్ల ఛిద్రమైపోయాయి. నశించిపోతున్న మన ప్రాచీనాక్షరసంపదను రక్షించుకోవాలన్న సదుద్దేశంతో పాలకులు, పండితులు, అవగాహనాపరులూ తాళపత్ర నిలయాలను ఏర్పాటుచేశారు. లోహ యుగం ప్రారంభమైన తరువాత తామ్రపత్రం కాలయవనికపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది, తాళపత్రానికి ప్రత్యామ్నాయంగా నిలిచింది. శాసనాలతో పాటు అన్నమయ్య పదసంకీర్తనలు వంటివీ తామ్రపత్రాల ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో తాళపత్రాలు, తామ్రపత్రాల్లో విషయాన్ని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు భద్రపరుస్తున్నాయి. కాగితం పుట్టుక పత్రికల వినూత్న వికాసానికి దోహదం చేసింది.
తొలి తెలుగు పత్రిక ‘సత్యదూత’
నికరంగా పత్రిక అని చెప్పగలిగిన ‘వివేక వర్ధిని’ని నడిపిన కందుకూరి వీరేశలింగంతో మొదలు పెట్టి తొలి తెలుగు పత్రిక ఏదో కనుగొనడానికి అనేక మంది ప్రయత్నించారు. అయినా ఈ పరిశోధకులెవరూ తొలి తెలుగు పత్రిక ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు.
      తెలుగు వారికి చారిత్రక దృష్టి మొదటి నుంచీ తక్కువ కావడం, ముద్రిత గ్రంథాలను, పత్రికలను జాగ్రత్త చేసే అలవాటు గానీ, వ్యవస్థ గానీ పకడ్బందీగా లేకపోవడంతో తొలి తెలుగు పత్రిక కోసం దేవులాట కొనసాగుతూనే ఉంది. తొలి పత్రిక ప్రతులు దొరకకపోయినా ఆ తర్వాతి రచయితల, చరిత్రకారుల రచనల్లోనూ ఏకాభిప్రాయమూ అంతంతమాత్రమే.
      తమిళులు ఒక శతాబ్దానికి పైగానే ముద్రణను ఉపయోగించుకుంటున్నారని సి.పి.బ్రౌన్‌ 1852 లో ప్రచురించిన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు పీఠికలో పేర్కొన్నారు. తెలుగులో ముద్రణ 1806 లోనే మొదలైనా 1830 వరకు పురోగతి లేదని కూడా బ్రౌన్‌ చెప్పారు. 1835 ప్రాంతంలో మద్రాసులో కొన్ని తెలుగు, సంస్కృత కాపీలను అచ్చు వేశారనీ, హిందువులు మాత్రమే స్వయంగా నడుపుకుంటున్న, కొన్ని ముద్రణ సంస్థల నుంచి వరసగా చాలా పుస్తకాలు వెలువడుతున్నాయనీ, అలాంటివి ఇప్పుడు కనీసం ఎనిమిది పనిచేస్తున్నాయనీ బ్రౌన్‌ ఆ పీఠికలో రాశారు. తెలుగులోనూ, తమిళంలోనూ నడుపుకుంటున్న, పత్రికలు ఉన్నాయి అని మాత్రమే బ్రౌన్‌ చెప్పారు కాని వాటి వివరాలు తెలియజేయలేదు. తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో ఉపయోగించిన కొన్ని పదాలకు సంబంధించిన మాటలను నాటి పత్రికల నుంచి పదాలను తీసుకునే ప్రయత్నం ఆయన చేశారు. ఆ సందర్భంగా ‘మద్రాస్‌ లిటరరీ జర్నల్‌’ ను ‘వర్తమాన తరంగిణి’ని ఉదహరించారు. బ్రౌన్‌ రాసిన జాబులలో ‘వృత్తాంతి’, ‘వర్తమాన తరంగిణి’ పేర్లను ఆయన ఉటంకించారు.
      ‘ఆంధ్రజాతి అక్షర సంపద - తెలుగు పత్రికలు’ అన్న అంశం మీద ఇటీవలి కాలంలో ఎన్నదగిన పరిశోధన చేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ వ్యవహారాన్నంతటినీ చర్చించి ‘వృత్తాంతి’ తొలి తెలుగు పత్రిక కావచ్చునని నిర్థారించారు.
      1831 లో ‘తెలుగు జర్నల్‌’ పత్రిక వెలువడినట్టు తెలుస్తోంది అని చెప్పిన వారున్నా ఆ పత్రిక వివరాలు తెలియనందువల్ల 1835 లో వెలువడిన ‘మద్రాసు క్రానికల్‌’ను తొలి తెలుగు పత్రికగా భావించిన వారూ ఉన్నారు. ‘మద్రాసు క్రానికల్‌’ దక్షిణ భారత దేశంలోని మొదటి సామాజిక పత్రిక అన్నవారూ ఉన్నారు. అదే సంవత్సరం మద్రాసు నుంచి బళ్లారి క్రిస్టియన్‌ అసోసియేషన్‌ వారు ‘సత్యదూత’ అనే పత్రిక రెండవ పత్రిక అంటున్నారు. 
      1831 లో వెలువడిందంటున్న ‘తెలుగు జర్నల్‌’ మొదలు నిడదవోలు వెంకట్రావు 1951 మేలో భారతిలో రాసిన వ్యాసంలో ‘సత్యదూత’ అనే తెలుగు పత్రిక ఒకటి ఉండేదని రాయడం వరకు తొలి తెలుగు దినపత్రిక ఏదీ అనే చర్చ ఊహలకు మాత్రమే పరిమితం అయింది. సత్యదూత 1835 నాటిదని నిడదవోలు వెంకట్రావు చేసిన ప్రస్తావన కూడా ఆధారాలు చూపలేని స్థితిలో చేసిన ఊహమాత్రమే.
      1826 లో ‘ది బళ్లారి క్రిస్టియన్‌ అసోసియేషన్‌’ను నిర్వహించడం, 1826 లో వారు అక్కడ ఒక ముద్రణాలయాన్ని ఏర్పాటుచేసి కన్నడ, తెలుగు భాషలలో కొన్ని ప్రచురణలు వెలువరించడం ఆధారాలున్న వాస్తవాలే అయినా ‘సత్యదూత’ ప్రత్రిక ప్రచురించినట్లు ఎక్కడా లేదని కూడా పొత్తూరి అభిప్రాయం. 1929 మే నెల భారతిలో ‘‘ప్రాచీనాంధ్ర పత్రికలు (1849-1875)’’ శీర్షికతో రాసిన వ్యాసంలో సైతం ‘సత్యదూత’ పత్రిక ప్రస్తావన నిడదవోలు వారు తేలేదు.
      ‘వృత్తాంతి’ తొలి తెలుగు పత్రిక అనడం కూడా కచ్చితమైన ఆధారాల సహాయంతో చేసే వాదన కాదు. ఎందుకంటే ఆ సంచికలూ ఎక్కడా లేవు. అయితే సి.పి.బ్రౌన్‌ ‘వృత్తాంతి’ నుంచి ఎత్తి రాయించుకున్న రచనలు మాత్రం చెన్నైలోని లిఖిత పుస్తక భండాగారంలో ఉన్నాయి కనక ‘వృత్తాంతి’నే తొలి తెలుగు పత్రిక అనుకుంటున్నారు. 
      1842 లో వెలువడిన ‘వర్తమాన తరంగిణి’లో ‘వృత్తాంతి’ గురించి స్పష్టమైన ప్రస్తావనలున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం